‘‘టాయ్‌లెట్ల శుభ్రత, కోడిగుడ్డు సైజు ఫొటోలు పంపడం నాన్ టీచింగ్ డ్యూటీ కాదా ?’’- అని ఏపీ టీచర్లు ఎందుకు అడుగుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తూ వచ్చింది. దానికి అనుగుణంగా ఎన్నికలు, జనాభా లెక్కల సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించే దిశలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది.
అందులో భాగంగా అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. దానికి ముందే వర్చువల్‌గా ఈ- ఫైలింగ్‌తో క్యాబినెట్ ఆమోదం పొందినట్టు ప్రకటించింది.
తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది.
ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరుతో నవంబర్ 28న జీవో నెం. 185 విడుదల చేశారు. విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ఇకపై ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని ఆదేశాలు ఇచ్చారు.
ఉపాధ్యాయుల స్థానంలో తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని కూడా పేర్కొన్నారు.
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
అసలెందుకీ చర్చ సాగుతోందన్నది ఆసక్తికరంగా ఉంది.

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY
ప్రభుత్వం ఏం చెబుతోంది..
విద్యాహక్కు చట్టం- 2009 ప్రకారం ఉపాధ్యాయులను ఎన్నికలు, జనాభా లెక్కల సేకరణకు వినియోగించుకునే అవకాశం ఉంది.
అయితే చట్టంలో ఉన్న నిబంధనావాళి సెక్షన్ 27 కి ఏపీ ప్రభుత్వం సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2010లో మార్పులు తీసుకొస్తోంది.
2011 మార్చి 3న విడుదల చేసిన జీవో 20లో 29రూల్స్ ఉండగా, తాజాగా 30వ రూల్ చేరుస్తోంది. దీని ప్రకారం టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో నియమించే వీలు లేకుండా మార్పులు చేశారు.
ఇకపై అనివార్య పరిస్థితుల్లో ఉపయోగించాల్సివస్తే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని పూర్తిగా వినియోగించిన తర్వాత మాత్రమే టీచర్లకు బాధ్యత అప్పగించాల్సి ఉంటుంది.
పాఠశాల విద్య మీద గత ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టకపోవడంతో అక్షరాస్యతా శాతంలో రాష్ట్రం వెనుకబడి ఉందని అభిప్రాయపడింది.
ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడం వల్ల విద్యారంగం కుంటు పడుతోందని, తద్వారా పాఠశాలలో చేరుతున్న వారి శాతం తగ్గుతోందని పేర్కొంది.
మౌలిక వసతుల కల్పన, పాఠ్యపుస్తకాలు వంటివి సకాలంలో అందించడం సహా అనేక అంశాల్లో తగిన శ్రద్ధ లేకపోవడం వల్ల విద్యారంగం అభివృద్ధి జరగడం లేదని చెబుతోంది.
విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టిన ఫలితంగా ఇటీవల సానుకూల ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులను పూర్తిగా పాఠశాల విధులకే పరిమితం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ఏం జరుగుతుంది..
1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల నుంచి ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగిస్తున్నారు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల వరకూ ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ ఉపాధ్యాయులదే కీలకపాత్ర.
సంఖ్య రీత్యా ఎక్కువగా ఉండడం, వాడవాడలా అందుబాటులో ఉన్న కారణంగా ఉపాధ్యాయులకు ఈ బాధ్యత అప్పగించారు.
ఎన్నికలతో పాటుగా దేశంలో విస్తృతంగా చేపట్టే జనాభా లెక్కల సేకరణలో కూడా ఉపాధ్యాయులది కీలక భూమిక.
వాటి కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోలింగ్ బూత్‌లతో పాటుగా జనగణనలలో సైతం వారికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు.
దీని కారణంగా ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయులంతా పోస్టల్ బ్యాలెట్‌కే పరిమితయ్యేవారు. నేరుగా ఓటు వేసే సమయంలో వారు ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి అయ్యేది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే ఉపాధ్యాయులు కూడా ఇతర ఓటర్లతో కలిసి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో ఎన్నికల విధుల నిర్వహణకి ఉపాధ్యాయుల స్థానంలో ఇతర శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించాలని జగన్ ప్రభుత్వం ఆశిస్తోంది.
ప్రతీ 2వేల జనాభాకి ఒక సచివాలయం ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది వరకూ సిబ్బంది ఉంటారు. కాబట్టి వారి పరిధిలో పోలింగ్ స్టేషన్ల నిర్వహణ బాధ్యత వారికి అప్పగించవచ్చని భావిస్తోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/ELECTION COMMISSION OF INDIA
ఎన్నికల కమిషన్ ఇష్టమే...
ఉపాధ్యాయుల స్థానంలో సచివాలయ సిబ్బందిని ఎన్నికల నిర్వహణలో వినియోగించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమని నిపుణుల అభిప్రాయం.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని శాఖల సిబ్బంది ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది ఈసీ నిర్ణయానుసారం ఉంటుందని రాజకీయ పరిశీలకుడు పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
"ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేకంగా సిబ్బంది ఉండరు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు ఎన్నికల అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రకటన జారీ చేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు/సిబ్బంది మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు. బదిలీ చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి అవసరం. ఎలక్షన్ విధుల నుంచి ఏ విభాగానికి మినహాయింపు ఉండే అవకాశం లేదు. అవసరం అనుకుంటే సాధారణ పౌరులతో కూడా ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు యంత్రాంగమంతా ఈసీఐ అధికార పరిధిలోనే ఉంటుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.
ఏపీ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయించాలనే విషయం లేదని గుర్తించాలని దేశాయ్ వివరించారు.

ఇవి మాత్రం బోధనేతర పనులు కాదా?
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల్లో కేవలం ఎన్నికలు, జనాభా లెక్కలు మాత్రమే కాకుండా చాలా ఉన్నాయనేది ఉపాధ్యాయులు, సంఘాల వాదన.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లు 16 రకాల యాప్‌లు నిత్యం వాడాల్సి ఉంటుంది.
ఉదయం స్కూల్‌కి వెళ్లిన వెంటనే ఫేస్ రికగ్నిషన్ కోసం ఉపయోగించే యాప్ మొదలుకుని అనేక కార్యక్రమాల కోసం 32 రకాల యాప్‌లు ప్రవేశ పెట్టారు.
వాటిలో సగం యాప్‌లు రోజువారీగా అప్ డేట్ చేయాలి.
విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం స్వీకరించిన వారి వివరాలు ఆయా ఆప్‌లలో అప్ లోడ్ చేయాలి. ఉదయం స్కూల్‌కి వెళ్లగానే టాయ్‌లెట్ల ఫోటోలు తీయాలి. వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
మిడ్‌డే మీల్‌లో పెడుతున్న ఆహార పదార్థాలు అన్నింటినీ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. కోడిగుడ్ల సైజు కూడా తెలియజేయాలి. వినియోగించిన బియ్యం సహా అన్ని వివరాలు యాప్‌లో నమోదు చేయాలి.
జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ వివరాలు అప్ లోడ్ చేయాలి. విద్యార్థి తల్లిదండ్రుల వివరాలు కూడా అందులో ఉండాలి.
విద్యారంగం మీద యునెస్కో రిపోర్ట్ 2021 ప్రకారం రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల కింద ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 63,621 ఉన్నాయి.
వాటిలో 3.14 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. 80 శాతం స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, మొత్తంగా 14 శాతం స్కూళ్లు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నాయని నిర్ధరించారు.
ఇటీవల పాఠశాలల విలీనం తర్వాత స్కూళ్ల సంఖ్య 56,572 కి తగ్గింది. ఈ కాలంలో కొందరు రిటైర్ అయిన కారణంగా ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గుతోంది.
అయితే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాప్‌ల పని పూర్తి చేసేందుకు కనీసంగా 2 గంటల సమయం పడుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు.
"మా బడిని నాడు-నేడు కింద థర్డ్ ఫేజ్‌లో అభివృద్ధి చేస్తామని ఆదేశాలు వచ్చాయి. అందుకోసం హెచ్‌ఎం పేరుతో బ్యాంక్ అకౌంట్ తీయాలని చెప్పారు.
మాది సింగిల్ టీచర్ స్కూల్. బ్యాంకు సమయంలో నేను వెళితే స్కూల్ చూసేవారు ఉండరు. రోజూ యాప్‌ల పని మీదే రెండు గంటలు గడపాల్సి వస్తోంది. ఆ సమయమంతా పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశమే లేదు. కనీసం అల్లరి చేయకండిరా అని చెప్పడానికి కూడా ఆస్కారముండదు. నేనే ఫోటోలు తీసుకుని, నెట్‌వర్క్ ఉన్న చోటుకి వెళ్లి అప్‌లోడ్ చేసుకోవాలి. అందుకే బోధన కన్నా బోధనేతర పనులు ఇప్పుడు బడిలోనే పెరిగాయి" అని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఆర్.రమేష్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు.
బోధనేతరపనులు తగ్గించాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో ఒకటి రెండు యాప్‌లు వాడేవాళ్లకి, 32 యాప్‌లు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన బీబీసీతో అన్నారు.

ప్రయత్నం మంచిదే కానీ..
యాప్‌ల నిర్వహణ భారం ఉపాధ్యాయులను వేధిస్తోంది. దాంతో ప్రభుత్వం బోధనేతర పనుల పేరుతో అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు, పదేళ్లకు ఓసారి చేయాల్సిన జనాభా లెక్కల సేకరణ కన్నా యాప్‌ల బాధ్యత తగ్గిస్తేనే ఎక్కువ మేలు జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
"ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉపాధ్యాయుల నుంచి తొలగిస్తే ఆనందిస్తాం. కానీ పోలింగ్ కోసం మళ్లీ స్కూళ్లు మూసివేయక తప్పదనే విషయం గ్రహించాలి. వేసవి సెలవుల్లో పదేళ్లకోసారి జరిగే జనగణన విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ బడిలోనే పెరుగుతున్న బోధనేతర పనుల ఒత్తిడి అసలు సమస్య. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు యాప్‌లతోనే కుస్తీ పడితే ఇక పాఠాలు చెప్పేవారెవరు. అందుకే ఈ యాప్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం. అలా కాకుండా కేవలం ఎన్నికల వరకే మినహాయించడం సరైంది కాదు’’ అని ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రయత్నం మంచిదే కానీ సమగ్ర దృష్టి అవసరం అని ఆయన బీబీసీతో అన్నారు.
‘అప్రజాస్వామిక పోకడ’
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను బాధ్యతల నుంచి తొలగించే యత్నం అప్రజాస్వామిక పోకడ అని టీడీపీ అంటోంది.
టీచర్లలో ప్రభుత్వ వైఫల్యాల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.
"ఎన్నికల విధుల్లో పాల్గొనడం టీచర్లకు కూడా పెద్దగా ఇష్టముండదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆ పని చేస్తున్నారు. కానీ వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడం ద్వారా జగన్ రెడ్డి ప్రజాస్వామ్య పోకడల్లో కొత్త అధ్యాయానికి తెర లేపారు. ఉపాధ్యాయులు బోధనేతరపనుల్లో పాల్గొనకూడదు అని అంటున్నప్పుడు నాడు-నేడు పనుల పేరుతో టీచర్లను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మద్యం దుకాణాల ముందు టీచర్లను కాపలా పెట్టడం ఏంటి? మరుగుదొడ్ల ఫొటోలు తీయడం ఉపాధ్యాయులు చేయాల్సిన పనా? ఇతర అనేక పనులు అప్పగించి బోధనేతర విధులంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందిి’’ అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్ రామకృష్ణ .
ఉపాధ్యాయుల్లో ఉన్న ఆగ్రహానికి భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మంచి చేసినా జీర్ణించుకోలేరు...
విద్యారంగంలో వస్తున్న మార్పులను జీర్ణం చేసుకోలేక కొందరు విమర్శలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
‘‘ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు అడుగుతున్నాయి. ఎన్నికలు, జనాభా లెక్కలు వంటి బాధ్యతల నుంచి వారికి మినహాయింపునిస్తే మంచిదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని అందరూ ఆహ్వానించాలి. విమర్శలు చేయడం అర్థరహితం. బడి బయట బాధ్యతల వల్ల ఉపాధ్యాయులకి ఒత్తిడి లేకుండా చూడాలన్నదే మా ఆలోచన. పిల్లలకు సంబంధించిన పనులు చేయడం కూడా భారమే అంటే ఎలా. విద్యారంగం మెరుగుపడాలని మూడున్నరేళ్లలో రూ.55 వేల కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు వంటి పథకాలతో సమూల మార్పులు తెస్తున్నాం. మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన వివరించారు.
రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులను సామాన్యులు సైతం గ్రహించారని ఆయన అన్నారు.
ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించే తాజా నిర్ణయం వల్ల పాఠశాల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగులపై నిఘా పెట్టే హెలికాప్టర్ బాస్‌లు ఎవరు, ఉద్యోగుల రాజీనామాలకు కారణం వీళ్లేనా?
- భారత్‌లో ఆడ, మగ మధ్య తేడా పోవాలంటే ఎన్నేళ్లు పడుతుంది,ఐరాస అంచనా ఏంటి?
- Zombie: 50,000 ఏళ్ల కిందట సమాధైన ఈ వైరస్లు మళ్లీ ఇప్పుడెలా ఉనికిలోకి వస్తున్నాయి
- బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఈ వైరస్‌తో మనుషులకు ప్రమాదమా
- అల్జీమర్స్‌ను తొలిదశలోనే నియంత్రించొచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















