మహిళా లీడర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారిపై నమ్మకం తగ్గుతోంది... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోసీ కాక్స్
- హోదా, ...
ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలకు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మహిళలు సారథ్యం వహిస్తున్నారు. అయితే, కంపెనీల్లో మహిళా లీడర్ల సంఖ్య పెరుగుతుండటంతో పాటే.. వారిపై నమ్మకం తగ్గిపోతోందని ఒక పరిశోధన చెప్తోంది. కెరీర్‌లో ఆడవాళ్లకు అవరోధంగా ఉండే కనిపించని గోడలను బద్దలు కొట్టి ఎదుగుతున్న మహిళల పరిస్థితి ఏమంత బాగోలేదని ఆ పరిశోధన సూచిస్తోంది.
కాంటార్ పబ్లిక్ అనే సంస్థ అధికార పదవుల్లో పురుషులు, మహిళలు అర్హతల గురించిన భావనలను పోల్చుతూ నిర్వహించే వార్షిక సర్వే ‘రెక్యవిక్ ఇండెక్స్ ఫర్ లీడర్‌షిప్’. ఈ నవంబర్‌లో కొత్త సూచీ విడుదలైంది. గడచిన ఏడాది కాలంగా మహిళా నేతల మీద విశ్వాసం గణనీయంగా పడిపోయినట్లు ఆ సూచీ చెప్తోంది. 2018 నుంచి వెలువడుతున్న ఈ సూచీలో మహిళల పట్ల విశ్వాసం పడిపోవటం ఇదే మొదటిసారి.
కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలతో కూడిన జీ7 దేశాలన్నిటా.. తమ దేశంలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక మహిళ ఉండటం తమకు ‘చాలా సౌకర్యవంతం’ అని.. సర్వేలో పాల్గొన్న వారిలో సగం కన్నా తక్కువ మంది (47 శాతం) చెప్పారు. గత ఏడాది ఈ మాట చెప్పిన వాళ్లు 54 శాతం మంది కాగా అది ఇప్పుడు గణనీయంగా తగ్గింది.
అలాగే మహిళల పట్ల మహిళల కన్నా ఎక్కువగా పురుషులు విమర్శనాత్మకంగా స్పందించారు. మహిళా సీఈఓతో తమకు ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండదని ప్రతి 10 మంది రెస్పాండెంట్లలో ఒకరు స్పష్టంగా చెప్పారు.
మహిళా రాజకీయ నేతల విషయంలో కూడా ఇదే విధమైన ప్రతిస్పందనలు వచ్చాయి. జీ7 దేశాల్లో ఈ సర్వేలో ప్రశ్నించిన వారిలో కేవలం 45 శాతం మంది మాత్రమే.. ప్రభుత్వాధినేతగా ఒక మహిళ ఉండటం తమకు ‘చాలా సౌకర్యవంతం’గా ఉంటుందని చెప్పారు. ఈ సంఖ్య 2021లో 52 శాతంగా ఉండగా ఇప్పుడు పడిపోయింది.
ఈ సర్వే ఫలితాలు చాలా మందిని నిరుత్సాహపరిచాయి. అయితే నాయకత్వం, లింగవివక్ష అంశంపై నిపుణులు, విద్యావేత్తలు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. మహిళా నేతల మీద విశ్వాసం సన్నగిల్లటానికి వారు వేర్వేరు సూత్రీకరణలు చేశారు. అయితే.. కంపెనీలు, సంస్థల్లో ప్రతి స్థాయిలోనూ పాతుకుపోయి ఉన్న వివక్షను నిర్మూలించటానికి.. విశ్వాసంలో ఉన్న ఈ తేడాలను సరిచేయటం చాలా కీలకమని వారందరూ అంటున్నారు.
సంప్రదాయ యధాతథ స్థితి
మహిళా సీఈఓల మీద విశ్వాసం తగ్గటానికి వివిధ కారణాలను చెప్తున్నారు. అయితే.. చాలా కారణాల్లో కొన్ని అంశాలు ఉమ్మడిగా కనిపిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ఉన్న మహిళా వ్యతిరేకత, లింగ పక్షపాతం అనేవి ఇటీవలి రాజకీయ పరిణామాలు, కోవిడ్ మహమ్మారిల వల్ల తీవ్రమయ్యాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి కాలంలో మహిళలు వేతనాలు చెల్లించే కార్మిక మార్కెట్‌ను విడిచి, ఇంట్లో పిల్లల సంరక్షణ, ఇతర ఇంటి పనులు చేపట్టటం వల్ల.. పనిలోను, ఇంట్లోను మహిళల పాత్ర పట్ల ‘‘పాత సంప్రదాయ భావనలు బలపడ్డాయి’’ అని.. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో సంస్థాగత ప్రవర్తన అంశాన్ని బోధించే ప్రొఫెసర్ డానా గ్రీన్‌బర్గ్ పేర్కొన్నారు. దీని ఫలితంగా మహిళల పట్ల వివక్ష సామాజికంగా మరింత ఆమోదనీయంగా మారిందని ఆమె అంటారు.
అలాగే.. సంక్షోభం, అనిశ్చిత పరిస్థితుల్లో తెలిసినవారికి ప్రాధాన్యం ఇచ్చే మానవ సహజ వైఖరిని కూడా ఈ పరిణామం చాటుతోందని ఆమె పేర్కొన్నారు.
‘‘మనం ఒక ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోకి ప్రవేశిస్తుండవచ్చు. అంటే అది మనం భయపడే కాలం. భయం అనేది.. సంప్రదాయంగా సురక్షితం, భద్రం అని మనకు నేర్పిన అంశాలవైపు మళ్లేలా చేస్తుంది. నాయకత్వం విషయానికి వచ్చినపుడు.. పురుషులు నాయకత్వం వహించటమే సురక్షితమని మన సంప్రదాయపు ఆలోచనలు. కాబట్టి ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనుషుల ఆలోచనల్లో కీలక పాత్రల్లో మహిళల కన్నా పురుషులకు ప్రాధాన్యం ఇవ్వటం పెరుగుతుంది’’ అని ఆమె వివరించారు.
రెక్యావిక్ గ్లోబల్ ఫోరమ్ వార్షిక సదస్సు, ఉమెన్ పొలిటకల్ లీడర్స్ నెట్‌వర్క్‌ల భాగస్వామ్యంతో ప్రపంచ వ్యాప్తంగా 14,000 మందికి పైగా జనాన్ని సర్వే చేసి రూపొందించిన కాంటార్ పబ్లిక్ సర్వేలో.. గత కొన్నేళ్లుగా ప్రధాన ప్రపంచ స్టాక్ మెర్కెట్ సూచీలు, మహిళా నేతల పట్ల విశ్వాసం సూచీ ఒకే విధంగా సాగినట్లు వెల్లడైంది: ఎస్ అండ్ పి 500, ఎఫ్‌టీఎస్‌ఈ 100 షేర్లు గణనీయంగా అమ్ముడైనపుడు.. మహిళా నేతల మీద విశ్వాసం కూడా పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని దేశాల్లో మహిళా నేతల పట్ల వైఖరులు మారటానికి రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
‘‘మహిళలు అసలు వారి సొంత ఆరోగ్య సంరక్షణనే వారి చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించాలా వద్దా అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నపుడు.. ఏం ఆశిస్తారు?’’ అని కాంటార్ పబ్లిక్ గ్లోబల్ సీఈఓ మిషెల్ హారిసన్ వ్యాఖ్యానించారు. అమెరికాలో గర్భస్రావం విషయంలో మహిళల హక్కులకు సంబంధించిన గత తీర్పును సుప్రీంకోర్టు 2022లో రద్దు చేసిన విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. అంటే.. ఒక మహిళకు గల పునరుత్పత్తి హక్కులను బాహాటంగా ప్రశ్నిస్తున్నపుడు ఆ మహిళ తన జీవితంలో ఏం చేయాలన్నా ఆమెకు గల స్వయం ప్రతిపత్తి అనేది సాధారణ చర్చనీయాంశమే అవుతుంది.
ఒక శక్తిమంతమైన నేత ఓ నిర్దిష్ట రీతిలో ప్రవర్తించడం కూడా.. నిర్దిష్ట ప్రవర్తనకు సమర్థనగా దానిని ప్రజలు భావించవచ్చునని గ్రీన్‌బర్గ్ అంటారు. ఉదాహరణకు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న కాలంలో మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తనను.. లింగ వివక్ష సాధారణంగా మారటానికి దోహదపడి ఉండవచ్చు.
ఈ పరిణామం సోషల్ మీడియా ట్రెండ్స్‌కు కూడా విస్తరించింది. ఆన్‌లైన్‌లో హింసాత్మక మహిళా ద్వేషం కనిపించటం గత ఐదేల్లలో విపరీతంగా పెరిగినట్లు ఒక పరిశోధన చూపుతోంది.
ఆన్‌లైన్‌లో స్త్రీద్వేషంతో కూడిన లేదా మహిళల మీద హింసను ప్రోత్సహించేలా ఉన్న సమాచారం ప్రబలంగా ఉండటంవల్ల.. రోజువారీ జీవితంలోనూ లింగవివక్షా సంస్కృతికి ప్రత్యక్షంగా దారితీసిందని బ్రిటిష్ రచయిత, పరిశోధకురాలు లారా బేట్స్.. 2020లో రాసిన ‘మెన్ హు హేట్ ఉమన్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
బ్రిటన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘హోప్ నాట్ హేట్’ 2020లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కూడా.. ఇంటర్నెట్‌లో జరుగుతున్న దానికి, వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న దానికి సంబంధం ఉందని నిర్ధారించింది. పాత తరం కన్నా కొత్త తరంలో మరింత పురోగామి అభిప్రాయాలు ఉండటం సహజమైనప్పటికీ.. స్త్రీవాదం ‘బాగా మితిమీరిపోయింది’ అని ఆ సర్వేలో పాల్గొన్న సగం మందికి పైగా యువకులు చెప్పారు.
జపాన్, జర్మనీ సహా కొన్ని దేశాల్లో.. పాత తరం కన్నా యువ తరంలో తక్కువ ప్రగతిశీల అభిప్రాయాలు ఉన్నాయని ఈ ఏడాది రేక్యావివక్ ఇండెక్స్ ఆఫ్ లీడర్‌షిప్ చెప్తోంది. అంటే వారు మహిళా నేతలను విశ్వసించటం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సంస్కృతిలో భాగం
మరింత మంది మహిళలు శక్తిమంతమైన పదవుల్లోకి వెళ్లటం వల్ల సంప్రదాయం యధాతథ స్థితిని మార్చివేయటం కూడా.. మహిళా నేతల పట్ల విశ్వాసం పడిపోవటానికి కారణమని మరొక సూత్రీకరణ చెప్తోంది.
‘‘చారిత్రకంగా పని ప్రదేశంలో, ప్రభుత్వాల్లో పురుషులదే ఆధిపత్యం ఉండేది. ఆ సంస్కృతులు కూడా మగవాళ్ల కోసమే తయారయ్యాయి. దీని అర్థం.. ఈ పరిస్థితులకు ఏదైనా భిన్నంగా ఉంటే దానిని అపనమ్మకంతో చూస్తారు’’ అని కాటలిస్ట్ స్వచ్ఛంద సంస్థ యూరప్ డైరెక్టర్ అలిసన్ జిమ్మర్‌మన్ పేర్కొన్నారు.
ఉదాహరణకు.. సమాజం మరింత లింగ సమానత్వం దిశగా పయనించటంలో మహిళలు పొందిన లబ్ధి.. పురుషులు నష్టపోవటం వల్ల పొందినదేనని అమెరికా పురుషుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ 2020 అధ్యయనం చెప్తోంది.
అలాగే మహిళలను క్రూరులుగా చిత్రీకరించటం మన సంస్కృతిలో భాగమని, నాయకత్వ స్థానాల్లో మహిళలు పెరిగే కొద్దీ ఈ స్వభావం బయటపడుతుంటుందని ‘హౌ ఉమన్ లీడ్’ అనే సంస్థ సీఈఓ జూలీ కాస్ట్రో అబ్రామ్స్ అంటున్నారు. ‘‘ఎందుకంటే మహిళల నాయకత్వంలో ఉండటం మనం నేర్చుకున్న సంస్కృతికి విరుద్ధంగా ఉంటుంది. ఆ నాయకత్వంలో ఉన్న మహిళలు విఫలమవటాన్ని మనం ఇష్టపడతాం. ఎందుకంటే మహిళలు సఫలం కావటం మనం నేర్చుకున్న సంస్కృతికి సరిపడదు’’ అని ఆమె పేర్కొన్నారు.
అలాగే.. ఉన్నత స్థాయిలో ఒక మహిళ విఫలమయ్యారని భావించినపుడు, మహిళలు నాయకత్వ స్థానాల్లో ఎందుకు ఉండకూడదో అని చెప్పటానికి ఆ మహిళను కారణంగా చూపుతుంటారని కాస్ట్రో వివరించారు. ఉదాహరణకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌తో పోటీ పడి హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పుడు.. అమెరికా ఒక మహిళా ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉందా అని చాలా మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రశ్నించాయి.
థెరానోస్ వ్యవస్థాపకురాలు ఎలిజబెత్ హోమ్స్.. తమ సంస్థకు చెందిన రక్త పరీక్షల సాంకేతికత గురించి ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ ఇటీవల జైలుశిక్షకు గురైనపుడు ఆమెను విమర్శిస్తూ విపరీతమైన ప్రచారం జరగటాన్ని కూడా కొందరు నిపుణులు ఉటంకిస్తున్నారు.
ఒక మహిళ సీఈఓగా ఉన్న కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నపుడు దానికి కారణం ఆ మహిళనే అంటూ వార్తా కథనాలు నిందించే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. అదే పురుషుడు సీఈఓగా ఉన్న కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నపుడు అలా జరగటం తక్కువని యూఎస్ రాక్‌ఫెలర్ ఫౌండేషన్ 2016లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
అలాగే.. ఒక కంపెనీ తీవ్ర కష్టాల్లో కూరుకుపోయినపుడు కానీ, విఫలమయ్యే ముప్పు అధికంగా ఉన్నపుడు కానీ మహిళలను కీలక పదవుల్లోకి ఎంపిక చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని ఒక పరిశోధన చెప్తోంది.
అక్టోబర్‌లో బెడ్ బాత్ అండ్ బియాండ్ సంస్థ షేర్ల ధరలు కుప్పకూలినపుడు.. ఆ సంస్థకు ఒక మహిళా సీఈఓను నియమించారు. ఇటీవల లాస్ ఏంజెలెస్ నగరం తీవ్ర అవినీతిని, ఇల్లులేని సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో కారెన్ బ్రాస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇంకా ప్రముఖమైన పరిణామం.. బ్రిటన్ తీవ్ర ఆర్థిక సమస్యలను, రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కొంటున్న సమయంలో దేశ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకున్నారు. ఇలాంటి వైఫల్యాల ఉదంతం ప్రతీదీ.. నాయకత్వ స్థానాల్లో మహిళల మీద విశ్వాసాన్ని మరింతగా దెబ్బతీసేవే.
మున్ముందు ఎలా మారుతుంది?
నాయకత్వ స్థానాల్లో స్థిరంగా పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యంతో పాటే.. వారి మీద విశ్వాసం సన్నగిల్లుతుండటం నిరాశను కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు.
అయితే.. ఇది పురోగమనానికి తాత్కాలికంగా ఎదురయ్యే ప్రతిఘటనేనా లేక లింగ సమానత్వం దిశగా సాధించిన పురోగతిని తిరోగమించేలా చేసే పరిణామమా అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.
రాజకీయ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక అంశాలు ఎలా మారుతూ వస్తాయనేది.. రాబోయే కాలంలో మహిళా నేతల పట్ల విశ్వాసం ఎలా మారుతుందనే దానిని నిర్ణయిస్తాయని చెప్తున్నారు.
అయితే.. ఇది మహిళలనో, మగాళ్లనో సరిచేయటానికి సంబంధించిన విషయం కాదని.. మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన నియమాలను మార్చటానికి సంబంధించిన అంశమని హారిసన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి
- హిట్-2 మూవీ రివ్యూ: థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అడివి శేష్ హిట్ కొట్టాడా?
- సుఖవ్యాధులు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు, లక్షణాలేంటి, అవి ఎంత ప్రమాదం?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎందుకొస్తాయి? అత్తింటివారితో ఘర్షణలకు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















