తమిళనాడు: 17 ఏళ్ల ఫుట్‌బాలర్ ప్రియ ప్రాణం తీసిన మోకాలి ఆపరేషన్

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రియ అనే 17 ఏళ్ల ఫుట్‌బాలర్ చనిపోవడం వివాదాస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.
ఇటీవల ప్రియ, కుడి కాలి మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తరువాత తలెత్తిన సమస్యలతో ఇతర అవయవాలు దెబ్బతిని ఆ అమ్మాయి చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
విచారణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఆపరేషన్ చేసిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
చెన్నైలోని కానికరపురం ప్రాంతానికి చెందిన ప్రియ, రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్. ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటోంది. కొద్ది రోజుల కిందట మోకాలిలో నొప్పి వస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లింది.
మోకాలి కీలు దగ్గర నరాలు దెబ్బతిన్నాయని, వాటిని ఆపరేషన్ చేసి సరి చేయాలని డాక్టర్లు చెప్పడంతో పెరియార్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఆ అమ్మాయిని చేర్పించారు. ఈ నెల 7వ తేదీన డాక్టర్లు ఆర్థోస్కోపి పద్ధతిలో ఆపరేషన్ చేశారు.
కానీ ఆరోగ్యం మరింత దిగజారడంతో ప్రియను ఈ నెల 10న రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు మార్చారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి కాలు కుళ్లి పోవడం ప్రారంభించింది. దాంతో ఆ కాలిని తీసేయాలని డాక్టర్లు నిర్ణయించారు.
కాలు తీసేని తరువాత ప్రియ ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ నెల 14న ఆ అమ్మాయికి మరొక ఆపరేషన్ చేశారు. కానీ ఆ మరుసటి రోజే ఇతర అవయవాలు దెబ్బతిని ప్రియ చనిపోయింది.
ప్రియ మరణంతో తమిళనాడులో నిరసనలు చెలరేగాయి. దాంతో ఆ ఘటన మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
‘ఆ అమ్మాయికి ఆపరేషన్ బాగానే జరిగింది. కానీ కట్టు చాలా గట్టిగా కట్టడం వల్ల కాలికి రక్తప్రసరణ ఆగిపోయింది. అందువల్ల కాలు చచ్చుబడి పోయింది’ అని తమిళనాడు వైద్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ మీడియాకు తెలిపారు.
ప్రియ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

సమస్య ఎక్కడ?
ఇలాంటి ఆపరేషన్లు చేసినప్పుడు రక్తం ఎక్కువగా కారిపోకుండా ఉండేందుకు కాలికి గట్టిగా తాడు వంటి బ్యాండేజీ చుడతారు. అది రక్తనాళాలను గట్టిగా అదిమి పట్టి రక్తప్రసరణను తగ్గిస్తుంది. ఆపరేషన్ తరువాత ఆ బ్యాండేజీని తీసేయాలి.
కానీ ప్రియ విషయంలో వైద్యులు దాన్ని వెంటనే తీసేయలేదు. చాలా ఆలస్యంగా తీశారు. ఇది వాస్క్యులర్ అక్లూజన్‌కు దారి తీసింది. అంటే చాలా సేపటి నుంచి రక్తప్రసరణ లేకపోవడం వల్ల ఎక్కడైతే కట్టు కట్టారో అక్కడ చర్మం, కండరాలు చచ్చుబడి కుళ్లిపోయాయి.
ఇలాంటి స్థితిలో ప్రియను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ కుళ్లిపోయినంత వరకు కాలిని తీసేశారు. కానీ దెబ్బతిన కణాలు విడుదల చేసిన ‘మయోగ్లోబిన్’ అనే ప్రొటీన్ ప్రియ రక్తంలో కలవడం ప్రారంభమైంది.
ఈ ప్రొటీన్ చాలా ప్రమాదకరమైనది. కిడ్నీలకు హాని చేస్తుంది. ‘మయోగ్లోబిన్’ ఎప్పుడైతే రక్తంలో కలిసిందో కిడ్నీలు చెడిపోయాయి. ఆ తరువాత కాలేయం, గుండె కూడా దెబ్బతినడంతో ప్రియ చనిపోయింది.
ఆపరేషన్ సమయంలో ప్రియ కాలికి వేసిన బ్యాండేజీ సరైన సమయంలో తీయకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డీన్ తెరానీ రంజన్ తెలిపారు.
ప్రస్తుతం వైద్య నిపుణులతో కూడిన బృందం ఈ ఘటనను విచారిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్టెమిస్ 1 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన నాసా
- కతార్ వరల్డ్ కప్: ‘మా పిల్లల చావుకు బాధ్యులెవరు?’ - వలస కార్మికుల మరణాలపై కుటుంబాల ప్రశ్నలు
- కృష్ణ: తిరుపతిలో గుండు చేయించుకుని వచ్చాక పద్మాలయ స్టుడియో గేటు దగ్గర ఆపేశారు, అప్పుడు ఏమైందంటే
- రవీంద్ర జడేజా: ‘టీమిండియా క్రికెటర్ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’
- అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్తో ఉపయోగం ఉంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














