పోర్న్ వీడియోలను పిల్లలు చూడకుండా 'ఏజ్ వెరిఫికేషన్' అడ్డుకోగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షియోనా మెక్‌కలమ్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ఆన్‌లైన్ సేఫ్టీ బిల్‌కు చేస్తున్న సవరణలతో ఇంటర్నెట్‌లో చిన్నారులు భద్రంగా ఉంటారని ప్రభుత్వం ఉద్ఘాటిస్తోంది.
చట్టబద్ధమే అయినా హానికరమైన కంటెంట్‌ను నిర్వచించే అధికారాలను పక్కకుపెట్టారు. వాక్‌స్వాతంత్ర్య ఉద్యమకారులకు ఇది సంతృప్తినిస్తోంది.
చిన్నారులు ఆన్‌లైన్‌లో పోర్నోగ్రఫీని యాక్సెస్ చేయటం చాలా సులభమని సేఫ్టీ బృందాలు అంటున్నాయి.
కానీ, ఈ చట్టాన్ని పలుచన చేశామన్న విమర్శలను మంత్రులు తిరస్కరిస్తున్నారు. చిన్నారుల వయసు తనిఖీని మెరుగుపరిచామని చెప్తున్నారు.
సోషల్ మీడియాలో వయోజనులకు ఉద్దేశించిన కంటెంట్‌ను.. ప్రస్తుతం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు చూడగలగుతున్నారని నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ నిర్వహించిన పరిశోధన సూచిస్తోంది. వెబ్‌సైట్లలో వయసు ఆంక్షలను తప్పించుకోవటానికి వారు తమ పుట్టిన తేదీని తప్పుగా పేర్కొంటున్నారు.
ఈ బిల్లులో భాగంగా.. పోర్నోగ్రఫీని పబ్లిష్ చేసే వెబ్‌సైట్లన్నీ తమ యూజర్లు నిజంగా 18 ఏళ్లు పైబడిన వారే అని ధృవీకరించటానికి మరిన్ని తనిఖీలను పెట్టాల్సి ఉంటుంది.
చర్యలు డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులు
ఈ తనిఖీల్లో వయోజనులు తమ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉందని, తమ వయసు 18 ఏళ్లకు పైనేనని నిరూపించటానికి సురక్షితమైన వయసు తనిఖీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. లేదంటే ప్రభుత్వ సమాచారాన్ని పోల్చుతూ మూడో పార్టీ వారి వయసును తనిఖీ చేసి నిర్ధారిస్తుంది.
ఈ చర్యలు చేపట్టని వెబ్‌సైట్ల మీద.. వాటి ప్రపంచ వ్యాపారంలో 10 శాతం వరకూ ఆఫ్‌కామ్ జరిమానా విధిస్తుంది. అలాగే ఆ వెబ్‌సైట్ల యజమానులు సహకరించటంలో విఫలమైతే వారిపై నేరాభియోగాలు కూడా నమోదు చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో బహిరంగంగా అందుబాటులో ఉన్న అశ్లీల కంటెంట్‌ను మైనర్లకు సులభంగా అందుబాటులో ఉంటోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పిల్లల భద్రత బృందాలు.. పోర్న్ సైట్లలో వయసు తనిఖీ ఉండాలని చాలా కాలంగా పిలుపునిస్తున్నాయి.
ఇంతకుముందు పోర్న్ బ్లాకర్స్ అనే ప్రతిపాదనలు ఉండేవి. వాటిద్వారా వాణిజ్య పోర్న్ వెబ్‌సైట్లు యూజర్ల వయసును తనిఖీ చేయటం తప్పనిసరి అయ్యేది. అలా చేయకపోతే బ్రిటన్‌లో నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ 2019లో ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టేశారు.
‘‘ఆఫ్‌లైన్ ప్రపంచంలో పిల్లలకు హాని చేయగల అంశాలు వారికి అందకుండా నిరోధించటానికి మనకు బలమైన వ్యవస్థలు ఉన్నాయి. పోర్నోగ్రఫీ కానీ, మద్యం కానీ, సిగరెట్లు కానీ కొనాలన్నా.. సినిమా హాలులో 18 ఏళ్లకు పైబడిన వారికి ఉద్దేశించిన మూవీని చూడాలన్నా జనం గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇవే రక్షణలను ఆన్‌లైన్ వాతావరణంలోకి కూడా తీసుకురావాలని మేం కోరుతున్నాం’’ అని చైల్డ్‌నెట్ ఇంటర్నేషనల్ సీఈఓ విల్ గార్డెనర్ బీబీసీకి చెప్పారు.
డాటా ప్రైవసీ ఆందోళనలు
పోర్న్ చూస్తుండటం వల్ల.. ఆరోగ్యకరమైన సంబంధాలు, సెక్స్, సమ్మతి వంటి అంశాలను చిన్నారులు, యువత అర్థం చేసుకునే తీరు మీద ప్రభావం చూపుతోందని సర్వత్రా ఆందోళనలు ఉన్నాయి.
చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారి నుంచి పిల్లలకు ప్రమాదం ఉంటుందని, తమపై జరిగిన లైంగిక వేధింపులను పిల్లలు ఫిర్యాదు చేయటం ఆగిపోవచ్చునని.. చిన్నారులతో పనిచేస్తున్న నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ మ్యాటర్స్ అనే ఆన్‌లైన్ సేఫ్టీ గ్రూప్ చెప్తున్న వివరాల ప్రకారం.. మహిళల గురించి తమ పిల్లల్లో చులకన భావం ఏర్పడుతుందని సగం మందికి పైగా తల్లులు భయపడుతున్నారు.
కొత్త నిబంధనలను ఎలా అమలు చేయటం అనేది నిర్ణయించుకోవాల్సింది కంపెనీలే. అయితే వయసు తనిఖీ కోసం కొన్ని నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆఫ్‌కామ్ సిఫారసు చేయవచ్చు.
బ్రిటన్‌లో అడల్ట్ కంటెంట్‌తో కూడిన అతిపెద్ద వెబ్‌సైట్ ఓన్లీఫ్యాన్స్.. యోటి, ఆన్‌డాటోలు అందించిన థర్డ్-పార్టీ టూల్స్‌ను ఉపయోగిస్తూ.. బ్రిటన్ సబ్‌స్క్రైబర్లు అందరికీ వయసు తనిఖీని అమలు చేస్తోంది.
ఆన్‌లైన్ జూదం వంటి రంగాల్లో వయసు తనిఖీ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ.. దానివల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉంటుందనే భయాలు ఇంకా ఉన్నాయి.
పోర్నోగ్రఫీ యూజర్ల డాటాబేస్ అనేది బ్లాక్‌మెయిల్ చేసే వారికి పెద్ద హ్యాకింగ్ టార్గెట్ కాగలదని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
ఈ బిల్లు చిన్నారుల కోసం కంటెంట్ విషయంలో ఒక గత్యంతరం లేని పరిస్థితిని సృష్టిస్తోందని.. డిజిటల్ హక్కులు, స్వాతంత్ర్యాలను పరిరక్షంచాలని ఉద్యమిస్తున్న ‘ఓపెన్ రైట్స్ గ్రూప్’ సంస్థకు చెందిన మోనికా హార్టన్ పేర్కొన్నారు.
‘‘వెబ్‌సైట్లు వారిని పూర్తిగా నిరోధించటమో లేదంటే, తమ సర్వీసును యాక్సెస్ చేయగల అత్యంత చిన్నవయసు పిల్లలకు కూడా అనుగుణంగా తమ వెబ్‌సైట్‌ను శుభ్రపరచటమో చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారామె.
దీనికి ఏకైక ప్రత్యామ్నాయం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి యూజర్ల వయసును ఊహించటమేనన్నారు. ఇది తీవ్రమైన గోప్యతా ఆందోళనలను రేకెత్తిస్తోందని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఒక వ్యక్తి వయసును ఆ వ్యక్తి గుర్తింపును వారు సందర్శిస్తున్న వెబ్‌సైట్లకు వెల్లడించకుండానే ఆన్‌లైన్‌లో ధృవీకరించటానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు అనేక రకాల పద్ధతులను అభివృద్ధి చేశాయని ఏజ్ వెరిఫికేషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇయాన్ కోర్బీ చెప్పారు.
‘‘ఒక నైట్‌క్లబ్ ప్రవేశద్వారాం దగ్గర ఉన్న వాళ్లు మిమ్మల్ని చూసి, మీరు చట్టబద్ధమైన వయసు దాటిన వారో కాదో అంచనా వేయగలిగినట్లుగానే.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ మీ సెల్ఫీ ద్వారా కానీ, వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ మీ వయసును అంచనా వేయగలదు. ఇది సగటు బౌన్సర్ కన్నా మరింత కచ్చితత్వంతో పనిచేస్తుందని పరీక్షల్లో నిర్ధారణ కూడా అయింది’’ అని ఆయన తెలిపారు.
‘‘వయో పరిమితి మరింత కఠినంగా ఉండే చోట.. వయసు తనిఖీ కోసం పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉపయోగించే సంప్రదాయ పద్ధతులు అవసరం కావచ్చు’’ కోర్బీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- సెక్స్ ఎడిక్షన్: ‘రోజుకి ఐదుసార్లు కూడా సరిపోయేది కాదు’
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి
- ఖతార్: అత్యంత సంపన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుందంటే...
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















