అంబేడ్కర్ ఫౌండేషన్: ద‌ళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 2.50 ల‌క్ష‌ల కానుక... ఈ పథకం గురించి మీకు తెలుసా?

పెళ్లి
    • రచయిత, ఎ. కిశోర్ బాబు
    • హోదా, బీబీసీ కోసం

ద‌ళితులు ఇతర కులాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటే అలాంటి జంటలకు కేంద్ర ప్ర‌భుత్వం 2.50 ల‌క్ష‌ల రూపాయ‌ల పెళ్లి కానుక ఇచ్చి వారిని ప్రోత్స‌హించే ప‌థ‌క‌మే ‘డాక్ట‌ర్ అంబేడ్కర్ స్కీమ్ ఫ‌ర్ సోష‌ల్ ఇంటిగ్రేష‌న్ త్రూ ఇంట‌ర్ క్యాస్ట్ మేరేజెస్’ (Dr. Ambedkar Scheme for Social Integration through Inter-Caste Marriages).

సామాజిక అస‌మాన‌త‌లు రూపుమాపే లక్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం 2013లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది.

దీనికోసం కేంద్రం ప్ర‌త్యేకించి ‘అంబేడ్కర్ ఫౌండేష‌న్’ను స్థాపించి దీని ద్వారా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది.

పేద కుటుంబాల‌కు చెందిన ద‌ళితులు కులాంత‌ర వివాహం చేసుకున్న స‌మ‌యాల్లో వారికి ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థికంగా ల‌బ్ధి చేకూరుతుంది.

ఈ ప‌థ‌కం వివ‌రాలు ఏమిటి? దీనికి అర్హులెవరు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సహాయం అందుకోవడం ఎలా? నియమ నిబంధనలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం.

ambedkar

ఏమిటీ ప‌థ‌కం? ఎప్పుడు మొదలైంది?

కులాంతర వివాహాలు చేసుకునే జంటలు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

కులాంతర వివాహాలు చేసుకునే జంటలు దాడులకు గురవుతున్నాయి. హత్యలూ జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇత‌ర కులాల వారిని పెళ్లాడిన ద‌ళితులకు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు, వారికి ఆర్థిక భ‌రోసా కూడా క‌ల్పించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ప‌థ‌కం ఇది.

కేంద్ర ప్ర‌భుత్వంలోని సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఫౌండేష‌న్ ద్వారా 2013లో ఈ ప‌థ‌కం మొదలైంది.

ద‌ళిత సామాజికవ‌ర్గాల‌కు చెందిన అమ్మాయి లేదా అబ్బాయి ఎవ‌రైనా స‌రే ఇత‌ర కులాల‌కు చెందిన వారిని వివాహం చేసుకుంటే వారికి కేంద్ర ప్ర‌భుత్వం రెండు విడతలుగా మొత్తం రూ. 2.50 ల‌క్ష‌లు అంద‌జేస్తుంది.

రాష్ట్ర ప్ర‌భుత్వాల ద్వారా అమ‌లు

ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాల ద్వారా అమ‌లు చేస్తోంది.

ఆయా రాష్ట్రాలలోని సామాజిక న్యాయం, సాంఘిక సంక్షేమ శాఖలు ఈ పథకం అమలు బాధ్యత చూసుకుంటున్నాయి.

కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ వారు అమలు చేసే వివాహ పథకాలను దీంతో మేళవించి అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నాయి.

ఎవ‌రు అర్హులు?

* 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన యువ‌తీయువ‌కులు

* కులాంత‌ర వివాహం చేసుకున్నవారు.

* వివాహ‌మైన జంట‌ల్లోని వ‌ధూవ‌రుల్లో ఒకరు త‌ప్ప‌నిస‌రిగా ద‌ళితులై ఉండాలి.

* ఈ కులాంత‌ర వివాహం హిందూ వివాహ చ‌ట్టం (Hindu Marriage Act 1955) ప్రకారం నమోదై ఉండాలి.

* ఈ వివాహాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలి.

* ఈ కులాంత‌ర వివాహం చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ద‌న‌ని తెలియ‌జేస్తూ వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక అఫిడ‌విట్ స‌మ‌ర్పించాలి

* ఆ వివాహం వారికి మొద‌టి వివాహం మాత్ర‌మే అయి ఉండాలి.

* పెళ్లి చేసుకున్న జంటలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

* జంటలో దళితేతర భాగస్వామి కూడా తన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

* కులాంతర వివాహం చేసుకున్న జంట తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను సమర్పించాలి.

ఎలా ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

కులాంతర వివాహం చేసుకున్న వారు నిబందనల ప్రకారం తమ దరఖాస్తును తమ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు/ శాసనసభ్యుడు/ జిల్లా కలెక్టర్ (MP/MLA/ District Collector) ద్వారా సిఫారసు చేయించుకోవాలి.

వీరి ద్వారా మాత్రమే దరఖాస్తు అంబేద్కర్ ఫౌండేషన్‌కు చేరాలి.

లేదంటే వారి సిఫారసు లేఖ అప్లికేషన్‌కు జత చేసి పంపించాలి.

అంబేడ్కర్ ఫౌండేషన్

ఫొటో సోర్స్, ambedkarfoundation.nic.in

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఫౌండేష‌న్ వెబ్‌సైట్‌లో ఈ ద‌ర‌ఖాస్తు ఫారం ల‌భిస్తుంది. http://ambedkarfoundation.nic.in/icms.html ద్వారా దరఖాస్తు నమూనా పొందవచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వారు https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login పెళ్లికానుక ప‌థ‌కం పోర్ట‌ల్ ద్వారా ఈ ప‌థ‌కానికి న‌మోదు చేసుకోవచ్చు.

తెలంగాణ‌ రాష్ట్రానికి చెందిన వారు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లి అందులో Incentive/ Financial Assistance Name : Intercaste Marriage Incentive Award Registration/ Application Print/Status క్లిక్ చేసి దాని ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వివాహమైన తరువాత ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి?

కులాంతర వివాహం చేసుకున్న తేదీ నుంచి ఏడాది లోపు ఆ దంపతులు ఈ పథకం కింద పెళ్లి కానుక పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి.

రెండో వివాహం చేసుకుంటే కూడా పథకం వర్తిస్తుందా?

వర్తించదు. వధూవరుల్లో ఎవరికైనా సరే అది రెండో వివాహం అయితే మాత్రం పథకం వర్తించదు.

జంటలో ఇద్దరికీ అదే మొదటి వివాహం అయి ఉండాలి.

వీడియో క్యాప్షన్, దళితులు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. 2.5 లక్షలు ఇస్తుందని మీకు తెలుసా?

ఆదాయ పరిమితి ఎంత ఉండాలి?

మొదట్లో కులాంతర వివాహం చేసుకుంటున్న జంటల్లో దళిత భాగస్వామి కుటుంబ ఆదాయ పరిమితి రూ.5 లక్షల లోపు ఉండాలని నిర్ణయించారు.

తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను ఉపసంహరించుకుంది.

కులాంతర వివాహం చేసుకునే దళితులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండానే ఈ పథకం వర్తించేలా నిబంధనలు మార్చారు.

పెళ్లి చేసుకున్న తరువాత కులం మార్చుకోవచ్చా?

సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కులం మార్చుకోవడానికి వీలు లేదు.

వధూవరుల్లో ఒకరు హిందూయేతరులైతే?

కులాంతర వివాహం హిందూ వివాహ చట్టం (1955)కు చెందనిది కానట్లయితే ఆ మతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

దీనికోసం వేరే దరఖాస్తు ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

ఆ దరఖాస్తు ఫారం లింక్.. http://www.ambedkarfoundation.nic.in/assets/schemes/Inter%20caste%20marriace%20scheme.pdf

వివాహమైన జంట అప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెళ్లి కానుక ఏదైనా తీసుకుంటే ఎలా?

అప్పుడు కూడా పథకం వర్తిస్తుంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న కానుక కింద అందుకున్న మొత్తాన్ని కేంద్ర పథకం నుంచి అందాల్సిన మొత్తంలో మినహాయించుకుని మిగతా డబ్బు ఇస్తారు.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

వధూవరుల్లో డబ్బు ఎవరికి చెల్లిస్తారు? మొత్తం ఒకేసారి చెల్లిస్తారా

ఇద్దరి పేరిట ఉండే బ్యాంకు జాయింట్ ఖాతా (Bank Joint Account) లో జమ చేస్తారు.

ఎన్ని విడతలలో ఇవ్వాలనేది ఫౌండేషన్ విచక్షణాధికారాలను బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఒకేసారి 2.50 లక్షల రూపాయలను ఆ దంపతుల బ్యాంకు జాయింట్ అకౌంట్‌లో జమ చేస్తారు.

కొన్ని సందర్భాలలో ఒక విడత కొంత మొత్తం చెల్లించి మిగతాది ఆ జంట పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు.

ఇలాంటి సందర్భంలో తొలుత 1.50 లక్షల రూపాయలను ఖాతాలో జమ చేస్తారు

మిగిలిన లక్ష రూపాయలను అలాగే అంబేద్కర్ ఫౌండేషన్ వద్దే వధూవరుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్టుగా ఉంచుతారు.

3 సంవత్సరాల పాటు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్టును నిర్వహించి మూడేళ్ల తరువాత వడ్డీ సహా ఆ డబ్బను ఆ దంపతులకు చెల్లిస్తారు.

మంజూరు విధానమేమిటి? తుది నిర్ణయం ఎవరిది?

డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ వారిదే తుది నిర్ణయం.

కులాంతర వివాహం చేసుకున్న దంపతులు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తును పరిశీలించి మంజూరు చేయాలా వద్దా అనే అంతిమ నిర్ణయం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ వారిదే.

కులాంతర వివాహ బహుమానం మంజూరుకు సంబంధించి ప్రతిపాదనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సంక్షేమ శాఖ/ జిల్లా కలెక్టరు/జిల్లా మేజిస్ట్రేట్ /డిప్యూటీ కమిషనరు నుంచి అందిన ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ ప్రతిపాదనలను డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.

డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఛైర్మన్ గారు తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి అర్హతలను బట్టి కొన్ని వాటికి తమ విచక్షణాధికారంతో కొన్ని నిబంధనలను సడలించే అధికారం ఉంది.

దరఖాస్తులు అందాల్సిన చిరునామా

కులాంతర వివాహం చేసుకున్న వారు పెళ్లి కానుక కోసం తమ దరఖాస్తులను ఆయా రాష్ట్రాల జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టరు/ డిప్యూటీ కమిషనరు/సంక్షేమ శాఖ ద్వారా సిఫారసు చేయించుకుని వారి ద్వారా ఆ దరఖాస్తులను ఈ కింద చిరునామాకు చేరేలా చూసుకోవాలి.

డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ (Dr. Ambedkar Foundation)

జీవన్ ప్రకాష్ బిల్డింగ్ (Jeevan Prakash Building)

9వ అంతస్థు (9th Floor)

25, కె.జి.మార్గ్ (25 K.G.Marg)

న్యూదిల్లీ = 110001 (New Delhi – 110001

మరిన్ని వివరాలకు [email protected]011-26180211, 8588038789 ఫోన్ నంబర్లను కానీ సంప్రదించొచ్చు.

తప్పుడు పత్రాలు సమర్పించి మోసం చేస్తే?

కులాంతర వివాహం చేసుకున్నవారికి పెళ్లి కానుక మంజూరు చేయడానికి ముందు పరిశీలన వివిధ దశల్లో సాగుతుంది.

నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్న దరఖాస్తులు, జిల్లా కలెక్టర్/జిల్లా మేజిస్ట్రేట్ నుంచి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్‌కు చేరిన దరఖాస్తులను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తారు.

దంపతులు ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించి మోసపూరితంగా ఈ పథకం కింద లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని తేలినా, లబ్ది పొందినా చట్ట ప్రకారం వారు శిక్షకు గురవుతారు.

వినియోగించుకుంటున్న జంటల సంఖ్య తక్కువే

కులాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించ‌డానికి కేంద్రం ఇంత పెద్దఎత్తున ఆర్థిక సాయం అంద‌జేస్తున్నా ఇప్ప‌టికీ దీనిపై చాలామందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, కులాల క‌ట్టుబాట్లు మీర‌లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకుంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది.

మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం దీన్ని వినియోగించుకుంటున్నవారి సంఖ్య కొంత ఎక్కువగా ఉంది.

2020-2021లో ఒడిశాాలో ఈ ప‌థ‌కం నుంచి లబ్ధి పొందిన జంటల సంఖ్య 1,847 కాగా 2021-22లో ఈ సంఖ్య 2,428కి పెరిగింది.

మ‌హారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం నుంచి గ‌త మూడేళ్ల‌లో క‌నీసం ఒక కులాంత‌ర వివాహం కూడా ఈ ప‌థ‌కం కింద న‌మోదు కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్ల‌మెంటులో చెప్పిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019-20లో ఈ ప‌థ‌కం కింద 54 జంటలు లబ్ధి పొందగా 2020-21 సంవ‌త్స‌రానికి ఆ సంఖ్య 114కి పెరిగింది. తెలంగాణ ఈ సంఖ్య 2019-20లో 52, 2020-2021లో63గా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)