కర్ణాటక: ఎగిరిపోయిన పెంపుడు చిలుక.. పట్టిచ్చినందుకు రూ. 85,000 బహుమతి ఇచ్చిన కుటుంబం..

అర్జున్ షెట్టి కుటుంబం
ఫొటో క్యాప్షన్, రుస్తోమాతో అర్జున్ షెట్టి కుటుంబం

అయిదు రోజుల సుదీర్ఘ విరామం తరువాత తన భాగస్వామి ఇంటికి తిరిగి రావడంతో ఆనందంతో రియో తన బుగ్గపై చిన్నగా పొడిచింది.

రియో భాగస్వామి పేరు రుస్తోమా.. రియో అంటే తనకు చెప్పలేనంత ఇష్టం.

అసలు విషయం చెప్పలేదు కదా... రియో, రుస్తోమాలు మనుషులు కారు. చిలుకలు. అవును... రుస్తోమో ఒక ఆఫ్రికన్ గ్రే పేరట్.

వాటిని పెంచుకుంటున్నవారి ఇంటి నుంచి రుస్తోమో వెళ్లిపోయింది. ఇంటి తలుపు ఒకటి తీసి ఉన్నప్పుడు మెల్లగా అది బయటకు వచ్చి ఎగిరిపోయింది.

రుస్తోమో కనిపించకపోవడమనేది పెద్ద వార్తగా మారింది. రుస్తోమాను పెంచుకుంటున్న కుటుంబం ఆ చిలుక ఆచూకీ చెప్పినా, పట్టి తెచ్చినా రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడమే దానికి కారణం.

కర్ణాటకలోని తుమకూరులో అర్జున్ షెట్టి అనే ఓ వ్యాపారి కుటుంబం ఈ రెండు చిలుకలను పెంచుతోంది. రుస్తోమో ఇంటి నుంచి తప్పించుకోగానే వారు దాన్ని తెచ్చినవారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

రుస్తోమా కోసం ప్రకటన
ఫొటో క్యాప్షన్, రుస్తోమా కోసం ప్రకటన

అది తప్పించకున్న అయిదు రోజుల తరువాత దాన్ని ఒకరు తెచ్చిచ్చారు. వారు రూ. 85,000 బహుమతిగా ఇచ్చారు. వారు ప్రకటించిన మొత్తం కంటే కూడా ఇది ఎక్కువ.

మూడేళ్ల కిందట రెండు చిలుకలను బెంగళూరులో కొనుగోలు చేశామని, అప్పటి నుంచి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నామని షెట్టి కుటుంబం చెప్పింది.

ఆఫ్రికన్ గ్రే పేరట్‌లను పెంచుకోవడం భారతదేశంలో చట్టవిరుద్ధమైన పనేమీ కాదు. అయితే, విదేశీ పక్షుల పెంపకం, వ్యాపారంపై నియంత్రణ ఉండాలని జంతుపరిరక్షకులు డిమాండ్ చేస్తుంటారు.

'ఈ చిలుకల జంటను మేం సొంత కుటుంబసభ్యులలాగానే చూసుకునేవాళ్లం. వాటిని ఎప్పుడూ పంజరంలో బందించలేదు' అని అర్జున్ షెట్టి చెప్పారు.

తన ఏడేళ్ల కుమారుడు విహాన్‌తో అవి ఎక్కువగా గడుపుతాయని, మిగతా కుటుంబసభ్యులతోనూ గడుపుతాయని.. వినే శబ్దాలను అవి అనుకరించేవని షెట్టి చెప్పారు.

అయితే, పది రోజుల కిందట తమ ఇంట్లోకి ఫర్నిచర్ తెస్తున్న సమయంలో తలుపులు తీసి ఉండడంతో రుస్తోమో బయటకు ఎగిరిపోయిందని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, పక్షుల పెంపకంపై ప్రజల్లో అవగాహన తేవడమే లక్ష్యం అంటోన్న క్లోయ్

రుస్తోమో బయటకు వెళ్లిపోయినప్పటి నుంచి రియో పూర్తిగా దిగులుపడి తిండి తినడం కూడా మానేసిందని ఆయన అన్నారు.

దాంతో ఎలాగైనా రుస్తోమాను తిరిగి తమ ఇంటికి తెచ్చుకోవాలని అనుకుని ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.

రుస్తోమా ఫొటో ముద్రించి, దాన్ని తెచ్చి ఇచ్చినవారికి రూ. 50,000 బహుమతి ఇస్తామని చెబుతూ కరపత్రాలను పంచారు.

తాము నివసించే తుమకూరు పట్టణమంతా ఈ కరపత్రాలు అతికించారు.

టుక్‌టుక్(ఈ-రిక్షా)లను అద్దెకు తీసుకుని.. రుస్తోమాను తెచ్చి ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ తుమకూరులో లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ చేయించారు.

రుస్తోమాను తెచ్చిచ్చింది వీరే
ఫొటో క్యాప్షన్, రుస్తోమాను తెచ్చిచ్చింది వీరే

ఇదంతా జరుగుతున్న సమయంలో రుస్తోమా అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్, కృష్ణమూర్తి అనే ఇద్దరు కార్మికుల సంరక్షణలో ఉంది.

రుస్తోమా ఇంటి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజున కృష్ణమూర్తి దాన్ని చూశారు. ఒక చెట్టుపై కూర్చున్న అది కుక్కలు, పిల్లులకు దొరక్కుండా తంటాలు పడుతోంది.

అంతేకాదు... ఆకలి, అలసట, భయంతో అది దిగులుగా కనిపించింది.

అలాంటి సమయంలో అది దానికదే కృష్ణమూర్తి వద్దకు వచ్చింది. ఆ తరువాత కృష్ణమూర్తి దాన్ని శ్రీనివాస్‌కు అప్పగించడంతో ఆయన దాన్ని ఒక పంజరంలో ఉంచి తిండి పెట్టారు.

అక్కడికి నాలుగు రోజుల తరువాత వారు రుస్తోమా కోసం ప్రచురించిన కరపత్రాలను చూశారు. అందులో ఉన్న అర్జున్ షెట్టి నంబరుకు ఫోన్ చేసి తమ వద్ద రుస్తోమా ఉన్న విషయం చెప్పారు.

రుస్తోమా, రియో
ఫొటో క్యాప్షన్, రుస్తోమా, రియో

రుస్తోమాను తేవడానికి షెట్టి వెళ్లినప్పటికి అది పంజరంలో దిగులుగా, నీరసంగా కనిపించింది.

''అసలు అది నన్ను చూసినప్పడు మీరు చూడాల్సింది. పెద్దగా అరుస్తూ హడావుడి చేసింది. సంతోషంగా ఉన్నప్పుడే అది అలా పెద్దపెద్ద శబ్దాలు చేస్తుంది'' అని ఆనందంగా నవ్వుతూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షెట్టి.

ఆ తరువాత కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లు రుస్తోమాను అర్జున్ షెట్టికి అప్పగించారు. అర్జున్ షెట్టి తమకు రూ. 85,000 బహుమతిగా ఇవ్వడం... అది ప్రకటించిన మొత్తం కంటే ఎక్కువ కావడంతో వారు సంతోషించారు.

రుస్తోమా తిరిగి రావడంతో అర్జున్ షెట్టి ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషించారు. ఇక రుస్తోమా భాగస్వామి రియో ఆనందానికైతే పట్టపగ్గాల్లేవు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: అడవిలో పక్షులు, జంతువుల దాహం తీరుస్తున్న వృద్ధుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)