గర్భం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు

- రచయిత, అనాబెల్ లియాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
"ఫ్లయింగ్ నా మొదటి కెరీర్, కాబట్టి ఇతర ఇండస్ట్రీలతో పోల్చడానికి వీల్లేదు. నన్ను మోసం చేస్తున్నారా? అని నేను పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నాకే కాదు అందరికీ వర్తిస్తుంది.’’
‘క్లారా ఫూ’ అనే మహిళ తాను గర్భం దాల్చినట్లు తెలుసుకొని ఆనందపడింది. కానీ, అంతలోనే ఆ ఆనందం మరో ఆందోళనకు దారి తీసింది.
ఆమె గతంలో సింగపూర్ విమానయాన సంస్థలో క్యాబిన్ ఉద్యోగిగా పనిచేశారు.
సింగపూర్ విమాన సంస్థ నిబంధనల ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత మూడో నెల చివరలో క్యాబిన్ సిబ్బంది ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు.
త్వరలోనే బిడ్డను కనబోతున్నట్లు తెలిసిన తర్వాత కూడా ఆమె తన ఉద్యోగంలోనే కొనసాగారు.
ఎందుకంటే కుటుంబం మొత్తమ్మీద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆమె ఒక్కరే. తనకు ఉద్యోగాన్ని వదిలే పరిస్థితి కూడా లేదని బీబీసీకి ఆమె తెలిపారు.
ఇదే కారణంతో తాను గర్భవతి అనే విషయాన్ని దాచిపెట్టి అయిదు నెలల పాటు ఆమె ఉద్యోగంలో కొనసాగారు. ఒక ప్రయాణికుడు ఆమె పొట్టను చూసి గర్భవతి అని గుర్తించడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
"అది చాలా కష్టం. చేయగలిగినంత కాలం నేను బాగానే చేశాను" అని ఫూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
సిమన్స్ & సిమన్స్ న్యాయ సంస్థకు చెందిన క్లారెన్స్ డింగ్ బీబీసీతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం నాటి ఈ పాత పాలసీని సింగపూర్ ఎయిర్ లైన్స్ జూలైలో తొలగించింది. సింగపూర్‌లో వివక్షను వ్యతిరేకించే చట్టాలు లేవు.
సింగపూర్ ఎయిర్ లైన్స్ విధానం సమస్యాత్మకం కాదని చెప్పడం లేదు. యజమానులు న్యాయమైన ఉద్యోగ పద్ధతులను అమలు చేయాలని సింగపూర్ ఉపాధి మార్గదర్శకాలు చెబుతున్నాయి" అని డింగ్ చెప్పారు.
‘‘ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించేలా చట్టమేమీ లేదు. ఒకవేళ ఇవి పాటించకపోయినా ఎటువంటి జరిమానాలు విధించరు. కానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఓఎం) పదే పదే ఈ నిబంధనలు పాటించాలని చెప్పడంతో కంపెనీలు అన్నీ వీటిని పరిగణనలోకి తీసుకుంటున్నాయి” అని డింగ్ అన్నారు.
కంపెనీలు పాటించే ఉద్యోగ నిబంధనలను నిశితంగా పరిశీలించి, వారి వర్క్ పాస్ అధికారాలను తగ్గించే శక్తి ఈ మంత్రిత్వ శాఖకు ఉంది. అందుకే దాని ఆదేశానుసారం కంపెనీలన్నీ ప్రవర్తిస్తున్నాయి.
కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాయాన సంస్థలు సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. గర్భిణులైన విమాన సిబ్బంది తొమ్మిది నెలల వరకు మరో ఉద్యోగంలో పనిచేయడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డెలివరీ అనంతరం తిరిగి ఫ్లయింగ్ విధులకు వెళ్లవచ్చు.
"ఇప్పటి వరకు గ్రౌండ్ పొజిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన క్యాబిన్ సిబ్బందికి వారి నైపుణ్యానికి తగిన స్థానాలు కేటాయించారు. క్యాబిన్ క్రూ విభాగంలోని అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి’’ అని సింగపూర్ ఎయిర్ లైన్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, ASHLEY HONG
ఎయిర్‌లైన్స్‌లో పని చేసిన వాళ్లు ఏమంటున్నారు?
సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించి 50 ఏళ్లు గడిచాయి. అప్పటినుంచి క్యాబిన్ సిబ్బందిలో మహిళలు కీలక పాత్ర పోషించారు.
స్నేహపూర్వక సేవకు ప్రతిరూపంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ‘‘సింగపూర్ గర్ల్’’ అని పిలుస్తారు.
ఆగ్నేయాసియా కొన్ని ప్రాంతాల్లోని పెరనాకన్ మహిళలు ధరించే ‘సరోంగ్ కెబాయా’ అని పిలిచే నీలి రంగులో ఉండే సంప్రదాయ దుస్తులను విమాన సిబ్బంది ధరిస్తారు.
ఈ యూనిఫాంను ఫ్రాన్స్ ఫ్యాషన్ డిజైనర్ పియర్ బాల్మెయిన్ రూపొందించారు.
కొత్తగా చేరిన ఉద్యోగులకు 14 వారాల శిక్షణ ఉంటుంది. భోజనం సిద్ధం చేయడం, తమను పరిచయం చేసుకోవడం, అత్యవసర సమయంలో ఎలా ప్రతిస్పందించాలో అనే అంశాలపై వారికి శిక్షణ ఇస్తారు.
ఈ ఉద్యోగం చేయడాన్ని చాలామంది మహిళలు గర్వంగా భావిస్తారని 1980లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన ఎలిజబెత్ లో వ్యాఖ్యానించారు.
‘‘గర్భవతులకు అక్కడ చోటు ఉండదని అందరికీ తెలుసు. కాబట్టే ఎలాంటి గొడవ జరగలేదు. మీరు వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఏదో ఒక దాన్ని త్యాగం చేయాల్సిందే’’ అని అని ఆమె చెప్పారు.
విమానయాన సంస్థ ఖ్యాతి, ఆ ఉద్యోగానికి ఉండే ప్రతిష్ట కారణంగా నియామక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది’’ అని సింగపూర్ అకాడమీ ఆఫ్ కార్పొరేట్ మేనేజ్‌మెంట్ ఒక నివేదికలో పేర్కొంది.
"ప్రతీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో దరఖాస్తు చేసిన వారిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు పొందుతారు. వారిని ‘సింగపూర్ గర్ల్’గా తయారు చేయడం కోసం మొదటి దశ శిక్షణ కోసం పంపిస్తారు" అని నివేదిక తెలిపింది.
ఆష్లే హాంగ్ అనే మహిళ 2011లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. గర్భం కారణంగా రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే ఆమె ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది.
ఫ్లయింగ్ డ్యూటీల నుంచి గర్భిణీలను తప్పించడం క్షేమకరమే. కానీ, వారు కంపెనీలోనే ఉండేలా ఏదైనా అవకాశం ఉంటే బాగుండేది అని ఆమె చెప్పారు.
‘‘ ఈ ఉద్యోగానికి సంతకం చేస్తున్నప్పుడే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని, ఈ ఉద్యోగానికి తుది గడువు తేదీ గర్భం దాల్చిన రోజే తెలిసిపోతుంది అనే అంశంపై మా అందరికీ అవగాహన ఉంది. అదే అంతిమ నిర్ణయం కాబట్టి ఉద్యోగం పోయిన మాకు పెద్దగా బాధపడటానికి కారణం దొరకలేదు’’ అని ఆమె వివరించారు.
గర్భిణులకు మద్దతుగా పోరాడుతోందెవరు?
సింగపూర్‌కు చెందిన అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ (అవేర్) అనే సంస్థ దశాబ్ద కాలానికి పైగా ఈ విధానానికి వ్యతిరేకంగా గొంతెత్తింది.
బలవంతంగా ఉద్యోగాలు వదులుకోవాల్సి వచ్చిన విమాన సిబ్బంది నుంచి తమకు ఫిర్యాదులు అందాయని ఆ బృందం తెలిపింది.
"సింగపూర్ ఎయిర్ లైన్స్ గర్భవతులను రాజీనామా చేయాలని కోరడం ఆమోదయోగ్యం కాదు. ఇది వివక్షపూరిత, పక్షపాత వైఖరికి చిహ్నం’’ అని అవేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ బీబీసీతో చెప్పారు.
"ఇది ఏదో ఒక విధంగా చట్టబద్ధమైనప్పటికీ, తల్లులు వృత్తిని కొనసాగించడానికి, జీవనోపాధిని సంపాదించడానికి సింగపూర్‌లో ఉన్న ప్రసూతి రక్షణ చట్టాల స్ఫూర్తికి ఈ విధానం విరుద్ధంగా ఉంది" అని లిమ్ వాదిస్తున్నారు.
2010లో గర్భవతులైన క్యాబిన్ సిబ్బంది రాజీనామా చేయాల్సిందిగా సింగపూర్ ఎయిర్ లైన్స్ కోరింది.
''విమానంలో విధులను నిర్వర్తించడానికి అనువుగా క్యాబిన్ సిబ్బంది శరీరం ఫిట్‌గా ఉండాలి’’ అని అప్పట్లో ఓ ప్రకటనలో తెలిపింది.
"బాధ్యతగల యజమానిగా మేం గర్భంతో ఉన్న సిబ్బంది, వారికి పుట్టబోయే పిల్లల శ్రేయస్సు విషయంలో రాజీపడలేం. మా క్యాబిన్ సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఐదేళ్ల కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉంటుందనే కారణంతోనే ఈ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి’’ అని సింగపూర్‌లోని స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రికలో ప్రచురితమైన ఓ కథనంలో ఆ విమానయాన సంస్థ తెలిపింది.
మిగతా విమానయాన సంస్థల్లో పరిస్థితేంటి?
పరిశ్రమల వాణిజ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ)ని దీనిపై మాట్లాడేందుకు బీబీసీ సంప్రదించింది.
‘‘ఈ విధానంపై మాకు ఎలాంటి సిఫారసులు లేవు. ఎందుకంటే ఇవి వ్యక్తిగత కంపెనీల మానవ వనరుల విభాగాలకు చెందిన పాలసీలు’’ అని చెప్పింది.
ఇతర ప్రధాన విమానయాన సంస్థలు వారి క్యాబిన్ సిబ్బందిలోని గర్భిణీలను రాజీనామా చేయమని కోరడం లేదు.
బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఖతార్ ఎయిర్‌వేస్, క్వాంటాస్‌లో పనిచేస్తున్న గర్భిణీ సిబ్బందికి గ్రౌండ్‌లో ఉద్యోగాలు ఇస్తున్నారు.
‘‘గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు ఇవ్వడం లేదా మెటర్నిటీ సెలవులు పూర్తయ్యేవరకు జీతం చెల్లించకుండా ఉద్యోగంలో కొనసాగించడం వంటి పద్ధతులను అనుసరించవచ్చు’’ అని హాంకాంగ్ జాతీయ విమానయాన సంస్థ క్యాథీ పసిఫిక్ వ్యాఖ్యానించింది.
‘‘సెలవులు పూర్తయిన తర్వాత క్యాబిన్ సిబ్బంది సంబంధిత భద్రతా శిక్షణా కోర్సులలో ఉత్తీర్ణత సాధించి తిరిగి ఫ్లయింగ్ విధుల్లో చేరవచ్చు. దశాబ్ద కాలానికిపైగా ఇలాంటి పాలసీలు అమల్లో ఉన్నాయి’’ అని ఆ సంస్థ పేర్కొంది.
ఎయిర్‌లైన్స్ నిబంధనలే పెద్ద అడ్డంకి..
విమాన సిబ్బంది వేషధారణ, వస్త్రధారణ విషయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిబంధనల పట్ల లిమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం విమానంలో పనిచేసే అమ్మాయిల శరీరాకృతి, బీఎంఐ ప్రకారం ఉండాలి. తల్లి అయ్యాక శరీరంలో మార్పులు వస్తాయి. అప్పుడు తిరిగి ఉద్యోగానికి రావాలనుకునే వారికి, బీఎంఐ ప్రకారం శరీరాకృతి లేని వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పరిమితం కావొచ్చు’’ అని లిమ్ అన్నారు.
క్యాబిన్ సిబ్బంది మొత్తానికి ఒకే రకమైన వస్త్రధారణ ప్రమాణాలు పాటిస్తామని ఎయిర్‌లైన్స్ అంటోంది.
ఈ విధానాలపై ప్రభుత్వం ఏం చెబుతోంది?
2021లో సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లోంగ్ మాట్లాడుతూ.. కార్యాలయాల్లోని వివక్షకు సంబంధించిన మార్గదర్శకాలను చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు.
"చట్టంలో మార్గదర్శకాలను పొందుపరచడం ఒక ముఖ్యమైన నిర్ణయం. పని ప్రదేశాల్లో వివక్షను సహించబోమని ఇది సూచిస్తుంది" అని లీ చెప్పారు.
లింగం, జాతీయత, వయస్సు, జాతి, మతం, వైకల్యంపై వివక్షను పరిష్కరించడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
‘‘ప్రతిభ కోసం చేసే యుద్ధంలో ఇది ఒక భాగం. దీని ద్వారా కంపెనీలు పని చేయడానికి తెలివైన ఉద్యోగులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి" అని డింగ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఫూ ఈ మార్పును స్వాగతించారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రతీ ఐదేళ్లకు 10,964 డాలర్లు (రూ.9,03,684) బోనస్ ప్రకటిస్తుంది. గర్భం కారణంగా ఈ బోనస్‌ను కోల్పోయినట్లు ఆమె చెప్పారు.
"నేను అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా తల్లిదండ్రులు, అత్తమామలు నాకు మద్దతుగా నిలిచారు. అలా లేకుంటే మరింత దారుణంగా ఉండేది" అని ఫూ అంటున్నారు.
"జాతీయ సంస్థ అయిన సింగపూర్ ఎయిర్ లైన్స్, మహిళలకు మద్దతుగా ఉండాలి. అక్కడ నా పక్షాన సంస్థ నిలిచి ఉండే నేను అక్కడే కొనసాగి ఉండేదాన్ని’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహిస్తోంది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాలేదు, అసలేం జరిగింది?
- వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా
- నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?
- బీబీసీ 100 మంది మహిళలు 2022: ఈ ఏడాది జాబితాలో తెలుగు యువతి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















