దిల్లీ లిక్కర్ కేసు: ‘అరెస్ట్ చేస్తారా... చేయండి...అంతకంటే ఏం చేస్తారు’... కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook

దిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) తన పేరును చేర్చడం మీద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

దర్యాప్తు సంస్థలు వచ్చి తనను ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె మీడియా సమావేశంలో అన్నారు.

‘‘నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో తొమ్మిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈడీని ఇక్కడకు పంపారు.

నా మీద, మంత్రుల మీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం అనేది భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయ ఎత్తుగడ మాత్రమే. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు.

దర్యాప్తు సంస్థలు వచ్చి అడిగితే మేం సమాధానాలు ఇస్తాం. అంతేకానీ ఇలా మీడియాలో లీకులు ఇచ్చి, పేరును చెడగొట్టాలని చూడటం సరికాదు.

ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడకుండా జైలులో పెడతామంటే పెట్టండి. అంతకంటే ఏం చేస్తారు. ఉరి తీస్తారా?’’ అని కవిత అన్నారు.

అయితే రిమాండ్ రిపోర్టులో కవిత మీద ఈడీ చేసిన ఆరోపణల గురించి ఆమె మాట్లాడలేదు. అలాగే మీడియా నుంచి ప్రశ్నలను కూడా స్వీకరించ లేదు.

మాగుంట శ్రీనివాసుల రెడ్డి

ఫొటో సోర్స్, Magunta Sreenivasulu Reddy/Facebook

మాగుంట: త్వరలో అన్ని విషయాలు చెబుతా

ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉన్న మరొక పేరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. ఆ కేసుకు తనకు సంబంధం లేదని ఆయన అన్నారు.

‘ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా అనే వ్యక్తి నా పేరు చెప్పినట్లు మా కన్సల్టెంట్ నాకు చెప్పారు. ఆ అమిత్ అరోరా అనే వ్యక్తితో ఎవరో నాకు తెలియదు.

మాగుంట కుటుంబానికి దిల్లీలో లిక్కర్ వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదని గత సెప్టెంబరులోనే స్పష్టంగా చెప్పాం.

తన నివాసం వద్ద మద్దతుదార్లతో కవిత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తన నివాసం వద్ద మద్దతుదార్లతో కవిత

ఈడీ రిమాండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

దిల్లీ లిక్కర్ ‘కుంభకోణం’ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది.

ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను దిల్లీలోని రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ఉంది.

అమిత్ అరోరాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది.

ఈడీ రిపోర్ట్ ప్రకారం...

దిల్లీలో మద్యం అమ్మకాల లైసెన్స్ తీసుకున్న వాటిలో మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దానిని మాగుంట రాఘవ్ నడుపుతున్నారు.

శరత్ రెడ్డికి చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్‌, ట్రైడెంట్ కెమాఫర్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్ కంపెనీలు లైసెన్స్ తీసుకున్నాయి.

వీడియో క్యాప్షన్, దిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర గురించి కల్వకుంట్ల కవిత ఏం చెప్పారు?

ఫోన్ల మార్పు

ఈ కేసులో ఈడీ అనుమానిస్తున్న వాళ్లు తరచూ ఫోన్లు మార్చినట్లుగా కూడా రిపోర్టులో పేర్కొన్నారు.

కల్వకుంట్ల కవిత 10, అభిషేక్ బోయినపల్లి 5, గోరంట్ల బుచ్చిబాబు 6, శరత్ రెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.

ఆధారాలు నాశనం చేసేందుకు అమిత్ అరోరా 11 సార్లు ఫోన్ మార్చడం/ధ్వంసం చేయడం చేశారని.. అలాగే ఈ కేసులో ఆరోపణలున్న మరికొందరు గత ఏడాది కాలంలో వినియోగించిన లేదా ధ్వంసం చేసిన డిజిటల్ డివైస్‌ల(సీడీఆర్ ఐఎంఈఐ విశ్లేషణ ఆధారంగా) నంబర్లు, వారి పేర్లు అంటూ ఒక జాబితా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా

ఫొటో సోర్స్, Getty Images

అసలు కేసు ఏంటి?

దిల్లీ ఎక్సైజ్ పాలసీ: 2021-22లో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దిల్లీలో అంతకు ముందు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేది. ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా విధానాలను తీసుకొచ్చారనేది ఆరోపణ.

2021 నవంబరులో ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో మద్యం అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.

2022 జులైలో కొత్తగా నియమితులైన దిల్లీ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్, కొత్త మద్యం విధానంలో అవకతవకలు ఉన్నట్లు ఆరోపించారు. ఆయన సలహా మేరకు నాటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.

ఆ తరువాత 2021-22 మద్యం విధానాన్ని రద్దు చేసి అంతకు ముందు ఉన్నట్లుగా ప్రభుత్వమే దుకాణాలు నడపడటం మొదలు పెట్టింది.

2022 ఆగస్టులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరును సీబీఐ రిపోర్టులో చేర్చింది.

ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల మీద ఈడీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి: