కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు

ఫొటో సోర్స్, KAVITHA/FB
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వివరణ కోరుతూ సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిందని కవిత ఒక ప్రకటనలో తెలిపారు.
సీబీఐ కోరిన విధంగా తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో డిసెంబర్ 6న అధికారులను కలుసుకుంటానని చెప్పినట్లు కూడా కవిత వెల్లడించారు.
"దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అక్కడి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై దాఖలైన కేసులో వెలుగు చూసిన వాస్తవాలు కొన్ని మీకు ఈ కేసుతో సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం ఆ వాస్తవాలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించవలసిన అవసరం ఏర్పడింది" అని సీబీఐ తన నోటీసులో పేర్కొంది.

అందుకని, డిసెంబర్ 6 ఉదయం 11 గంటలకు విచారణకు దిల్లీ లేదా హైదరాబాద్‌లో ఎక్కడ వీలవుతుందో దయచేసి తెలపాలని కూడా సీబీఐ కోరింది.
ఈ లేఖపై స్పందించిన కవిత, హైదరాబాద్‌లో కలుసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.







