అంబేడ్కర్ చనిపోవడానికి ముందు చివరి 24 గంటల్లో ఏం జరిగింది?

బీఆర్ అంబేడ్కర్

ఫొటో సోర్స్, Sharda Badhe/BBC

    • రచయిత, నామ్‌దేవ్ కాట్‌కర్
    • హోదా, బీబీసీ మరాఠీ

డిసెంబర్ 6, 1956.

భారతదేశంలో అణచివేతకు గురైన వర్గాలకు ఆ రోజు సూర్యోదయంతో కాకుండా సూర్యాస్తమయంతో మొదలైంది. దోపీడికి లోనైన అణగారిన వర్గాల ప్రజలకు దిక్సూచీగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ రోజున కన్నుమూశారు.

జీవితంలో తన మనుగడ, చదువు కోసం చేసిన పోరాటం చేసిన అంబేడ్కర్... దళితుల అభ్యున్నతి కోసం పాటుపడటం, స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం వంటి కొన్ని కఠినమైన ప్రయాణాలు కూడా చేశారు.

ఆయన జీవనప్రయాణంలో అనేక వ్యాధులతో కూడా పోరాటం చేశారు అంబేడ్కర్. మధుమేహం, రక్తపోటు, నరాలవాపు, కీళ్లనొప్పులు వంటి నయం చేయలేని వ్యాధులతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. మధుమేహం వల్ల ఆయన బాగా బలహీనపడ్డారు.

మోకాళ్ల నొప్పులతో అనేక రాత్రులు అంబేడ్కర్ మంచానికే పరిమితమయ్యారు.

డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున బాబాసాహెబ్ నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

ఆయన చనిపోవడానికి ముందు రోజు అంటే డిసెంబర్ 5న ఏం జరిగిందో ఈ కథనంలో చెప్పడానికి ప్రయత్నించాం. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చివరిరోజు సెషన్లో పాల్గొన్న అంబేడ్కర్‌, బహిరంగంగా కనిపించడం అదే చివరిసారి.

1956 నవంబర్ నెల చివరి మూడు వారాలు అంబేడ్కర్, దిల్లీ బయటే ఉన్నారు. నవంబర్ 12న పట్నా నుంచి నేపాల్‌లోని కాఠ్‌మాండూ వెళ్లారు. నవంబర్ 14న ప్రపంచ బౌద్ధమత సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఆ కాన్ఫరెన్స్‌ను నేపాల్ రాజు మహేంద్ర ప్రారంభించారు. స్టేజీ మీద తన పక్కన కూర్చోవాల్సిందిగా అంబేడ్కర్‌కు మహేంద్ర ఆహ్వానించారు. అలా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆ ఘటన ఆధారంగా బౌద్ధమత ప్రపంచంలో అంబేడ్కర్‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

కాఠ్‌మాండూలోని వివిధ ప్రదేశాలలో ప్రజలను కలుసుకుని అంబేడ్కర్ బాగా అలసిపోయారు. దిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు బుద్ధుని జన్మస్థలమైన లుంబినితోపాటు సార్నాథ్ అశోక స్తూపం, పట్నాలోని బుద్ధ గయను ఆయన సందర్శించారు.

నవంబర్ 30న దిల్లీకి చేరుకున్నప్పుడు అలసిపోయినట్లు కనిపించారు అంబేడ్కర్.

దిల్లీలోని అంబేడ్కర్ మెమోరియల్‌లో ఆయన బొమ్మ

ఫొటో సోర్స్, Namdev Katkar/BBC

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని అంబేడ్కర్ మెమోరియల్‌లో ఆయన బొమ్మ

అదే చివరి సారి...

అప్పుడే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల అంబేడ్కర్ హాజరు కాలేదు. డిసెంబర్ 4వ తేదీన రాజ్యసభ సమావేశానికి హాజరు కావాలని ఆయన పట్టుబట్టారు.

చివరకు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ మాల్వంకర్, అంబేడ్కర్‌ను పరీక్షించి రాజ్యసభకు వెళ్లొచ్చని చెప్పారు. దాంతో, రాజ్యసభకు వెళ్లిన అంబేడ్కర్, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చారు. అదే ఆయన చివరిసారి పార్లమెంట్‌కు వెళ్లడం.

రాజ్యసభ నుంచి తిరిగి వచ్చిన తరువాత అంబేడ్కర్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత మధ్యాహ్నం అంబేడ్కర్ భార్య సవిత ఆయనను నిద్రలేపి కాఫీ ఇచ్చారు. 26-అలీపూర్ రోడ్‌లోని తమ బంగ్లా ఆవరణలో అంబేడ్కర్, సవితలు కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

అదే సమయంలో నానక్ చంద్ రత్తూ అక్కడికి వచ్చారు. డిసెంబరు 16న బొంబాయిలో మతమార్పిడి వేడుక జరగాల్సి ఉంది. నాగ్‌పుర్ తరహాలో బొంబాయిలోనూ మతమార్పిడి కార్యక్రమం జరగాలని అక్కడి నాయకులు కోరారు. ఆ కార్యక్రమానికి అంబేడ్కర్, సవిత హాజరుకావాల్సి ఉంది.

నానక్‌ చంద్ రత్తూ ఎవరు?

నానక్‌ చంద్ రత్తూ పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా వ్యక్తి. ఉపాధి కోసం దిల్లీకి వచ్చిన నానక్ చంద్, అంబేడ్కర్‌ను కలిశారు. ఆ తరువాత అంబేడ్కర్‌కు నీడలా ఆయన పనిచేశారు.

నానక్ చంద్, 1940 నుంచి అంబేడ్కర్‌కు కార్యదర్శిగా పని చేయడం ప్రారంభించారు. అంబేడ్కర్ చివరి రోజు వరకు అంటే డిసెంబర్ 6, 1956 వరకు నానక్ చంద్ ఆయన వద్దే పని చేశారు.

బాబాసాహెబ్ రచనలను టైప్ చేయడంలో నానక్ చంద్ సహాయం చేసేవారు. తర్వాత అంబేడ్కర్ జ్ఞాపకాలపై నానక్ చంద్ రెండు పుస్తకాలు రాశారు. 1922 ఫిబ్రవరి 6న జన్మించిన నానక్‌ చంద్, 80 ఏళ్ల వయసులో 2002 సెప్టెంబరు 15న చనిపోయారు.

డిసెంబర్ 14న బొంబాయిలో జరిగే మతమార్పిడి కార్యక్రమానికి సంబంధించి టికెట్ల రిజర్వేషన్ల గురించి నానక్ చంద్‌ను అంబేడ్కర్ ఆరా తీశారు. అంబేడ్కర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన విమానంలో ప్రయాణించాలని సవిత కోరారు. దాంతో విమాన టిక్కెట్లను ఏర్పాటు చేయమని నానక్ చంద్‌ను కోరారు.

ఆ తరువాత చాలా సేపు, అంబేడ్కర్ చెబుతుండగా నానక్‌ చంద్ టైప్ చేశారు.

ఆ రోజు అంటే డిసెంబరు 4న రాత్రి దాదాపు 11 గంటల 30 నిమిషాలకు అంబేడ్కర్ పడుకున్నారు. ఆలస్యం కావడంతో నానక్ చంద్ కూడా అంబేడ్కర్ ఇంట్లోనే నిద్రపోయారు.

రాజగృహలోని అంబేడ్కర్ స్టడీ రూమ్

ఫొటో సోర్స్, Sharad Badhe/BBC

ఫొటో క్యాప్షన్, రాజగృహలోని అంబేడ్కర్ స్టడీ రూమ్

అంబేడ్కర్ చివరి 24 గంటలు..

డిసెంబరు 5న అంబేడ్కర్ ఉదయం 8:30 గంటలకు నిద్ర లేచారు. ఆయన భార్య సవిత అంబేడ్కర్‌ను నిద్ర లేపి టీ ఇచ్చారు. ఇద్దరూ కలిసి టీ తాగారు. ఇంతలో ఆఫీసుకి బయలుదేరాల్సిన నానక్ చంద్ కూడా అక్కడికి వచ్చి, వారితోపాటే టీ తాగి వెళ్లిపోయారు.

భార్య సవిత సాయంతో ఉదయం పూట కాలకృత్యాలను అంబేడ్కర్ పూర్తి చేసుకున్నారు. టిఫిన్ చేయడానికి అంబేడ్కర్‌ను డైనింగ్ టేబుల్ వద్దకు సవిత తీసుకొచ్చారు. అంబేడ్కర్, సవిత, డాక్టర్ మాల్వంకర్ ముగ్గురూ కలిసి టిఫిన్ చేశారు. ఆ తర్వాత బంగ్లా వరండాలో కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు.

అంబేడ్కర్ వార్తా పత్రికలు చూశారు. ఆయనకు ఇవ్వాల్సిన మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి సవిత వంట పనికి వెళ్లారు. అంబేడ్కర్, డాక్టర్ మాల్వంకర్ వారి మాటలు కొనసాగించారు.

డాక్టర్ మాధవ్ మాల్వంకర్ బాంబేకు చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్. ఆయనకు గిర్‌గావ్‌లో క్లినిక్ ఉంది. ఆయన అంబేడ్కర్‌కు స్నేహితుడు, వ్యక్తిగత వైద్యుడు.

మెడిసిన్‌ పూర్తి చేసిన తరువాత జూనియర్ డాక్టర్‌గా మాల్వంకర్‌ వద్ద సవిత పనిచేశారు. అక్కడే ఆమె అంబేడ్కర్‌ను తొలిసారి కలిశారు.

దాదాపు 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అంబేడ్కర్‌ను ఆయన భార్య భోజనానికి పిలిచారు. అప్పుడు అంబేడ్కర్ లైబ్రరీలో చదువుతూ రాసుకుంటూ ఉన్నారు. 'ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మా, హిజ్ వర్క్ ఆఫ్ రైటింగ్' అనే పుస్తకానికి ముందుమాటను పూర్తి చేస్తున్నారు.

సవిత భోజనం తీసుకురాగా తిని అంబేడ్కర్ నిద్రపోయారు. దిల్లీలో ఉన్నప్పుడు సవిత అప్పుడప్పుడు బయటకు వెళ్లి పుస్తకాలతో పాటు ఆహారం, పానీయాలు వంటివి కొంటూ ఉండేవారు. అంబేడ్కర్ పార్లమెంటుకు వెళ్లినప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు మాత్రమే ఆమె ఈ పనులు చేసేవారు.

డిసెంబరు 5న ఎప్పటిలాగే అంబేడ్కర్ నిద్రిస్తున్న సమయంలో సవిత మార్కెట్‌కు వెళ్లారు.

డాక్టర్ మాల్వంకర్ అదే రాత్రి అంటే డిసెంబర్ 5న బొంబాయికి విమానంలో వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన కూడా కొన్ని వస్తువులు కొనడానికి సవితతో కలిసి బయటకు వెళ్లారు. అంబేడ్కర్ నిద్రపోతున్నందున ఆయనకు చెప్పకుండానే వారు వెళ్లిపోయారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు మార్కెట్‌కు వెళ్లిన సవిత, డాక్టర్ మాల్వంకర్ సాయంత్రం 5:30 గంటలకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో అంబేడ్కర్‌కు కోపం వచ్చింది.

తన 'డా.అంబేడ్కర్ ఆత్మకథ'లో అంబేడ్కర్‌కు కోపం తెచ్చుకోవడం కొత్త విషయం కాదని తెలియజేశారు.

''రోజూ ఉండే చోట తన పుస్తకం కనిపించకపోయినా, పెన్ను కనిపించకపోయినా సాహెబ్‌కు కోపం వచ్చేది. చిన్న విషయమైనా ఆయన ఇష్టానికి విరుద్ధంగా జరిగితే లేదా అనుకున్నట్లుగా జరగకపోతే కోపం వెంటనే వస్తుంది.

ఆయన కోపం ఉరుములా ఉంటుంది. కానీ అది క్షణకాలం మాత్రమే. కావాల్సిన పుస్తకం, నోట్‌బుక్ లేదా కాగితం దొరికినప్పుడు మరుసటి క్షణంలోనే ఆయన కోపం మాయమైపోతుంది'' అని సవిత రాశారు.

బజారు నుంచి తిరిగి రాగానే సవిత నేరుగా అంబేడ్కర్ గదికి వెళ్లారు. మీ కోసం ఎదురు చూస్తున్నానని అంబేడ్కర్ ఆమెతో చెప్పారు. ఆయనకు నచ్చచెప్పి కాఫీ తీసుకురావడానికి ఆమె నేరుగా వంటగదికి వెళ్లారు.

రాత్రి 8 గంటలకు జైన పూజారులు, ప్రతినిధుల బృందం బాబాసాహెబ్‌తో సమావేశమైంది. వారు బౌద్ధం, జైనమతం గురించి చర్చించారు.

‘డిసెంబర్ 6న జరగనున్న జైన మత సమావేశంలో జైన, బౌద్ధమతాల మధ్య ఐక్యత పెరిగేలా అంబేడ్కర్... జైన సన్యాసులతో చర్చలు జరపాలని వారు కోరారు’ అని అంబేడ్కర్ జీవిత చరిత్ర 12వ భాగంలో చాంగ్‌దేవ్ ఖైర్‌మోడే రాశారు.

ఇంతలో డాక్టర్ మాల్వంకర్ ముంబైకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో బాబాసాహెబ్.. ప్రతినిధి బృందంతో చర్చల్లో మునిగిపోయారు.

'అంబేడ్కర్‌తో మాట్లాడకుండానే డా.మాల్వంకర్ వెళ్లిపోయారు’ అని చాంగ్‌దేవ్ తన బాబాసాహెబ్ జీవిత చరిత్రలో రాశారు. అయితే డాక్టర్ మాల్వంకర్, అంబేడ్కర్ అనుమతి తీసుకుని విమానాశ్రయానికి బయలుదేరినట్లు సవితా అంబేడ్కర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

అనంతరం జైన ప్రతినిధుల బృందం కూడా వెళ్లిపోయింది. "మరుసటి రోజు (డిసెంబర్ 6) సాయంత్రం నా సెక్రటరీ దగ్గర నా ఖాళీ సమయాన్ని తెలుసుకుని రండి. దాని మీద మనం చర్చిద్దాం" అని చెప్పారు.

ఆ తరువాత అంబేడ్కర్ సన్నగా 'బుద్ధాం శరణం గచ్ఛామి' అంటూ పాడటం మొదలుపెట్టారు.

సవితా అంబేడ్కర్ రాసిన పుస్తకం

ఫొటో సోర్స్, TATHAGATA PRAKASHAN

అంబేడ్కర్ చివరిసారిగా పాడుకున్న పాటలు..

బాబాసాహెబ్ సంతోషంలో ఉంటే బుద్ధ వందన, కబీర్ ద్విపదలను పాడుకునేవారని సవితా అంబేడ్కర్ రాసుకున్నారు. కాసేపటి తరువాత రేడియోగ్రామ్‌లో బుద్ధ వందన ఆడియో ప్లేట్‌ను పెట్టమని నానక్‌ చంద్‌కు అంబేడ్కర్ చెప్పారు.

తరువాత అంబేడ్కర్ కొద్దిగా భోజనం చేశారు.

అంబేడ్కర్ తిన్నాక సవిత భోజనం చేశారు. ఆమె తినే వరకు అంబేడ్కర్ వేచి చూశారు. ఆ సమయంలో కబీర్ దోహా 'ఛలో కబీర్ తేరా భవస్గర్ దేరా'ను పాడారు.

ఆ తరువాత కొన్ని పుస్తకాలు తీసుకొని కర్ర సాయంతో బెడ్‌రూమ్‌కు అంబేడ్కర్ వెళ్లారు.

వెళ్తూ నానక్‌ చంద్‌కు... తన పుస్తకం 'ది బుద్ధా అండ్ హిజ్ ధమ్మ' ముందుమాట ప్రతిని, ఎస్.ఎం జోషి, ఆచార్య ఆత్రే కోసం రాసిన ఉత్తరాల కాపీలను ఇచ్చి వాటిని టేబుల్‌పై పెట్టమని అడిగారు అంబేడ్కర్.

తన పని ముగించుకుని నానక్ చంద్ ఆయన ఇంటికి వెళ్లారు. సవిత అంబేడ్కర్ వంటగదిని శుభ్రం చేయడంతో అలసిపోయారు.

సవితా అంబేడ్కర్ తన ఆత్మకథలో రాసినట్లుగా అంబేడ్కర్‌కు అర్ధరాత్రి వరకు చదవడం, రాయడం అలవాటు. డిసెంబర్ 5వ తేదీ రాత్రి నానక్‌ చంద్ వెళ్లిపోయిన తర్వాత బాబాసాహెబ్ 'ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మా' పుస్తకం ముందుమాటను సవరించారు.

ఎస్.ఎం జోషి, ఆచార్య ప్రహ్లాద్ కేశవ్ ఆత్రేతో పాటు బ్రహ్మీ సర్కార్‌కు రాసిన లేఖలనూ సవరించారు అంబేడ్కర్. ఆ రోజు బాబాసాహెబ్ పదకొండున్నర గంటలకు పడుకున్నారు.

డిసెంబర్ 5 రాత్రి ఆయన జీవితంలో చివరి రాత్రి అని సవితా అంబేడ్కర్ తన పుస్తకంలో రాశారు.

అంబేడ్కర్ జీవిత చరిత్ర

ఫొటో సోర్స్, SUGAVA PRAKASHAN

'సూర్యాస్తమయం'తో ఉదయించిన డిసెంబర్ 6

డిసెంబర్ 6, 1956న సవితా అంబేడ్కర్ ఎప్పటిలాగే నిద్రలేచారు. టీ సిద్ధం చేసిన తర్వాత, ఆమె అంబేడ్కర్‌ను లేపడానికి వెళ్లారు. ఉదయం ఏడున్నర అయింది.

"నేను గదిలోకి ప్రవేశించినప్పుడు, సాహెబ్ ఒక పాదం దిండుపై ఉంచినట్లు చూశాను. సాహెబ్‌ను రెండు మూడు సార్లు పిలిచాను.

కానీ, కదలిక కనిపించలేదు. ఆయన గాఢంగా నిద్రపోతున్నాడని అనుకున్నాను. కాబట్టి ఆయనను కదిలించి, లేపడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత…” అని తన పుస్తకంలో రాసుకొచ్చారు సవితా అంబేడ్కర్.

బాబాసాహెబ్ నిద్రలోనే కన్నుమూశారు. సవితా అంబేడ్కర్‌కు ఏం అర్థం కాలేదు. ఆమె ఎడతెగకుండా ఏడవడం ప్రారంభించారు.

అప్పుడు బంగ్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. సవితా అంబేడ్కర్, సహాయకుడు సుదామా. సవితా అంబేడ్కర్ కుప్ప కూలిపోయారు. ఆమె ఏడుస్తూనే సుదామాని పిలిచారు.

ఆ తరువాత డాక్టర్ మాల్వంకర్‌కు సవితా అంబేడ్కర్ ఫోన్ చేశారు. అంబేడ్కర్‌కు 'కోరమైన్' ఇంజెక్షన్ ఇవ్వమని ఆయన సలహా ఇచ్చారు. కానీ ఆయన చనిపోయి చాలా గంటలు గడిచాయి. కాబట్టి ఇంజెక్షన్‌ వేయలేకపోయారుత. నానక్ చంద్‌ను తీసుకురావాలని సుదామను సవితా అంబేడ్కర్ పంపారు.

కారు వేసుకొని వెళ్లి నానక్ చంద్‌ను సుదామ తీసుకొని వచ్చాడు. కొందరు అంబేడ్కర్ శరీరానికి మసాజ్ చేయగా మరికొందరు కృత్రిమ శ్వాస ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ అవేవీ పని చేయలేదు. అంబేడ్కర్ అప్పటికే చనిపోయారు.

ఆ తరువాత అంబేడ్కర్ చనిపోయారనే వార్తను అందరికీ చెప్పాలని తమ ముగ్గురం కలిసి నిర్ణయించుకున్నామని సవితా అంబేడ్కర్ రాశారు. ప్రముఖులు, ప్రభుత్వశాఖలు, పీటీఐ, యూఎన్ఐ, ఆకాశవాణి వంటి వాటికి నానక్ చంద్ ఫోన్ చేసి విషయం చెప్పారు.

అంబేడ్కర్ మరణవార్త దావానంలా దేశమంతా వ్యాపించింది. ఆ వేదన దేశమంతటా కనిపించింది.

వేలాది మంది అంబేడ్కర్ అనుచరలు దిల్లీలోని ఆయన నివాసం వైపుగా బయలుదేరారు. 'బాబాసాహెబ్‌ను సారనాథ్‌లో దహనం చేయాలని మాయిసాహెబ్ పట్టుబట్టారు' అని చాంగ్‌దేవ్ రాశారు. అయితే అంబేడ్కర్ అంత్యక్రియలు బొంబాయిలో జరగాలని కోరినట్లు సవితా అంబేడ్కర్ తన ఆత్మకథలో రాశారు.

మొత్తానికి అంత్యక్రియలను బాంబేలో నిర్వహించాలని నిర్ణయించారు.

దిల్లీలోని అంబేడ్కర్ నివాసానికి నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర మంత్రులు.. పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు రావడం ప్రారంభించారు.

అంబేడ్కర్ మృతదేహాన్ని బొంబాయి తీసుకువెళ్లడానికి జగ్జీవన్‌రామ్ విమానాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని నాగ్‌పూర్ మీదుగా బొంబాయికి తరలించారు. బొంబాయిలో జరిగిన అపూర్వమైన అంతిమయాత్రను దేశమంతా చూసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)