అమ్మాయి చనువుగా మాట్లాడిందని లైవ్‌లో ముద్దు పెట్టేస్తారా? ముంబయిలో దక్షిణ కొరియా లైవ్‌స్ట్రీమర్‌ను వేధించిన యువకుల అరెస్ట్

హ్యోజియాంగ్ పార్క్

ఫొటో సోర్స్, Getty Images

ముంబయిలో లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ఒక యువతిని వేధించినందుకు గాను ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హ్యోజియాంగ్ పార్క్ (24) అనే యువతి మంగళవారం రాత్రి ముంబయి నగరంలో నడుస్తూ లైవ్‌స్ట్రీమ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ యువతి సోషల్ మీడియాలో మయోచి పేరుతో లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుంటారు.

ఈ యువకులు ఆమె చుట్టూ చేతులు వేసి, ఆమె బుగ్గ మీద ముద్దుపెడుతున్న దృశ్యం సంబంధిత వీడియోలో కనిపించింది.

ఆ యువకుల మీద వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

లైవ్‌స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్‌లో మయోచికి 12,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సాధారణంగా తను వీడియో గేమ్స్ ఆడుతున్న వీడియోలను కానీ, వివిధ రకాల వంటలను రుచి చూస్తున్న వీడియోలను కానీ పోస్ట్ చేస్తుంటారు.

ఆమె కొన్ని వారాలుగా భారతదేశంలో ప్రయాణిస్తూ తన అనుభవాలను లైవ్ వ్లాగ్‌ల ద్వారా రికార్డు చేస్తున్నారు.

ఆ క్రమంలో మంగళవారం ముంబయిలోని ఖార్ ప్రాంతంలో నడుస్తూ లైవ్‌స్ట్రీమ్ చేస్తూ తన ఫాలోవర్లతో పాటు, రోడ్డు మీద ఉన్న వారితోనూ మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ఒక యువకుడు ఆమె దగ్గరకు వచ్చాడు.

అతడు ఆమె చేయి గట్టిగా పట్టుకుని, ఆమెను తన బైక్ మీదకు లాగటానికి ప్రయత్నిస్తుండటం.. ట్విచ్‌లో ఉన్న వీడియోలో కనిపిస్తోంది. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టటానికి కూడా అతడు ప్రయత్నించాడు.

ఈ పరిణామంతో దిగ్భ్రాంతి చెందిన హ్యోజియాంగ్.. ‘‘ఇంటికి వెళ్లాల్సిన టైమ్ అయింది’’ అంటూ అతడి దగ్గర నుంచి పక్కకు రాగలిగారు. కానీ ఆ యువకుడు, అతడి స్నేహితుడు బైక్ మీద ఆమె వెంటపడ్డారు. ఆమె ఫోన్ నంబర్ చెప్పాలని అడిగారు.

వీడియో క్యాప్షన్, కావలి యూట్యూబర్ నాగలక్ష్మికి అంత ఫేమ్ ఎలా వచ్చింది?

చివరికి మరో వ్యక్తి ఆమెకు సాయంగా రోడ్డు దాటి వారి దగ్గరకు వచ్చారు. ఆమెను వేధించటం ఆపాలని సదరు యువకులకు ఆయన చెప్పారు.

హ్యోజియాంగ్ ఒక హోటల్ దగ్గరకు పరుగున వెళ్లటం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అక్కడికి వెళ్లాక తాను క్షేమంగా ఉన్నానని చెప్పి ఆమె వీడియోను ఆపేశారు.

అనంతరం సదరు వీడియోలో కొంత భాగాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేశారు. ‘‘పరిస్థితి తీవ్రం కాకుండా ఉండటానికి చేతనైనంతవరకూ ప్రయత్నించాన’’ని ఆ పోస్టులో రాశారు.

ట్విచ్‌లో కామెంట్ చేసిన కొందరు ఈ వేధింపులకు తానే కారణమని నిందించారని, తాను ‘మరీ చనువుగా’ ఉన్నానని, తన దగ్గరకు వచ్చిన యువకుడితో తానే మాటలు మొదలు పెట్టానని వారు తప్పుపట్టారని కూడా ఆమె వివరించారు.

అయితే ఇంకొందరు ఆమెకు మద్దతునిచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పారు.

బుధవారం ట్విటర్ యూజర్ ఒకరు ఆ క్లిప్‌ను షేర్ చేశారు. ఆ యువకుల ప్రవర్తన ‘‘అసహ్యకరంగా’’ ఉందని విమర్శించారు. ఈ ఘటనకు శిక్షపడి తీరాలని వ్యాఖ్యానిస్తూ ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)