హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథతో మరో సస్పెన్స్ థ్రిల్లర్

ఫొటో సోర్స్, AdiviSesh/Twitter
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సినీ అభిమానులు దాదాపు ప్రతి సినిమానీ చూస్తుంటారు. అయితే, కొన్ని జోనర్‌లకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంటుంది. కొంతమందికి హారర్ సినిమాలంటే ఇష్టం. కొంతమందికి థ్రిల్లర్స్. అలానే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌కీ ఓ ఫ్యాన్ బేస్ ఉంది.
ఓటీటీలు వచ్చాక ఈ తరహా కథల ఉధృతి మరింత పెరిగింది. యంగ్ హీరోలకు ఈ కథలు పర్‌ఫెక్ట్‌గా సూటవుతాయి. పైగా బడ్జెట్ పెద్దగా అవ్వదు. దానికి తోడు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. అందుకే, నేర పరిశోధనాత్మక కథలకు అంత గిరాకీ. వాటికి సీక్వెల్స్ కూడా మామూలైపోయింది.
పేరుకి తగ్గట్టుగానే విజయవంతమైన `హిట్` ఫ్రాంచైజీని కొనసాగించాలనుకోవడం నిర్మాత నాని తెలివైన నిర్ణయాల్లో ఒకటి. ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరైన.. అడవి శేష్ కథానాయకుడిగా నటించడం వల్ల.. `హిట్ 2`పై మరింత ఆసక్తి పెరిగింది.
టీజర్, ట్రైలర్లలో హంతకుడ్ని దాచేసి, తానెవరో తెలుసుకోవాలన్న ఉత్సుకత పెంచారు. ఇన్ని భారీ అంచనాల మధ్య హిట్-2 వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా? కాదా?

ఫొటో సోర్స్, @KolanuSailesh
రెండు క్లూలు...
కేడీ – అంటే కృష్ణ దేవ్ (అడవి శేష్) విశాఖలో ఎస్‌పీగా పనిచేస్తుంటాడు. అతడు చాలా ఇంటలిజెంట్. ఎలాంటి నేరస్థుడినైనా చిటికెలో పట్టుకుంటాడు. నేరస్థులది 'కోడి బుర్ర` అనేది కేడీ నమ్మకం. అయితే, కేడీకే చెమటలు పట్టించే ఘటన ఒకటి జరుగుతుంది.
పబ్‌లో పనిచేసే సంజన అనే అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతుంది. తల, కాళ్లు, చేతులు, మొండెం.. అన్నీ వేరు వేరుగా పడుంటాయి. మెడమీద పళ్ల గాటు, తొమ్మిదో నంబర్ షూ ముద్ర తప్ప ఆధారాలేం దొరకవు. ఆ రెండే రెండు క్లూలతో కేడీ విచారణ చేపడతాడు.
ఎక్కడికక్కడ దారులన్నీ మూసుకుపోతున్నపుడు కేడీ ఈ కేసును ఎలా ఛేదించాడు? ఇంతకీ హంతకుడు ఎవరు? ఇవన్నీ హిట్ 2 చూసి తెలుసుకోవాలి.
‘బుర్ర’కు పదును
హిట్ సినిమాతో.. థ్రిల్లర్ సినిమాల్ని ఎలా తీయాలో దర్శకుడు శైలేష్ కొలనుకు అర్థమైపోయింది. ఆ స్కేల్ పట్టేశాడు. ఎక్కడ ఏ అంశాన్ని పట్టుకోవాలి? ఏది పైపైన టచ్ చేసి వదిలేయాలి? ఎప్పుడు ఎక్కడ ఎలాంటి క్లూ ప్రేక్షకులకు ఇవ్వాలి? ఈ విషయాలన్నీ దర్శకుడికి బాగా అర్థమయ్యాయి.
హిట్ 2లోనూ తన పనితనం కనిపిస్తుంది. అందుకే ఎక్కడా ఎలాంటి లేట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. మూడో సన్నివేశాకే సంజన హత్య జరిగిపోతుంది. అప్పటి నుంచీ కథ ట్రాక్‌లోకి వచ్చేస్తుంది.
కేడీకి విజిల్ వేయడం రాదు. కేడీ గర్ల్ ఫ్రెండ్ ఆర్య ఎప్పటికప్పుడు డైరీ రాసుకొంటుంటుది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ముందే నోట్ చేసుకొనే తీశాడు దర్శకుడు. వాటిని సినిమా కథకు అవసరమైన కీలకమైన సన్నివేశాల్లో వాడబోతున్నాడన్న విషయం ప్రేక్షకులకు ముందే తెలుస్తుంటుంది.
కానీ ఎప్పుడు? ఎలా? అనేదే ఆసక్తికరం. కొన్ని కీ మూమెంట్స్‌కి కరెక్ట్ ప్లేసులో వాడి.. సన్నివేశాలకు ఓ హైప్ తీసుకొచ్చాడు దర్శకుడు.
తొలి సగంలో ఇన్వెస్టిగేషన్ చాలా తేలిగ్గా సాగిపోతుందని, హీరో తెలివితేటలకు అనుగుణంగానే కేస్ సాల్వ్ అయిపోతుందని అనిపిస్తుంది. కానీ, సడన్‌గా ఓ ట్విస్టు వచ్చి కథను మారుస్తుంది. ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టే స్క్రీన్ ప్లేతో తొలి సగం రేసీగానే నడిచిపోతుంది.
వావ్ మూమెంట్స్ ఏవీ?
మధ్యలో.. కేడీ, ఆర్యల లవ్ మూమెంట్స్ వచ్చిపోతుంటాయి. `హిట్` రిఫరెన్సులూ కనిపిస్తాయి. హిట్‌లో ఏం జరిగిందో అక్కడక్కడ ఫ్లాష్ కట్స్‌లా చూపిస్తూ.. ప్రేక్షకులు ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీలో ఉన్నారన్న విషయాన్ని దర్శకుడు అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ విజయం రెండో సగం మీద ఆధార పడి ఉంటుంది. ఎందుకంటే.. తొలి సగంలో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఓ క్రూరమైన హత్య జరిగి ఉంటుంది. దాని చుట్టూ వందల ప్రశ్నలు. పోలీస్ అధికారి సమాధానాల కోసం వేట మొదలెడతాడు.
ఇవన్నీ.. ఏ కథలో అయినా దాదాపుగా ఒకేలా ఉంటాయి. హిట్ 1 ఇన్వెస్టిగేషన్ ఫార్ములానే హిట్ 2లోనూ కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానమైన పాయింట్.. ఈ కథలోని చిక్కుముడిని విప్పడం. దాన్నిబట్టే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.
హంతకుడు ఎవరు? అనే విషయంలో.. తెరపై హీరోనే కాదు, థియేటర్లో ప్రేక్షకులు కూడా.. తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. `ఇతనా.. అతనా` అంటూ ప్రేక్షకుల బుర్రల్లోనూ ప్రశ్నలు మెదులుతుంటాయి. వాటికి భిన్నమైన సమాధానం తెరపై చూపిస్తే `వావ్` అనుకొంటారంతా. అలాంటి `వావ్ మూమెంట్స్` హిట్ 2 కథలో లోపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్యాక్ స్టోరీ వీక్...
మరీ ముఖ్యంగా హంతకుడ్ని రివీల్ చేసే విధానం బాగోలేదు. చాలా చప్పగా సాగిపోయింది. తన బ్యాక్ స్టోరీ అతకలేదు. ‘అందుకోసం ఇన్ని హత్యలు చేస్తావా? లాజిక్ లేకుండా?’ అని హీరోనే ఆ హంతకుడ్ని నిలదీస్తాడు. దాన్ని బట్టి.. సైకో కిల్లర్ హత్యోదంతం ఎంత లాజిక్‌లెస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సినిమాటిక్ లిబర్టీస్ దర్శకుడు చాలా తీసుకొన్నట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ ప్రాపర్‌గా సాగుతుంది. తెలియని కోణాలు బయటకు వచ్చినప్పుడే ఆసక్తి ఉంటుంది. అయితే.. తెలుసుకోవాల్సిన పాయింట్లు కూడా మధ్యలో వదిలేసి, వాటిని చివర్లో రివీల్ చేయడం తెలివైన స్క్రీన్ ప్లే అనిపించుకోదు.
నేరస్థులది కోడి బుర్ర అనేది కథానాయకుడి ఉద్దేశం. అయితే ఆ కోడి బుర్ర నేరస్థుడిదా? హీరోదా? అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, AdiviSesh/Twitter
పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడి `కోడిబుర్ర` అని రాసి వెళ్లిపోతాడు సైకో. అది చూసి హీరో షాక్ అవుతాడు. ఇలాంటి సీన్లు ఎన్నయినా రాసుకోవొచ్చు. కానీ, హంతకుడు ఎవరో రివీల్ చేసినప్పుడైనా.. ఆ కోడి బుర్ర సైకో ఎవరికీ తెలియకుండా హీరో ఇంట్లోకి ఎలా చొరబడ్డాడో చెప్పాలి కదా? అలా చెబితే కదా.. సైకోకి ఎన్ని తెలివితేటలున్నాయో అర్థమవుతుంది?
కాకపోతే, కొన్ని లోపాలు రేసీ స్క్రీన్ ప్లేలో కనపడనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం కథకు మాత్రమే కట్టుబడి ఉండడం, పక్క దారులు చూడకపోవడం, రన్‌టైమ్‌ని దృష్టిలో ఉంచుకొని పాటలకు కత్తెర వేయడం చాలా బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ ఫాస్ట్‌గా సాగిపోవడం వల్ల.. లోపాలు కూడా మర్చిపోతాం.
‘హిట్ 3’లో కనిపించే హీరో ఎవరో చివరి సన్నివేశంలో రివీల్ చేశారు. `కేస్-3`ని ఛేదించే హీరో కనిపించగానే థియేటర్లో విజిల్స్ పడతాయి. ఈ సీన్ కూడా.. `హిట్ 2`కి జోష్ తీసుకొచ్చింది. హిట్ 1తో పోలిస్తే.. హిట్ 2లో గ్రిప్పింగ్ కొంత సడలింది. కాకపోతే.. థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, @KolanuSailesh
అడవి శేష్‌కే సాధ్యమా?
థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు అడవి శేష్. ఈ జోనర్ తనకు ఎంత అచ్చొచ్చిందో మరోసారి నిరూపించుకొన్నాడు. కేడీ పాత్రలో ఎంత సీరియస్‌నెస్ ఉంటుందో, అంత ఫన్ ఉంటుంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేశాడు.
హిట్ 1లో విశ్వక్ బాగా చేశాడు. తనని రీప్లేస్ చేయడం కష్టం అనుకొంటే.. అడవి శేష్ తనకు మాత్రమే సాధ్యమయ్యే బాడీ లాంగ్వేజ్, నటనతో.. విశ్వక్ లేని లోటు తీర్చాడు. మీనాక్షి చౌదరి రొమాంటిక్‌గా కనిపించింది. తనకు నటించే స్కోప్ చాలా తక్కువ. కిల్లర్‌ని రివీల్ చేయకూడదు కాబట్టి.. తన గురించి ఏం మాట్లాడకూడదు. మిగిలిన పాత్రలన్నీ శేష్‌కి సపోర్ట్ చేశాయి.
కెమెరా, నేపథ్య సంగీతం.. థ్రిల్లర్ చిత్రాలకు చాలా కీలకం. ఆ రెండు విభాగాలూ చక్కగా పనిచేశాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఒక్కటే ఈ సినిమాలో ఉంది. మరో చిన్న బిట్ సాంగ్ కథలో భాగంగా వస్తుంది.
శైలేష్ కొలను ఈ కథను బాగా మొదలెట్టాడు. ద్వితీయార్థం చూడాలని, హంతకుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి రేపాడు. కానీ.. చివరి వరకూ ఈ కథని గ్రిప్పింగ్‌గా నడపలేకపోయాడు. సైకో బ్యాక్ స్టోరీ విషయంలో రీవర్క్ చేసుకొంటే బాగుండేది.
నాని నిర్మాతగా మళ్లీ పాస్ అయ్యాడు. చిన్న సినిమా కదా అని చుట్టేయకుండా క్వాలిటీ మేకింగ్ అందించాడు.
ఇవి కూడా చదవండి:
- సుఖవ్యాధులు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు, లక్షణాలేంటి, అవి ఎంత ప్రమాదం?
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగులపై నిఘా పెట్టే హెలికాప్టర్ బాస్‌లు ఎవరు, ఉద్యోగుల రాజీనామాలకు కారణం వీళ్లేనా?
- Zombie: 50,000 ఏళ్ల కిందట సమాధైన ఈ వైరస్ మళ్లీ ఇప్పుడెలా ఉనికిలోకి వచ్చింది?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?















