చైనా: మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన షీ జిన్‌పింగ్... ఆయన టీమ్‌లోని ఆరుగురు కీలక నేతలు వీరే...

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ద్వారా మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా షీ జిన్‌పింగ్ నిలిచారు.

ఆదివారంనాడు జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆయనను నేతగా ఎన్నుకున్నారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన 203 మంది సభ్యులు, 168మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఛైర్మన్‌గా కూడా షీ జిన్‌పింగ్ ఎన్నికయ్యారు.

ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్ లో, కొత్త సెంట్రల్ కమిటీనీ సభ్యులను, ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.

ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో కేవలం 11మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.

మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారారు షీ జిన్‌పింగ్
ఫొటో క్యాప్షన్, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారారు షీ జిన్‌పింగ్

టాప్ టీమ్

మొత్తం మీద చైనా రాబోయే అయిదేళ్లలో అధికారాన్ని చెలాయించే వారు ఎవరో తేలిపోయింది.

పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా షీ జిన్‌పింగ్ ఎంచుకున్న నేతలు అత్యంత విశ్వాసపాత్రులుగా చెబుతారు. చైనా ప్రభుత్వ అధికార క్రమంలో టాప్ పొజిషన్‌లో ఉన్నవారిలో ఆయన వ్యతిరేకులు ఎవరూ లేరు.

ఈ కమిటీ ప్రెసిడెన్షియల్ క్యాబినెట్‌కు సమానంగా ఉంటుంది. పార్టీలో ఈ స్థాయికి చేరుకోవాలంటే వారి ట్రాక్ రికార్డ్ ఘనంగా ఉండటమే కాకుండా, ప్రత్యర్ధులను అడ్డుతొలగించుకునే యుక్తులు కూడా తెలిసిన వారై ఉండటం కూడా ముఖ్యమే.

తాజా స్టాండింగ్ కమిటీలో లీ కియాంగ్, ఝావో లెజీ, వాంగ్ హూనింగ్, కాయ్ కీ, డింగ్ యూషావ్, లీ షీ అనే ఆరుగురు సభ్యులు.

ఒక పదవీకాలం ముగిసిన తర్వాత స్టాండింగ్ కమిటీలో పెద్ద మార్పులు జరగడం చైనాలో అసాధరణమేమీ కాదు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.

షీ జిన్‌పింగ్ స్వయంగా ఎంపిక చేసిన సభ్యుల్లో జావో లెజీ, వాంగ్ హూనింగ్ మినహా మిగిలిన వారంతా ఈ పదవికి కొత్తవారే. అందరూ పూర్తిగా కాకపోయినా, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు విధేయులే.

ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా పవర్ సెంటర్‌లో కీలకమైన వ్యక్తులు, వారి చరిత్ర ఏంటో చూద్దాం.

లీ కియాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లీ కియాంగ్

1. లీ కియాంగ్ (Li Qiang)

వయసు 63

ఇప్పటి వరకు ఆయన పార్టీ షాంఘై విభాగానికి సెక్రటరీగా పని చేశారు.

అధ్యక్షుడికి అత్యంత విశ్వాసపాత్రులలో ఒకరు. పార్టీలో కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చారు. ఝెజియాంగ్ ప్రావిన్స్‌కు షీ జిన్‌పిన్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు, లీ కియాంగ్ ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేశారు.

షాంఘై ప్రాంతంలో కోవిడ్ ప్రబలినప్పుడు ఆయన టీమ్ వ్యవహరించిన తీరుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది ఆయనకు రాజకీయంగా సమస్యగా మారుతుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ, ఆయన నియామకంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

షీ జిన్‌పింగ్‌కు విశ్వాసంగా ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని దీనితో స్పష్టమైంది.

రాబోయే కాలంలో ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులకు పదవులను కేటాయిస్తారు. ఇందులో లీ కియాంగ్ ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టవచ్చు. అంటే, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తర్వాత రెండో శక్తివంతమైన నేత ఆయనే అవుతారు.

ఝావో లెజీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఝావో లెజీ

2. ఝావో లెజీ (Zhao Leji)

వయసు 65

ప్రస్తుతం ఆయన సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

పార్టీలో ఆయనను చాలా వేగంగా ఎదిగిన నేతగా చెబుతారు. 42 సంవత్సరాలకే గవర్నర్ పదవిని పొందగలిగారు.

అవినీతి నిరోధక శాఖకు నాయకుడిగా, పార్టీని క్రమశిక్షణలో పెట్టడంతో ఝావో లెజీ పాత్ర కీలకమని చెబుతారు. అవినీతికి పాల్పడ్డ అనేకమంది సీనియర్ నాయకుల పేర్లను ఆయన బయటపెట్టారు.

వాంగ్ హూనింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వాంగ్ హూనింగ్

3. వాంగ్ హూనింగ్ (Wang Huning)

వయసు 67

ప్రస్తుత పదవి: కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటేరియట్‌కు మొట్టమొదటి సెక్రటరీ

మాజీ స్కాలర్, ప్రొఫెసర్ కూడా అయిన వాంగ్ సీనియర్ పార్టీ నాయకుల దృష్టిని ఆకర్షించడం ద్వారా వేగంగా ఎదిగారు. మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ఆయనను పార్టీ పదవులలోకి సిఫారసు చేశారు. తర్వాత ఆయన జెమిన్‌కు కన్సల్టెంట్‌గా పని చేశారు.

చైనాలో ముగ్గురు పెద్ద నాయకులు జియాంగ్ జెమిన్, హు జింటావో, షీ జిన్‌పింగ్‌లకు రాజకీయ సిద్ధాంతాలను అందించిన వ్యక్తిగా కూడా చెబుతారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా ఆయన మెదడు నుంచి వచ్చిన ఆలోచనే అంటారు. పార్టీలోని అన్ని వర్గాలతో ఆయన స్నేహంగా ఉంటారని పేరు.

కాయ్ కీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాయ్ కీ

4.కాయ్ కీ (Cai Qi)

వయసు 66

ప్రస్తుత పదవి: బీజింగ్ నగర మేయర్

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తులతో ఒకరు. కోవిడ్ సమయంలో కూడా బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన ఘనతను ఆయన దక్కించుకున్నారు.

అయితే, బీజింగ్‌లో జనాభాను తగ్గించడానికి 2017లో ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక వివాదాస్పదమైంది. ఈ పథకం కారణంగా అల్పాదాయ వర్గాలకు చెందిన అనేకమంది బీజింగ్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

డింగ్ యుషావ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డింగ్ యుషావ్

5.డింగ్ యూషావ్ (Ding Xuexiang)

వయస్సు: 60

ప్రస్తుత పదవి: జనరల్ సెక్రటరీ ఆఫీస్, అధ్యక్ష కార్యాలయాల డైరక్టర్

ట్రైనింగ్ పొందిన ఇంజినీర్. షాంఘైలోని ప్రభుత్వ అనుబంధ పరిశోధనా కేంద్రంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

ప్రావిన్షియల్‌ స్థాయి పార్టీ కార్యదర్శి, గవర్నర్‌ లాంటి పదవులను చేపట్టిన అనుభవం లేకపోయినా పార్టీలో ఎదిగారు.

2007లో షీ జిన్‌పింగ్‌ కార్యదర్శి అయ్యారు. 2014 నుంచి అధ్యక్ష కార్యాలయానికి అధిపతిగా పని చేస్తున్నారు.

షీ జిన్‌పింగ్ ఆలోచనలను యూషావ్ బలంగా సమర్థిస్తారు. చైనాతోపాటు, వివిధ దేశాలలో అధ్యక్ష పర్యటన సందర్భంగా ఆయన వెంటే ఉన్నారు.

లీ షీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లీ షీ

లీ షీ (Li Xi)

వయస్సు: 66

ప్రస్తుత పదవి: గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి

చైనా నాయకుడి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న లీ షీ అధ్యక్షుడికి విధేయుడు. 2017లో లియోనింగ్ ప్రావిన్స్‌లో ఒక ఆర్థిక డేటా సంక్షోభాన్ని ఆయన సమర్ధవంతంగా మేనేజ్ చేశారన్న పేరు సంపాదించుకున్నారు.

రాజకీయంగా కీలక నగరం యానాన్‌లో పార్టీకి నాయకత్వం వహించారు.

వీడియో క్యాప్షన్, షీ జిన్‌పింగ్ చిన్న బంగాళాదుంపలు పండించమని చెప్పి ఈ గ్రామంలో పేదరికాన్ని అంతం చేశారా?

అనుకున్నదే జరిగింది

కొత్తగా ఎన్నికైన పాలక వర్గాన్ని చూసి చాలామంది చైనీయులు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ‘‘ఇది మేం ఊహించిందే’’ అని ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.

చైనాలో చాలా మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే గొంతులను నొక్కివేయడం అక్కడ సర్వసాధారణం.

చైనా జాతీయ మీడియాలో ఆదివారం నాడు జరిగిన కార్యక్రమాలను నివేదించారు. కానీ, వాటిపై వచ్చే కామెంట్లలో చాలా వరకు హైడ్ చేశారు. ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉన్న కామెంట్లను ప్రచురించారు.

చైనా ట్విటర్‌లాంటి వీబో ప్లాట్‌ఫామ్‌లో ఈ వార్తలను ప్రచురించడానికి అధికారిక మీడియా సంస్థలకే అనుమతి లభించింది. కొత్త నాయకత్వాన్ని కీర్తించే పోస్టులను మాత్రమే ప్రచురించారు. వ్యతిరేక వార్తలను, కామెంట్లను కనిపించకుండా చేశారు.

అయినా, ట్విటర్‌లో అక్కడక్కడా విమర్శకులు ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. ట్విటర్ పై చైనాలో నిషేధం ఉన్నా, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఇది చాలా క్లిష్టమైన పని.

" షీ జిన్‌పింగ్ సైన్యం దాని పేరుకు తగ్గట్టుగా ఉంది. దేశం మొత్తం ఆయన సామ్రాజ్య పునరాగమనాన్ని స్వాగతించింది’’ అని ఓ విమర్శకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, అవి చైనా నిర్మించిన కృత్రిమ దీవులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)