కొత్త సెక్స్ చట్టాలతో దేశంలో టెన్షన్ టెన్షన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫానీ వెర్తీమర్
- హోదా, బీబీసీ న్యూస్
కోవిడ్-19 కారణంగా ఎదుర్కొన్న నష్టాల నుంచి ఇంకా కోలుకోని ఇండోనేసియా టూరిజం ఆపరేటర్లు తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంపై ఆందోళన చెందుతున్నారు.
పెళ్లి కాని జంటలు, వైవాహిక భాగస్వాములు కాని వారి మధ్య సెక్స్ నిషేధిస్తున్నట్లు అక్కడి పార్లమెంటు చట్టం చేసింది. ఈ చట్టం కారణంగా పర్యాటకులు రావడం తగ్గిపోతుందని టూరిజం ఆపరేటర్లు అంటున్నారు.
మానవ హక్కులకు కలిగిన విపత్తుగా విమర్శకులు అభివర్ణిస్తున్న ఈ వివాదాస్పద చట్టం పెళ్లికాని వారి సహజీవనాన్నీ నిషేధించింది. అంతేకాకుండా, వారి రాజకీయ, మత స్వేచ్ఛపైనా నియంత్రణలు విధించింది.
ఈ చట్టానికి వ్యతిరేకంగా జకార్తాలో నిరసనలు చేశారు. ఇంకొందరు ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయాలనుకుంటున్నారు.
మూడేళ్లలో అమల్లోకి రానున్న ఈ కొత్త క్రిమినల్ కోడ్ ఇండోనేసియా పౌరులకే కాకుండా ఆ దేశంలో నివసించే విదేశీయులు, పర్యటకులు అందరికీ వర్తిస్తుంది.
ఇండోనేసియా సమీపంలోని ఆస్ట్రేలియాలో ఈ చట్టంపై మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. ‘బాలీ బోంకీ బ్యాన్’ అంటూ దీనిపై అక్కడ కథనాలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ కొత్త చట్టం కారణంగా పర్యటకరంగంపై ప్రభావమేమీ ఉండబోదని కొందరు పరిశీలకులు అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొనే జంటలో భాగస్వాముల తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ, వారి వైవాహిక భాగస్వాములు కానీ ఫిర్యాదు చేస్తేనే వారిని విచారిస్తారని, లేనప్పుడు ఏమీ కాదని వారు చెబుతున్నారు.
అయితే, కొత్త చట్టం కారణంగా ఏ రూపంలోనైనా సమస్యలు రావచ్చని హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన పరిశోధకుడు అభిప్రాయపడ్డారు.
ఇండోనేసియా ఆర్థిక వ్యవస్థ ఆస్ట్రేలియా నుంచి వచ్చే పర్యటకులపై ఎక్కువగా ఆధారపడుతుంది. కోవిడ్‌కు పూర్వం ఆస్ట్రేలియాయే ఇండోనేసియాకు ప్రధాన పర్యటక వనరు. బాలిలోని వెచ్చని వాతావరణాన్ని అనుభవించేందుకు, చౌకగా దొరికే బింటాంగ్ బీర్‌ను కావాల్సినంత తాగేందుకు, బీచ్ పార్టీలలో రాత్రంతా పార్టీలలో మునిగి తేలేందుకు ఆస్ట్రేలియా నుంచి ప్రతి నెలా వేలాది మంది పర్యటకులు బాలీకి వచ్చి వాలుతుంటారు.
అంతేకాదు... బాలిలో పెళ్లి చేసుకోవడానికీ జంటలు అక్కడికి వెళ్తుంటాయి. హైస్కూల్, కాలేజ్ చదువులు పూర్తయిన వెంటనే పార్టీలకూ పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియా నుంచి బాలీకి వెళ్తుంటారు.
ఆస్ట్రేలియా యువతలో చాలామంది బాలీ వెళ్లడం తమ జన్మహక్కుగా భావిస్తుంటారు.
చాలాకాలంగా చర్చలో ఉన్న ఈ చట్టం ఇక అమల్లోకి రానుందని తెలిసిన తరువాత భవిష్యత్తులో బాలీలో పర్యటించడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపై అనేక కామెంట్లు వస్తున్నాయి. ఇకపై బాలీ రావాలంటే మేరేజ్ సర్టిఫికేట్ తీసుకురావాలేమో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
బాలీ టూరిజాన్ని నాశనం చేయడానికి ఈ చట్టాన్ని మించింది లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఈ చట్టం అమలు చేయడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదా?
ఆరోపణలు ఎదుర్కొనే భార్యాభర్తల పిల్లలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, జీవిత భాగస్వాములు కానీ ఫిర్యాదు చేస్తేనే వారిని విచారిస్తారు. నేరం నిరూపణ అయితే చట్టం ప్రకారం గరిష్ఠంగా ఏడాది వరకు శిక్ష విధిస్తారు.
‘ఇలా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉన్నది ఇండోనేసియా ప్రజలకే. బయట దేశాల నుంచి వచ్చిన జంటల గురించి వారు అక్కడ ఉన్న సమయంలోనే వారి పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, జీవిత భాగస్వాములు కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు’ అంటూ ఇండొనేసియా జస్టిస్ మినిస్ట్రీకి చెందిన ఓ అధికార ప్రతినిధి ఆందోళనలు తగ్గించే ప్రయత్నం చేశారు.
అయితే, ఇండోనేసియాకు చెందిన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆస్ట్రేలియా అబ్బాయి ఎవరైనా బాలిలో గడపడానికి వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా అంటూ హ్యూమన్ రైట్స్ వాచ్ సీనియర్ రీసెర్చర్ ఆండ్రియాస్ హర్సోనో అన్నారు. ఆ అమ్మాయికి చెందినవారు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆస్ట్రేలియా పర్యాటకుడు కేసుల్లో చిక్కుకుంటాడు కదా అంటున్నారు ఆండ్రియాస్.
దీన్ని పోలీసులు, రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసే అవకాశముంటుందని ఆండ్రియాస్ అభిప్రాయపడ్డారు.
పోలీసులు కొందరు వ్యక్తులను, కొన్ని హోటళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడే ప్రమాదం ఉందని.. రాజకీయ నేతలు కూడా తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆండ్రియాస్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
2019లో రికార్డ్ స్థాయిలో 12.3 లక్షల మంది ఆస్ట్రేలియన్లు బాలీలో పర్యటించారని ఇండోనేసియా ఇనిస్టిట్యూట్ గణాంకాలు చెబుతున్నాయి.
2021లో కోవిడ్ కారణంగా సంవత్సరమంతా కలిపి కేవలం 51 మంది విదేశీ పర్యటకులే వచ్చారు.
ఈ ఏడాది జులై నుంచి పర్యటకుల సంఖ్య పెరుగుతూ పర్యటకం రంగం కోలుకుంటోంది. ఇండోనేసియా జాతీయ గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2022 జులైలో మొత్తం 4.7 లక్షల మంది విదేశీ పర్యటకులు ఇండోనేసియా వచ్చారు.
కాగా కొత్త చట్టం ఇండోనేసియా టూరిజానికి పెద్ద దెబ్బ అని హ్యూమన్ రైట్స్ వాచ్ డిప్యూటీ ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్సన్ ట్వీట్ చేశారు.
మరోవైపు పర్యటక రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నవారూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2017 నుంచి బాలీలో పనిచేస్తున్న టూర్ గైడ్ యొమాన్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ కొత్త చట్టం ప్రభావం పర్యటక రంగంపై తీవ్రంగా ఉండబోతోందని అన్నారు.
‘‘నేను పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాను కాబట్టి చాలా చాలా ఆందోళన చెందుతున్నాను’ అన్నారు యొమాన్.
బాలీ పర్యటకంపై గతంలోనూ అనేక ప్రతికూల ప్రభావాలు పడ్డాయి.
‘గల్ఫ్ యుద్ధం, బాలీ బాంబ్ పేలుళ్లు, అగ్నిపర్వతాలు బద్ధలవడం, మౌంట్ సుమేరు అగ్నిపర్వతం, ఆ తరువాత కోవిడ్ వంటి అనేకం ఇక్కడి పర్యటకాన్ని దెబ్బతీశాయి’ అని యొమాన్ అన్నారు.
వివాహేతర సెక్స్ నేరమంటూ చట్టం చేసి పర్యటకులను ఆందోళనలో నెట్టిన ఇండోనేసియా మరోవైపు తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు కూడా వీలు కల్పించే వీసాలు జారీ చేసేలా వారం కిందట నిర్ణయం తీసుకుంది.
ఒక్క ఆస్ట్రేలియన్లే కాదు ఇతర దేశాలకు చెందిన పర్యటకులు కూడా ఇండోనేసియా కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘బాలీ వచ్చి జైలు పాలవడం కంటే వేరే చోటికి వెళ్లాలనుకుంటారు కదా ఎవరైనా’ అని కెనడానికి చెందిన ట్రావెల్ బ్లాగర్ మెలిస్సా గిరాక్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














