హాంకాంగ్ టూరిస్టులకు 5 లక్షల ఉచిత విమాన టికెట్లు... ఏమిటీ ఆఫర్?

ఫొటో సోర్స్, Getty Images
హాంకాంగ్, తమ పర్యాటక రంగానికి ఊపిరిపోసేందుకు సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం కుదేలైంది. పర్యాటకులను తిరిగి ఆకర్షించేందుకు ఉచితంగా 5 లక్షల విమాన టిక్కెట్లు అందించాలని నిర్ణయించుకుంది.
కానీ, ఈ వ్యూహం పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందా? పర్యాటక రంగానికి చెందినవారు దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇక్కడ కరోనా కఠిన నిబంధనలు ఇంకా అమలులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రూ. 2,110 కోట్ల (255 మిలియన్ డాలర్లు) విలువైన ఈ ప్రణాళిక, పర్యాటక రంగానికి ఊపును తెస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
'ఉచిత టికెట్లు మాత్రమే సరిపోవు'
'వాక్ ఇన్ హాంకాంగ్' అనే టూరిస్ట్ గైడ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పాల్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.
''పర్యాటకులను ఆకర్షించడానికి ఉచిత టికెట్లు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. కానీ, దీని గురించి మరికొన్ని విషయాలు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఉచిత టికెట్లు ఎవరికి ఇస్తారు? విమానయాన సంస్థలు దీన్ని అమలు చేయగలవా? ఉచిత టికెట్ పొందిన అదృష్టవంతులు ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు'' అని పాల్ అన్నారు.
పాల్ తెలుసుకోవాలనుకుంటున్న ఈ సమాచారం గురించి ఇంకా హాంకాంగ్ వెల్లడించలేదు.
హాంకాంగ్ దేశీ విమానయాన సంస్థలైన 'హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్', 'హాంకాంగ్ ఎయిర్‌లైన్స్' ఈ పథకం అమలులో ఉంటాయని హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
సాధారణంగా చైనా, జపాన్, ఆగ్నేయాసియాల్లో ఈ విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా తిరిగే 'క్యాథీ పసిఫిక్ ఎయిర్‌లైన్స్' కూడా ఇందులో భాగంగా ఉంది.
కరోనా తగ్గిపోయిన తర్వాత విదేశీ ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఉచిత టికెట్లు అందజేయాలనే ప్లాన్‌ను కరోనా మహమ్మారి మొదలైన తొలినాళ్లలోనే రచించామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.
తమ టూరిస్ట్ గైడ్‌లు ప్రజలను చారిత్రక, నాగరికతకు సంబంధించిన ప్రదేశాలకు తీసకుకెళ్తారని పాల్ చెప్పారు. సాధారణంగా ఇలాంటి ప్రదేశాలకు ప్రజలు వెళ్లరు.
కరోనా కంటే ముందు తన వద్దకు వచ్చిన విదేశీ, దేశీ యాత్రికులు ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు.
''2013లో మేం ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు దిగజారాయి. ఇప్పడు పర్యటనకు వస్తున్న యాత్రికుల సంఖ్య ప్రకారం మేం మళ్లీ మా పని మొదలుపెట్టాల్సి వచ్చింది'' అని పాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్చువల్ టూర్లతో పాటు ఇప్పుడు స్థానిక ప్రజలపై వారి సంస్థ దృష్టి కేంద్రీకరించింది.
''ఇప్పటికీ మా సంస్థను నడపగలుగుతున్నాం అంటే మా అదృష్టంగానే భావించాలి. ఉచిత టికెట్లు ఇవ్వడం వల్ల ప్రజలు ఇక్కడికి వస్తారు. మునుపటిలాగే ఖర్చు చేస్తారు'' అని ఆయన అన్నారు.
తమ వద్దకు వచ్చే యాత్రికుల్లో ధనవంతులు ఉంటారు కాబట్టి వారు పెద్దగా విమాన టికెట్ల ధరల గురించి ఆందోళన చెందరని ఆయన భావిస్తున్నారు.
''మహమ్మారి కంటే ముందు మా వద్దకు వచ్చిన వారిని గమనించాం. బాగా డబ్బు ఉన్నవారే ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఉచిత విమాన టికెట్లు వారిపై పెద్దగా ప్రభావం చూపవు. మరికొన్ని అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
క్వారంటైన్ పాలసీలో మార్పులు
రెండేళ్లుగా హాంకాంగ్‌లో కఠిన కోవిడ్ నిబంధనలు అమలు అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే హాంకాంగ్, కరోనా ఆంక్షల నుంచి బయటపడుతోంది. నెగెటివ్‌గా తేలిన వారు కూడా తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను సెప్టెంబర్ 23న తొలగించారు.
అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను, కార్పొరేట్ సమావేశాలను మూన్ సూయి నిర్వహిస్తుంటారు. పర్యాటకులను తిరిగి ఆకర్షించేందుకు ఏం చేయడానికైనా హాంకాంగ్ సిద్ధంగా ఉన్నట్లు మూన్ సూయి చెప్పారు.
''గత రెండేళ్లు చడీచప్పుడు లేకుండా సాగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల ఊసే లేదు. కానీ, జూన్ నుంచి నాకు ఫోన్లు రావడం మొదలైంది. ఏదో ఈవెంట్‌కు సంబంధించిన నాకు ఫోన్లు వస్తున్నాయి. దీన్ని బట్టి పరిస్థితులు మెరుగవుతున్నట్లు నాకు అనిపిస్తుంది.
మరింతమంది పర్యాటకులను ఆకర్షించడానికి ఉచిత టికెట్లు సహాయపడతాయి. కోవిడ్ ఆంక్షలు సడలించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్వారంటైన్ పాలసీలో మార్పులు రావడం ఆనందించదగ్గ విషయం. ఈ మార్పులు చేయకముందు పర్యాటకులు హోటల్‌లోనే ఒక వారం పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. దీనికి ఎవరూ ఇష్టపడకపోయేవారు'' అని మూన్ సూయి చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణ రంగం ఏమంటోంది?
5 లక్షల ఉచిత టికెట్లను ఇవ్వడం గురించి ప్రయాణ రంగానికి చెందినవారు ఏం అనుకుంటున్నారు?
2013-2019 మధ్య హాంకాంగ్‌కు 5.8 కోట్ల మంది ప్రయాణీకులు వచ్చినట్లు హాంకాంగ్ పర్యాటక సంస్థ తెలిపింది.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కేవలం 2,49,699 ప్రయాణీకులు హాంకాంగ్‌లో అడుగుపెట్టినట్లు చెప్పింది.
హాంకాంగ్ ట్రావెల్ ఏజెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫ్రెడ్డీ యిప్, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రసారదారు ఆర్‌టీహెచ్‌కేతో మాట్లాడుతూ... ''తాజా నిర్ణయం మంచి సంకేతమే. కానీ, మరిన్ని డిస్కౌంట్లు, రాయితీలు ఇవ్వాలి'' అని అన్నారు.
అనుమానాలు
నికోలస్ ఇలాలోఫ్ అక్కడ ఒక రెస్టారెంట్‌ను నడుపుతుంటారు. శుక్రవారం ప్రజల రద్దీ కనిపించిందని ఆయన చెప్పారు. అయితే, గతంలో ఎక్కువగా విదేశీ పర్యాటకులు కనిపించేవారని ఆయన అన్నారు. కేవలం విమాన టికెట్లు ఉచితంగా ఇస్తే సరిపోదు, ప్రజలకు కోవిడ్ గురించి, వాటి ఆంక్షల గురించి ఇంకా అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
''మళ్లీ కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడం మొదలైతే కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయి. అప్పుడేం జరుగుతుంది? ఉచిత టికెట్లు ఇస్తున్నారని ప్రజలు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఉచిత టికెట్లతో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MAN MO DIM SUM AND WINE
'సరైన చర్య'
కరోనా నియమాల కారణంగా సంగీత ప్రదర్శనలను నిలిపేయాల్సి వచ్చిందని మ్యూజిక్ బార్ యజమాని జాన్ పీమర్ చెప్పారు. టికెట్ ఇవ్వడంతోనే సమస్య ముగిసిపోదు కానీ దీన్నొక సరైన ముందడుగుగా చెప్పొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్లిన ప్రజలు ఈ ప్రదేశాన్ని మెచ్చుకుంటారు. కానీ, రావడంతోనే కరోనా పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు అంటూ చెబితూ వారి మూడ్ పాడవుతుంది.

ఫొటో సోర్స్, THE WANCH, HONG KONG
పీసీఆర్ పరీక్ష
హాంకాంగ్‌లో ఇప్పటికీ కఠిన కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని బీబీసీకి చెందిన గ్రేస్ సోయి అన్నారు.
''ప్రయాణీకులు ఇక్కడికి చేరుకున్న తర్వాత రెండు, నాలుగు, ఆరో రోజు పీసీఆర్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆస్వాదించడం కోసం ఇక్కడికి వస్తోన్న పర్యాటకులకు ఇలాంటి పరీక్షలు, నిబంధనలు ఇబ్బందిని కలిగిస్తాయి'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ
- రిషి సునక్: బ్రిటన్ ప్రధాని రేసులో నంబర్ వన్
- విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు... వైరల్ అవుతున్న ఫోటోలు
- Virat Kohli Six: ‘ఆ షాట్ ఒక మానవుడు కొట్టి ఉంటే ఔటయ్యేవాడు.. విరాట్ కోహ్లీ బౌండరీ దాటించి, సిక్స్‌గా మలిచాడు’
- INDvPAK: భారత్‌ను గెలిపించిన చివరి ఓవర్ నాలుగో బంతిపై సోషల్ మీడియాలో చర్చ ఎందుకు జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













