భారత్‌లో ఆడ, మగ మధ్య తేడా పోవాలంటే ఎన్నేళ్లు పడుతుంది, ఐరాస అంచనా ఏంటి?

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తజీన్ పఠాన్
    • హోదా, బీబీసీ విజువల్ జర్నలిజం

స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం 2030నాటికి సాధించాలనే లక్ష్యాన్ని భారత్ చేరుకునే అవకాశంలేదని ఐక్యరాజ్యసమితి మహిళల విభాగం యూఎన్ విమెన్ తాజాగా అంచనా వేసింది.

పరిస్థితులు ఇప్పటిలాగే కొనసాగితే మహిళలకు వ్యతిరేకంగా చట్టాల్లో కనిపిస్తున్న వివక్షను తొలగించడానికి, న్యాయ సమానత్వాన్ని సాధించడానికి 268 ఏళ్లు పడుతుందని ‘యూఎన్ విమెన్’ తాజా నివేదిక తెలిపింది.

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో స్త్రీ-పురుషుల సమానత్వం కూడా ఒకటి. జెండర్ ఆధారంగా స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను తొలగించడమే దీని లక్ష్యం.

చట్టాల్లో వివక్షను తొలగిస్తూ.. బాలికలు, మహిళలకు న్యాయ సేవలను చేరువ చేయాలని దీనిలో నిబంధనలు ఉన్నాయి.

పనికి సమాన వేతనం, ఉద్యోగాల్లో మహిళలకు అన్నీ హక్కులూ కల్పించడం లాంటివి స్త్రీ-పురుషుల సమానత్వంలో ఉంటాయి.

మహిళలు

చట్టాల్లో ఏముంది?

ఒకేలాంటి పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు ఇచ్చేలా చూసేందుకు భారత్‌లో చట్టాలేమీ లేవు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జెండర్ గ్యాప్ నివేదిక-2022 ప్రకారం, స్త్రీ-పురుషుల సమానత్వంలో జాబితాలోని 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో ఉంది.

పురుషుల తరహాలో మహిళలు రాత్రివేళ పనిచేయకుండా అడ్డుకునేందుకు భారత్‌లో కొన్ని చట్టాలున్నాయి.

ఉదాహరణకు మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్ 2017, మైన్స్ యాక్ట్ 1952, ఫ్యాక్టరీస్ యాక్ట్ లాంటి చట్టాల్లో పురుషులల్లా మహిళలు ఫ్యాక్టరీల్లోని కొన్ని విధుల్లో పాల్గొనకుండా ఆంక్షలు ఉన్నాయి.

ఇలాంటి ఆంక్షల వల్లే ప్రపంచ బ్యాంకు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో భారత్ వెనుకబడింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ సూచీలో చాలా ముందున్నాయి.

మహిళలు

ఉద్యోగాల్లో మహిళలు

ఉద్యోగాల్లో మహిళల పాత్రను ప్రభావితం చేయడంలో పిల్లల పెంపకం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ప్రసూతి సెలవుల కోసం భారత్ ‘‘మెటర్నిటీ బెనిఫిట్ లా’’ను తీసుకొచ్చింది. దీని ద్వారా 182 రోజుల వేతనంతో కూడాని ప్రసూతి సెలవులను ఇవ్వాలని ఇక్కడి నిబంధనలు చెబుతున్నాయి.

అయితే, ఇక్కడ తండ్రికి ఎలాంటి సెలవులూ ఇవ్వరు.

మరోవైపు గర్భిణులను ఉద్యోగాల నుంచి తీసేయకుండా అడ్డుకునే నిబంధనలు కూడా ఇక్కడ లేవు.

దీంతో గర్భిణులను ఏదో ఒక కారణం చూపించి ఉద్యోగం నుంచి తొలగించే అవకాశముంది.

తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రసూతి సెలవులు ఇస్తే, పరిస్థితి మెరుగ్గా ఉంటోందని జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ చెబుతోంది.

ఈ సూచీలో జపాన్ మంచి స్కోర్ సాధించింది. ఇక్కడ మహిళలతోపాటు పురుషులకు కూడా 300 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.

మహిళలు

మహిళా పారిశ్రామికవేత్తలు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో మహిళా పారిశ్రమికవేత్తలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

మహిళలు వ్యాపారాలను నడిపించడంలో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు, వ్యాపారాలను రిజిస్టర్ చేసుకునేటప్పుడు, బ్యాంకు ఖాతాలు తెరిచేటప్పుడు వివక్ష లేకుండా చూడటం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

భారత్‌లో ఈ విషయాల్లో మహిళలపై వివక్ష చూపించే చట్టాలేమీ లేవు. అయితే, రుణాలు మంజూరు సమయంలో జెండర్ ఆధారిత వివక్ష కనిపిస్తోంది.

ఈ దిశగా భారత్ చేయాల్సిన కృషి చాలా ఉంది.

జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ప్రకారం.. భారత్‌లో మహిళల నేతృత్వంలో నడుస్తున్న సంస్థలు కేవలం 2.8 శాతం మాత్రమే.

మహిళలు

సైన్స్‌లో మహిళలు

మరోవైపు సైన్స్ విభాగంలో మహిళల గురించి కూడా చర్చ జరుగుతోంది.

స్టెమ్ విభాగం అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌లలో మహిళా విద్యార్థుల వాటా 42.7 శాతం వరకూ ఉంది. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ.

ప్రస్తుతం స్టెమ్ విద్యార్థుల్లో మహిళల వాటా అల్జీరియాలో ఎక్కువగా 55.47 శాతం ఉంది.

అయితే, స్టెమ్ ఉద్యోగాల్లో మహిళల వాటా ఆ దేశంలో చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఇది 19.9 శాతం మాత్రమే.

అల్జీరియా ఉద్యోగాల్లో వాతావరణం పురుషులకు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం. మరోవైపు ఇక్కడ పనివేళలు కూడా మహిళలకు అంత అనుకూలంగా ఉండవు.

అందుకే మహిళలు ఎక్కువగా ఈ రంగాల వైపు చూసేందుకు ఇష్టపడరు.

భారత్‌లో స్టెమ్ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వాటా 17.35 శాతం మాత్రమే.

ఈ విషయంలో బంగ్లాదేశ్, చైనా, అఫ్గానిస్తాన్, శ్రీలంక.. భారత్ కంటే ముందున్నాయి.

మహిళలు

నాయకత్వంలో మహిళలు

ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం.. మేనేజ్‌మెంట్, నాయకత్వ పదవుల్లో భారత్‌లో మహిళలు 18 శాతం వరకు ఉన్నారు. బ్రిటన్, అమెరికాలలో ఈ వాటా వరుసగా 30, 40 శాతం వరకూ ఉంది.

ఈ విషయంలో శ్రీలంక కూడా భారత్ కంటే ముందుంది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా భారత్ చేస్తున్న కృషిపై నీతి ఆయోగ్ ఏటా సమాచారాన్ని విడుదల చేస్తుంది.

స్త్రీ, పురుషుల సమానత్వం భారత్ స్కోర్ మొత్తంగా 48గా దీనిలో పేర్కొన్నారు. ఈ దిశగా భారత్ చేయాల్సిన కృషి చాలా ఉంది.

కొన్ని విభాగాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, మొత్తంగా స్త్రీ-పురుషుల సమానత్వంలో భారత్ చాలా వెనుకబడి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)