ఫిఫా వరల్డ్ కప్: ఆయన చనిపోయాడని పేపర్లలో వచ్చింది. కానీ, ఒక జట్టు కోచ్ ఎలా అయ్యారు?

రిగోబర్ట్ సాంగ్

ఫొటో సోర్స్, Getty Images

2016 అక్టోబరులో కామెరూన్ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మాజీ ప్లేయర్ రిగోబర్ట్ సాంగ్ మరణం అంచుల వరకు వెళ్లొచ్చారు.

నిజానికి ఇదే తరహా అనుభవాన్ని 2003లో ఆయన దగ్గర నుంచి చూశారు. అది జూన్ నెల. ఫిఫా ఫెడరేషన్స్ టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్‌లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు ఆయన ఫ్రాన్స్ వచ్చారు.

మాంచెస్టర్ సిటీ కోసం సాంగ్ ఆడుతున్నారు. అయితే, మ్యాచ్ మధ్యలోనే మార్క్ వివియన్ ఫూ కుప్పకూలారు. తోటి ప్లేయర్లు, వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. మార్క్ ఫూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఊహించని రీతిలో కళ్లముందే తన జట్టులోని ప్లేయర్ మరణించినడాన్ని సాంగ్ దగ్గర నుంచి చూశారు.

13ఏళ్ల తర్వాత, ఈ సారి సాంగ్ నేరుగా మరణం అంచుల వరకు వెళ్లారు. దీనికి బ్రెయిన్ ఆన్యురిజమే కారణం. అంటే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది.

రిగోబర్ట్ సాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరిగిందో గుర్తు లేదు..

‘‘అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పటికీ ఆ రోజు నేను మరణానికి ఎంత దగ్గరగా వెళ్లుంటానా? అని ఆలోచిస్తుంటాను’’అని సాంగ్ బీబీసీతో చెప్పారు.

సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు సాంగ్ మరణించినట్లు వార్తలు ప్రచురించాయి. అయితే, నేడు ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో కామెరూన్ జట్టుకు ఆయన కోచ్‌గా వచ్చారు.

1990ల్లో ఇటలీలో జరిగిన వరల్డ్ కప్‌లో కామెరూన్ క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. అప్పుడు జట్టులో ఆయన కూడా ఉన్నారు.

కోచ్ సాంగ్

రిగోబెర్ట్ సాంగ్ 1976 జులై 1న దక్షిణ కామెరూన్‌లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై తన ఇష్టాన్ని చిన్న వయసులోనే ఆయన గుర్తించారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన తొలి యూరోపియన్ టూర్‌కు వెళ్లారు. ఫ్రాన్స్‌లో మెట్స్ ప్రొఫెషనల్ క్వాడ్ కోసం ఆయన ఆడారు.

ఆ మ్యాచ్‌లలో మంచి ప్రతిభ కనబరచడంతో కెమెరూన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టులో సాంగ్‌కు చోటు దక్కింది. 1994 వరల్డ్ కప్‌తోపాటు 1998లో ఫ్రాన్స్‌, 2010 దక్షిణాఫ్రికా ఫిఫా కప్‌లలో కామెరూన్ కోసం ఆయన ఆడారు.

అయితే, దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆడిన కొన్ని నెలలకే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ నుంచి పదవీ విరమణ ప్రకటిస్తున్నట్లు సాంగ్ తెలిపారు. అప్పటికే ఆయన ఇంగ్లండ్‌లో లివర్‌పూల్, లీడ్స్ జట్ల కోసం కూడా ఆడేవారు.

ఆ తర్వాత కోచ్‌గా సాంగ్ తన ప్రస్థానం మొదలుపెట్టారు. 2016 ఫిబ్రవరిలో కామెరూన్ జాతీయ జట్టు మేనేజర్‌గా ఆయన నియమితులయ్యారు.

కానీ, అదే ఏడాది అక్టోబరు 2న ఇంట్లోనే సాంగ్ కుప్పకూలారు. వెంటనే కామెరూన్ రాజధాని యువాండేలోని సెంట్రల్ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు.

అప్పటికి ఆయన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండేది. మెదడులోని ఒక నాడిలో వాపు వల్ల ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

‘‘అసలు ఏం జరిగిందో నాకు తెలియలేదు. చావు, బతుకుల మధ్య ఉన్నానని కూడా నాకు తెలియదు’’అని 2017లో బీబీసీతో ఆయన చెప్పారు.

అయితే, ఈ వార్త కామెరూన్ మీడియాకు చేరింది. కొన్ని వార్తా సంస్థలు ఆయన మరణించినట్లు ప్రకటించాయి. ప్రజలు సంతాపాలు కూడా ప్రకటించారు.

రిగోబర్ట్ సాంగ్

ఫొటో సోర్స్, Getty Images

నైజీరియాలోనూ

కామెరూన్‌లో మాత్రమే కాదు.. అటు నైజీరియాలోనూ వార్తా సంస్థలు సాంగ్ మరణ వార్తను ప్రచురించాయి. సోషల్ మీడియాలో ప్రజలు సంతాపం ప్రకటించారు.

అయితే, సాంగ్ మరణించలేదు. ఆయన పరిస్థితి మాత్రం సీరియస్‌గా ఉండేది. ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత మళ్లీ కోమా నుంచి ఆయన బయటకు వచ్చారు. తాను చనిపోలేదని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

‘‘కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత.. అసలు ఏం జరిగిందో నాకు చెప్పారు. వెంటనే నాకు మార్క్ ఫూ ఘటన గుర్తుకువచ్చింది’’అని ఆయన తెలిపారు.

లివర్‌పూల్, లీడ్స్ లాంటి జట్ల కోసం సాంగ్ ఆడారు. ‘‘అథ్లెట్లు, ఫుట్‌బాలర్లు సురక్షితంగా ఉంటారని ప్రజలు భావిస్తారు. కానీ, వారికి చాలా ముప్పు ఉంటుంది’’అని సాంగ్ చెప్పారు.

రిగోబర్ట్ సాంగ్

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ జట్టుకు

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. కొన్ని రోజులు ఆయన ఫ్రాన్స్‌లో గడిపారు. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వచ్చేశారు.

అప్పటినుంచీ కామెరూన్ యువతకు ఫుట్‌బాల్‌లో మార్గనిర్దేశం చేస్తున్నారు. కామెరూన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో ఆయన భిన్న పదవులు చేపట్టారు.

2022 మొదట్లో ఆఫ్రికా ఫుట్‌బాల్ కప్‌కు కామెరూన్ ఆతిథ్యం వహించింది. ఆ కప్‌ను కామెరూన్ నాలుగుసార్లు గెలుచుకొంది. దీంతో మళ్లీ కామెరూన్ గెలుస్తుందని అంచనాలు వచ్చాయి.

కానీ, ఆ కప్‌లో కామెరూన్ మూడో స్థానంలోకి వచ్చింది. దీంతో జట్టు కోచ్ టోనీ కొసెసవోను బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలోకి మళ్లీ సాంగ్ వచ్చారు.

వీడియో క్యాప్షన్, ఆండ్రూ సైమండ్స్: కారు ప్రమాదంలో కన్నుమూసిన ఈ క్రికెటర్ జీవితంలోని ముఖ్యాంశాలు

ఆ తర్వాత ఖతార్ ఫిఫా కప్‌కు ఆడేందుకు కామెరూన్ అర్హత సాధించింది. 2018లో రష్యాలో జరిగిన కప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కామెరూన్ తృటిలో చేజార్చుకుంది.

బహుశా చావును దగ్గర నుంచి చూసి రావడం వల్లనేమో కామెరూన్ క్రీడాకారులకు సాంగ్ మెరుగ్గా మార్గనిర్దేశం చేస్తున్నారని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

‘‘నన్ను ఏదైనా సలహా అడిగితే.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని చెబుతా. కానీ, జాగ్రత్తగా ఉండాలి. చిన్న తలనొప్పి వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. జీవితంలో ఒత్తిడిని తీసుకోకూడదు. ప్రశాంతంగా ముందుకు పోవాలి’’అని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)