యుక్రెయిన్ సంక్షోభం: మహిళగా జీవనం, పాస్‌పోర్టులో పురుషునిగా గుర్తింపు... సరిహద్దులు దాటలేక కష్టాలు

నికిత

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, నికిత
    • రచయిత, జోష్ పరీ
    • హోదా, ఎల్జీబీటీ+ ప్రొడ్యుసర్, బీబీసీ న్యూస్

యుక్రెయిన్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తోన్న వందలాది మంది ట్రాన్స్‌జెండర్ మహిళలకు సరిహద్దుల వద్ద అనుమతి లభించకపోవడంతో నిరాశ ఎదురవుతోంది.

90 శాతం మంది ట్రాన్స్ మహిళలు ఈ ప్రయత్నంలో విఫలమయ్యారని ఆ మహిళలకు దేశం వదిలి వెళ్లిపోవడంలో సహాయం చేసేందుకు ప్రయత్నించిన చారిటీలు బీబీసీతో చెప్పాయి.

18-60 ఏళ్ల వయస్సున్న యుక్రెయిన్ పురుషులు దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదు. కానీ ఇప్పటికీ చాలామంది ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు, వారి పాత పేరు మునుపటి జెండర్‌నే కలిగి ఉంది. దీంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ కారణంగా కొందరు తమకు పాస్‌పోర్ట్ లేదని అబద్ధాలు చెబుతుండగా, మరికొంతమంది దేశం విడిచేందుకు అక్రమ మార్గాలను ఉపయోగిస్తున్నారు.

ఈ రెండు పద్ధతులను అనుసరించలేకపోయిన 29 ఏళ్ల ట్రాన్స్ మహిళ నికిత, యుక్రెయిన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తాను దుర్భలమైన పరిస్థితుల్లో ఉన్నట్లు ఆమె భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో జెండర్‌కున్న ప్రాధాన్యం ఎలా మారిపోయింది?

చాలామందిలాగే యుక్రెయిన్‌ ట్రాన్స్‌జెండర్‌ల మాదిరిగానే నికిత కూడా తన పాస్‌పోర్ట్‌లో పేరు, లింగాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే ఈ ప్రక్రియలో తీవ్రమైన మానసిక పరిశీలనలతో పాటు వైద్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

అందువల్లే పాస్‌పోర్ట్ పత్రాలు ఆమెను ఇంకా పురుషుడిగానే పేర్కొంటున్నాయి.

చెర్నిహియెవ్‌లోని తన ఇంటి నుంచి పారిపోయిన తర్వాత, మోల్డోవా సరిహద్దును దాటేందుకు నికిత ప్రయత్నించారు. కానీ సరిహద్దు ఏజెంట్లు తనపై 'ట్రాన్స్‌ఫోబిక్ జోక్'లు వేశారని, సరిహద్దు దాటడానికి అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడికి కొద్దిరోజుల ముందు సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులను గమనిస్తే... పాడటం, డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడే ఒక ఆత్మవిశ్వాసమున్న యువతిగా ఆమె కనిపిస్తారు.

కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి మారిపోయింది. టర్నిపోల్‌లోని మిక్స్‌డ్ జెండర్ షెల్టర్‌లో తలదాచుకుంటోన్న ఆమె పూర్తి నిరాశగా, నిస్సహాయంగా ఉన్నారు. తాను మరొకరి శరీరంలో జీవిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు.

షెల్టర్‌లో సురక్షితంగా అనిపించడం లేదని, అందుకే అబ్బాయిల దుస్తులు ధరించినట్లు నికిత చెప్పారు

ఫొటో సోర్స్, Nikita

ఫొటో క్యాప్షన్, షెల్టర్‌లో సురక్షితంగా అనిపించడం లేదని, అందుకే అబ్బాయిల దుస్తులు ధరించినట్లు నికిత చెప్పారు

కేవలం ఒక చిన్న బ్యాగ్ వస్తువులతో ఆమె ఇంటి నుంచి వచ్చేశారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా చర్యలు తీసుకున్నారు. పొడవైన జుట్టును దాచుకోవడం, మేకప్ వేసుకోకపోవడం, పూర్తిగా అబ్బాయిల దుస్తులు ధరించడం లాంటి చర్యలతో ఆమె తన లింగ గుర్తింపును దాచేయడానికి ప్రయత్నించారు.

''నేను ట్రాన్స్‌జెండర్ మహిళను. నా పాస్‌పోర్ట్‌లో పురుషుడు అని ఉన్నందుకు నన్ను జైలులో పెడుతున్నట్లుగా అనిపిస్తోంది'' అని ఆమె చెప్పారు.

ఎల్జీబీటీ ప్రజలు సైన్యంలో పనిచేయకూడదనే నియమాలు, నిషేధాలు యుక్రెయిన్‌లో లేవు. కానీ అలా చేయడం సురక్షితం కాదని, జెండర్ గుర్తింపు కారణంగా తనను తిరస్కరిస్తారని నికిత నమ్ముతున్నారు.

''మిలిటరీ నన్ను అర్థం చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ నేను ట్రాన్స్‌జెండర్ మహిళను అని తెలిస్తే వారు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. అందులో చేరడం నాకు సురక్షితం కాదు'' అని నికిత అన్నారు.

''సరిహద్దులు దాటడానికి నేను సహాయపడుతోన్న ట్రాన్స్ మహిళల్లో ఎక్కువ మంది పాస్‌పోర్ట్‌లో తమ కొత్త గుర్తింపును నమోదు చేసుకోలేదు. యుద్ధం కారణంగా కొన్ని వైద్య సర్వీసులు ఆపేసిన కారణంగా వారు ఇప్పుడు ఆ సేవలను పొందలేరు'' అని యుక్రెయిన్‌లోని ప్రధాన ట్రాన్స్‌జెండర్ ఆర్గనైజేషన్లలో ఒకటైన కోహోర్ట్ హెడ్ అనస్థాసియా దొమాని అన్నారు.

''ఈ పరిస్థితుల్లో నేను ఇచ్చే సలహా ఏంటంటే... పాస్‌పోర్ట్‌లో పుట్టిన పేరు, లింగం అలాగే ఉన్న ట్రాన్స్‌జెండర్లు సరిహద్దులకు వెళ్లకూడదు. ఇప్పటివరకు మేం సహాయం చేసేందుకు ప్రయత్నించిన 90 శాతం కంటే ఎక్కువ మంది, పాస్‌పోర్ట్‌లో సరైన గుర్తింపు లేని కారణంగా సరిహద్దుల వద్ద తిరస్కరణకు గురయ్యారు'' అని ఆమె తెలిపారు.

ట్రాన్స్ జ‌ెండర్ మహిళలకు అవసరమైన క్రాస్-సెక్స్ హార్మోన్స్ మందులను అందించడంలో ఒలెనా సహాయపడుతున్నారు

ఫొటో సోర్స్, Olena Shevchenko

రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఎల్జీబీటీ కార్యకర్తలు, చారిటీలు తమ సహాయాన్ని, మద్దతును అందించేందుకు పనిచేస్తున్నాయి.

పాస్‌పోర్ట్‌లో తన గుర్తింపును విజయవంతంగా మార్చుకున్న ఒక ట్రాన్స్‌జెండర్ మహిళను అనస్థాసియా సురక్షితంగా సరిహద్దులను దాటించగలరు. కానీ ఆమె కీయెవ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

తన మాజీ భార్య, బిడ్డ సురక్షితంగా యుక్రెయిన్ దాటడంలో ఆమె సహాయపడ్డారు. ఆ తర్వాత తన అపార్ట్‌మెంట్‌ను యుక్రెయిన్ ట్రాన్స్‌జెండర్లకు సహాయం చేసే స్థావరంగా మార్చేశారు.

సరిహద్దులు దాటాలనుకునే మహిళలకు సలహాలు ఇవ్వడం, మందులు పంపిణీ చేయడం, షెల్టర్లలో నివసించే వారు ఆహారం కొనుక్కునేందుకు డబ్బు పంపించడం వంటి సహాయ కార్యక్రమాలు ఆమె చేస్తారు.

2008 నుంచి ఒలెనా ఎల్జీబీటీ కార్యకర్తగా ఉన్నారు

ఫొటో సోర్స్, Insight Ukraine

ఫొటో క్యాప్షన్, 2008 నుంచి ఒలెనా ఎల్జీబీటీ కార్యకర్తగా ఉన్నారు

ఒలెనా షెవ్‌చెంకో, ఇన్‌సైట్ అనే ఎల్జీబీటీ చారిటీ హెడ్. ఇళ్ల నుంచి వచ్చేసిన ఎల్జీబీటీ ప్రజల కోసం లివ్యూ, చెర్నిహియెవ్‌ నగరాల్లో ఈ చారిటీ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.

ఈ చారిటీ మానసిక కౌన్సిలింగ్‌తో పాటు మందుల పంపిణీ కూడా చేస్తుంది.

ఈ శిబిరాలకు సంబంధించిన వార్తలు అందరికీ తెలియడంతో సహాయం కోసం పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని ఇన్‌సైట్ చారిటీ తెలిపింది.

''సహాయం చేయాలని కోరుతూ రోజులో నాకు 50 కంటే ఎక్కువ ఈమెయిల్స్ వస్తాయి. అదొక అంతులేని వ్యవహారంలా తయారవుతుంది'' అని ఒలెనా చెప్పారు.

''లెస్బియన్లకు సహాయం చేస్తున్న సమయంలో అంతా సవ్యంగానే జరుగుతుంది. వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిహద్దులు దాటుతారు. సురక్షితంగా సరిహద్దు దాటినట్లు సంతోషంగా మాకు సందేశాలు పంపిస్తారు''

''కానీ ట్రాన్స్‌జెండర్ల విషయానికొచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోతుంది. వారు సరిహద్దు దాటగలుగుతారా? లేదా అనేది మనకు కచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితుల్లో వారికి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు'' అని ఒలెనా వివరించారు.

వీడియో క్యాప్షన్, కూతురుగా తిరిగొచ్చిన కొడుకు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)