ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్

- రచయిత, జేమ్స్ క్లేటన్, బిన్ డెరికో
- హోదా, బీబీసీ న్యూస్
ట్విటర్ కార్యాలయంలో పనిచేసే చోటును పడక గదులుగా మార్చినట్లు కనిపించే ఫొటోలు బీబీసీకి అందాయి.
కార్యాలయ ప్రదేశాన్ని ఇలా నివాస అవసరాలకు వాడటాన్ని శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు ‘భవన నిబంధనల ఉల్లంఘన’ కింద పరిశీలిస్తున్నారు.
డబుల్ బెడ్‌తో పాటు ఒక వార్డ్‌రోబ్, చెప్పులు ఉన్న ఒక గది ఫొటో బయటకు వచ్చింది.
ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుంచి కార్యాలయంలోనే ఉంటున్నారని మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు.
పనిలో విజయవంతం కావాలంటే కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని మస్క్ గత నెలలో ట్విటర్ ఉద్యోగులకు ఈమెయిల్ రాశారు.
తమకు అందిన ఫిర్యాదు ప్రకారం, నిబంధనల ఉల్లంఘన జరిగిందా? లేదా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ ఫ్రాన్సిస్కో భవన తనిఖీల విభాగం స్పష్టం చేసింది.
అలసిపోయిన ఉద్యోగుల కోసం పడకలు ఏర్పాటు చేసినందుకు కంపెనీలను నగర భవన విభాగం లక్ష్యంగా చేసుకుందని మస్క్ అన్నారు.

ట్విటర్ సంస్థ కొత్త మార్పులకు సర్దుకునేవరకు తాను ఆఫీసులోనే నిద్రపోతానని మస్క్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ ట్వీట్‌ను ఇప్పుడు డిలీట్ చేశారు.
ట్విటర్ కార్యాలయంలోని సోఫాలను పడకలుగా ఉపయోగిస్తున్న ఫొటోలు కూడా బీబీసీకి అందాయి.
మరో కాన్ఫరెన్స్ గదిలో ఒక అలారం గడియారం, ఒక బెడ్‌ను ఏర్పాటు చేసినట్లు ఫొటోలో కనిపిస్తుంది.
‘‘అదొక హోటల్ రూమ్‌లా కనిపిస్తోంది’’ అని మాజీ ఉద్యోగి ఒకరు అన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాయలంలోనే మస్క్ తరచుగా నిద్రిస్తుంటారని వారు తెలిపారు.
ఈ అంశంపై స్పందించాల్సిందిగా ట్విటర్‌ను బీబీసీ కోరగా ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అక్టోబర్ నెలలో ఎలాన్ మస్క్, ట్విటర్‌ను పూర్తిగా టేకోవర్ చేశారు. ఆ తర్వాత ట్విటర్ ఉద్యోగులకు ఆయన మెయిల్ చేస్తూ ‘‘ ఉద్యోగులు అందరూ అధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.

‘‘అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఉద్యోగంలో కొనసాగేందుకు అర్హతా ప్రమాణంగా మారుతుంది’’ అని ఈ మెయిల్‌లో ఆయన రాశారు.
కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ స్కాట్ వీనర్ బుధవారం బీబీసీతో మాట్లాడుతూ... ‘‘ఆయన ఇప్పుడు ట్విటర్ ఉద్యోగులను నిద్రపోయేలా చేస్తున్నారు’’ అని అన్నారు.
‘‘ఆయన ప్రజల గురించి పట్టించుకోరు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కోసం పనిచేసే వ్యక్తుల గురించి కూడా పట్టించుకోరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఉద్దేశించిన అవసరాల కోసమే ఆ భవనాన్ని ఉపయోగిస్తున్నారనే అంశాన్ని మేం నిర్ధారించుకోవాలి’’ అని సీబీఎస్ న్యూస్‌తో భవన శాఖ అధికారి ఒకరు అన్నారు.
ఓపియాడ్ డ్రగ్ దుర్వినియోగంపై, అది చూపించే దుష్పరిమాణాల నుంచి పిల్లలను రక్షించడంపై నగర పాలకులు ఎక్కువ దృష్టి సారించాలని ట్విటర్‌లో ఒక పాత్రికేయుని ట్వీట్‌కు సమాధానంగా మస్క్ పేర్కొన్నారు.
ఎలా బయటకు తెలిసింది?
‘‘ఇటీవల ఉద్యోగులను కోల్పోయిన ప్రధాన కార్యాలయంలో.. నిద్ర గదులుగా మారిన విచారకరమైన చిన్న కాన్ఫరెన్స్ గదులు. నిద్ర పోయేందుకు ఉన్న మార్గాల్లో వచ్చిన ఒక రకమైన మెరుగుదల’’ అని ఒక ఉద్యోగి చేసిన ట్వీట్‌ను ఫోర్బ్స్ నివేదించింది.
టెస్లాతో పాటు మస్క్ ఆధీనంలోని ఇతర వ్యాపారాల నుంచి ట్విటర్‌లో పనిచేయడానికి వచ్చిన ఉద్యోగులకు కూడా ఈ గదుల్లోనే వసతి ఏర్పాటు ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
భవనాల తనిఖీ విభాగానికి చెందిన అధికారి ప్యాట్రిక్ హనన్, శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ వార్తా సంస్థతో మాట్లాడుతూ... ‘‘తాత్కాలిక బస కోసం వినియోగించే భవనాలకు కూడా వేర్వేరు నియమాలు ఉంటాయి’’ అని అన్నారు.
- భాగల్పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’
- చైనా: జీరో కోవిడ్ పాలసీకి సడలింపులు.. ఇక ‘కోవిడ్‌తో సహజీవనం’
- అఫ్గానిస్తాన్: అధికారంలోకి వచ్చాక తొలిసారి బహిరంగ మరణ శిక్ష అమలు చేసిన తాలిబాన్లు
- ఈ బీచ్‌లకు భార్యతోనే వెళ్లాలట.. లేదంటే ఏడాది జైలు
- గర్భం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















