బోస్నియా: స్రెబ్రినికా మగజాతి ఊచకోతకు పాతికేళ్లు

కుమారుడి సమాధిని ముద్దాడుతున్న మెజ్రా జోగాజ్.. ఆ ఊచకోత నుంచి జోగాజ్ బయటపడగా కుమారుడు, భర్త మరణించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుమారుడి సమాధిని ముద్దాడుతున్న మెజ్రా జోగాజ్.. ఆ ఊచకోత నుంచి జోగాజ్ బయటపడగా కుమారుడు, భర్త మరణించారు

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో అత్యంత దారుణ అకృత్యమైన స్రెబ్రినికా ఊచకోత జరిగి పాతికేళ్లయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ నాయకులు మాట్లాడారు.

బోస్నియాలో జరిగిన ఆ దారుణ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది మగవాళ్లు, బాలురకు నివాళిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వేల్స్ యువరాణి, మృతుల బంధువులు మాట్లాడారు.

ఆ నరమేధంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇటీవల గుర్తించిన నలుగురి అస్థికలను ఖననం చేశారు.

పాతిపెట్టిన శవాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ ఏమిటీ నరమేధం

బోస్నియాకు చెందిన సెర్బ్ దళాలు సెర్బీనికాలో 1995లో 8 వేల మంది ముస్లిం పురుషులు, బాలురను ఊచకోత కోశాయి. ఆ ఘటనకు పాతకేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

1992-95 మధ్య జరిగిన బోస్నియా యుద్ధ సమయంలో సెర్బ్ ఆర్మీ జాతి నిర్మూలనకు దిగింది.

1995 జులై 11న జనరల్ రత్కో మ్లాదిక్ నేతృత్వంలోని సెర్బ్ దళాలు స్రెబ్రినియా పట్టణాన్ని చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి.

సెర్బ్ దళాలు అక్కడ అడుగుపెట్టే సమయానికి పక్కనే ఉన్న పొటోకారీ పట్టణంలోని డచ్ శరణార్థి శిబిరంలో సుమారు 20 వేల మంది ముస్లింలు ఆశ్రయం పొందారు. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలు, రోగగ్రస్థులు, బలహీనులే.

సెర్బ్ దళాలు చుట్టుముట్టగానే మహిళలు, బాలికలను అక్కడి నుంచి తరలించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెర్బ్ దళాలు చుట్టుముట్టగానే మహిళలు, బాలికలను అక్కడి నుంచి తరలించారు

అయితే సెర్బ్ దళాల హింస ఉద్ధృత రూపం దాల్చేటప్పటికి డచ్ సేనలు సెర్బ్ దళాలకు లొంగిపోయాయి. బోస్నియాక్‌ (బోస్నియా ముస్లింలు) మహిళలు, పిల్లలను బస్సుల్లో సురక్షిత ప్రాంతలకు తరలించారు.

దాంతో అక్కడ బోస్నియా ముస్లిం పురుషులు, బాలురు మిగిలిపోయారు. వారందరినీ కాల్చి చంపేయడానికి సెర్బ్ దళాలు తీసుకెళ్లిపోయాయి.

అలా వేలాది మంది బోస్నియా ముస్లిం పురుషులు, అబ్బాయిలను చంపేసి బుల్డోజర్లతో పాతిపెట్టేశారు.

బోస్నియా సెర్బ్ దళాల కమాండర్ రత్కో మ్లాదిక్(మధ్యలో). ఈ ఊచకోతకు నేతృత్వం వహించింది ఈయనే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోస్నియా సెర్బ్ దళాల కమాండర్ రత్కో మ్లాదిక్(మధ్యలో). ఈ ఊచకోతకు నేతృత్వం వహించింది ఈయనే

తండ్రుల కళ్లెదుటే కొడుకులను చంపారు.. బతికుండగానే పాతిపెట్టారు

ఈ క్రమంలో సెర్బ్ దళాలు అత్యంత దారుణాలకు పాల్పడ్డాయని చెబుతారు.

కొందరిని బతికుండగానే పాతిపెట్టారని ఆ తరువాత అనేక నివేదికల్లో వెల్లడైంది. అంతేకాదు.. పిల్లలను చంపేటప్పుడు తండ్రులను అక్కడే ఉంచి చూడమని బలవంతం చేసి వారి కళ్లెదుటే వధించారు.

కేవలం రెండు వారాల్లోనే సెర్బ్ దళాలు 8 వేల మందికిపైగా బోస్నియా ముస్లిం మగవాళ్లు, అబ్బాయిలను చంపేశాయి.

ఆ సమయంలో ఐరాస శాంతి సేనకు చెందిన డచ్ బలగాలు అక్కడే ఉన్నా తగినన్ని ఆయుధాలు లేకపోవడంతో తమ చుట్టూ జరుగుతున్న ఈ ఊచకోతను నిలువరించలేకపోయాయి.

అనంతర కాలంలో ఐరాస ట్రైబ్యునల్ దీనిపై విచారణ జరిపింది.. ఈ ఊచకోత వెనుక భారీ ప్రణాళిక ఉందని బయటపెట్టింది.

''ఐరాస చరిత్రలో ఈ విషాదం శాశ్వతంగా వెంటాడుతుంది'' అని ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఆ తరువాత ప్రకటించారు.

డచ్ సేనలు ఏమీ చేయలేకపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డచ్ సేనలు ఏమీ చేయలేకపోయాయి

బోస్నియా ముస్లింలపై ఎందుకు కక్షగట్టారు?

ఒకప్పుడు యుగోస్లేవియాలో భాగంగా ఉండే 'ది సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా' వివిధ జాతులు, తెగలకు నిలయంగా ఉండేది. బోస్నియా ముస్లింలు, సనాతన సెర్బ్‌లు, క్యాథలిక్ క్రొయేట్స్ అధికంగా ఉండేవారు.

1992లో ఒక రిఫరెండం నిర్వహించిన తరువాత 'బోస్నియా-హెర్జ్‌గోవినా' స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అమెరికా, పలు యూరప్ దేశాలు దాన్ని గుర్తించాయి.

అయితే, బోస్నియా సెర్బ్‌లు ఈ రిఫరెండాన్ని బహిష్కరించాయి. అక్కడికి కొద్ది రోజుల్లోనే సెర్బియా ప్రభుత్వ మద్దతుతో బోస్నియా సెర్బ్ సేనలు ఈ కొత్త దేశం 'బోస్నియా-హెర్జ్‌గోవినా'పై దాడి చేశాయి.

జాతి నిర్మూలన చేయాలన్న దుష్టాలోచనతో, గ్రేటర్ సెర్బియా నెలకొల్పాలన్న వాంఛతో ఆ ప్రాంతం నుంచి బోస్నియా ముస్లింలను నిర్మూలించడానికి సిద్ధమయ్యారు.

మధ్య యుగంలో ఒట్టామన్ పాలకుల కాలంలో కొందరు బోస్నియన్లు ముస్లిం మతం స్వీకరించారు.

బోస్నియా సెర్బ్ దళాలు స్రెబ్రీనికాను 1992లో స్వాధీనం చేసుకున్నప్పటికీ బోస్నియా సైన్యం 1993లో మళ్లీ తమ చేతుల్లోకి తీసుకోగలిగింది.

1993 ఏప్రిల్‌లో ఆ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి ఎలాంటి దాడుల భయంలేని సురక్షిత ప్రాంతంగా ప్రకటించింది. అక్కడ ఐరాస శాంతి సేనలో భాగమైన కొద్దిపాటి డచ్ దళాన్ని కాపలా ఉంచింది.

వేలాది మంది ఆకలితోనూ చనిపోయారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేలాది మంది ఆకలితోనూ చనిపోయారు

కానీ, సెర్బ్ దళాలు ఆ ప్రాంతానికి నిత్యవసరాలు రాకుండా చేసేవారు. దీంతో బోస్నియా ముస్లింలు వేలాది మంది ఆకలితోనూ చనిపోయారు.

అలా కొన్నాళ్లు జరిగాక 1995 జులై 6న బోస్నియా సెర్బ్ దళాలు స్రెబ్రీనికాను చుట్టుముట్టాయి. ఐరాసకు చెందిన డచ్ దళం వారిని నిలువరించలేక లొంగిపోవడమే కాకుండా తమ వద్ద ఉన్న 5 వేల మంది ముస్లింలను సెర్బ్ దళాలకు అప్పగించాయి. దీంతో బోస్నియా ముస్లింలను ఊచకోత కోశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)