పిట్ బుల్ కుక్కలు మనుషులను చంపేస్తున్నాయ్- ఇవి ఎందుకింత క్రూరంగా మారుతున్నాయి?

పిట్ బుల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమానీ ఎంకీజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణాఫ్రికాలోని ఫొమొలాంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కేకలు వినపడటంతో ప్రజలు ఉలిక్కిపడి లేచారు. 

బయటకు వచ్చి చూస్తే అమెరికన్ పిట్ బుల్ జాతికి చెందిన రెండు కుక్కలు... కెకెట్సో సొలే అనే మూడేళ్ల బాలుని మీద దాడి చేస్తున్నాయి. చివరకు ఆ కుక్కలు వాళ్ల కళ్ల ముందే బాలున్ని కొరికి, చీల్చి చంపేశాయి. 

ఆ బాలుడు బయట ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఆ రెండు కుక్కలను అక్కడ బోనులో ఉంచుతారు. అయితే స్వేచ్ఛగా తిరగడం కోసం ఆ రోజు వాటిని వదిలేశారు.

ఆ కుక్కలు చాలా సేపు దాడి చేసినట్లు బాలుని ఇంట్లో వాళ్లు చెబుతున్నారు.

కుక్కల దాడి
ఫొటో క్యాప్షన్, కెకెట్సో సొలే

‘మధ్యలో ఆ కుక్కలను ఎవరూ తరమకుండా ఉండి ఉంటే, వాడిని అవి తినేసి ఉండేవి. అప్పటికే వాడి ముఖం సగం పోయింది’ అని బాలుని ఆంటీ తెలిపారు.

కొందరు కుక్కల మీద వేడి నీళ్లు పోసి, బాలుని మృత దేహాన్ని పక్కకు లాగారు.

ఆ తరువాత కోపంతో స్థానికులు ఒక కుక్కను పట్టుకుని సజీవంగా కాల్చివేశారు.

ఆ కుక్కల యజమాని అయిన 21 ఏళ్ల లెబోహాంగ్ పాలీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకరమైన కుక్కలను పెంచుతున్నందుకు కేసు నమోదు చేశారు.

బాలుని మీద దాడి చేసిన మరొక కుక్కను జంతు సంరక్షణ అధికారులు చంపేశారు.

జోహెన్నెస్‌బర్గ్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రీ స్టేట్ ప్రావిన్స్‌లోని ఘటనా స్థలానికి బీబీసీ వెళ్లినప్పుడు అక్కడ అంతా గంభీరమైన వాతావరణం కనిపించింది.

బాలుని కుటుంబం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. వారి కళ్ల ముందే అమెరికన్ పిట్ బుల్స్ బాలుని మీద దాడి చేశాయి.

పిట్ బుల్

ఇదే తొలి మరణం కాదు 

దక్షిణాఫ్రికాలో అమెరికన్ పిట్ బుల్ దాడుల్లో ప్రజలు మరణించిన కేసులు చాలానే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అయిదుగురు చనిపోయారని స్వచ్ఛంద సంస్థ ‘యానిమల్స్ 24-7’ గణాంకాలు చెబుతున్నాయి. 

గత 18 ఏళ్లలో కేవలం పిట్ బుల్ కుక్కల దాడుల్లోనే 37 మందికిపైగా ప్రజలు చనిపోయారు. వీరిలో 18 మంది పిల్లలు. ఈ పిల్లల్లోనూ అయిదుగురు ఈ ఒక్క ఏడాదిలోనే చనిపోయారు. 2017లో నలుగురు పిల్లలు చనిపోయారు.

2016 నుంచి ప్రతి ఏడాది అమెరికన్ పిట్ బుల్ చేతిలో కనీసం ఒక్కరైనా చనిపోతున్నారు.

‘కుక్కలు దాడులు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కుక్కలు కరిచిన కేసులకు సంబంధించి దాదాపు 70 విచారణలు వచ్చాయి. అంటే సగటున నెలకు ఆరు. అక్టోబరులోనే ఆ సంఖ్య 50శాతం పెరిగింది’ అని డీఎస్‌సీ అటార్నీస్‌కు చెందిన కిరస్టీ హల్సామ్ అన్నారు.

కుక్కల దాడులకు సంబంధించిన కేసులను డీఎస్ అటార్నీస్ చూస్తూ ఉంటుంది.

ఈ ఏడాది సెప్టెంబరులో ఇంట్లోని పెంపుడు పిట్ బుల్ కుక్కల చేతిలో 10ఏళ్ల స్టామ్ నుకు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో దక్షిణాఫ్రికాలో పిట్ బుల్ జాతి కుక్కలను నిషేధించాలంటూ ఆన్‌లైన్ వేదికగా ద్వారా మద్దతు కూడగట్టడం ప్రారంభించారు.

పిట్ బుల్

ఫొటో సోర్స్, Getty Images

డాగ్ ఫైటింగ్ కోసం 

అమెరికన్ పిట్ బుల్ జాతి కుక్కలను రక్షణ కోసమే కాకుండా అక్రమంగా కుక్కల పోటీలు నిర్వహించేందుకు కూడా వాడుతున్నారు.

పోటీల్లో గెలిచేందుకు వీలుగా కుక్కలను అగ్రెసివ్‌గా మారుస్తారు. పందెంలో ప్రత్యర్థి కుక్కను చంపేలా శిక్షణ ఇస్తారు. అక్రమంగా నిర్వహించే ఈ పోటీల్లో కుక్కల మీద పందేలు కాస్తుంటారు.

ఈ ఏడాది జులైలో కేప్‌ టౌన్‌లోని గ్రాసీ పార్క్ వద్ద ఇలా అక్రమంగా నిర్వహించే కుక్కల పోటీలను అధికారులు అడ్డుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో మూడు పిట్ బుల్ జాతి కుక్క పిల్లలు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

కుక్కల దాడుల సమస్యకు మరొక కారణం వాటిని ఇతర జాతి కుక్కలతో బ్రీడింగ్ చేయడం కూడా. కుక్కల పందేల కోసం బొయిర్ బోల్స్ వంటి జాతి కుక్కలతో పిట్ బుల్ జాతి కుక్కలను క్రాస్ బ్రీడ్ చేస్తున్నారు.

ఇలా పుట్టిన కుక్కలు చూడటానికి అమెరికన్ పిట్ బుల్ మాదిరిగానే ఉన్నప్పటికీ నైజంలో మాత్రం చాలా దూకుడుగా ఉంటాయి. పిల్లలు వంటి వారి మీద దాడులు చేస్తాయి.

అయితే అమెరికన్ పిట్ బుల్ జాతిని నిషేధించే బదులు కొన్ని రకాల ఆంక్షలు విధించాలని కొందరు సూచిస్తున్నారు. 

‘ఆ బ్రీడ్‌ను నిషేధిస్తే రక్షణ కోసం ప్రజలు మరొక జాతి కుక్కలను ఆశ్రయిస్తారు. ఆ తరువాత జర్మన్ షెఫర్డ్ వంటి జాతి కుక్కల దాడులు పెరుగుతాయి’ అని పిట్ బుల్ ఫెడరేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ప్రతినిధి లిన్స్ అన్నారు. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)