రాజమౌళికి ‘బెస్ట్ డైరెక్టర్‌’ అవార్డ్ ప్రకటించిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్

సినిమా దర్శకుడు రాజమౌళి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఆర్ఆర్ఆర్’ సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మరొకసారి వార్తల్లోకి వచ్చారు.

బెస్ట్ డైరెక్టర్-2022 అవార్డుకు రాజమౌళి ఎంపికైనట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ప్రకటించింది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

42 మంది సినిమా విశ్లేషకులు ఉన్న జ్యూరీ రాజమౌళిని ఉత్తమ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్-2022 అవార్డుల విజేతలు:

ఉత్తమ చిత్రం: ఠార్

ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి(ఆర్ఆర్ఆర్)

ఉత్తమ నటుడు: కాలిన్ ఫారెల్(ఆఫ్టర్ యాంగ్)

ఉత్తమ నటి: కేట్ బ్లాంచెట్(ఠార్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లోనూ అవార్డుల విజేతలను ప్రకటించారు.

ఎన్‌వైఎఫ్‌సీసీ లోగో

ఫొటో సోర్స్, New York Film Critics Circle/Twitter

ఏంటీ అవార్డులు?

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్(ఎన్‌వైఎఫ్‌సీసీ) అనేది అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఒక సంస్థ. దీన్ని 1935లో ప్రారంభించారు.

న్యూయార్క్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ వంటి వాటికి చెందిన సినిమా విశ్లేషకులు ఈ సంస్థలో భాగంగా ఉంటారు. అమెరికాలో తీసిన చలనచిత్రాలతో పాటు ఇతర దేశాలకు చెందిన సినిమాలను సైతం గౌరవించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ చెబుతోంది.

ఉత్తమసినిమా, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సినిమాటోగ్రఫీ, యానిమేషన్ వంటి విభాగాల్లో ఈ సంస్థ అవార్డులు ఇస్తుంది.

సినిమా పురోగతికి సాయపడే చరిత్రకారులు, సేవా సంస్థలు, రచయితలు, విమర్శకులు వంటి వారికి ప్రత్యేక అవార్డులు ఇస్తారు.

ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఈ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. ఆ తరువాత ఏడాది జనవరిలో అవార్డులను ప్రదానం చేస్తారు.

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల జాబితాను చూసి ఆస్కార్ అవార్డులను అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది.

ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఆస్కార్ నామినీల జాబితాను ప్రకటిస్తారు.

1935 నుంచి చూస్తే తాము ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసిన సినిమాల్లో 43శాతం వాటికి ఆస్కార్ అవార్డులు వచ్చినట్లు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్చెబుతోంది.

రామ్‌చరణ్ తేజ్, ఎన్టీఆర్, రాజమౌళి

ఫొటో సోర్స్, SS Rajamouli/Facebook

రాజమౌళి: ఇది తొలి అడుగు

బీబీసీ టాకింగ్ మూవీస్ ఇటీవల రాజమౌళితో మాట్లాడింది. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వస్తున్న స్పందన మీద ఆయన ఇలా వివరించారు...

ఈ కథ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహానికి సంబంధించింది. ఇద్దరు శక్తిమంతమైన హీరోల మధ్య స్నేహం. సామాన్య మనుషుల మధ్య ఉన్నట్లుగానే వారి మధ్య భావోద్రేకాలు ఉండేలా చూశాం. శక్తిసామర్థ్యాల్లో మాత్రం వారిని సూపర్ హీరోలుగా చూపించాం.

భారత్ నుంచి ఒక సినిమాకు ఇంత గుర్తింపు రావడమనేది చాలా పెద్ద విషయం. ఇది నాకు మాత్రమే కాదు అనేక మంది భారతీయ సినిమా దర్శకులకు మంచి ప్రేరణ కలిగించే విషయం.

ప్రపంచసినిమా రంగం మీద మేం వేసిన తొలి అడుగు ఇది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది

కరోనా సంక్షోభంతో లాక్‌డౌన్ వల్ల చాలా మంది ఇళ్లకే పరిమతమయ్యారు. అప్పుడు ప్రజలు కొత్త సినిమాల కోసం చూడటం ప్రారంభించారు. కొత్త కథలు, కొత్త సంస్కృతులు, కొత్త కథనం వంటి వాటి కోసం అన్వేషించారు.

సుమారు ఏడాదిన్నర పాటు సినిమా థియేటర్లు మూసేసి ఉంచారు. ఈ కాలంలో ఇతర దేశాల సినిమాలకు ప్రజలు అలవాటు పడ్డారు. వాటి గురించి తెలుసుకున్నారు. ఇది కూడా మాకు చాలా కలిసి వచ్చింది.

మా సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌కు రావడం ప్రారంభించారు. అప్పటికే ఇతర దేశాల సినిమాలకు అలవాటు పడి ఉన్న ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్

ఫొటో సోర్స్, SS Rajamouli/Facebook

తారిఖ్ వాసుదేవ: భాష అవరోధం కాలేదు

బాలీవుడ్ నటుడు, రచయిత తారిఖ్ వాసుదేవ ఆర్ఆర్ఆర్ సినిమా విజయం గురించి బీబీసీ టాకింగ్ మూవీస్‌తో ఇలా అన్నారు...

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ స్థాయిలో తీసిన సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. సంగీతం కూడా ఆకట్టుకుంది.

ఆర్ఆర్ఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడమే కాదు ప్రేక్షకులను ఆ సినిమా కట్టిపడేసింది. అద్భుతమైన నటన, కథను చెప్పిన తీరు సినిమా అభిమానులను మెప్పించింది.

ఈ సినిమాను చాలా చోట్ల ‘తెలుగు సబ్‌టైటిల్స్’తోనే ప్రదర్శించారు. కానీ థియేటర్లకు వచ్చే అభిమానులకు తెలుగు భాష అవరోధంగా నిలవలేదు.

దక్షిణభారత దేశం నుంచి వచ్చిన ఈ ఎనర్జటిక్ సినిమా సరికొత్త యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. పెద్ద తెరల మీద చూపించే ‘ఫాస్ట్ పేస్డ్’ సినిమాలకు డిమాండ్ పెరుగుతోందన్న సందేశాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ఇస్తోంది. దేశంతోటి, భాషతోటి పని లేదని నిరూపిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'ఆర్‌ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రూ.560 కోట్లు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన హిందీ వెర్షన్ అయితే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఇండియా సినిమాగా నిలిచింది.

ఇవి కూడా చూడండి: