‘నేనొక అమ్మాయిని.. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి’

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మేమిద్దరం అమ్మాయిలమే కదా. ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకు మాపై కోపం? మేం పెళ్లి చేసుకుంటే గ్రామస్థులకేంటి నొప్పి?" అని నిలదీస్తున్నారు ప్రియ (పేరు మార్చాం).

మీరు, మాకు సహాయం చేస్తారా? అని ఆమె నన్ను అడిగారు. నేను ఓ క్షణం ఆగి, మీ వివాహం చెల్లదని జవాబిచ్చాను.

ఫోన్‌లో కాసేపు నిశ్శబ్దం. తరువాత ఆమె ఎన్నో ప్రశ్నలు అడిగారు. చివరకు "ప్రేమించుకున్నాం, దానికే జీవితాలు నాశనం అయిపోయాయి" అంటూ నిట్టూర్చారు.

ప్రియ, లత (పేరు మార్చాం) ప్రేమించుకుంటున్నారు. ప్రియ, బేల్దారి లేదా ఎంఎన్ఏఆర్‌జీఏ (గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా వచ్చిన పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. తన అన్నదమ్ములు, వదినలు, అక్కచెల్లెళ్లతో కలిసి ఉంటున్నారు.

"నేను మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఒకటో తరగతి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. బడిలో ఎవరైనా తనని ఏడిపిస్తే నేను ఊరుకునేదాన్ని కాదు. బాగా కొట్లాడేదాన్ని" అని ప్రియ చెప్పారు.

ప్రియ తనను తాను అబ్బాయిలాగ సంభోదించుకుంటారు. వాళ్లిద్దరిలో ప్రియ ఎంత దూకుడుగా ఉంటారో, లత అంత నెమ్మదిగా ఉంటారు.

లత ఫోన్‌లో చాలా మెల్లిగా, గుసగుసగా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారని, తాను గట్టిగా మాట్లాడలేనని చెప్పారు.

జూన్ మాసం ప్రైడ్ మాసం

ఫొటో సోర్స్, GETTY IMAGES

'చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం'

"ఒకటో తరగతి నుంచే మేం ప్రేమించుకుంటున్నాం. కానీ ఏడవ తరగతికి వచ్చాకే ఆ విషయం మాకు అర్థమైంది. అప్పటినుంచి మేమిద్దరం ఒక విభిన్నమైన ప్రేమను అనుభవిస్తున్నాం. బడిలో ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. బజారుకు సరుకులు తేవడానికి కలిసే వెళ్లేవాళ్లం.

ఎనిమిదో తరగతిలోనే ప్రియ బేల్దారీ పనులు చేయడం మొదలుపెట్టింది. అలా వచ్చిన డబ్బులతో నాకు బట్టలు, కాఫీ, మిఠాయిలు కొనిపెట్టేది. ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా ప్రియ నన్ను వెంట తీసుకునే వెళ్లేది. నన్ను విడిచి తను ఉండలేదు. మేమిద్దరం ఎంత దూరంగా వెళుతుంటే అంతకు అంత దగ్గరవ్వాలని అనిపించేది. మా ప్రేమ గురించి ఎవరికీ తెలీదు. స్కూలు తరువాత కూడా మేము రోజూ కలుసుకునేవాళ్లం" అని లత వివరించారు.

ఎనిమిదో తరగతి వరకూ అంతా సవ్యంగా జరిగింది గానీ తరువాత ఇద్దరం వేరే వేరే స్కూళ్లకు వెళ్లిపోయామని ప్రియ చెప్పారు.

తాను చేరిన స్కూల్లోనే చేర్పించమని లత తన తల్లిదండ్రులను అడగలేదని ప్రియకు కోపం వచ్చింది. అలిగి, లతతో మాట్లాడడం మానేశారు.

అప్పుడే, ఒక అబ్బాయి, లత వెంటపడడం మొదలుపెట్టాడు. ప్రియకు ఈ విషయం తెలిసి ఫిర్యాదు చేశారు. కానీ, అందరూ లతనే తప్పుబడుతూ, లత మంచిది కాదని నిందలు మోపారు.

దాంతో లత వివాహం గురించి వాళ్లింట్లో చర్చలు మొదలయ్యాయి.

ప్రియ, లత ఇద్దరూ వేరు వేరు స్కూళ్లల్లో తొమ్మిది, పదవ తరగతులు చదివారు. అయితే, లత పదిలో ఫెయిల్ అయిపోయారు.

"ఆ సమయంలో మేము మరింత పోరాడవలసి వచ్చింది. లత ఇంట్లో వాళ్లను బతిమాలి తన చదువు కొనసాగించమని ప్రాథేయపడ్డాం" అని ప్రియ చెప్పారు.

లతను పదవ తరగతిలో మళ్లీ చేర్పించి, అదే స్కూల్లో ప్రియ 12వ తరగతిలో చేరారు. అయితే, పదవ తరగతి తరువాత ప్రియ, లత చదువు మాన్పించేశారు.

"బయట పరిస్థితులు బాగోలేవు. తన కోసం నేను ఎవరెవరితో తగువులు ఆడను? అందుకే చదువు మాన్పించేశా" అని ప్రియ చెప్పారు.

"ఇంట్లో నా పెళ్లి మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయం వెంటనే ప్రియకు చెప్పాను. అప్పుడే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నాకెవరి గురించి ఏ భయం లేదు. ప్రియ ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని లత చెప్పారు.

ఎల్జీబీటీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, DEBAJYOTI CHAKRABORTY/NURPHOTO VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎల్జీబీటీ కార్యకర్తలు

విషయం ఇంట్లో తెలిసిపోయింది

"నేను సల్వార్ కమీజ్ వేసుకున్నాను. తను ప్యాంటు, చొక్కా వేసుకుంది. మేము గుడిలో పెళ్లి చేసేసుకున్నాం. తరువాత ఎవరిళ్లకి వాళ్లు వెళిపోయాం. మా పెళ్లి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు" అని లత చెప్పారు.

"ఏ వార్తాపత్రికలో వచ్చిందో ఏమో, ఊరంతా ఈ విషయం గుప్పుమంది" అని ప్రియ అన్నారు.

"ఇంట్లో వాళ్లకి తెలియగానే అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. మా అమ్మతో పెద్ద తగువైపోయింది. అమ్మాయిలను అమ్మాయిలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ ప్రియే ఏదో చేసింది. నీ బుర్ర పాడు చేసేసింది అంటూ మా అమ్మ శాపనార్థాలు పెట్టారు" అని లత చెప్పారు.

ప్రియ ఇంట్లో కూడా ఇదే గొడవ. మూడు రోజుల తరువాత ప్రియ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆమె అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియనట్లు నటించారు. వచ్చిన పోలీసులు కూడా ప్రియకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.

ఎల్జీబీటీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు మెట్లెక్కారు

ఈ మొత్తం వ్యవహారంలో లత బాగా భయపడిపోయారు. వారిని వీరిని అడిగి ప్రియ ఒక వకీలు సహాయం తీసుకున్నారు. ఈ విషయమై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఆ ఖర్చులన్నీ ప్రియే భరించారు.

ప్రియ, లత తమ లివ్-ఇన్ రిలేషన్ గురించి ఒక అఫిడవిట్ తయారు చేయించారని, 2018 డిసెంబర్ 20న గుడిలో వివాహం చేసుకున్నట్లు తెలుపుతూ జైపూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వారి తరపు న్యాయవాది భీమ్ సేన్ తెలిపారు.

తమ పెళ్లి గురించి తెలిసిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు తమను చంపేస్తామని బెదిరించారని వారిద్దరూ చెప్పారు.

పిటిషనర్లు ఇద్దరు ఒకే జెండర్‌కు చెందినవారు కానీ కలిసి జీవించాలనుకుంటున్నారని, ఆ జంటకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, వారి వివాహం గురించి కోర్టు వ్యాఖ్యానించలేదు.

కాగా స్వలింగసంపర్క సంబంధాలను చట్టవిరుద్ధంగా భావించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది.

ఎల్జీబీటీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

లత నేనేం చెప్తే అది చేస్తుంది

"నేను లతను బావిలో దూకమని చెప్తే దూకేస్తుంది. ఆమెకు గులాబ్ జామూన్, బర్ఫీ చాలా ఇష్టం. లత ఖర్చులకు నేను డబ్బులు ఇస్తాను. తన మీద చేయి పడిందంటే ఊరుకునేది లేదని లత తండ్రికి వార్నింగ్ ఇచ్చాను" అని ప్రియ చెప్పారు.

అయితే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని ప్రియను అడిగాను.

"నేనింక పూర్తిగా అలిసిపోయాను. లతకు పెళ్లి చేసేస్తాను. మంచి అబ్బాయిని వెతికి లతకిచ్చి పెళ్లి చేసేస్తాను" అని చెప్పి ప్రియ కొంతసేపు మౌనంగా ఉండిపోయారు.

"లతను ఇంటికి తీసుకొస్తే ఉరేసి చంపేస్తామని ఇంట్లోవాళ్లు బెదిరిస్తున్నారు. నేనేం చెయ్యగలను?" అంటూ ప్రియ నిట్టూర్చారు.

ఎల్జీబీటీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

నేను కట్నంగా వెళ్లిపోతాను

లతకు పెళ్లి చేసేస్తే మీరేమైపోతారు? మీ ప్రేమ సంగతేంటి? అని ప్రియను అడిగాను.

"నేను కట్నం కింద లత ఇంటికి వెళిపోతాను. డబ్బులు సంపాదిస్తున్నాను కదా. రెండు పూట్ల తిండి పెడితే చాలని చెప్తాను" అని ప్రియ అన్నారు.

మీ సంగతేంటని లతని అడిగాను.

ప్రియ ఏం చెప్తే అదే చేస్తానని ఆమె చెప్పారు.

జూన్ మాసం ప్రైడ్ మాసంగా సెలబ్రేట్ చేసుకుంటారు. స్వలింగ సంపర్కులను గుర్తించాలనే ఉద్దేశంతో జూన్ నెలను ప్రైడ్ నెలగా భావిస్తారు.

రాజస్థాన్‌లో నివసిస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలకు ప్రైడ్ మాసం గురించి ఏమీ తెలీదు. వారికి అక్కర్లేదు కూడా.

వాళ్లిద్దరిదీ ఒకటే కోరిక. కలిసి జీవించాలి. కానీ వారి కోరిక నెరవేరే మార్గమేది కనిపించడం లేదు.

ఎల్జీబీటీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

30 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నివసిస్తున్న దివ్యేందు గంగూలీ, సమీర్ సేథ్ గత మూడు దశాబ్దాలుగా తమ జీవితం అద్భుతంగా సాగుతోందని అంటున్నారు.

"ముప్పై ఏళ్లలో అనేక సంసారాల్లో ఉదాసీనత ఆవహిస్తుంది లేదా విడిపోతారు. కానీ మా జీవితం అలా సాగట్లేదు. మా ఇద్దరికి వయసు అంతరం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అదొక సమస్య కాలేదు" అని వారిద్దరూ చెబుతున్నారు.

కోల్‌కతాకు చెందిన దివ్యేందు ఉద్యోగ రిత్యా అహ్మదాబాద్ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే గుజరాత్‌కు చెందిన సమీర్‌ను కలుసుకున్నారు. తొలి చూపులోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు వారిద్దరి గొంతులో ఎంతో ఆనందం కనిపించింది.

తమ గుర్తింపు పట్ల వారికి ఎప్పుడూ ఏ రకమైన ఇబ్బంది కలగలేదా? అని అడిగితే..

"నేను 12వ తరగతి తరువాత పై చదువుల కోసం కోల్‌కతా విడిచిపెట్టాను. 14-15 ఏళ్లప్పుడు నా కోరికలు, నా ఇష్టాల గురించి నాకు అవగాహన రావడం మొదలైంది. అప్పుడు చాలా కంఫ్యూజింగ్‌గా ఉండేది. అప్పట్లో ఇంటర్నెట్ వాడకం విరివిగా లేదు. లైంగిక విద్య అసలే లేదు. ఇంక ఊరికే చీకట్లో బాణాలు వెయ్యడం మొదలుపెట్టాను" అని దివ్యేందు వివరించారు.

"నాకు ఒక ఫీమేల్ పార్ట్‌నర్‌తో సంబంధం ఉండేది. కానీ అప్పుడే నాకు అర్థమైంది మేల్ పార్టనర్‌తో సంబంధం ఏర్పరచుకోవడంలోనే నాకు ఆనందం ఉందని. అయితే, దీని గురించి నా తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయాను. అహ్మదాబాద్‌లో సమీర్ పరిచయం అయ్యారు. మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. మేమిద్దరం కలిసి జీవించడం మొదలుపెట్టాం. ఇంతలో మా నాన్న చనిపోయారు. అమ్మ నన్ను కలవడానికి అహ్మదాబాద్ వచ్చారు. ఆమెకు మా గురించి అర్థమైపోయింది. సమీర్ మంచివాడు. నిన్ను శ్రద్ధగా చూసుకుంటున్నాడు అని ఆమె అన్నారు. నన్ను ఎవరైనా గేలి చేస్తున్నారనో, అవమానిస్తున్నారనో నాకెప్పుడూ అనిపించలేదు" అని దివ్యేందు చెప్పారు.

సమీర్‌కు కూడా తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంత సమయం పట్టింది.

"మా నాన్న పెద్దగా ఏమీ అనలేదుగానీ మా అమ్మ మౌనంగా ఉండిపోయారు. ఆమె మౌనం నాకర్థమైంది. అమ్మా, నీకు ఓ కూతురు ఉండి, నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఆమె సంతోషంగా ఉంటుందా? ఆమె జీవితం అలా ఉంటే మీకు శాంతి లభిస్తుందా? అని అడిగాను.

నేను మరో అబ్బాయితోనే కలిసి సంతోషంగా ఉండగలను. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి జీవితాలు దుర్భరమైపోతాయని చెప్పాను. మా అమ్మకు మెల్లి మెల్లిగా అర్థం అయింది. మేము ఇన్నేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. మా అమ్మ, నాన్న అప్పుడప్పుడు వచ్చి మా దగ్గర ఉండి వెళుతుంటారు" అని సమీర్ వివరించారు.

సమాజాన్ని తాము పట్టించుకోబోమని దివ్యేందు, సమీర్ ముక్తకంఠంతో చెబుతున్నారు.

"మేము కలిసి జీవిస్తున్నాం. అది మాకు సంతోషం కలిగిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది" అని వారు అంటున్నారు.

ఓ పక్క దివ్యేందు, సమీర్ లాంటి జంటలు ఆనందంగా ముందుకు వెళుతుంటే, ప్రియ, లత లాంటి జంటలు సమాజ ఆధిపత్యానికి బలైపోతున్నాయి. ఇలాంటి కథలు ఎన్నో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)