ఎయిర్‌ఇండియాకు టాటాలు పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా... విస్తారాలో విలీనం అందుకు దోహదపడుతుందా?

ఎయిరిండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిరిండియా, విస్తారాలను టాటా గ్రూపు నిర్వహిస్తోంది
    • రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
    • హోదా, బీబీసీ న్యూస్, ఢిల్లీ

టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా, విస్తారా త్వరలో విలీనం కానున్నాయి. ఇది గొప్ప పరిణామమని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు భారత విమానయాన రంగంలో లీడర్‌గా ఉన్న ఇండిగో సంస్థపై ఈ విలీనం ప్రభావం చూపగలదా?

దేశీయంగా ఎయిరిండియా, విస్తారాల మార్కెట్ షేర్ దాదాపు 18 శాతం ఉంది. భారత దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థదే ఆధిపత్యం. ఇండిగో సంస్థకు దాదాపు 57 శాతానికిపైగా మార్కెట్ షేర్‌ ఉంది. కాబట్టి ఇండిగోకు దీటుగా రాణించడం టాటా సన్స్‌కు సవాలు అని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం విస్తారాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ)తో కలిసి టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విలీనం తర్వాత ఏర్పడే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కనుంది. దీని కోసం ఎస్‌ఐఏ 250 మిలియన్ డాలర్లు (రూ. 2,029 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

2021లో కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2.2 బిలియన్ డాలర్ల (రూ. 17,863 కోట్లు)కు కొనుగోలు చేసింది.

ఒకప్పుడు భారత్‌కు ఎయిరిండియా గర్వకారణంగా ఉండేది. కానీ, ప్రైవేటు రంగం వృద్ధి చెందడంతో పాటు 2000 దశకంలో జరిగిన మార్పులు ఆ సంస్థ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మరోవైపు భారత విమానయాన రంగంలో పోటీ ఎక్కువ కావడంతో ఎయిరిండియాకు భారీ నష్టాలు రావడం మొదలైంది. వాటి నుంచి కోలుకోవడం కోసం బెయిలవుట్ నిధులపై ఆధారపడింది.

ఇప్పుడు టాటా చేతుల్లోకి వెళ్లిన ఎయిరిండియా సంస్థ మరోసారి అవే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

ఎయిరిండియా

ఫొటో సోర్స్, Getty Images

రెండు విమానయాన సంస్థలను కలపాలని టాటా తీసుకున్న నిర్ణయం సమయోచితమైనదని ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ అన్నారు.

ప్రభుత్వ అంచనాల ప్రకారం, ప్రస్తుతం 900 మిలియన్ డాలర్లుగా ఉన్న భారత పౌర విమానయాన మార్కెట్ విలువ 2025 నాటికి 4 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.

పెరుగుతున్న మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది సాధ్యంగానే కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికే అత్యంత బలంగా ఉన్న ఇండిగో మార్కెట్‌లోకి టాటా గ్రూపు చొచ్చుకెళ్లడం చాలా కష్టమైన పని.

‘‘ఇండిగో మార్కెట్ నుంచి కనీసం 2 శాతాన్ని లాగేసుకున్నా ఆ చర్య మార్కెట్ వ్యూహాల్లో చాలా దూకుడును తెస్తుంది’’ అని భార్గవ అన్నారు.

భారత్‌కు విమానయాన సంస్థల విలీనాల విషయంలో పేలవ చరిత్ర ఉంది. జెట్ ఎయిర్‌వేస్ -ఎయిర్ సహారా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్- ఎయిర్ డెక్కన్ వంటి విలీనాలు విఫలమయ్యాయి. ఎక్కువ డీల్‌కు విలీనం చేయడం, నిర్వహణలో నష్టాలను చవిచూడటంతో ఈ ప్రక్రియ భారత్‌కు కలిసి రాలేదు.

కానీ, ఎయిరిండియా-విస్తారా విలీనం విషయంలో నిపుణులు ఆశాజనకంగా ఉన్నారు.

ఇండిగో

ఫొటో సోర్స్, Getty Images

ఎయిరిండియా, విస్తారా సంస్థలే కాకుండా ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థ నిర్వహణ కూడా టాటా గ్రూప్ ఆధీనంలోనే ఉంది. ఈ మూడు సంస్థల మార్కెట్ షేర్ 23 శాతానికి పైగా ఉంటుంది. ఇప్పుడు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అంతర్జాతీయంగా ఉన్న ప్రాబల్యం, ఆ సంస్థ పెట్టే పెట్టుబడులు కూడా టాటా గ్రూప్‌కు ఉపయోగపడనున్నాయి.

ఎయిరిండియా కీర్తి తగ్గిపోయి చాలా రోజులు అయినప్పటికీ దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆ సంస్థకు ఇప్పటికీ ప్రైమ్ టైమ్ స్లాట్స్ అలాగే కొనసాగుతుండటం కలిసొచ్చే అంశం.

ప్రస్తుతం ఈ విలీనం ఎయిరిండియాను దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా మార్చుతుంది. నడిపిస్తోన్న విమానాల సంఖ్య పరంగా దేశంలో రెండో అతిపెద్ద దేశీ విమాన సంస్థగా మారుస్తుంది.

ఈ విలీనం టాటాలకు కలిసొస్తుందని, ఒకే బ్రాండ్ మీద పూర్తిగా దృష్టి సారించేలా చేస్తుందని విమానయాన నిపుణుడు అమేయా జోషి అన్నారు.

ఆర్థిక లాభాలను పొందడం మాత్రమే కాదు ఎయిరిండియా ఖ్యాతిని తిరిగి పునరుద్ధరించడం ఇప్పుడున్న వారి ముందున్న సవాలు. అయితే, ఈ సవాలును ఎదుర్కోవడానికి టాటా బ్రాండ్ విలువ దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఈ ఒప్పందం ‘గో ఫస్ట్’, ‘స్పైస్ జెట్’ వంటి సంస్థలకు పెద్ద సవాళ్లను విసురుతుందని వారు భావిస్తున్నారు.

‘‘ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఇప్పుడు ఆ రెండు సంస్థలకు చాలా తక్కువగా ఉన్నాయి. వారికి భారీ మూలధన పెట్టుబడులు అవసరం’’ అని జోషి చెప్పారు.

వీడియో క్యాప్షన్, ల్యాండయ్యేటప్పుడు ఈ విమానాలు ఎలా ఊగిపోయాయో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)