ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లిచేసుకోవచ్చా, చట్టాలు ఏం చెబుతున్నాయి, శిక్షేంటి?

వీడియో క్యాప్షన్, ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమేనా?

మహారాష్ట్ర సోలాపుర్‌లో ఇద్దరు కవల యువతులు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పత్రికల్లోనూ ఈ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి.

ఇలా ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం నేరమని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఈ పెళ్లికి చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలీ చాకణాకర్ వెల్లడించారు.

‘‘సోలాపుర్‌కు చెందిన ఒక యువకుడు ముంబయిలో ఇద్దరు కవల అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఐపీసీలోని సెక్షన్ 494 ప్రకారం నేరం. సోలాపుర్ ఎస్పీ దీనిపై విచారణ చేపట్టాలి. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలి’’అని రూపాలీ ఒక ట్వీట్ చేశారు.

పెళ్లి

ఫొటో సోర్స్, UGC

వివాదం ఏమిటి?

ముంబయికి చెందిన ఇద్దరు యువతులను సోలాపుర్‌లోని అకలుజ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

దీంతో అసలు భారత్‌లో ఒకేసారి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సాధ్యమేనా? దీన్ని చట్టాలు అనుమతిస్తాయా? అని చాలా మంది సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

పెళ్లి

ఫొటో సోర్స్, UGC

పెళ్లి ఎలా జరిగింది?

అసలు ఈ పెళ్లి ఎక్కడ, ఎలా జరిగిందనే అంశంపై అకలుజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అరుణ్ సుగావ్‌కర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ముంబయికి చెందిన పింకీ పడగాంవ్‌కర్, రింకీ పడగాంవ్‌కర్ కవలలు. వారిద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకొని, ఒకే ఇంటిలో ఉండాలని వీరు భావించారు. ప్రస్తుతం వీరు సోలాపుర్‌కు చెందిన అతుల్‌ అవతాడేను పెళ్లి చేసుకున్నారు’’అని అరుణ్ చెప్పారు.

రెండు కుటుంబాల అనుమతితోనే వీరు ఈ పెళ్లి చేసుకున్నారని అరుణ్ వివరించారు.

సోలాపుర్ జిల్లా అకలుజ్‌లోని జామాపుర్ రోడ్‌ గలాండే హోటల్‌లో ఈ పెళ్లి జరిగింది.

వీడియో క్యాప్షన్, మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

అతుల్ సొంత గ్రామం మాలసిరస్. ముంబయిలో ఆయన ట్రావెల్ బిజినెస్ నడిపిస్తున్నారు.

మరోవైపు రింకీ, పింకీలు ఐటీ ఇంజినీర్లు. వీరిద్దరూ ముంబయిలో తల్లితోనే కలిసి జీవిస్తున్నారు. మొదట అతుల్‌తో వీరికి పరిచయం ఏర్పడింది.

ఒకసారి రింకీ, పింకీలతోపాటు వీరి తల్లి కూడా అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు అందరినీ అతుల్ తన కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

అలా రోజులు గడిచేకొద్దీ ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రింకీ, పింకీలతో అతుల్ పరిచయం కూడా ప్రేమగా మారింది.

వీడియో క్యాప్షన్, ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

హోటల్ యజమాని ఏం చెబుతున్నారు?

పెళ్లి నిజంగా జరిగిందా? అని ధ్రువీకరించుకునేందుకు గలాండే హోటల్‌ యజమాని నానా గలాండేను బీబీసీ మరాఠీ సంప్రదించింది.

తమ హోటల్‌లో ఆ పెళ్లి జరిగిందని నానా గలాండే స్పష్టంచేశారు.

నానా గలాండే మాట్లాడుతూ.. ‘‘డిసెంబరు 2, శుక్రవారం మధ్యాహ్నం మా హోటల్‌లో ఆ పెళ్లి జరిగింది. మొదట ఇలా ఇద్దరినీ ఒకేసారి పెళ్లిచేసుకుంటానని ఆయన చెప్పినప్పుడు మేం కూడా ఆశ్చర్యానికి గురయ్యాం’’అని ఆయన చెప్పారు.

‘‘మొదట పింకీ, రింకీలతో తాను మాట్లాడతానని, అప్పుడే ఈ పెళ్లికి హోటల్ బుక్ చేసుకోవడానికి అంగీకరిస్తాం’’అని ఆయన చెప్పారు.

‘‘ఆ ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకున్నారు. తమ ఇష్టపూర్వకంగానే వారు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి వారు సిద్ధంగా ఉన్నారని తెలుసుకునేందుకు వారి దగ్గర నుంచి ఆధార్, పాన్ , ఇతర ధ్రువపత్రాలు తీసుకున్నాను. ఆ తర్వాతే మా హోటల్‌లో పెళ్లికి అనుమతించాం’’అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

కేసు నమోదు..

ఈ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అకలుజ్ పోలీస్ స్టేషన్‌లో ఒక యువకుడు ఫిర్యాదు కూడా చేశారు.

‘‘ఇలా ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం నేరం అని చెబుతూ రాహుల్ ఫూలే అనే వ్యక్తి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 494 ప్రకారం మేం కేసు నమోదుచేశాం’’అని అరుణ్ చెప్పారు.

ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్నాం. విచారణ పూర్తయిన తర్వాతే మేం స్పందించగలం’’అని అరుణ్ చెప్పారు.

మరోవైపు అతుల్‌ను కూడా సంప్రదించేందుకు బీబీసీ మరాఠీ ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించలేదు.

వీడియో క్యాప్షన్, ఇండియాలో లెజ్బియన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం కష్టమా?

చట్టం ఏం చెబుతోంది?

ఐపీసీలోని సెక్షన్ 494 ప్రకారం.. భార్య లేదా భర్త బతికి ఉన్నప్పుడు మరో పెళ్లి చేసుకోవడం నేరం. అయితే, ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. భార్య లేదా భర్తతో విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు.

అయితే, భార్య లేదా భర్త బతికి ఉన్నప్పుడే మరో పెళ్లి చేసుకుంటే.. ఆ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు.

అయినప్పటికీ, పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

గతంలో ఇలాంటి కేసు ఒకటి తాను చూశానని అడ్వొకేట్ దిలీప్ తూర్ బీబీసీ మరాఠీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, బిర్యానీ అమ్ముతూ ఐదుగురు కూతుర్లను సాకుతున్న ఓ తల్లి

ఇలాంటి పెళ్లిళ్లను అడ్డుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ హిందూ బైగమీ యాక్ట్-1946ను అప్పట్లోనే తీసుకొచ్చినట్లు దిలీప్ చెప్పారు. దీని ప్రకారం భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం నేరమని ఆయన వివరించారు.

మరోవైపు క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు కూడా ఇలాంటి చట్టాలు విడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అకలుజ్ కేసుపై అడ్వొకేట్ అసీమ్ సరోడే కాస్త భిన్నంగా స్పందించారు. ఇద్దరూ స్వచ్ఛందంగానే పెళ్లికి అంగీకరిస్తే, అది నేరంకాదని చెప్పారు.

‘‘ఇద్దరిని పెళ్లి చేసుకోకుండా బైగమీ చట్టం నిషేధించే మాట వాస్తవమే. కానీ, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దాన్ని నేరంగా పరిగణించరు. ఇలాంటివి మన దేశంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)