Nigeria Coconut Cultivation: నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొబ్బరి పంటను నమ్ముకున్న దేశం

- రచయిత, ఇజోమా డుక్వే
- హోదా, బీబీసీ న్యూస్, లాగోస్
నైజీరియా వాణిజ్య కేంద్రం లాగోస్ దగ్గర ఐసోలో పరిసరాల్లో టోయిన్ కప్పో కోలావోల్ అనే మహిళ ఒక చిన్న కొబ్బరి ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, కొబ్బరి కోరు, చిరు తిళ్ళను తయారు చేస్తారు.
ఆమె 2018లో డి-క్రిబ్స్ కోకోగ్రీ కోకోనట్ అనే సంస్థను స్థాపించారు. వ్యాపారం కోసం కొబ్బరికాయలను తీర పట్టణం బేదెగ్రీ నుంచి సేకరించేవారు. ఈ ప్రాంతం దేశంలోని కొబ్బరి పరిశ్రమకు కేంద్రంగా ఉంది.
పెరుగుతున్న ఫ్యాక్టరీ ఉత్పత్తులకు తగినంతగా కొబ్బరి దొరకడం కష్టంగా మారుతూ వచ్చింది. దీంతో, ఆమె ఘనా నుంచి కొబ్బరికాయలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు.
"ఇలా దిగుమతి చేసుకోవడం వల్ల నా ఉత్పత్తుల ఖరీదు పెరిగిపోతోంది. దీంతో, నేను వినియోగదారులను కోల్పోతున్నాను" అని ఆమె అన్నారు.
కొబ్బరి పరిశ్రమకు ఆకర్షితులైన వ్యాపారవేత్తలలో కప్పో కోలావోల్ కూడా ఒకరు.
కొబ్బరికాయ నుంచి వచ్చే పీచు నుంచి కొబ్బరి వరకు అనేక రకాల పదార్ధాలు తయారు చేసేందుకు దీనిని వాడతారు. దీని నుంచి ఆహారపదార్ధాలు మాత్రమే కాకుండా, సౌందర్య సాధనాలు, వస్త్రాలు కూడా తయారు చేస్తారు. దీనిని ఇంధనంగా కూడా వాడతారు.
2000 దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికి డిమాండ్ పెరుగుతోంది. దీని నుంచి ప్రయోజనం పొందేందుకు నైజీరియాలో కూడా ఈ పరిశ్రమలో అడుగుపెట్టే వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతోంది.
క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితులున్న సమయంలో కూడా కొబ్బరి ఉత్పత్తుల డిమాండ్ స్థిరంగానే ఉంది.
2021లో అంతర్జాతీయ సరఫరా తక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె సగటు ధర 62% పెరిగింది. ఒక టన్ను నూనె ధర 1636 డాలర్లకు (సుమారు రూ. 1,30,423) చేరింది.
కొబ్బరి పంటను వాణిజ్య పంటగా అభివృద్ధి చేసేందుకు గత నెలలో నైజీరియాలోని బేదెగ్రీ ప్రాంతంలో కొబ్బరి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది.
కొబ్బరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు జాతీయ కొబ్బరి ఉత్పత్తిదారులు, ప్రాసెసర్లు, నైజీరియా మార్కెట్ అసోసియేషన్ కలిసి ప్రారంభించిన ప్రణాళికలో ఈ కార్యక్రమం ఒక భాగం.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది నైజీరియా కొబ్బరి నూనె, వివిధ ఆహార పదార్ధాలు, పానీయాల తయారీ కోసం 500,000 టన్నుల కొబ్బరిని దిగుమతి చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
నైజీరియా రాజధాని అబూజా నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒక కొబ్బరి తోటకు వెళ్లాను.
ఈ తోటను రే డేవిస్, ఆమె భర్తతో కలిసి నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్మీలో పదవీ విరమణ చేసిన తర్వాత కొబ్బరి సాగులోకి అడుగుపెట్టారు.
ఈ కొబ్బరి తోట 150 హెక్టార్ల భూమిలో విస్తరించి ఉంది. రాతి నెలలో అక్కడక్కడా మొలకలు వచ్చిన కొబ్బరి మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ తోటలో మొత్తం 4000 కొబ్బరి మొక్కలను నాటారు.

ఈ దంపతులు ఆరేళ్ళ క్రితం వ్యవసాయం మొదలుపెట్టారు. వీరు మొదట నిమ్మకాయలు, కాయగూరలు, అరటి లాంటివి కూడా పండించేవారు. క్రమంగా 2021లో 20 హెక్టార్ల భూమిలో కొబ్బరి సాగు మొదలుపెట్టారు.
కొబ్బరి ఉత్పత్తిదారులు టోగో, ఘనా, ఐవరీ కోస్ట్ లాంటి దేశాల నుంచి కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు ఉన్న లోటును డేవిస్ లాంటి వారు చేస్తున్న ప్రయత్నాలు పూరించవచ్చు.
"మన సొంత పరిశ్రమలకు సేవలందించేందుకు తగినంత ఉత్పత్తి లేదు. ఇక్కడ కొబ్బరికి మంచి మార్కెట్ ఉంది" అని డేవిస్ అన్నారు.
కొబ్బరి పంటను వాణిజ్య పంటగా చూడటం మొదలుపెట్టారని నాకోప్ మాన్ అధ్యక్షులు మాఒకోరోజీ అన్నారు.
"ఇది ఆర్ధిక వ్యవస్థకు చాలా ద్రవ్యాన్ని తేగలదు. కొబ్బరి దేశ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలదు" అని అన్నారు.
"మాకు కొబ్బరి పండే నేలలు ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి. కొబ్బరి పంటకు అనుకూలమైన వాతావరణం కూడా ఉంది.’’

ఫొటో సోర్స్, Getty Images
"మేము దిగుమతి చేసుకోవడానికి బదులు ఎగుమతి చేస్తూ ఉండాల్సింది" అని ఒకోరోజీ అన్నారు. ఒకోరోజీ నైజీరియాలో ప్రభుత్వ సహకారంతో కొబ్బరి స్వయం సమృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం కోసం పని చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నైజీరియాలో 2027 నాటికి 36 రాష్ట్రాల్లో సుమారు 10,000 హెక్టార్లలో కొబ్బరి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో దేశీయంగా కొబ్బరి ఉత్పత్తి పెంచాలని చూస్తున్నారు.
అయితే, కొబ్బరి దిగుబడిని పెంచేందుకు వీలుగా ఉండే నాణ్యమైన కొబ్బరి విత్తనాలను సంపాదించడం రైతులకు పెద్ద సవాలుగా మారింది.
కొబ్బరిని వాణిజ్య పంటగా చేసేందుకు దేశీయంగా దొరికే పశ్చిమ ఆఫ్రికా పొడవు కొబ్బరి, ఆసియాలో దొరికే మరుగుజ్జు రకంతో క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల వచ్చే హైబ్రిడ్ రకం మెరుగ్గా ఉంటుంది.
హైబ్రిడ్ పంట నాలుగు నుంచి ఐదేళ్లకొకసారి చేతికొస్తుంది. మరుగుజ్జు కొబ్బరి రెండున్నరేళ్ల నుంచి మూడు సంవత్సరాలకొకసారి చేతికొస్తుంది. కానీ, పరిశోధకులు ప్రత్యేకంగా వాణిజ్య పంట కోసం హైబ్రిడ్ రకాన్ని అభివృద్ధి చేశారు.
అధిక దిగుబడి రావాలంటే హైబ్రిడ్ రకాలను వాడటం అవసరమని బేదెగ్రీలో కొబ్బరి సాగు చేస్తున్న అబియోదున్ ఓయ్‌లేకన్ చెప్పారు.
"కానీ, ఒక్కొక్క విత్తనం ధర ఆరు డాలర్ల ఖరీదు ఉండటంతో ఇది సాధారణ రైతులకు అందుబాటులో లేదు" అని చెప్పారు.
"గతంలో వేసిన పంటను మార్చి కొత్త పంటను వేయాలంటే పెట్టుబడి కూడా అవసరమవుతుంది. అందుకు ఆర్ధిక సహకారం అవసరం" అని అన్నారు. దీంతో, చిన్న రైతులు ఉత్పత్తిని పెంచడం కష్టంగా మారుతుందని అన్నారు.

కొబ్బరి పరిశ్రమలకు విద్యుత్ అవసరం
కొబ్బరి పరిశ్రమకు సహకారం అందించి ఉత్పత్తిని పెంచేందుకు లాగోస్ స్టేట్ గవర్నమెంట్ కోకోనట్ డెవెలప్మెంట్ అథారిటీకి పనిని అప్పగించారు.
దేశంలో ప్రభుత్వమే అత్యధికంగా కొబ్బరిని ఉత్పత్తి చేస్తోందని సంస్థ జనరల్ మేనేజర్ డాపో ఓలాకులేహిన్ అన్నారు. గత 10 - 15 సంవత్సరాలుగా కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమ భారీగా పెరగడంతో ఉత్పత్తిదారుల అవసరానికి తగినంతగా కొబ్బరి దొరకటం లేదు.
"గత మూడేళ్ళ నుంచి కొబ్బరి ప్రాసెసింగ్‌కు పెరిగిన డిమాండును గమనించి కొబ్బరి పండించేందుకు చాలా మందిని ప్రోత్సహించడం మొదలుపెట్టాం. దీని ఫలితాలు మరో నాలుగైదేళ్లలో కనిపిస్తాయి" అని అన్నారు.
రైతులకు విత్తనాలను పంచేందుకు లాగోస్ స్టేట్ గవర్నమెంట్ కోకోనట్ డెవెలప్మెంట్ అథారిటీ కి చెందిన తోటల్లో ఉత్పత్తి చేసేవారు.
గత ఏడాది వారు కొబ్బరి ఉత్పత్తిదారులకు 200,000 కొబ్బరి విత్తనాలను సరఫరా చేశారు. కానీ వనరులు తగినంతగా లేవు. ఈ ఏడాది కేవలం 80,000 విత్తనాలను మాత్రమే పంచగలరు. అంటే, ప్రస్తుతానికి కొబ్బరి ప్రాసెసర్లు కొబ్బరికాయలను దిగుమతి చేసుకోవాల్సిందే.
"దేశంలో నెలకొన్న నిరుద్యోగం. విదేశీ మారక ద్రవ్యం కోసం చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొబ్బరి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది" అని నైజీరియా పారిశ్రామిక మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి కౌరా అరిమియే అన్నారు.
"కొబ్బరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం మాత్రమే కాకుండా మేము అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నాం" అని అన్నారు.
ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా మౌలిక వసతులను మెరుగుపరచాలని కోకోనట్ ఫుడ్ సంస్థ జామ్ అధ్యక్షుడు ఏబున్ ఫెలుదు అన్నారు.
నైజీరియాలో విద్యుత్ కోతలు బాగా ఎక్కువ. ఇక్కడ రోడ్లు కూడా బాగుండవు. ఈ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది. కానీ, రోడ్లు, విద్యుత్ లాంటి అంశాలతో పాటు మా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరడం పట్ల దృష్టి పెడితే మరింత సహాయకరంగా ఉంటుంది" అని ఫెలుదు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లఖ్‌నవూ లులు మాల్లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో
- ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- శ్రీలంక కు భారత్ చేయాల్సింది సైనిక సాయమా, ఆర్ధిక సాయమా, 1987 అనుభవాలు ఏం చెబుతున్నాయి
- భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి పాకిస్తాన్‌కు రహస్య సమాచారం ఇచ్చారా... అలా ఆరోపించిన నుస్రత్ మీర్జా ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















