బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఈ వైరస్‌తో మనుషులకు ప్రమాదమా

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, CHICKENS - GENERIC

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్, జెరెమీ హోవెల్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇది వ్యాపిస్తోంది.

ఈ వ్యాధి సోకి కోట్ల సంఖ్యలో అడవి పక్షులు, పెంపుడు కోళ్లు చనిపోయాయి.

దీనికి కారణం హెచ్‌5ఎన్‌1 అనే సూక్ష్మజీవి. ఇది ఒక రకమైన వైరస్.

దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

బర్డ్ ఫ్లూ అంటే ఏంటి?

బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు సంబంధించిన వ్యాధి. వంద ఏళ్లుగా ఇది ఉనికిలో ఉంది. సాధారణంగా శరత్కాలంలో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తర్వాత దీని వ్యాప్తి తగ్గుతుంది.

‘‘మొదట యూరప్, ఆసియాల్లోని బాతుల్లో ఈ వ్యాధి మొదలైంది. తరువాత ఇతర పక్షులకు వ్యాపించింది’’ అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలోని రోష్లిన్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీ ప్రొఫెసర్ పాల్ డిగార్డ్ చెప్పారు.

ఇప్పుడు అత్యంత ప్రబలంగా ఉన్న హెచ్‌5ఎన్‌1 వైరస్‌ను తొలుత 1996లో చైనాలో గుర్తించారు. తర్వాత ఇది ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.

అయితే, ఈ ఏడాది బర్డ్ ఫ్లూ వైరస్ సాధారణం కంటే ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించింది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

బర్డ్ ఫ్లూ ఎంత ప్రాణాంతకమైనది?

ఈ హెచ్‌5ఎన్‌1 జాతి వైరస్ ప్రాణాంతకమైనది.

ఇది రోజుల వ్యవధిలోనే మొత్తం పెంపుడు పక్షులు, కోళ్ల మందలకు సోకుతుంది.

పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది.

యూరప్, అమెరికాలో గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఇప్పుడు బర్డ్ ప్లూ ప్రబలింది.

‘‘ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల పెంపుడు పక్షులు మరణించాయి. ఇందులో 10 కోట్ల పక్షులు అమెరికా, యూరప్‌లకు చెందినవే. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ఉన్న కారణంగా పక్షులను రైతులే చంపేశారు’’ అని యూకేలో జంతు సంక్షేమం కోసం పనిచేసే పిర్‌బ్రైట్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మునీర్ ఇక్బాల్ చెప్పారు.

ఇది పశ్చిమ యూరప్ దేశాల్లో గుడ్ల కొరతకు, క్రిస్మస్ సందర్భంగా టర్కీ కోళ్ల కొరతకు దారి తీసింది.

బ్రిటన్‌లో క్రిస్మస్ కోసం పెంచిన 13 లక్షల టర్కీ కోళ్లలో దాదాపు సగం కోళ్లు వైరస్ కారణంగా చనిపోయాయి.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీస్‌లోని పెలికాన్ పక్షులపై బర్డ్ ఫ్లూ ప్రభావం చూపింది

ఈసారి ఏం జరిగింది?

బర్డ్ ఫ్లూ కారణంగా ఈ ఏడాది మునుపెన్నడూ లేనంతగా అడవి పక్షులు చనిపోయాయి. ముఖ్యంగా సముద్ర పక్షులు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

80 పక్షి జాతులు తాజా వైరస్ ప్రభావానికి గురయ్యాయని ప్రొఫెసర్ ఇక్బాల్ చెప్పారు.

‘‘ఉదాహరణకు స్కాట్లాండ్‌లోని స్కువా పక్షుల జనాభాలో 40 శాతాన్ని ఈ వైరస్ చంపేసింది. గ్రీస్‌లోని 2000 డాల్మేషియాన్ పెలికాన్‌లు ఈ వ్యాధి వల్ల చనిపోయాయి’’ అని ఆయన తెలిపారు.

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ నిపుణురాలు డాక్టర్ లూయిస్ మోన్‌క్లా మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్ ఈసారి సీల్స్, నక్క వంటి జాతుల్లో కూడా వ్యాపించిందని చెప్పారు.

‘‘ఈ వ్యాప్తి యూరప్‌లో మొదలైంది. తర్వాత ఉత్తర అమెరికాకు పాకింది. గతం మాదిరిగా కాకుండా ఇంకా ఈ వైరస్ ఉనికిలోనే ఉంది’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇంతకు ముందెన్నడూ వన్యప్రాణుల్లో ఈ స్థాయిలో వ్యాధి వ్యాప్తి జరగలేదు. ఇది ఇంకా మధ్య దశలోనే ఉంది. ఈ వ్యాప్తి పరిధి ఇంకా విస్తరిస్తోంది’’ అని అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ డాక్టర్ రెబెక్కా పాల్సన్ చెప్పారు.

గతంలో కంటే ఈ వైరస్ ఈసారి ఇంత దారుణంగా ఎందుకు ప్రబలిందనే కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి వేగంగా వ్యాప్తి చెందేలా లేదా పర్యావరణంలో ఎక్కువ కాలం పాటు సజీవంగా ఉండేలా వైరస్ ఉత్పరివర్తనం చెంది ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఏం చేస్తున్నారు?

చైనాలో పెంపుడు కోళ్లకు టీకాలు వేస్తున్నారు.

ఇతర దేశాలు టీకాలను వేయట్లేదు. టీకాలు వేసిన కోళ్ల గుడ్లు, మాంసాన్ని ఇతర దేశాలకు విక్రయించలేవు కాబట్టి ఈ మార్గం వైపు ఇతర దేశాలు చూడట్లేదు.

‘‘కోళ్లకు టీకాలు ఇస్తే కఠినమైన ఎగుమతి నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ మారిస్ పిటెస్కీ చెప్పారు.

బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను చంపేయమని ఈయూ దేశాలు, ఉత్తర అమెరికా ప్రభుత్వాలు రైతులను ఆదేశించాయి.

అడవి పక్షుల నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉంచుతూ పెంపుడు పక్షులను ఫౌల్ట్రీలలో జాగ్రత్తగా పెంచాలని యూకే, ఫ్రాన్స్ ప్రభుత్వాలు రైతులకు సూచించాయి.

పెంపుడు కోళ్లకు టీకాలో వేయడం వల్ల వాణిజ్యపరమైన నష్టాలు ఉన్నప్పటికీ ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రభుత్వాలు వైరస్‌ను అదుపులోకి తీసుకురావడానికి టీకా ట్రయల్స్‌ను మొదలుపెట్టాయి.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

బర్డ్‌ ప్లూ వల్ల మానవులకు ప్రమాదమా?

కొన్ని సందర్భాల్లో మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ సోకిన పక్షులతో ఎక్కువ సమయం గడిపిన వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

‘‘ప్రస్తుతం ఉనికిలో ఉన్న హెచ్5ఎన్‌1 వైరస్‌తో మానవులకు వ్యాధి సంక్రమించేంత ప్రమాదం ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు.

కానీ, అడవి పక్షులను పర్యవేక్షించడం, పశువైద్యుల నుంచి నివేదికలు పొందడం ద్వారా ఈ వైరస్ ఎంత వరకు వ్యాపిస్తుందనే దానిపై నిఘా ఉంచాలి’’ అని పాల్ డిగార్డ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, కొత్త రీ సైక్లింగ్ విధానంతో జలచరాలను రక్షిస్తున్న బ్రిటన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)