Greece Cargo Plane Crash: 11 టన్నుల ల్యాండ్‌మైన్లు, ఆయుధాలు తీసుకెళ్తూ కూలిన విమానం.. చుట్టుపక్కల ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన ప్రభుత్వం

ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ముందు జాగ్రత్త చర్యగా డ్రోన్లను ఉపయోగించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ముందు జాగ్రత్త చర్యగా డ్రోన్లను ఉపయోగించారు
    • రచయిత, ఫ్లోరా డ్రురే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. ఈ విమానంలో ల్యాండ్‌మైన్లు సహా 11 టన్నుల బరువైన ఆయుధాలు ఉన్నాయని, వీటిని బంగ్లాదేశ్ తరలిస్తున్నారని అధికారులు చెప్పారు.

ఈ ఆన్టోవ్-12 విమానం కూలిపోయిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని కూడా అధికారులు హెచ్చరించారు.

శనివారం రాత్రి ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానం సెర్బియా నుంచి జోర్డాన్‌కు ప్రయాణిస్తోంది. కవాలా నగరానికి సమీపంలో కూలిపోయింది. ఇందులో ఉన్న 8 మంది చనిపోయారు.

కూలిపోతున్నప్పుడు విమానానికి మంటలు అంటుకున్నాయని, ఒక పెద్ద అగ్నిగోళంలా విమానం కూలిందని ప్రమాద సమయంలో తీసిన వీడియోను బట్టి తెలుస్తోంది.

ఆదివారం ఉదయం ఈ విమానాన్ని, ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ముందు జాగ్రత్త చర్యగా డ్రోన్లను ఉపయోగించారు.

కూలిపోయిన విమానం శకలాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కూలిపోయిన విమానం శకలాలు

భారీ స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్తున్న ఈ విమానం కూలిపోయిన ప్రాంతంలో పేలుళ్లు జరుగుతాయేమోనని భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రమాద స్థలం సురక్షితమే అని తేలే వరకూ ఆర్మీ కానీ, పేలుళ్ల నిపుణులు కానీ, గ్రీక్ అటామిక్ ఎనర్జీ కమిషన్ సిబ్బంది కానీ అక్కడ అడుగుపెట్టరని గ్రీక్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది.

ఇక్కడ గాలిలో ఏమైనా తేడాలు ఉన్నాయేమోనని కూడా పరిశీలించామని, ప్రస్తుతానికి ప్రమాదకరమైన సంకేతాలేవీ లేవని ఉత్తర గ్రీస్ ఫైర్ బ్రిగేడ్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ మారిస్ అపొస్టొలిడిస్ చెప్పారు.

''తీవ్రమైన పొగ, వేడితో పాటుగా తెల్లని పదార్థం కూడా కనిపించాయి. ఆ పదార్థం ఏంటనేది మేం గుర్తించం. అదేంటో స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ టీం చెప్పాలి. అలాగే, ప్రమాద స్థలానికి మేం వెళ్లాలా? వద్దా? అనేది కూడా వాళ్లే చెప్పాలి'' అని అపొస్టొలిడిస్ వెల్లడించారు.

గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని, దీంతో విమానాన్ని నడుపుతున్న పైలట్ గ్రీస్‌లోని కవాలా విమానాశ్రయంలో అత్యవసరంగా దిగేందుకు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. కానీ, విమానం రన్‌వేను చేరుకోలేకపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.45 గంటలకు విమానాన్ని చూశామని స్థానికులు తెలిపారు.

కూలిపోవడానికి ముందే విమానానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కూలిపోవడానికి ముందే విమానానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు

''హమ్మయ్య.. అది మా ఇళ్లపై పడలేదు'' అని సమీపంలో నివసించే అమిలియా టప్తనోవా అన్నారు.

''దానికి పొగలు అలముకున్నాయి. శబ్ధం వచ్చింది కానీ, అదెలాంటిదో నేను స్పష్టంగా చెప్పలేను. పర్వతం మీదుగా వెళ్లింది. మళ్లీ తిరిగి పొలాలపైకి వచ్చి కూలిపోయింది'' అని ఆమె వెల్లడించారు.

''ఆ మంటల్ని చూసి మాకు భయమేసింది. చాలా కార్లు వచ్చాయి. కానీ, ఒక్కటి కూడా విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లలేకపోయాయి. ఎందుకంటే అక్కడ వరుసగా పేలుళ్లు జరుగుతున్నాయి''.

ఈ విమానం 11 టన్నుల సెర్బియాలో తయారైన ఆయుధాలను బంగ్లాదేశ్‌కు తీసుకెళుతోందని సెర్బియా రక్షణ శాఖ మంత్రి నెబొజా స్టెఫనోవిక్ ప్రకటించారు.

అయితే, విమానంలో ఉన్న ఆయుధాలు ఎలాంటివి అన్నదానిపై స్పష్టత లేదు.

మోర్టార్ మైన్లు, ట్రైనింగ్ మైన్లలో వాడే పేలుడు పదార్థాలు ఉన్నాయని, విమానంలో వీటిని తరలించేందుకు అవసరమైన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనుమతులు ఉన్నాయని మంత్రి చెప్పారు.

కాగా, ఈ విమానంలో ల్యాండ్‌మైన్లు కూడా ఉన్నాయని ఆయుధాల డీలర్ వలీర్‌కు చెందిన ఒక డైరెక్టర్ బీబీసీతో అన్నారు.

ఆర్మీ, బోర్డర్ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని సెర్బియా నుంచి కొనుగోలు చేశామని, విమానంలో ఆ మోర్టార్ షెల్స్ కూడా ఉన్నాయని బంగ్లాదేశ్ సైన్యం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసు అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ బెంగాలీకి తెలిపారు.

యుక్రెయిన్ కార్గో ఎయిర్‌లైన్ మెరిడియన్‌కు చెందిన ఈ విమానంలో ఉన్న సిబ్బంది యుక్రేనియన్లు అని తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాకు వెళ్లాల్సిన ఈ విమానం జోర్డాన్, సౌదీ అరేబియా, భారత్‌ల్లో కూడా ఆగాల్సి ఉంది.

గ్రీస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)