భాగల్‌‌పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’

కుమార్తెతో నీలం

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, కుమార్తెతో నీలం
    • రచయిత, విష్ణు నారాయణ్
    • హోదా, బీబీసీ కోసం

‘‘జంతువుల కంటే దారుణంగా మా అమ్మను హత్య చేశాడు. ఆమె శరీరంలో చాలా భాగాలను గొడ్డలితో నరికేశాడు. అతడిని ఉరితీయాలి. అతని కుటుంబం మొత్తాన్ని ఉరితీయాలి. మాకు జరిగిందే, అతడి కుటుంబానికి కూడా జరగాలి.’’

‘‘అసలు నా బుర్ర పనిచేయడం లేదు. నేను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను ఒక్కోసారి ఏదో మాట్లాడేస్తున్నాను. నేను చెప్పేది మాత్రం ఒకటే. ఆ హంతకుడిని ఉరితీయాలి.’’ ఇవి బిహార్ భాగల్‌‌పూర్ చెందిన నీతూ కుమారీ వ్యాఖ్యలు.

హత్యకు గురైన నీలం దేవి కుమార్తె నీతు.

నీలం దేవి

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, నీలం దేవి

శ్రద్ధ హత్యలానే..

గత శనివారం నీలం దేవి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను చంపిన వ్యక్తి అత్యంత క్రూరంగా ఆమెపై దాడిచేశాడు.

ఆమె ప్రతిఘటించినప్పటికీ గొడ్డలితో ఆ వ్యక్తి పదేపదే దాడిచేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె నోటి నుంచి ‘‘షకీల్ మియా’’అనే పేరు వినిపించింది.

నీలం దేవి హత్య కేసుపై మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. కొందరు దిల్లీలోని శ్రద్ధ వాల్కర్ హత్య కేసుతో ఈ కేసును పోలుస్తున్నారు.

మరోవైపు బాధితురాలి గ్రామం ఛోటీ దిలౌరీకి వస్తున్న రాజకీయ నాయకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ఇక్కడ మత సామరస్యం దెబ్బతినకుండా స్థానిక అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ పెద్దయెత్తున పోలీసు బలగాలను మోహరించారు.

హత్య కేసు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

అసలేం జరిగింది?

డిసెంబరు 3న అంటే శనివారం సాయంత్రం 7 గంటలకు ఈ ఘటన జరిగింది. భాగల్‌పూర్ పీర్‌పైంతీ మార్కెట్ నుంచి తమ గ్రామానికి వస్తుండగా..దారిలోనే నీలం దేవిపై దాడి జరిగింది.

వెంటనే ఈ వార్త గ్రామానికి చేరింది. సంఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి ఆమె ముఖం నుంచి శరీరంలోని భిన్నభాగాలపై గొడ్డలితో దాడిచేసిన గాయాలు కనిపించాయి.

ఆమెను అలానే అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు గ్రామస్థులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమెకు అప్పటికే చాలా రక్తస్రావమైంది. ఆ గాయాలతో ఆమె మరణించారు.

నీలం దేవి కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆమె నోటి నుంచి ‘‘షకీల్’’ అనే పేరు వినిపించింది. ఆయనే తనపై దాడిచేశారని ఆమె చెప్పారు.

భాగల్‌పూర్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

రాజకీయాలు..

నిందితుడిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు, సోమవారం అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో రెండో నిందితుడు షేక్ జుబైర్‌ను డిసెంబరు 4వ తేదీనే పోలీసులు పట్టుకున్నారు.

అయితే, ఈ హత్య అనంతరం ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాధితురాలు హిందూ యాదవ వర్గానికి చెందడం, నిందితుడు ముస్లిం కావడంతో సోషల్ మీడియాలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు ఈ హత్య తానే చేసినట్టు ప్రధాన నిందితుడు షేక్ షకీల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

దాడిలో ఉపయోగించిన గొడ్డలిని కూడా అతడి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. డిసెంబరు 5 సాయంత్రం బాధితురాలి ఇంటికి ప్రతిపక్ష నాయకుడు విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ) వచ్చారు.

కులం, మతం అండ చూసి కొంతమంది నేరస్థులను ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలిస్తోందని విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీని వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంటోందని చెప్పారు.

‘‘ఒకప్పుడు బిహార్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి. నేడు రాష్ట్రం మధ్యలోనూ హత్యలు జరుగుతున్నాయి. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌దే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ కూడా నీతీశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.

పోలీసులు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ కేసుపై భాగల్‌పూర్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మీడియాతో మాట్లాడారు. ‘‘పీర్‌పైంతీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబరు 3న ఒక మహిళ హత్యకు గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిపై కేసు నమోదుచేశాం. ఆ ఇద్దరినీ మేం అరెస్టు చేశాం’’అని ఆయన చెప్పారు.

‘‘నీలం దేవికి నిందితుడు షకీల్ తెలుసు. వీరిద్దరి వ్యవసాయ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. మరోవైపు తమ కుమార్తె పెళ్లి కోసం షకీల్ నుంచి నీలం దేవి అప్పు తీసుకున్నారు’’అని ఆయన వివరించారు.

‘‘అయితే, ఆ అప్పును సమయానికి నీలం దేవి చెల్లించలేకపోయారు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగేవి. నెల రోజుల క్రితం కూడా వీరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత పదునైన ఆయుధంతో నీలం దేవిపై నిందితుడు దాడి చేశాడు’’అని ప్రభాత్ పేర్కొన్నారు.

నీతు కుమారి

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, నీతు కుమారి

‘‘ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయారు. ఈ ఘటనతో పరిస్థితులు అదుపుతప్పే అవకాశముంది. అందుకే ఎస్‌డీవో, ఎస్‌డీవోలు ఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబంతో వారు మాట్లాడారు. వెంటనే స్పందించేందుకు భారీగా పోలీసులను కూడా మోహరించాం’’అని ఆయన చెప్పారు.

అయితే, షకీల్ నుంచి నీలం దేవి అసలు ఎలాంటి అప్పూ తీసుకోలేదని ఆమె కుమార్తె నీతు కుమారీ చెబుతున్నారు.

‘‘నాకు మా అమ్మ గురించి బాగా తెలుసు. నేను పొలానికి, మార్కెట్‌కు ఆమెతో కలిసి వెళ్లేదాన్ని. మాకు షకీల్‌తో ఎలాంటి సంబంధమూ లేదు’’అని ఆమె చెప్పారు.

‘‘ఎవరో రోడ్డు మీద కనిపించే వ్యక్తితో మాట్లాడినట్లే మేం ఆయనతో మాట్లాడేవాళ్లం. ఆయన మా గ్రామస్థుడు కూడా కాదు. మా కులం వాడు కూడా కాదు’’అని ఆమె చెప్పారు.

అయితే, నీతు కుమారి చెబుతున్న మాటలను షకీల్ కోడలు బీబీ రవీనా ఖండించారు. ‘‘నీలం దేవి మా ఇంటికి కూడా వచ్చేవారు. మా మావయ్య కూడా వారి ఇంటికి వెళ్లేవారు. గొడవంతా ఆ అప్పు గురించే మొదలైంది’’అని ఆమె అన్నారు.

అశోక్ యాదవ్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, అశోక్ యాదవ్

ఉరి తీయాలి

అయితే, నీలం దేవి భర్త అశోక్ యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మాకు షకీల్‌తో ఎలాంటి సంబంధమూ లేదు’’అని చెప్పారు. ‘‘ఒకవేళ అతడు మా ఇంటికి వచ్చిపోయే పరిస్థితే ఉంటే ఇలాంటి ఘటన జరుగుతుందని తెలిసి మేం అడ్డుకోమా? అసలు ఆయన్ను ఉరితీయాలి’’అని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, ఒకసారి షకీల్ తమ ఇంటిలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారని ఇదివరకు అశోక్ యాదవ్ మీడియాతో చెప్పారు.

ఈ విషయంపై షకీల్ భార్య నిసారున్ ఖాతూన్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘నీలం మాకు తెలుసు. ఆమె పదేళ్ల నుంచి మా ఇంటికి వస్తోంది’’అని ఆమె అన్నారు.

‘‘ఆమె మా దగ్గర నుంచి రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బుల కోసమే ఇంత గొడవ జరిగింది’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, కత్తితో బ్యాంకు దోపిడీకి వచ్చిన దొంగను ఎదుర్కొన్న లేడీ మేనేజర్

మరోవైపు డబ్బుల విషయంలో మొదలైన గొడవ వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని పీర్‌పైంతీ పోలీస్ స్టేషన్ చీఫ్ రాజ్‌కుమార్ చెప్పారు. ‘‘తన దగ్గర నుంచి రూ.2 లక్షలను నీలం అప్పుగా తీసుకున్నారని నిందితుడు చెప్పాడు. నీలం ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని వివరించాడు’’అని ఆయన అన్నారు.

అయితే, నేడు ఈ హత్య తర్వాత కొందరు నాయకులు మత సామరస్యం దెబ్బతిసేలా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

ఘటనపై స్థానికుడు శంకర్ దయాళ్ ఠాకుర్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇదొక దారుణమైన నేరం. నిందితుడు చాలా క్రూరంగా దాడిచేశాడు. ఇదొక అనాగరిక దాడి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

స్థానికులే ప్రధాన నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మత సామరస్యం దెబ్బ తినకుండా వారు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)