ఛత్తీస్‌గఢ్: ‘ఒకప్పుడు పోలీసులను చూసి భయపడేవారు.. ఇప్పుడు వారూ యూనిఫాం ధరించారు’.. రక్షకభటులుగా ట్రాన్స్జెండర్లు

ఫొటో సోర్స్, cg khabar
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ హిందీ కోసం రాయ్‌పూర్ నుంచి
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల సబూరీ యాదవ్ చాలా సంతోషంగా ఉన్నారు. ‘‘చాలామంది మమ్మల్ని ఏడిపించేవారు, ఎగతాళి చేసేవారు. కానీ పోలీస్ అధికారి అటువైపు వచ్చారంటే అంతా సైలెంట్ అయ్యేవారు. పోలీస్ యూనిఫాం ఒక్కటే ఈ అవమానాల నుంచి నాకు విముక్తి కల్పిస్తుందని నేను అనుకునేదానిని’’ అని సబూరీ యాదవ్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఎంపికైన తొమ్మిదిమంది ట్రాన్స్‌జెండర్‌ల బృందంలో సబూరీ యాదవ్ ఒకరు.
ఈ నియామక ప్రక్రియలో 317మంది పురుషులు, 71 మహిళలతోపాటు 9మమంది ట్రాన్స్‌జెండర్లను కూడా ఎంపిక చేసినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెంట్ అజయ్ యాదవ్ తెలిపారు.
వీరంతా రాతపరీక్ష, శరీర దారుఢ్య పరీక్షల్లో నెగ్గి పోలీసు ఉద్యోగాలు సంపాదించారు.
వీరేకాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన పోలీస్ నియామక పరీక్షల్లో మరో ఆరుగురు ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఉద్యోగాలు సంపాదించినట్లు తెలిసింది.
2017లో విడుదలైన పోలీస్ నియామక పరీక్షల ద్వారా తొలిసారి ట్రాన్స్‌జెండర్లకు కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది . దీనికి సంబంధించిన పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి.

పురుష శరీరం.. మహిళ మనస్తత్వం
చూడటానికి తన శరీరం పురుషుడిలా ఉన్నా తన మనసంతా మహిళలలాగే ఆలోచిస్తుండేదని సబూరీ యాదవ్ వెల్లడించారు. తాను అలా ఉండటం ఇంట్లో వారికి నచ్చేది కాదని, తన నలుగురు అక్క చెల్లెళ్లకు సోదరుడిగా ఉండాలని కుటుంబం కోరుకునేదని సబూరీ అన్నారు.
‘‘పేదరికం కారణంగా మా ఇంట్లో ఒక్క చెల్లి తప్ప ఎవరూ చదువుకోలేదు. నేను అమ్మాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వారు మందలించేవారు. నేను చదివి ఉపాధి సాధించాలని కోరుకునేవారు. నేను మగవాడిగా ఉంటేనే అది సాధ్యమని వారు అనుకునేవారు’’ అని సబూరీ వెల్లడించారు.
సబూరీ తండ్రి గత ఏడాది మరణించారు. తల్లి ఇళ్లలో పని చేసి పిల్లలను పోషిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగా లేదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు.

మరో ట్రాన్స్ జెండర్ కథ
జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన 32 ఏళ్ల నేహ కూడా అంతే సంతోషంలో ఉన్నారు. షెడ్యూల్ తెగకు చెందిన అశోక్ కుమార్ బంజారే తల్లిదండ్రులు కూలీ పని చేసుకునేవారు.
‘‘నాకు నడవడం తెలిసినప్పుడు నా తమ్ముడు నాన్నమ్మ ఒడిలో ఉండేవాడు. మమ్మల్ని వదిలిపెట్టి ఉపాధి కోసం అమ్మానాన్న ఎక్కడికో వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మ అనారోగ్యంతో మరణించారు. మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు " అని నేహ వివరించారు.
నేహ తల్లి మరణించడంతో ఆమె తండ్రి మరో వివాహం చేసుకున్నారు. నేహను అమ్మమ్మే పెంచారు.
‘‘తొమ్మిది, పది తరగతులకు వచ్చేసరికి నాకు అబ్బాయిలంటే ఇష్టం పెరిగింది. అమ్మాయిలలాగా ఉండాలని కోరుకునే దాన్ని. కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా అలా ఉండలేకపోయాను. కానీ నాలోని స్త్రీత్వాన్ని మాత్రం చంపుకోలేకపోయాను. డిగ్రీ పూర్తయినప్పటి నుంచి నేను అమ్మాయిలా జీవించడం మొదలు పెట్టాను’’ అని చెప్పారు నేహ.
స్కూల్ వయసులోనే తనకు లింగ మార్పిడి చేయించుకోవడానికి ఆసక్తి చూపే వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని, రాయ్‌గఢ్‌లో తన గురువును కూడా ఎంచుకున్నానని నేహచెప్పారు.
శుభకార్యాల్లో ఆశీర్వాదాలు ఇచ్చేందుకు నేను కొందరు థర్డ్ జెండర్ వ్యక్తులతో కలిసి ఇంటింటికి వెళ్లేదాన్ని. అప్పట్లో నాకు అదే ఆదాయ వనరు. అయితే గౌరవ ప్రదమైన పని చేయాలని అనుకునేదాన్ని అని నేహ వివరించారు.
సత్తా చాటే ధైర్యం
2017లో పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ట్రాన్స్‌జెండర్‌లకు కూడా అవకాశం కల్పిస్తూ నిబంధనలు మార్చడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు నేహ. ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం పనిచేసే మిత్‌వా కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు నేహ. రాయ్‌పూర్‌లో రాష్ట్రప్రభుత్వం నిర్వహించే పోలీస్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్‌లో చేరారు.
ఇది కాకుండా పోలీస్ శాఖ నిర్వహించే ట్రైనింగ్ సెంటర్‌లకు వెళ్లి పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నాలు చేశారు.
ఈ అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్‌లో సవాలుగా తీసుకున్నారు అని రాజ్‌నంద్‌గావ్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సురేషా చౌబే అన్నారు.
ట్రైనింగ్ తీసుకుంటున్నవారిలో చాలామంది శిక్షణ పూర్తయ్యాక ఫోన్‌లు మాట్లాడుకుంటూ కాలం గడిపితే వీరు మాత్రం మైదానంలోనే ఉండి కఠిన శిక్షణను తీసుకున్నారు. వారి పట్టుదలకు ఫలితం దక్కింది. అన్నారాయన.
పోలీస్ నియామకాలలో ట్రాన్స్‌జెండర్లు పాల్గొని ఉద్యోగం పొందడం సమాజంలో వారు సాధించిన అతిపెద్ద విజయమని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ కమిటీ సభ్యురాలు విద్యా రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు.
ట్రాన్స్‌జెండర్‌లు ఎక్కువమంది పోలీసులను చూసి భయపడతారు. కానీ ఇప్పుడు వారే యూనిఫామ్ ధరించే పరిస్థితికి చేరుకున్నారు. వారికి కూడా అవకాశం ఇస్తే పురుషులతో సమానంగా విజయాలు సాధించగలరు అని నిరూపించారు అన్నారు విద్యా రాజ్‌పుత్
పోలీస్ ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్న నేహ, ఇప్పుడు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తనను అర్దం చేసుకునే అబ్బాయిని పెళ్లాడతానని ఆమె చెబుతున్నారు.
‘‘టైమ్‌పాస్ చేయాలనుకునే అబ్బాయిలంటే నాకు ఇష్టం ఉండదు. కానీ నా మనసుకు నచ్చిన అబ్బాయి దొరికినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను " అన్నారు నేహా.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భవిష్యత్‌లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?
- ఎల్జీబీటీ: ప్రైడ్ మంత్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు జరుపుకొంటారు?
- LGBT: బైసెక్సువల్ అని చెప్పుకోగానే అమ్మాయిల కష్టాలు ఎందుకు పెరుగుతాయి?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- బిట్ కాయిన్ ట్రేడింగ్ నైజీరియాలో జోరుగా సాగడానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








