బిన్ లాడెన్ పెంపుడు కుక్కలపై రసాయన ఆయుధాలను ప్రయోగించేవారా?

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బిన్ లాడెన్
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘కుక్కలను పెంచుకోవడాన్ని ముస్లింలు తప్పుగా పరిగణిస్తారు. కానీ, నా భర్త ఒసామా బిన్ లాడెన్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ఆయన రెండు జర్మన్ షెపర్డ్‌లను యూరప్ నుంచి తీసుకొచ్చారు. వాటికి సాఫియర్, జాయర్‌ అనే పేర్లు పెట్టారు. ఖార్తూమ్‌లో వీటిని మా తండ్రి జాగ్రత్తగా చూసుకుంటున్నారని లాడెన్ నాకు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వారంతా ఇస్లాంను అనుసరిస్తారు. కుక్కలను దూరంగా పెట్టాలని ముస్లింలకు మతపెద్దలు చెబుతుంటారు.’’

‘‘గ్రోయింగ్ అప్ బిల్ లాడెన్: ఒసామాస్ వైఫ్ అండ్ సన్ టేక్ అస్ ఇన్‌సైడ్ దెయిరె సీక్రెట్ వరల్డ్’’ పుస్తకంలో నజ్వా బిన్ లాడెన్‌ ఈ విషయాలు పేర్కొన్నారు.

తన కుమారుడు ఒమర్ బిన్ లాడెన్, రచయిత జాన్ సైసాల సాయంతో 2015లో లాడెన్ మొదటి భార్య నజ్వా బిన్ లాడెన్ ఈ పుస్తకాన్ని రాశారు. దీనిలోని 17వ చాప్టర్‌లో ఒబామా పెంపుడు శునకాల గురించి రాసుకొచ్చారు.

‘‘ఒక కుక్కను ఎవరో దొంగతనం చేశారు. మరొక కుక్కకు వింత వ్యాధి సోకింది. ఈ వ్యాధి వల్ల ఆ కుక్క చాలా బాధపడింది’’అని నజ్వా వివరించారు.

అయితే, ఈ పుస్తకం ప్రచురితమైన ఏడు సంవత్సరాల తర్వాత ‘‘ద సన్’’ వార్తాపత్రికకు ఒమర్ బిన్ లాడెన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన తండ్రి రసాయన ఆయుధాలను కుక్కలపై ప్రయోగించారని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌లో 2011లో ఒసామా బిన్ లాడెన్ మరణించారు. అప్పుడు లాడెన్‌తో ఉన్నవారు రసాయన ఆయుధాలను పరీక్షిస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

దీనిపై ఒమర్ స్పందిస్తూ.. ‘‘ఆ పరీక్షలను నేను చూశాను’’అని చెప్పారు.

‘‘ఒక ఆయుధాన్ని వారు మా పెంపుడు శునకంపై ప్రయోగించారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ విషయాన్ని మరచిపోవడానికి చాలా ప్రయత్నించాను. అయితే, దీనికి చాలా సమయం పట్టింది’’అని ఆయన వివరించారు.

అప్పుడు తన తండ్రి, కుటుంబంతో కలిసి అఫ్గానిస్తాన్‌లో ఒమర్ జీవించేవారు. అప్పుడు వీరి దగ్గర బాబీగా పిలిచే పెంపుడు కుక్క ఉండేది. దీనికి పోలీసు జాగిలం తరహాలో ట్రైనింగ్ ఇచ్చారు.

‘‘చాలా త్వరగా ఆ కుక్క మరణించింది. దీనికి కారణం ఏమిటో తెలియలేదు’’అని ఒమర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: 'శిథిలాల మధ్య నా కుటుంబ సభ్యులు చూస్తుండగానే చనిపోయారు'

ఒమర్ ఎవరు?

అది జనవరి 2010లో ఒక మంచు కురిసే రాత్రి. న్యూయార్క్ టైమ్స్ రచయిత, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు గాయీ లాసన్‌ను డమాస్కస్‌లోని ఓ నైట్‌క్లబ్‌లోకి ఒసామా బిన్ లాడెన్ నాలుగో కుమారుడు ఒమర్ ఆహ్వానించారు.

ఆ తర్వాత ‘‘రోలింగ్ స్టోన్’’ మ్యాగజైన్ కవర్ స్టోరీగా ‘‘ఒసామాస్ సన్: ద డార్క్, ట్విస్టెడ్ జర్నీ ఆఫ్ ఒమర్ బిన్ లాడెన్’’ ప్రచురితమైంది.

ఆరోజు ఏం జరిగిందో లాసన్ వివరిస్తూ.. ‘‘బేస్‌మెంట్‌లోని ఆ బార్‌లో కాస్త చీకటిగా అనిపించింది. అక్కడ ఒక డజను మంది అరబ్బులు విస్కీ తాగుతున్నారు. ఆ పక్కనే పోల్ డ్యాన్స్‌ కూడా జరుగుతోంది’’అని పేర్కొన్నారు.

‘‘రష్యన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అసలు బొమ్మల్లా కనిపిస్తారు’’అని ఓ కూల్‌డ్రింగ్ తాగుతూ ఒమర్ వ్యాఖ్యానించినట్లు లాసన్ పేర్కొన్నారు.

లాసన్, ఒమర్‌ల మధ్య జరిగిన ఆ భేటీ ఒక రహస్య సమావేశం. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ తల దాచుకున్నారో అప్పటికి ఎవరికీ తెలియదు. అమెరికా హిట్‌ లిస్టులో ‘‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు’’గా ఒసామా కొనసాగుతున్నారు.

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, AFP

అమెరికాలో 2001 దాడుల తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఒసామా బిన్ లాడెన్ మారారు. ఆ తర్వాత ఒమర్ కూడా తండ్రి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

ఇప్పుడు ఒమర్ వయసు 41ఏళ్లు. 1991 నుంచి 1996 మధ్య తండ్రితో కలిసి ఆయన సూడాన్‌లో జీవించారు. ఆ తర్వాత సౌదీ అరేబియాకు ఒసామా వెళ్లిపోయారు. ఆ తర్వాత అల్-ఖైదా శిబిరాల్లో ఆయుధాలు ఉపయోగించడంపై ఒమర్ కూడా శిక్షణ తీసుకున్నారు.

‘‘గ్రోయింగ్ అప్ బిల్ లాడెన్: ఒసామాస్ వైఫ్ అండ్ సన్ టేక్ అస్ ఇన్‌సైడ్ దెయిరె సీక్రెట్ వరల్డ్’’ పుస్తకంలో ఒమర్ ఇలా రాసుకొచ్చారు. ‘‘నేను అల్‌ఖైదాను ఎందుకు వదిలిపెట్టానంటే ప్రజలను హత్య చేయడం నాకు ఇష్టం లేదు. నేను అలా బయటకు వచ్చేయడం మా నాన్నకు కూడా ఇష్టంలేదు. కానీ, ఆయన నన్ను వెళ్లమని పంపించారు’’అని వివరించారు.

ఆ తర్వాత ఒమర్ బిన్ లాడెన్ సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. 2006లో యూరప్‌కు వెళ్లాలని కూడా అనుకున్నారు.

భార్యతో ఒమర్

ఫొటో సోర్స్, ELISABETTA A. VILLA/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భార్యతో ఒమర్

ఒమర్ వ్యక్తిగత జీవితం..

ఆ సమయంలోనే ఒమర్‌కు పెళ్లి అయ్యింది. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.

2006లో ఈజిప్టులో జీవిస్తున్న బ్రిటిష్ మహిళ జేన్ ఫెలిక్స్ బ్రౌన్‌ను ఒమర్ కలిశారు. ఆమె ఒమర్ కంటే 24 ఏళ్ల పెద్ద. ఆమెకు ఐదుగురు మనవళ్లు కూడా ఉన్నారు.

వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జైనాగా ఆమె పేరు మార్చుకున్నారు. కొన్ని నెలలు జెడ్డాలో జీవించిన తర్వాత, ఆమె బ్రిటన్‌కు వెళ్లారు.

‘‘యూరప్ వెళ్లడానికి నాకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. కానీ, మా పెళ్లి తర్వాత జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. నేను జీవితంలో ఏం చేయాలో ఒక అవగాహన వచ్చింది’’అని పుస్తకంలో ఒమర్ చెప్పారు.

ప్రపంచ శాంతి కోసం ఒమర్ పనిచేయాలని భావించినట్లు 2008లో ఏపీ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఆ సమయంలోనే ఒమర్ కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. లాడెన్ కుటుంబం, ఇతరులతో వారి సంబంధాల గురించి ఆయన మాట్లాడేవారు.

వానిటీ ఫెయిర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడుతూ... ‘‘మా తాతయ్య మహమ్మద్ బిన్ లాడెన్ చాలా ధనవంతులు. నాలుగుసార్లు ఆయన పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు మాజీ భార్యలను ఆయన పిలిచేవారు. అక్కడకు పిల్లలు, మనవళ్లు అంతా వచ్చేవారు. వారి మధ్య మంచి అనుబంధం ఉండేది’’అని చెప్పారు.

ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నార్‌మైండీలో భార్య జైనాతో కలిసి ఒమర్ జీవిస్తున్నారు. జైనా ఒక ప్రొఫెషనల్ పెయింటర్. తనపై ఆ పెయింటింగ్స్, పర్వత ప్రాంతాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయని ఒమర్ చెబుతుంటారు.

తండ్రి గురించి ఏం చెబుతున్నారు?

వీడియో క్యాప్షన్, అఫ్గాన్‌లో నిరాయుధులు, ఖైదీలను అఫ్గాన్‌లో బ్రిటన్ ప్రత్యేక బలగాలు హత్య చేసినట్లు ఆధారాలు..

‘‘ద సన్’’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఒసామా బిన్ లాడెన్ గురించి ఒమర్ మాట్లాడారు. ‘‘2011, మే 2న అమెరికా నావీ సీల్స్ మా నాన్నను పాకిస్తాన్‌లో మట్టుపెట్టినట్లు తెలిసింది. అప్పుడు నేను ఖతార్‌లో ఉన్నాను’’అని ఆయన చెప్పారు.

అమెరికా సేనలు లాడెన్ శరీరాన్ని సముద్రంలో పడేసి ఉండకపోవచ్చని ఒమర్ చెప్పారు.

‘‘మా నాన్నకు వారు ఏం చేశారో తెలియదు. ఆయన శరీరాన్ని సముద్రంలో తోసేశారని చెప్పారు. దాన్ని నేను నమ్మను. అమెరికాలో ప్రజలకు చూపించడానికి ఆ శరీరాన్ని వారు తీసుకెళ్లి ఉండొచ్చు’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)