బట్టతల గురించి ఆ మూడు అపోహలేంటి, సైంటిస్టులు ఏం చెబుతున్నారు..?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రఫేల్ అబుచెబే
- హోదా, బీబీసీ ముండో
బట్టతలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు శతాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.
సుమారు 2000 ఏళ్ల క్రితం ఆధునిక వైద్యానికి పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన గ్రీక్ శాస్త్రవేత్త హిప్పోక్రేట్స్, తొలిసారి తన శాస్త్రీయ పరమైన పరిశోధనలను మతపరమైన విశ్వాసాల నుంచి వేరు చేశారు.
ఆ రోజుల్లోనే ఆయన జుట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది? ఊడిపోయిన జుట్టు మళ్లీ తిరిగి ఎలా వస్తుందనే విషయాలపై పలు పరిశోధనలు చేపట్టారు.
ఈ పరిశోధనల ఫలంగా నేడు మన జుట్టు వెనకున్న రహస్యాలను మరింత మెరుగ్గా తెలుసుకోగలుగుతున్నాం.
అంతేకాక జన్యుపరమైన లోపాల నుంచి పర్యావరణ పరంగా ఉన్న కారణాల వరకు ఏవేవి బట్టతలకు కారణమవుతున్నాయో మనం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం.
అయినప్పటికీ, జుట్టు ఊడిపోవడానికి ఇవే కారణమంటూ.. ఇంకా కొన్ని అపోహలు ప్రజల్లో ఉన్నాయి.
‘‘బట్టతల ఉండటమనేది అంత చెడ్డ విషయమేమీ కాదు’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ లాస్ ఏంజిల్స్(UCLA)లోని జుట్టు ఊడిపోవడం, జుట్టు సమస్యలపై స్పెషలైజేషన్ తీసుకున్న డెర్మటాలజిస్ట్ కరోలిన్ గోహ్ తెలిపారు.
బట్టతల గురించి ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయని డాక్టర్ గోహ్ చెబుతున్నారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం బట్టతల గురించి ఇంకా ప్రజల్లో ఉన్న మూడు అపోహల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, MIKROMAN6
అపోహ 1: వంశపారపర్యంగా బట్టతల వస్తుంది
స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుకునేటప్పుడు మీరు వినే ఉంటారు. బట్టతల ఎక్కువగా కుటుంబంలో ఎవరికైనా ఉండటం వల్లే వస్తుందని. అయితే వాస్తవం దాని కంటే మరింత సంక్లిష్టంగా ఉంది.
బ్రిటన్‌లో 2017లో ప్రచురితమైన పీఎల్ఓఎస్ జెనెటిక్స్ జర్నల్‌లో... 52 వేల మంది పురుషులపై వంశపారపర్యంగా వచ్చే బట్టతల విషయంలో పరిశోధన చేసినట్టు ఒక బ్రిటిష్ పరిశోధకుల బృందం పేర్కొంది.
ఈ అధ్యయనంలో కనీసం 287 మందికి జుట్టు ఊడిపోవడంలో జన్యుపరమైన సమస్యలు ఉన్నట్టు కూడా తేల్చింది. 40 శాతం బట్టతలకు కారణం ఎక్స్ క్రోమోసోమో(X chromosome)లో లోపాలు ఉండి ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది.
అంటే ఒక జన్యువు తల్లి నుంచి వారసత్వంగా వస్తుండగా.. మిగిలినవి జన్యువులలో ఇద్దరివీ ఉండొచ్చు.
తల్లి నుంచి ఆమె కుటుంబం నుంచి బలమైన జన్యువులు పిల్లలకు రావడం నిజమైనప్పటికీ, కేవలం ఒక్క జన్యువు వల్లనే బట్టతలకు కారణం కాదని గోహ్ చెప్పారు.
ఒకటికి మించిన జన్యువుల వల్ల బట్టతల వస్తుందని పేర్కొన్నారు. బట్టతలకు కారణమయ్యే జన్యువులు ఇరువైపుల నుంచి వస్తాయని అన్నారు.
అయితే పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఉండదు. జుట్టు రాలిపోవడంలో పురుషులలో, మహిళలలో ఎందుకు ఒకే విధంగా ఉండదో మనం తెలుసుకోవాలి.
వంశపారపర్యమైన అలోపేసియా అయిన ‘ఆండ్రోజెనిటిక్ అలోపేసియా’ గురించి సైంటిస్టులు ఏం చెబుతున్నారో మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది.
గోహ్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ తరహా అలోపేసియాకు కారణమయ్యే జన్యువులు పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్‌కు ప్రభావితం అవుతాయని తెలిసింది.
ఇది మహిళలలో, పురుషులలో ఇద్దరిలో సంభవిస్తుంది. కానీ దీనిలో మార్పులుంటాయి.
మహిళలకు సాధారణంగా బట్టతల ఎక్కువగా కనిపించదు. అయితే వారు కూడా తలపై భాగం నుంచి కొంత జుట్టు కోల్పోతూ ఉంటారు.
పురుషుల మాదిరి అంత టెస్టోస్టెరాన్ మహిళలకు ఉండదు. దీన్ని సమతుల్యం చేసేందుకు అత్యధిక మొత్తంలో ఈస్ట్రోజెన్ ఉంటుందని గోహ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 2: క్యాప్‌లు పెట్టుకోవడం లేదా జుట్టును పదే పదే శుభ్రపరుచుకోవడం వల్ల బట్టతల
వారంలో మీరు ఎన్నిసార్లు తలస్నానం చేస్తూ ఉంటారు? ప్రతి రోజూ, లేదా వారంలో మూడుసార్లా? క్యాప్‌లను కానీ హ్యాట్స్‌ను కానీ ఎప్పుడూ పెట్టుకుని ఉంటున్నారా..?
ఇలాంటి ప్రశ్నలను మీ హెయిర్ డ్రెస్సర్ మిమ్మల్ని అడిగే ఉంటారు. మీ జుట్టు ఊడిపోయేందుకు ఇవే కారణంగా చెప్పి ఉంటారు.
కానీ ఇవేమీ కూడా మీ జుట్టు ఊడిపోయేందుకు కారణాలు కావు. జుట్టు ఊడిపోయేందుకు క్యాప్‌లు కానీ లేదా హ్యాట్‌లు కానీ కారణాలు కావని, వీటి వల్ల హెయిర్ ఊడిపోతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని గోహ్ చెబుతున్నారు.
మన శరీరంలో ఉన్న అత్యంత జిడ్డు ప్రదేశాల్లో తల కూడా ఒకటి. అయితే, ఇది అంత సెన్సిటివ్ భాగం కాకపోవచ్చు.
శరీరంలో ఇతర భాగాలతో పోలిస్తే.. తలభాగంలో కొన్ని అలర్జీలు వస్తుంటాయని ఒక నిపుణడు పేర్కొన్నారు.
ఒకవేళ మీరు సరియైన ఉత్పత్తులను వాడితే.. ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావని అన్నారు.

ఫొటో సోర్స్, UCLA
అపోహ3: బట్టతలకు పరిష్కారం లేదు
బట్టతలను నిరోధించేందుకు ప్రస్తుతం క్లినికల్‌గా నిరూపితమైన మూడు ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి. అయితే ఏవి కూడా 100 శాతం ఫలితాన్ని హామీ ఇవ్వడం లేదు.
జుట్టు ఊడిపోవడంలో అత్యంత క్లిష్టమైన రసాయనిక, బయోలాజికల్ కారణాలు ఉన్నాయి. అయితే, వీటిని అడ్డుకునే ప్రయత్నాలు లేదా చికిత్సలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఊడిన జుట్టు మళ్లీ వచ్చేలా సాయపడతాయి.
మినోక్సిడిల్.. లోషన్ల, ఫోమ్‌ల రూపంలో అమ్మే దీన్ని నేరుగా తలభాగానికి అప్లై చేసుకోవచ్చు.
మినోక్సిడిల్‌కు చెందిన నోటి ద్వారా వేసుకునే క్యాప్సుల్స్‌ను తక్కువ డోసులో తీసుకోవడం వల్ల కొత్తగా హెయిర్ గ్రోత్ వచ్చినట్టు కొన్ని అనధికారిక అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఫినాస్టెరైడ్.. ఈ ఔషధాన్ని నోటితో తీసుకోవచ్చు. దీన్ని తొలుత ప్రొస్టేట్ పెరుగుదలకు వాడారు. ప్రస్తుతం దీన్ని జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కూడా వాడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాన్స్‌ప్లాంట్స్.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ సమయంలో.. ఎక్కడైతే హెయిర్ గ్రోత్ ఉంటుందో అక్కడి నుంచి కేశాలను తీసుకుని, జుట్టు లేని దగ్గర అతికిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎన్నో రకాల ట్రాన్స్‌ప్లాంట్ విధానాలు అమల్లోకి వచ్చాయి.
అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ విషయంలో గతంలో ఎన్నో అపోహలున్నట్టు డాక్టర్ గోహ్ తెలిపారు. కానీ ఇటీవల కాలంలో ట్రాన్స్‌ప్లాంట్స్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
కేశాలను తొలగించడం, అతికిపెట్టడం వరకు ఎన్నో ప్రొసీజర్లు ఉండటం వల్ల.. ఎంతో శ్రద్ధతో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే అంబేడ్కర్ ఎందుకు తిరస్కరించారు
- బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు 'రిహార్సల్స్' ఎలా జరిగాయంటే..
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ తీసుకోవడం ఉత్తమమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















