వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగులపై నిఘా పెట్టే హెలికాప్టర్ బాస్‌‌లు ఎవరు, ఉద్యోగుల రాజీనామాలకు కారణం వీళ్లేనా?

వర్క్ ఫ్రమ్ హోమ్ (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వర్క్ ఫ్రమ్ హోమ్ (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, అలెక్స్ క్రిస్టియన్
    • హోదా, బీబీసీ వర్క్‌లైఫ్

మైక్రోమేనేజ్‌మెంట్ అనేది ఎప్పటినుంచో ఉంది. కానీ, వర్క్‌ ఫ్రమ్ హోమ్–రిమోట్ ఉద్యోగాలతో కొత్త తరహా హెలికాప్టర్ బాస్‌ల సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది.

వీరి వల్ల ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆలిసన్‌కు తన లైన్ మేనేజర్ నుంచి గంటగంటకూ ఫోన్లు వస్తూనే ఉంటాయి.

‘‘ఆన్‌లైన్‌లో నా స్టేటస్ ‘Away’అని కనిపిస్తే చాలు. ఒక 30 నిమిషాల్లో నా ఇన్‌బాక్స్‌లో మెయిల్ ఉంటుంది. ప్రాజెక్టు ఎలా నడుస్తోందని దానిలో పరోక్షంగా అడుగుతారు’’అని బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన 24 ఏళ్ల ఆలిసన్ వివరించారు.

‘‘మేం రోజూ ఉదయం మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరవుతాం. దేనిపై పనిచేస్తున్నామో ఆ మీటింగ్‌లో చెప్పాల్సి ఉంటుంది. నిజానికి మేం పనిచేసేది లాంగ్‌టెర్మ్ ప్రాజెక్టులపై. వీటిలో రోజూ పెద్దగా మార్పులేమీ ఉండవు’’అని ఆమె వివరించారు.

తాము ఆఫీసుకు వెళ్లి పనిచేసేటప్పుడు మైక్రోమేనేజ్‌మెంట్ మరీ ఇంతలా ఉండేదికాదని ఆలిసన్ చెప్పారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి మొదలుకావడంతో ఆమె పనిచేస్తున్న ఆరోగ్య సేవల సంస్థ టెక్ నిపుణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది.

‘‘కోవిడ్-19 సమయంలో మేం మొదటిసారి వర్క్‌ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టాం. నిజానికి సాధారణం కంటే ఎక్కువ పని మేం చేయాల్సి వచ్చింది. కానీ, తను లేకపోతే మేం పని చేయమేమోనని మా మేనేజర్ భావించేవారు. నిజానికి ఇది చాలా చిరాకుగా అనిపించేది’’అని ఆలిసన్ వివరించారు.

ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

ఇదేమీ కొత్త కాదు..

మైక్రోమేనేజ్‌మెంట్ అనేది కొత్త కాదు. కొంత మంది మేనేజర్‌లు నిత్యం తమ ఉద్యోగులపై అలా నిఘా పెడుతూనే ఉంటారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడంతో కొంత మంది మేనేజర్లలో అభద్రతా భావం చాలా పెరిగినట్లు అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్-19 వ్యాప్తితో కొత్తరకం హెలికాప్టర్ల బాస్‌లు ఎక్కువయ్యారని వివరిస్తున్నారు.

హెలికాప్టర్ తల్లిదండ్రుల గురించి మీరు వినే ఉంటారు. వారు నిత్యం పిల్లలపై నిఘా పెడుతుంటారు. ఇప్పుడు అలానే మేనేజర్‌లు తమ ఉద్యోగులపై అలా నిఘా పెడుతున్నారు.

ఈ అంశంపై 24 దేశాలకు చెందిన 1200 మందికిపైగా ఉద్యోగులపై జులై 2020లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఒక అధ్యయనం చేపట్టింది. దీనిలో దాదాపు 20 శాతం మంది తమ మేనేజర్‌లు నిత్యం తమపై నిఘా పెడుతున్నారని వెల్లడించారు.

మరో 33 శాతం మంది అయితే, తమ సామర్థ్యం, నైపుణ్యాలపై తమ మేనేజర్‌లకు నమ్మకం లేనట్లు కనిపిస్తోందని వివరించారు.

ఇదే అధ్యయనంలో 38 శాతం మంది మేనేజర్లు తమ ఉద్యోగులు ఇదివరకటి పోలిస్తే, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు సరిగ్గా పనిచేయడంలేదని వివరించారు. మరో 40 శాతం మంది తమ ఉద్యోగులపై తమకు అంత నమ్మకంలేదని కూడా వెల్లడించారు.

ఇప్పటికీ చాలా మంది మేనేజర్లు తమకు అందుబాటులో ఉండే పాత టెక్నాలజీలతో రిమోట్ టీమ్‌లను మేనేజ్ చేయడం కష్టం అవుతోందని అభిప్రాయపడుతున్నారు.

ఈ రిమోట్ మైక్రోమేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆకస్మిక తనిఖీలు, మధ్యమధ్యలో కాల్స్, అనవసర జూమ్ మీటింగ్స్ లాంటివి ఎక్కువయ్యాయి. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల పనితీరు దెబ్బ తింటోందని నిపుణులు సూచిస్తున్నారు.

తమ బాస్‌లు మైక్రోమేనేజ్‌ చేయడంతో తమకు పనిచేసే ఆసక్తి, సామర్థ్యం తగ్గిపోతున్నట్లు ఉద్యోగులు కూడా వివరిస్తున్నారు.

ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

‘‘నియంత్రణే ముఖ్యం’’

ఉద్యోగులు రిమోట్ వర్క్‌ మొదలుపెట్టిన తర్వాత రెండు రకాల నాయకత్వ లక్షణాలు కనిపించడం ఎక్కువైందని బెల్జియంలోని వ్లెరిక్ బిజినెస్ స్కూల్‌లో లీడర్‌షిప్ అండ్ కోచింగ్ ప్రొఫెసర్ కెట్లీన్ డే స్టాబెలీర్ చెప్పారు. ‘‘ఈ రెండు లక్షణాలు మంచివి కాదు. మొదటి స్టైల్‌ను పరిశీలిస్తే, తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయాన్ని కొందరు మేనేజర్లు పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఉద్యోగులు తమను పట్టించుకోవడంలేదని భావన కలుగుతోంది. ఇక రెండోది మైక్రోమేనేజింగ్’’అని కెట్లీన్ చెప్పారు.

‘‘మైక్రోమేనేజింగ్‌లో భాగంగా కొందరు మేనేజర్లు తమ ఉద్యోగులపై నిత్యం నిఘా పెడుతుంటారు. కొందరు అయితే, ఎలాగైనా ఆఫీసుకు వచ్చేయాలని ఒత్తిడి చేస్తుంటారు’’అని కెట్లీన్ చెప్పారు.

‘‘వరసగా వీడియో కాన్ఫెరెన్స్‌లు పెడుతుంటారు. ప్రతి మెయిల్‌లోనూ తమను సీసీ పెట్టమంటారు. అసలు సృజనాత్మకత లేదా స్వేచ్ఛకు అవకాశం లేని ప్రాజెక్టులు ఇస్తారు’’అని ఆమె వివరించారు.

ఇలాంటి అతి నిఘాకు కొన్ని కారణాలు కూడా ఉంటాయని న్యూయార్క్‌కు చెందిన లీడర్‌షిప్ కోచ్ ఏరియెల్ సదన్ చెప్పారు.

‘‘మైక్రోమేనేజ్‌మెంట్ సమస్య ఎప్పుడూ ఉంది. అయితే, మేనేజర్, టీమ్ సభ్యుల మధ్య నమ్మకం లేకపోతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది’’అని ఆమె వివరించారు.

‘‘ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఉద్యోగులను మేనేజర్లు నేరుగా చూడలేరు. అసలు ఉద్యోగులు ఏం చేస్తున్నారో వారికి పెద్దగా తెలియదు. దీని వల్ల అనుమానం మరింత పెరుగుతుంది’’అని ఆమె చెప్పారు.

‘‘కొందరు మేనేజర్లు అన్నింటినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తారు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఇది కుదరదు’’అని ఆమె వివరించారు.

ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

టెక్నాలజీతో..

కొత్తకొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, టూల్స్‌తో ఉద్యోగులపై నిఘా పెట్టడం మేనేజర్లకు మరింత ఎక్కువైంది. యాప్స్‌లో చూపించే స్టేటస్‌తో అసలు ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఉన్నారోలేదో చూస్తుంటారు.

కొందరు మేనేజర్లయితే, ఉద్యోగులపై నిఘా పెట్టే కొత్త విధానాలను కూడా అనుసరిస్తున్నారు. జులై 2022లో మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చేపట్టిన అధ్యయనంలో.. 68 శాతం ఉత్తర అమెరికా ఉద్యోగ సంస్థలు తమ సిబ్బందిపై నిఘాపెట్టే సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాయి.

సెప్టెంబరు 2021లో డిజిటల్.కామ్ నిర్వహించిన సర్వేలో 1250 ఉద్యోగ సంస్థలు ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు అవకతవకలకు పాల్పడినట్లు అనుమానం వచ్చే సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు కూడా తెలిపాయి.

ఈ విధానాలు, నిఘా వల్ల ఉద్యోగులు ఒత్తిడి ఎక్కువైనట్లు భావిస్తున్నారు. కాఫీ కోసం చిన్న విరామం తీసుకున్నప్పుడు కూడా ఆన్‌లైన్‌లో స్టేటస్ యాక్టివ్‌గా ఉండేలా చూసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోందని ఆలిసన్ చెప్పారు.

కొంతమంది ఉద్యోగులు అయితే, ‘‘మౌస్ జిగ్‌లెర్స్’’లాంటి టూల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇవి నిరంతరం మౌస్ కదిలేలా చూస్తూ.. కంప్యూటర్‌పై మనం యాక్టివ్‌గా ఉండేటట్లు చూపిస్తాయి.

ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఇలా?

మైక్రోమేనేజ్‌మెంట్ వల్ల కొన్నిసార్లు మంచి కూడా జరుగుతుందని డా. కెట్లీన్ వివరించారు. ‘‘ఉద్యోగులకు సాయం అందించేందుకు, లేదా అంతా కలిసి పనిచేస్తున్నామనే భావన కలిగించేందుకు కొందరు మేనేజర్లు మైక్రోమేనేజ్‌మెంట్ చేస్తుంటారు. అది మంచిదే’’అని ఆమె చెప్పారు.

కొంచెం కలగజేసుకోవడం లేదా తమ పనిని పర్యవేక్షించడం తమకు కూడా మంచిదేనని సదన్ అంటున్నారు. అయితే, ఇక్కడ కొంచెం అనేది ఒక్కో ఉద్యోగికి ఒక్కోలా ఉంటుంది.

అయితే, మొత్తంగా చూసినప్పుడు మైక్రోమేనేజ్‌మెంట్ వల్ల ఎక్కువ చెడే జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మైక్రోమేనేజ్‌మెంట్ ఉద్యోగులు సంస్థను ఏకంగా వదిలిపెట్టి వెళ్లిపోయే ముప్పు కూడా ఉంటుంది.

‘‘మైక్రోమేనేజ్‌మెంట్‌ను ఒక బ్యాడ్ మేనేజ్‌మెంట్‌గా చూడాలి. ఇక్కడ మేనేజర్లు అన్నింటినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తారు. ఫలితంగా ఉద్యోగులు సంస్థను వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది’’అని ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే డిజిటల్ టూల్స్ అభివృద్ధి చేసే వర్క్‌జామ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ విలియమ్స్ చెప్పారు.

‘‘దీని వల్ల ఉద్యోగులు తమను గుర్తించడం లేదని భావిస్తారు. తమ ఆలోచనలు, సృజనాత్మకతకు విలువ ఇవ్వడంలేదని అనుకుంటారు. ఫలితంగా ఉద్యోగ సంస్థకు వారు దూరంగా జరుగుతారు’’అని ఆయన వివరించారు.

‘‘ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఇప్పటికే సిబ్బంది ఇతర ఉద్యోగులు సంస్థకు దూరంగా ఉంటారు. దీనికి మైక్రోమేనేజ్‌మెంట్ తోడైతే వారు సంస్థకు మరింత దూరం అవుతారు’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

రాజీనామాలు..

మొత్తంగా మైక్రోమేనేజ్‌మెంట్‌తో ఉద్యోగుల రాజీనామాలు ఎక్కువ అవుతాయి. ‘‘ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసినప్పుడు మైక్రోమేనేజ్ చేయడం చాలా తేలిక. కానీ, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు కాల్స్, ఈమెయిల్స్ లాంటి మార్గాలను మేనేజర్లు ఎంచుకుంటారు. దీని వల్ల వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. చివరగా ఆ ఉద్యోగి రాజీనామా చేసేవరకు వెళ్తుంది’’అని సదన్ చెప్పారు.

ఒకవేళ ఇలా మైక్రోమేనేజ్ చేసే సంస్థల్లో పనిచేయాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నప్పుడు, వారిలో సృజనాత్మకత, కొత్త ఆలోచనలు పెద్దగా ఉండవని నిపుణులు అంటున్నారు.

‘‘కొత్త నైపుణ్యాలకు వారు ప్రాధాన్యం ఇవ్వరు. కొత్త ఆలోచనలతోనూ వారు ముందుకు రారు. ఫలితంగా ఆ సంస్థలో వారి వృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది’’అని సదన్ వివరించారు.

మరోవైపు మైక్రోమేనేజర్లు కూడా తమ పనిని తామే ఎక్కువ చేసుకుంటారని కెట్లిన్ చెప్పారు. ‘‘నిజానికి చాలాసార్లు ఇలాంటి నాయకులు చాలా ఒత్తిడిలో కనిపిస్తుంటారు. ఇతరులు చేయాల్సిన పనిని తమ భుజాలపై వేసుకోవడమే దీనికి కారణం. ఫలితంగా వ్యూహాలపై వీరు వెచ్చించే సమయం తగ్గిపోతుంది’’అని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా?

నమ్మకం ముఖ్యం..

ఉద్యోగులు పనిచేసే విధానంలో మార్పులు రావడంతో వారితో మాట్లాడే, పనిచేయించుకునే విధానాల్లోనూ అలాంటి మార్పులు అవసరం. ఇది అందరూ కొత్త అంశాలు నేర్చుకొనే దశ అని కెట్లిన్ చెప్పారు.

‘‘మేనేజర్లు కూడా తమ ఉద్యోగులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు’’అని ఆమె వివరించారు.

‘‘నేడు రిమోట్, హైబ్రిడ్ వర్క్ అనేది అన్నిచోట్లా కనిపిస్తోంది. దీంతో హెలికాప్టర్ బాస్‌లు కూడా తమ ఉద్యోగులతో సామరస్యంగా ఎలా నడుచుకోవాలో కొత్త మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

మరోవైపు ఆలిసన్ కూడా తన మేనేజర్ మారుతారని ఆశిస్తున్నారు. అప్పటివరకు మేనేజర్ సూచించినట్లే జూమ్ మీటింగ్స్, మెయిల్స్‌కు చాలా మర్యాదతో ఆమె సమాధానం ఇస్తున్నారు. ఇలాంటివి లేకపోయినా తను మెరుగ్గా పనిచేయగలనని ఏదో ఒకరోజు తమ మేనేజర్ తెలుసుకుంటారని ఆమె ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఎదురుచూడటం తప్పా మరేమీ చేయలేనని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)