విమానం దొంగిలించి, వాల్‌మార్ట్‌పై కూల్చేస్తానంటూ గాలిలో చక్కర్లు.. నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...

వాల్‌మార్ట్‌పై దాడి చేస్తానని బెదిరించిన తర్వాత మిసిసిపిలో విమానం చక్కర్లు కొడుతున్న దృశ్యాన్ని ప్రత్యక్ష సాక్షులు వీడియో తీశారు

ఫొటో సోర్స్, TMX/colby Breazeale

ఫొటో క్యాప్షన్, వాల్‌మార్ట్‌పై దాడి చేస్తానని బెదిరించిన తర్వాత మిసిసిపిలో విమానం చక్కర్లు కొడుతున్న దృశ్యాన్ని ప్రత్యక్ష సాక్షులు వీడియో తీశారు
    • రచయిత, జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి చిన్న విమానాన్ని దొంగతనం చేశారు. అంతేకాకుండా ఆ విమానాన్ని, వాల్‌మార్ట్ షాపులోకి తీసుకెళ్తానని బెదిరించాడు. ఇలా బెదిరింపులకు పాల్పడిన ఆ వ్యక్తిని గ్రాండ్ లారెన్సీ (అత్యంత విలువైన వస్తువుల దొంగతనం), తీవ్రవాద బెదిరింపుల ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.

కోరీ వేనీ ప్యాటర్సన్ అనే వ్యక్తిని ఈ ఆరోపణల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిసిసిపిలోని టుపెలో వద్ద ప్యాటర్సన్, గంటల పాటు విమానంలో చక్కర్లు కొట్టారని నేలపై విమానం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

గాలిలో ఉన్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతుండగా, మరోవైపు వాల్‌మార్ట్ షాపులోని ప్రజలను ఖాళీ చేయించారు.

నిందితుడు స్థానిక విమానాశ్రయంలో పనిచేశాడని, అయితే అతని వద్ద పైలట్ లైసెన్స్ ఉన్నట్లు అనిపించడం లేదని సిటీ పోలీసులు తెలిపారు.

''ప్యాటర్సన్, బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ ట్విన్- ఇంజిన్ విమానాన్ని దొంగిలించాడు. ఇది 10-11 సీటింగ్ సామర్థ్యంతో ఉంటుంది'' అని చెప్పారు.

విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న కాసేపటికే నిందితుడు, 911 నంబరుకు ఫోన్ చేసి 'వాల్‌మార్ట్ బ్రాంచ్‌లోకి విమానాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నా' అని హెచ్చరించారు.

వేగంగా స్పందించిన అధికారులు ''ప్రమాద హెచ్చరిక'' జారీ చేయడంతో వెంటనే వాల్‌మార్ట్ భవనంతో పాటు దాని సమీపంలోని దుకాణాలను ఖాళీ చేయించారు.

ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం

ఫొటో సోర్స్, TMX/colby Breazeale

అధికారులు తెలివిగా వ్యవహరించి ప్యాటర్సన్ సురక్షితంగా నేలపై ల్యాండ్ అయ్యేలా చేయగలిగారని స్థానిక పోలీస్ ఉన్నతాధికారి జాన్ ఖాకా అన్నారు. అధికారుల ఉచ్చులో పడిన ప్యాటర్సన్ వాల్‌మార్ట్ భవనంలోకి విమానాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నాడని ఆయన వివరించారు.

అయితే, అధికారులు నిందితునితో ఏం మాట్లాడారు? విమానాన్ని నేలపై ల్యాండ్ చేసేలా అతన్ని ఎలా ఒప్పించారు? నిందితుని ఉద్దేశాలు ఏంటి? అనే వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.

ఫేస్‌బుక్‌లో 'గుడ్‌బై' అనే సందేశాన్ని నిందితుడు పోస్ట్ చేసినట్లు జాన్ ఖాకా, విలేఖరుల సమావేశంలో చెప్పారు.

నిందితుడు విమానాన్ని దొంగిలించి ఆకాశంలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఫ్లైట్ ట్రాకర్లు, ఆ విమానాన్ని మానిటర్ చేశాయని వెల్లడించారు.

కాసేపటి తర్వాత స్థానిక 'డబ్ల్యూటీవీఏ' టీవీకి చెందిన ఒక రిపోర్టర్ ఈ ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా... ఆ విమానం ఒక వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ అయినట్లుగా కనిపించింది.

అయితే, విమానంలో ఇంధనం అయిపోవడంతో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్‌కు ముందు ఉత్కంఠ నెలకొంది.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్యాటర్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గ్రాండ్ లారెన్సీ, తీవ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలతో పాటు ఫెడరల్ స్థాయి దర్యాప్తును కూడా ఆయన ఎదుర్కోనున్నారు.

అత్యంత యుక్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర గవర్నర్ టతె రీవ్స్ ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, విమానం చక్రాల్లో దాక్కుని వెళ్లినా బతికాడు, ఎలాగంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)