గుజరాత్‌లో బీజేపీని ఎవరూ ఎందుకు ఓడించలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 150కిపైగా సీట్లు గెలిచింది.
- గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకొంది 99 సీట్లు మాత్రమే.
- అప్పుడు కాంగ్రెస్ 77 సీట్లు గెలిచింది.
- ఈ సారి ఎన్నికల్లో ఆప్ కూడా తమ అదృష్టం పరీక్షించుకుంది.
- ప్రస్తుతం ఆప్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది, ఐదు సీట్లు వచ్చాయి.
- తాజా ఎన్నికల్లో ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్సే.
- 1985లో కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలో పార్టీ 149 సీట్లు గెలిచింది.

ఫొటో సోర్స్, @BJP
గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో ఉన్నప్పుడే రాజ్‌కోట్‌లోని కాంగ్రెస్ నాయకుడు ఇంద్రనీల్ రాజ్‌గురు రిసార్టులో కొందరు న్యాయవాదులు మాట్లాడుకుంటున్నారు.
మేం కూడా ఆ చర్చ వింటున్నాం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి వారు మాట్లాడుకుంటున్నారు. నరేంద్ర మోదీని ‘‘గుజరాత్ సింహం’’గా న్యాయవాది అనిరుధ్ నథ్వానీ అభివర్ణించారు.
ఆ వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘మరి ఆ సింహం ఒక్క విలేకరుల సమావేశం ఎందుకు పెట్టలేకపోతోంది?’’అని ప్రశ్నించారు. అయితే, ఆ ప్రశ్నను కొట్టి పారేస్తూ మోదీ సింహమే అని మరోసారి అనిరుధ్ వ్యాఖ్యానించారు.
ఇది అనిరుధ్ నాథ్వానీ ఒక్కరి మాట కాదని గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు రాజీవ్ షా చెప్పారు.
‘‘గుజరాత్‌లోని మధ్యతరగతి ప్రజలు మోదీని సింహంగానే చూస్తారు. అది అనిరుధ్ నాథ్వానీ ఒక్కరి మాట కాదు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు లాంటి అంశాలు వారికి అక్కర్లేదు. ఇప్పటికీ మధ్యతరగతి ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో మోదీకి మంచి ప్రజాదరణ ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పార్టీది కాదు.. నరేంద్ర మోదీది’’అని రాజీవ్ షా చెప్పారు.
ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇలాంటి విజయాన్ని 1985లో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ చూసింది. ఆనాడు పార్టీకి 149 సీట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది చరిత్రాత్మక విజయం
ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకి రికార్డును బీజేపీ బద్దలుకొట్టింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇక్కడ మొదట్నుంచీ ఎలాంటి అనిశ్చితీలేదని రాజీవ్ షా చెప్పారు.
నగరాల్లోని 60 సీట్లు బీజేపీకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లోని 122 సీట్లు రెండు పార్టీల మధ్య చీలుతాయని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంచనా వేశారు.
అయితే, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురించి ఆయన మరచిపోయారు. ‘‘ఆప్ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడకు వచ్చినది కాంగ్రెస్‌ను ఓడించడానికి, బీజేపీని కాదు’’అని ఇక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
1995 నుంచి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. అయితే, కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా 40కి అటూఇటూగా ఉండేది.
అయితే, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం 27.3 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆప్ వాటా ఓటింగ్ శాతం 12.9 శాతం వరకూ ఉంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ దారుణంగా దెబ్బతీసిందని రాజీవ్ షా చెబుతున్నారు. నేడు బీజేపీ విజయంలో ఆప్ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 49.1 శాతం. నేడు ఇది 53కు అటూఇటూగా ఉంది.
గతసారి 49 శాతం ఓట్లతో బీజేపీ గెలుచుకొంది 99 సీట్లు. కానీ, ప్రస్తుతం 150కిపైగా సీట్లలో పార్టీ విజయం సాధించింది. మూడు శాతం ఓటింగ్ తేడాతో బీజేపీ భారీ విజయం నమోదుచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మూడు శాతమేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో 41.4 శాతం ఓటింగ్‌తో 77 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ఓటింగ్ శాతం 27కు పడిపోయింది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఓటింగ్‌కు ఆప్ ఓటింగ్‌ను కూడా కలిపినా కూడా 2017లో కాంగ్రెస్ ఒక్కటే సంపాదించిన ఓటింగ్ శాతం కంటే తక్కువగా ఉంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 26 సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. అప్పుడు బీజేపీ ఓటింగ్ శాతం 62.21. కాంగ్రెస్ 32.11 శాతం ఓట్లు సంపాదించినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ ఓటమిలో ఆప్‌దే ప్రధాన పాత్ర అని మరికొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. సూరత్‌లోని సోషల్ సైన్స్ స్టడీ సెంటర్ ప్రొఫెసర్ కిరణ్ దేశాయ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
‘‘1995 నుంచి కాంగ్రెస్ ఓటింగ్ శాతం 40 శాతానికి అటూఇటూగా ఉంటూ వస్తోంది. కానీ, ప్రస్తుతం ఇది 30 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అంటే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుకు ఆప్ గండి కొట్టింది. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకును కేజ్రీవాల్ చీల్చలేకపోయారు. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, పార్టీ నాయకుడు అల్పేశ్ కఠారియా గెలుస్తారని భావించాం. కానీ, వారు గెలవలేదు’’అని ఆయన అన్నారు.
‘‘మరోవైపు ప్రచారంలోనూ కాంగ్రెస్ నాయకులు పెద్దగా కనిపించలేదు. కేవలం బీజేపీ, ఆప్ నాయకులే కనిపించారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీయడంలో కేజ్రీవాల్ విజయవంతం అయ్యారు. బీజేపీని మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయారు. గుజరాత్‌కు నరేంద్ర మోదీకి విడదీయరాని అనుబంధముంది. దాన్ని విడదీయడం అంత తేలిక కాదు’’అని కిరణ్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూత్వ రాజకీయాలు
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు దోషులను విడుదల చేయడం, నరోదా పాటియా అల్లర్ల దోషి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వడం లాంటి బీజేపీ చర్యలేవీ గుజరాత్ ఓటర్లపై పార్టీకి వ్యతిరేకంగా ప్రభావం చూపలేదని ప్రొఫెసర్ కిరణ్ దేశాయ్ అన్నారు.
2002నాటి నరోదా పాటియా అల్లర్లలో మనోజ్ కుల్‌కర్ణిని కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, ఆయన కుమార్తె పాయల్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. పైగా పాయల్ భారీ మెజార్టీతో గెలిచారు. ఆమెకు 71 శాతం ఓట్లు వచ్చాయి.
‘‘మోర్బీలో అంత పెద్ద ప్రమాదం జరిగింది. కానీ, అక్కడ బీజేపీ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావమూ పడలేదు. ఆ ప్రమాదానికి బీజేపీ వైఫల్యమే కారణంగా చెప్పుకోవాలి. ఆ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలిచింది. ఇదంతా బీజేపీ విజయం కాదు.. మోదీ విజయం. మనం బీజేపీ అంటే మోదీ మాత్రమే అని భావిస్తే... అప్పుడు ఇది బీజేపీ విజయం అని చెప్పుకోవచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
గుజరాత్ రాజకీయాలపై ఘనశ్యామ్ షా వరుస పుస్తకాలు రాశారు. 2002 అల్లర్ల తర్వాత గుజరాత్‌లో మొదలైన హిందూత్వ పవనాలు క్రమంగా మరింత బలపడుతున్నాయని ఆయన అన్నారు.
‘‘మోదీ నిరంకుశ పాలన, హిందూత్వ రాజకీయాలకు ఈ విజయం ప్రతీకగా చెప్పుకోవచ్చు. నిజానికి ఇది రెండు అసమాన పార్టీల మధ్య జరిగిన యుద్ధం. ఇక్కడ సమానత్వమే లేదు. ఒకవైపు బీజేపీ తమ మొత్తం బలగాన్ని ఉపయోగించింది. కాంగ్రెస్‌కు ఒక వ్యవస్థ, యంత్రాంగం, డబ్బు, నాయకులు.. అస్సలేమీ లేవు. ఈ ఎన్నికల ఫలితాల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?’’అని ఆయన ప్రశ్నించారు.
‘‘గుజరాత్‌లో ప్రజలు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగం గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ, చివరకు హిందూత్వకు ప్రజలు మొగ్గుచూపారు. ముస్లిం వ్యతిరేక రాజకీయాలను ఇక్కడి ప్రజలు తిరస్కరించడం లేదు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఎందుకు బీజేపీ తగ్గడం లేదు?
గత 27 ఏళ్లలో బీజేపీ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గడం లేదు?
ఈ ప్రశ్నకు గుజరాత్ యూనివర్సిటీ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ గౌరంగ్ జానీ మాట్లాడుతూ.. ‘‘గుజరాత్ జనాభా 6.25 కోట్లు. రాష్ట్రంలోని ఐదు ప్రధాన పట్టణాలైన అహ్మదాబాద్, వడోదర, రాజ్‌కోట్, సూరత్, భావనగర్‌లలో మొత్తంగా 2.25 కోట్ల మంది జీవిస్తున్నారు. ఈ ఐదు నగరాల్లో బీజేపీ చాలా దృఢంగా ఉంది. 1990ల్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు ఈ నగరాలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. పటేల్, బనియా, జైన్లు, బ్రాహ్మణులను ఇక్కడ బీజేపీ ఏకం చేయగలిగింది. దీనికి వ్యతిరేకంగా క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లింలను మాధవ్ సింగ్ సోలంకి కూడగట్టారు. అయితే, నేడు ఈ సమీకరణలను బీజేపీ మరింత పటిష్ఠం చేసుకోగలిగింది’’అని ఆయన చెప్పారు.
‘‘రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గకపోవడానికి కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు లేకపోవడమే కారణం. ఒకప్పుడు రాష్ట్రంలో జిన్నాభాయ్ దర్జీ లాంటి బలమైన నాయకులు ఉండేవారు. ఇప్పుడు పార్టీ ఖాళీ అయ్యింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నుంచి ఆప్‌కు..
ప్రస్తుతం కాంగ్రెస్‌ను ఆప్ దెబ్బతీసిన మాట వాస్తవమే అయినప్పటికీ, భవిష్యత్‌లో బీజేపీకి ఆప్ గట్టి పోటీ ఇస్తుందని జానీ అన్నారు.
‘‘ఎప్పటినుంచో గుజరాత్ రెండు పార్టీల వ్యవస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రంగంలోకి మూడో పార్టీ వచ్చింది. ఇక్కడ ఉచిత విద్యుత్, నీరు, విద్య గురించి పార్టీ హామీలు ఇచ్చిం. అయితే, పార్టీ ఇక్కడ కొత్త కావడంతో ప్రజలు నమ్మలేకపోయారు’’అని జానీ వివరించారు.
రాష్ట్రంలో బీజేపీ భారీ విజయం సాధించినట్లు ఫలితాల్లో తేలిన తర్వాత ఆప్, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు.
‘‘చరిత్ర సృష్టించడంలో గుజరాత్ ముందుంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత రెండు దశాబ్దాల్లో అభివృద్ధిలో బీజేపీ అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. దీంతో పార్టీని ఆశీర్వదిస్తూ ప్రజలు భారీ విజయాన్ని ఇచ్చారు’’అని ఆయన అన్నారు.
‘‘నరేంద్ర మోదీ అభివృద్ధి మోడల్‌కు ప్రజలు ఇచ్చిన విజయం ఇది. బోగస్ హామీలు, బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. మహిళలు, యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలూ బీజేపీ ఆహ్వానం పలికాయి’’అని అమిత్ షా అన్నారు.
ప్రతిపక్షాలకు వ్యూహం లేదు..
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ఇప్పటివరకు ఏ పార్టీ 150కిపైగా స్థానాల్లో విజయం సాధించిన చరిత్ర లేదు. ప్రస్తుతం బీజేపీ పేరిట ఆ రికార్డు నమోదైంది.
అయితే, నేడు కాంగ్రెస్ పరిస్థితికి ఆ పార్టీనే కారణమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. అయితే, ఇందులో 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోయరు. మరోవైపు బీజేపీని ఓడించలేమనే భావన ఇక్కడి కాంరగెస్ నాయకుల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఆప్ మరింత బలపడుతుందని వివరిస్తున్నారు.
బీజేపీ హిందూత్వ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ దగ్గర ఎలాంటి వ్యూహమూలేదని ఘనశ్యామ్ అన్నారు.
‘‘బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఇక్కడి పార్టీ నాయకులు ఆ విషయంలో మౌనం వహించారు. వ్యూహాం అనేది పార్టీ మొత్తం ఒకేలా ఉండాలి. అదే సమయంలో బీజేపీ తమ హిందూత్వ రాజకీయాలపై మొత్తం శక్తిని ఉపయోగించింది’’అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- భార్యను కీలు బొమ్మగా మార్చేసే ఈ గ్యాస్‌లైటింగ్ ఏమిటి, దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా?
- ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















