రిషి సునక్: బ్రిటన్‌ ప్రధాని కాబోతున్న తొలి బ్రిటిష్-ఆసియన్ నేత, కన్సర్వేటివ్ పార్టీ అధికారిక ప్రకటన

రిషి సునక్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, .
    • హోదా, .

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునక్ బాధ్యతలు చేపడతారని కన్జర్వేటివ్ పార్టీ కమిటీ ప్రకటించింది. బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధానిగా, తొలి ఆసియా సంతతి ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

రిషి సునక్ ఈ వారంలోనే అధికారికంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బ్రిటన్ చరిత్రలో 200 ఏళ్లలో అత్యంత పిన్న వయసు ప్రధానిగా కూడా రిషి చరిత్రకెక్కనున్నారు.

బ్రిటన్ రాజు రిషి సునక్‌కు ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానిగా నియమితులైన 45 రోజులకే రాజీనామా చేసిన లిజ్ ట్రస్ నుంచి రిషి బాధ్యతలు స్వీకరిస్తారు.

పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికవటానికి నామినేషన్ల గడవువు సోమవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ముగిసింది. బరిలో ఉన్న రెండో అభ్యర్థి పెన్నీ మార్డంట్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఆమె రాజీనామా చేయటంతో కన్జర్వేటివ్ పార్టీలో ప్రధానమంత్రి పదవికి పోటీ మొదలైంది. ఈ పోటీలో మళ్లీ బరిలోకి దిగిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం.. ఆదివారం రాత్రి రేసు నుంచి వైదొలిగారు.

సోమవారం నామినేషన్ గడువుకు కొన్ని నిమిషాల ముందు రెండో అభ్యర్థి, కామన్స్ నేత పెన్నీ మోర్డంట్‌ కూడా తప్పుకున్నారు.

దీంతో పార్టీ నేత పదవికి ఎన్నికవటానికి రుషి సునక్ నామినేషన్ ఒక్కటే వచ్చింది. ఆయన ఒక్కరికే కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉందని, ఆయన పార్టీ నేతగా ఎన్నికై, ప్రధానమంత్రి అవుతారని పార్టీ కమిటీ ప్రకటించింది.

బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఎన్నికవాలంటే మొత్తం 355 మంది టోరీ ఎంపీల్లో కనీసం 100 మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది. మాజీ ఆర్థిక మంత్రి అయిన రిషి సునక్‌కు దాదాపు 200 మంది ఎంపీలు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ మోర్డంట్ కూడా రిషికి తన పూర్తి మద్దతు ఉందని ట్వీట్ చేశారు. రిషికి పార్టీ సమైక్యంగా పూర్తి మద్దతు ఇవ్వాల్సిన సమయమని కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ జేక్ బెర్రీ పేర్కొన్నారు.

రిషి సునక్

ఫొటో సోర్స్, PA Media

అస్థిరత, ఆందోళన

ఇది బ్రిటన్‌లో ఇంతకు ముందెన్నడూ కనిపించని అస్థిర కాలం. చాలామంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కూడా ప్రైవేట్ సంభాషణలో దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాంటి సర్కస్ ఫీట్ల వల్ల పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిందని పార్టీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రిషి సునక్ ప్రధానమంత్రి కావటానికి ప్రజాస్వామిక తీర్పు లేదని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

బ్రిటన్‌లో ఎన్నికలు లేకుండా వరుసగా నాలుగో వ్యక్తి ప్రధానమంత్రి పదవి చేపడుతున్నారు. రిషి సునక్‌కు ముందు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్‌లు ఈ విధంగా ప్రధానమంత్రులు అయ్యారు.

2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచారు. 2024లో మళ్లీ సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. బ్రిటన్ పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి తీరాల్సిన ఆవశ్యకత రిషి సునక్‌కు లేదు.

అయితే.. నిలువునా చీలిపోయిన కన్జర్వేటివ్ పార్టీ, నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితి, తీవ్రమైన ప్రతిపక్ష దాడులు.. వీటన్నింటినీ రిషి సునక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పెన్నీ మార్డాంట్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పెన్నీ మార్డాంట్

ఎన్నిక ఎలా జరుగుతుంది?

ప్రస్తుతం బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉంది. బోరిస్ జాన్సన్ దిగిపోయిన తర్వాత లిజ్ ట్రస్ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు పార్టీ మళ్లీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఎన్నికైన పార్టీ నాయకుడే తదుపరి ప్రధాని కూడా అవుతారు.

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నిక కావాలంటే 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఈ ప్రక్రియ పబ్లిక్ కాదు.

కన్జర్వేటివ్ పార్టీకి మొత్తం 357మంది సభ్యులు ఉన్నారు. అభ్యర్థులకు 100 చొప్పున నామినేషన్లు రావాలంటే ముగ్గురి కన్నా ఎక్కువమంది ఎన్నికల్లో నిల్చునే అవకాశం లేదు. ఇద్దరు లేదా ఒక్కరే నిల్చునే అవకాశం కూడా ఉంది. ఒక్కరే అయితే ఓటింగ్ అవసరమే ఉండదు.

ముందుగా ఇద్దరు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అభ్యర్థి పేరును ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరో 98 మంది ఎంపీలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఈ ఎంపీలు తమ పేర్లను గోప్యంగా ఉంచుకోవచ్చు.

ముగ్గురు వ్యక్తులు బరిలో ఉంటే, వారిలో తక్కువమంది ఎంపీల ఓట్లు వచ్చిన వారిని బరిలో నుంచి తొలగిస్తారు. మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు ఎంపీలు తమ ప్రాధాన్య ఓట్లను వేస్తారు. ఈ ఓటింగ్ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.30 గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. ఒక్కరే నామినేషన్ వేయటంతో ఓటింగ్ అవసరం లేకుండానే ఆయన పార్టీ నేతగా ఎన్నికవుతారు.

వీడియో క్యాప్షన్, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)