టిండర్‌లో మోసాలు: డేటింగ్ పేరుతో కిడ్నాప్‌లు- బాధితులుగా పురుషులు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫెలిప్ సౌజా
- హోదా, బీబీసీ బ్రెజిల్, సావో పాలో
డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తికి మరో మహిళతో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య మెసేజ్‌లు నడుస్తాయి.
కొంతకాలం తర్వాత వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు.
ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి రాగానే ఆ వ్యక్తి కిడ్నాప్‌కు గురవుతారు... సినిమా కథను తలపించేలా డేటింగ్ యాప్ ద్వారా జరుగుతోన్న మోసం తీరు ఇది.
డేట్‌ను కలవడం కోసం చేసుకున్న ఏర్పాట్లు కొంతకాలం వరకు బాధితులను పీడకలలా వెంటాడుతుంటాయి.
బ్రెజిల్‌లో అతిపెద్ద, ధనిక నగరం సావో పాలో. అక్కడ ఈ తరహా నేరాలు సర్వసాధారణంగా మారాయి. వీటి గురించి బీబీసీతో నగర పౌరుల భద్రతా సెక్రటరీ (ఎస్‌ఎస్‌పీ) మాట్లాడారు.
‘‘టిండర్ వంటి డేటింగ్ యాప్‌లలో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి ఎర వేస్తున్నారు. స్థానిక పోలీసుల వద్ద నమోదైన కిడ్నాప్ కేసుల్లో 90 శాతానికి పైగా టిండర్ యాప్‌తో సంబంధం ఉన్నవే. కిడ్నాపర్లకు డబ్బు చెల్లించే సమయంలో బాధితులు మానసిక, కొన్నిసార్లు భౌతిక హింసకు గురవుతారు’’ అని ఆయన చెప్పారు.
సావో పాలో సివిల్ పోలీసు విభాగానికి చెందిన యాంటీకిడ్నాపింగ్ అధికారులు, 2022 ఏడాదిలోనే ఇలాంటి 94 కేసుల్లో చర్యలు తీసుకొని 250కి పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు.
నేరగాళ్ల ప్రధాన లక్ష్యం 40 ఏళ్లు పైబడిన ఒంటరి పురుషులే.
నగరంలోని ప్రముఖ ఆసుపత్రి ‘డాస్ క్లినికాస్’ వైద్యుడు కూడా ఇలాంటి బాధితుల్లో ఒకరు. ఆయన డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసేందుకు వెళ్లి ఆ తర్వాత 14 గంటల పాటు నేరస్థుల చేతుల్లో బందీ అయ్యారు.
ఖాతాలోని డబ్బునంతా ఖాళీ చేసిన తర్వాతే నేరగాళ్లు ఆయనను వదిలేశారు. రుణాలు, కొనుగోళ్లు, నగదు బదిలీలు ద్వారా దాదాపు 14,000 డాలర్లు (రూ. 11. 36 లక్షలు)ను కాజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి వ్యక్తులపై కన్నేస్తారంటే..
ఇలాంటి నేరాలకు పాల్పడేవారు, ముందుగా బాధితుల ఆన్‌లైన్ వ్యవహారాలను అధ్యయనం చేస్తారని బీబీసీతో ఎస్‌ఎస్‌పీ చెప్పారు.
‘‘సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో తమ ఆర్థిక స్థాయిని ప్రదర్శించే వినియోగదారులను వారు గమనిస్తారు. తర్వాత వారికి ఎర వేస్తారు’’ అని ఆయన తెలిపారు.
ఇలాంటి ముఠాలు ఎలా పని చేస్తుంటాయి? మనం ఉచ్చులో చిక్కుకుంటున్నామని ఎలా తెలుసుకోవాలి? అనే అంశాల గురించి పలువురు పోలీసు అధికారులు, డిజిటల్ సెక్యూరిటీ నిపుణులతో బీబీసీ మాట్లాడింది. అయితే, వారు తమ వివరాలను బహిరంగపరిచేందుకు ఇష్టపడలేదు.
ఆర్థికంగా విజయవంతమైన మధ్యవయస్సులో ఉన్న ఒంటరి పురుషులే సాధారణంగా బాధితులుగా మారుతున్నారని పావో పాలో ఉత్తర భాగంలో పనిచేస్తున్న ఒక మిలిటరీ పోలీస్ లెఫ్టినెంట్ వివరించారు.
‘’40 ఏళ్లు పైబడి, కాస్త ఆస్తిపాస్తులు ఉన్న ఒంటరి పురుషులు బాధితులు అవుతున్నారు. చాలామంది నేరగాళ్లు, టిండర్ యాప్‌లో ప్రలోభ పెట్టే మెసేజ్‌లు చేయడం ద్వారా, వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడటం ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
డేటింగ్ యాప్‌లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా నేరస్థులు, మోసం చేయాలనుకునువారిని ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యటనలు, విలాసవంతమైన కార్ల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకునేవారిపై వారు దృష్టి సారిస్తారు.
‘‘టిండర్ యాప్‌లో మామూలుగా బాధితులను సాయంత్రం సమయాల్లో, మారుమూల ప్రాంతాల్లో వ్యక్తిగతంగా కలుద్దామంటూ నేరస్థులు కోరతారు.
ఇలాగే నేను చూసిన ఒక కేసులో... ఒక వ్యక్తి, టిండర్ యాప్‌లో పరిచయమైన మహిళను ఒక షాపింగ్ మాల్‌లో వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె అనారోగ్యంగా ఉన్నానంటూ, ఇల్లు వదిలి బయటకు రాలేనంటూ విచారం వ్యక్తం చేయడంతో అతను ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడే అతను కిడ్నాప్ అయ్యాడు’’ అని లెఫ్టినెంట్ వివరించారు.
యాప్‌లో పరిచయమైన రెండు, మూడు రోజుల తర్వాత ఇలాంటి సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వెలుగులోకి రాకుండా..
వివిధ కారణాలతో ఈ డేటింగ్ యాప్ కిడ్నాప్‌ల గురించి తక్కువగా పోలీసులకు నివేదిస్తున్నారని మరో పోలీసు అధికారి నమ్ముతున్నారు.
ఈ కారణాల్లో మొదటిది ఏంటంటే...పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయడానికి బాధితులు సంకోచించడం. మరో ప్రధాన కారణం ఇలాంటి మోసాలకు గురైనవారు అసలు విషయం చెప్పకుండా... తమ భాగస్వాములకు తాము మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలియకుండా ఉండేందుకు డబ్బు కోసం ఎవరో తనను కిడ్నాప్ చేశారని చెబుతుంటారు.
సంపన్నులు, విద్యావంతులైన పురుషులు రొమాంటిక్‌గా గడపడం కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఒప్పుకొని ఇలాంటి మోసాలకు తరచుగా బాధితులుగా మారడం తనను ఆశ్చర్యపరిచిందని మరో పోలీసు అధికారి అన్నారు.
చాలా కేసుల్లో సంబంధిత వ్యక్తి బంధువులు పోలీసులకు ఫోన్ చేసిన తర్వాతే బాధితుల అదృశ్యం గురించి తెలుస్తుంది.
‘‘తమ వారు కనిపించడం లేదని కుటుంబంలో ఎవరో ఒకరు గుర్తించిన తర్వాత ఈ విషయం గురించి పోలీసులకు చెబుతారు. ఏ ఇద్దరు బాధితులు కూడా ఒకే ప్రదేశంలో కిడ్నాప్ అవ్వడం ఇంతవరకు జరగలేదు. కానీ ఒకే నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’’ అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్చరికలు
బ్రెజిల్ స్వచ్ఛంద సంస్థ ‘సేఫర్ నెట్’లో గిల్‌హామ్ అల్వ్స్ ఒక డిజిటల్ సెక్యూరిటీ నిపుణుడిగా పని చేస్తున్నారు.
ఇంటర్నెట్ నేరాలను పరిష్కరించడం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తుంది.
మోసాలు చేయడం కోసం నేరస్థులు తరచుగా డేటింగ్ యాప్‌లను వాడుతారని గిల్‌హామ్ చెప్పారు.
‘‘ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్లాట్‌ఫారమ్ దేనికి బాధ్యత వహిస్తుందో అర్థం చేసుకోవడం. యాప్ బయట ఏం జరుగుతుంది అనేది ఆ కంపెనీ పరిధిలోనికి రాని అంశం. ఒకవేళ ఏదైన నేరం జరిగితే కోర్టులో స్కామర్ ప్రొఫైల్ నుంచి సమాచారాన్ని పొందడం మాత్రం సాధ్యమవుతుంది’’ అని ఆయన వివరించారు.
కొన్ని కేసుల్లో మోసగాళ్లు బాధితులకు ఎర వేసేందుకు నకిలీ ఫొటోలు, ప్రొఫైళ్లు వాడకుండా నిజమైన వ్యక్తుల ఫొటోలు వాడతారని ఆయన చెప్పారు. మోసపోతున్నామని ఎలా గుర్తించాలో కూడా ఆయన వివరించారు.
‘‘ఒకవేళ అది క్యాట్‌ఫిషింగ్ స్కామ్ (ఇంటర్నెట్‌లో నకిలీ ఐడీ వినియోగిస్తారు) అయితే యాప్‌లోని ప్రొఫైల్ నకిలీది అయి ఉంటుంది. అప్పుడు క్రిమినల్ మనల్ని వాట్సాప్ వంటి మరో ప్లాట్‌పామ్‌పైకి తీసుకెళ్తుంటారు. యాప్‌లో ప్రొఫైల్ డిలీట్ చేశామని, అందుకే వాట్సాప్‌లోకి రావాలంటూ నేరగాళ్లు చెబుతుంటారు.
యాప్‌లో తొలిసారి పరిచయం అయిన తర్వాత ప్రొఫైల్‌ను డిలీట్ చేశారంటే వారు తమ సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నట్లు. అలాగే పరిచయమైన కొన్ని రోజుల్లోనే వ్యక్తిగతంగా కలవాలని కోరేవారిని, డేటింగ్ యాప్ ప్లాట్‌ఫారమ్‌ను వదిలి వాట్సాప్‌కు రావాలని కోరే వ్యక్తులను మారుమూల లేదా ప్రైవేటు ప్రదేశాలలో కలవడం వంటివి చేయకూడదు.
ఆ వ్యక్తితో చేసిన మెసేజ్‌లను భద్రంగా ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఎక్కువ మంది ఉండే ప్రదేశాలు అంటే షాపింగ్ మాల్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. కొన్ని కేసుల్లో తొలి రెండు, మూడు సమావేశాల్లో నెమ్మదిగా వ్యవహరించే మోసగాళ్లు ఆ తర్వాత తమ చేతి వాటం చూపిస్తారు.
ఇలాంటి ఒక కేసులో ఒక మహిళ కొత్త వ్యక్తిని రెండు సార్లు కలిసింది. అప్పుడు అతను సాధారణంగానే ప్రవర్తించారు. ఇక మూడో సమావేశం సమయంలోనే అతను ఆమెను దోచుకొని పరారు అయ్యాడు’’ అని హాల్‌మన్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- ఫిఫా వరల్డ్ కప్: ఆయన చనిపోయాడని పేపర్లలో వచ్చింది. కానీ, ఒక జట్టు కోచ్ ఎలా అయ్యారు?
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- కిమ్ జోంగ్ తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించబోతున్నారా
- అదానీ చేతికి NDTV: దేశంలోని అగ్ర స్థాయి న్యూస్ నెట్‌వర్క్‌ను గౌతమ్ అదానీ ఎలా నడపనున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















