ఇండోనేసియాలో పిల్లల మరణాలకు కారణమవుతున్న సిరప్

కూతరు నదీరాతో అగస్టీనా

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, 15 నెలల నదీరా కిడ్నీ సమస్యతో చనిపోయింది

ఇండోనేసియాకు చెదిన 17 నెలల నదీరాకు జ్వరంతోపాటు దగ్గు వచ్చింది.

జకార్తాలోన ఒక హెల్త్ సెంటర్ నుంచి పారాసిటమల్ సిరప్‌ను తీసుకొచ్చింది పాప తల్లి అగస్టీనా మౌలానీ.

'జ్వరం ఎంతకూ తగ్గక పోవడంతో ప్రతి నాలుగు గంటలకు పాపకు మందు ఇచ్చాను. కానీ జ్వరం తగ్గలేదు. చివరకు పాస్ పోయడం మానేసింది' అని అగస్టీనా బీబీసీకి తెలిపారు.

నదీరాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్పు కనపడలేదు.

కొన్ని టెస్టులు చేయగా పాపలో పరిమితికి మించిన యూరియా ఉన్నట్లు తేలింది. కిడ్నీలు పాడైపోవడం వల్ల ఇలా జరిగింది. కోమాలోకి వెళ్లిన నదీరా చివరకు చనిపోయింది.

మెడికల్ షాపులో ర్యాక్ నుంచి మందులు తీస్తున్న ఉద్యోగి

ఫొటో సోర్స్, EPA

ఈ ఏడాది 157 మంది

ఇండోనేసియాలో నదీరా మాదిరిగా ఎందరో చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

కిడ్నీ సమస్యలతో పాటు ఇతర రుగ్మతల వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం 157 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 5 ఏళ్ల లోపు వారే.

పిల్లలకు ఇచ్చిన మందులు కలుషితం కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుమారు 100 రకాల సిరప్స్‌ను ప్రభుత్వం నిషేధించింది.

పిల్లలకు సిరప్ బదులు ట్యాబ్లెట్స్‌ను పొడి చేసి నీళ్లలో కలిపి ఇవ్వాల్సిందిగా ఫార్మసీలు సూచిస్తున్నాయి.

ఇథైలీన్ గ్లోకోల్, డైయిథైలీన్ గ్లోకోల్ వంటి హానికర పదార్థాలు ఆ సిరప్స్‌లో ఉన్నాయని ఇండోనేసియా ఆరోగ్యశాఖ మంత్రి బుడీ సాదికిన్ చెబుతున్నారు.

ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి వాటిలో ఆ పదార్థాలను యాంటీ ఫ్రీజ్ సొల్యూషన్స్‌గా వాడతారు. కాస్మెటిక్స్‌లోనూ కొద్ది మోతాదులో ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఔషధాల్లో ఉపయోగించకూడదని ప్రపంచఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది.

'ఇథైలీన్ గ్లోకోల్, డైయిథైలీన్ గ్లోకోల్ వంటి వాటివల్లే పిల్లల్లో కిడ్నీలు పాడైపోయాయని తేలింది' అని సాదికిన్ తెలిపారు.

మైడిన్ ఫార్మా ఉత్పత్తులు

ఫొటో సోర్స్, WHO

గాంబియాలో కూడా

గాంబియాలో 70 మంది పిల్లలు ఇలాగే చనిపోయిన కొన్ని వారాల తరువాత ఇండోనేసియాలో కేసులు నమోదు కావడం మొదలైంది.

గాంబియాలో విక్రయించిన దగ్గు సిరప్స్‌లో 'మోతాదుకు మించి' ఇథైలీన్ గ్లోకోల్, డైఇథైలీన్ గ్లోకోల్ ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వీటిని భారత్‌కు చెందిన సంస్థ తయారు చేసింది.

అయితే గాంబియా, ఇండోనేసియా కేసుల మధ్య సంబంధం ఉందో లేదో ఇంకా తెలియలేదు.

పిల్లలకు హాని కలిగించిన నాలుగు రకాల సిరప్స్‌ను గాంబియాకు మాత్రమే ఎగుమతి చేశామని వాటిని తయారు చేసిన మైడెన్ ఫార్మా తెలిపింది. తమ దేశంలో ఆ మందులు లేవని ఇండోనేసియా చెబుతోంది.

ఇటీవల రెండు ఫార్మా కంపెనీలు తమకు ముడిసరుకు సరఫరా చేసే సంస్థలను మార్చింది. దాని మీద విచారణ చేపడతామని ఇండోనేసియా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

'ఆ ఫార్మా కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తుల్లో ఎక్కువ విషపూరితంగా ఉండి కిడ్నీలను పాడు చేస్తున్నట్లుగా సంకేతాలున్నాయి' అని ఇండోనేసియా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ చీఫ్ పెన్నీ లుకిటో అన్నారు.

కిడ్నీ సమస్యలు తలెత్తుతున్న పిల్లలకు చికిత్స అందించడంలో భాగంగా సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల సాయాన్ని ఇండోనేసియా అడిగింది. అరుదుగా లభించే విరుగుడు మందు ఫామీపిజోల్‌ను సరఫరా చేయాలని కోరింది.

ఇలా సిరప్స్ తీసుకోవడం వల్ల పిల్లలు చనిపోవడం ఇండోనేసియాలో సంచలనం కలిగించింది. ఔషధాల నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి.

ఔషధాల నాణ్యతను ధ్రువీకరించే బాధ్యత ఫార్మా కంపెనీలకే ప్రభుత్వం వదిలేసినట్లుగా జకార్తా పోస్ట్ తన సంపాదకీయంలో రాసింది.

'తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకుంటూ ఉంటే మా హృదయం ద్రవించి పోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని మాకు ఇప్పుడు తెలిసింది' అని ఆ పత్రిక రాసింది.

గతంలో టానిక్ రుచి కాస్త తీయ్యగా ఉండేందుకు డైయిథైలీన్ గ్లోకోల్ వాడేవారు అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో పని చేసే ప్రొఫెసర్ ఎరిక్ చాన్ తెలిపారు. కానీ అది ప్రమాదకరమని తెలిసి ఇప్పుడు వాడటం లేదు అన్నారు.

'డైయిథైలీన్ గ్లోకోల్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అది డిగ్లైకోలిక్ యాసిడ్‌గా మారుతుంది. ఇది కిడ్నీ కణాలను నాశనం చేస్తుంది. సరైన సమయంలో చికిత్స అందించక పోతే ప్రాణాలు కూడా పోతాయి.

మూత్రం రావడం తగ్గిపోతూ ఉందంటే కిడ్నీలు పాడైపోతున్నాయనేందుకు సంకేతంగా భావించాలి' అని ఎరిక్ వివరించారు.

పిల్లలను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తిప్పుతారు కాబట్టి 'మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది' అని ఆయన అన్నారు.

ఉమర్ అబు బకర్

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, ఉమర్ అబు బకర్

‘బాధ్యత వహించాలి’

తూర్పు జకార్తాలోని రెండేళ్ల ఉమర్ అబు బకర్ సెప్టెంబరు 24న చనిపోయాడు. కిడ్నీలు పాడై చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అంతకు రెండు వారాల కింద ఉమర్‌కు జ్వరంతోపాటు జలుబు చేసింది. విరేచనాలు కూడా మొదలయ్యాయి. దాంతో ఉమర్ తల్లి సిటీ సుహర్దియాతీ దగ్గర్లోని క్లినిక్‌కు తీసుకెళ్లింది.

పారాసిటమల్ సిరప్‌తోపాటు మూడు రకాల మందులను వారికి ఇచ్చారు. వాటిని వాడటం మొదలు పెట్టిన మూడు రోజుల తరువాత ఉమర్ మూత్రం పోయడం ఆపేశాడు.

దాంతో మళ్లీ ఉమర్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి మరొక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

'అంత ప్రమాదకరమైనవి దగ్గు టానిక్‌లో ఎందుకు ఉన్నాయి? వాటిని ప్రభుత్వం నిజంగానే చూసి ఆమోదించిందా? వాటిని పరీక్షించి ఉండాల్సింది' అని సిటీ సుహర్దియాతీ అన్నారు.

'ఇది నిర్లక్ష్యం వల్లే జరిగితే అందుకు కారణమైన వారు బాధ్యత వహించాలి' అని నదీరా తల్లి అగస్టీనా కూడా డిమాండ్ చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)