టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత: మెటాలో ఉద్యోగం కోల్పోయిన భారత యువతి కథ, ఆమె అమెరికా కల ఎలా చెదిరిపోయింది?

ఫొటో సోర్స్, COURTESY SURBHI GUPTA
అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఇటీవల చేపడుతున్న భారీ ఉద్యోగాల కోతలు హెచ్1-బీ లాంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న ఎంతో మంది భారతీయుల పరిస్థితిని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా చేపట్టిన లేఆఫ్‌లలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో సురభి గుప్తా కూడా ఒకరు. ఈమె మెటా కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్. దీన్ని అంగీకరించేందుకు తనకెంత సమయం పట్టింది?
హెచ్1-బీ వీసాదారులు ఈ అనిశ్చితిని ఎలా ఎదుర్కొంటున్నారు? తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? వంటి విషయాలపై సురభి గుప్తా కాలిఫోర్నియాకు చెందిన జర్నలిస్ట్ సవితా పటేల్‌తో మాట్లాడారు. ఆ వివరాలు సురభి గుప్తా మాటల్లోనే..

ఫొటో సోర్స్, PHOTO COURTESY: SURBHI GUPTA
ఉదయం 6 గంటలకే మెయిల్
ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. తనకి శుభాకాంక్షలు తెలిపేందుకు అర్థరాత్రి వరకు మేల్కొని ఉన్నాను. ఆ సమయంలో మా స్నేహితుల నుంచి లేఆఫ్ ప్రకటన గురించి మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. వారందరూ చాలా ఆందోళనకు గురయ్యారు.
ఇక్కడ ఉదయం 6 గంటలప్పుడు, నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌తో నన్ను తీసేసినట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే నేను మెటా కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరాను. నన్ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు తెలుసుకుని, నా స్నేహితులు చాలా షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే నేను చాలా బాగా పనిచేసే దాన్ని.
ఈ లేఆఫ్ ప్రకటన నా లక్ష్యానికి వ్యతిరేకంగా ఉంది. నేను పనినే దైవంగా భావించేదాన్ని. స్కూల్‌లో నాకు ఎంతో ఇష్టమైన టీచర్‌వల్ల నేను పని విషయంలో ఎంతో నిబద్ధతతో ఉండేదాన్ని. ఉద్యోగం పోయిన సమయంలో నా పరిస్థితి టైటానిక్ నౌక మునిగిపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే, ఒకదాని తర్వాత ఒక యాక్సస్ కోల్పోయాను. తొలుత వర్క్‌ప్లేస్, ఆ తర్వాత ఈమెయిల్, చివరికి ల్యాప్‌టాప్.. ఇలా నాదనుకున్న ఒక్కొక్కటీ నేను కోల్పోతూ వచ్చాను.
కానీ, లింక్డిన్‌లో నా నెట్‌వర్క్ స్పందించిన సానుకూలమైన తీరును చూసి నేను చాలా ఆనందానికి, ఆశ్చర్యానికి గురయ్యాను. ఎంతో మంది సహ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, స్నేహితులు అందరూ నాకు మద్దతుగా నిలిచారు. రిఫరల్స్ ఇచ్చారు. నన్ను కేర్ చేసే వారు ఈ దేశంలో కూడా నాకు చాలా మంది ఉన్న అనుభూతి కలిగింది. ఈ దేశానికి చెందిన దానినేననే ఫీలింగ్ నాకు వారు కల్పించారు.

ఫొటో సోర్స్, PHOTO COURTESY: SURBHI GUPTA
కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల సమయం
మెటాలో నా చివరి రోజు జనవరి నెలలో వచ్చింది. నా హెచ్1-బీ వీసా (ఇదొక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా ద్వారా విదేశీయులు ఆరేళ్ల పాటు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు వీలుంటుంది) మీద మరో 60 రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు వీలుంటుంది. అంటే మరో ఉద్యోగం వెతుకునేందుకు నాకు మార్చి ప్రారంభం వరకు గడువుంది.
సెలవుల కారణంతో డిసెంబర్‌లో నియామకాలు అంతగా ఉండవు. దీంతో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం కాస్త కష్టంగానే మారింది. కానీ, నేను చాలా ఫోకస్డ్‌గా ఉన్నాను. పలు కంపెనీలతో నేను ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాను. కొత్త ఉద్యోగావకాశాల కోసం చూస్తున్నాను.
మెటాలో నేను నా ఆఫీసును, సహోద్యోగులను మిస్ అవుతున్నాను. లక్షలాది మంది ప్రజలకు అద్భుతమైన ప్రాడక్ట్‌ను రూపొందించగలగడమే కాకుండా కెరీర్‌లో అభివృద్ధి, కొత్త విషయాలు నేర్చుకునే ఎన్నో అవకాశాలను నాకు కంపెనీఇచ్చింది. ప్రాడక్ట్ మేనేజర్‌గా కంపెనీ ఉత్పత్తులను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కడం నిజంగా చాలా గొప్ప బహుమతి.
జీవితంలో వెనుకడుగు వేయకూడదు..
జీవితంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. ధైర్యంగా ఉండాలని వారు నాకు చెప్పారు. ఎందుకంటే సమస్యలను అవకాశాలుగా మార్చుకున్న వ్యక్తిని నేను. ఇంతకంటే మంచిది నీకు దొరుకుతుందని వారు నాకు చెప్పారు.
అయితే, అమెరికాలో పనిచేయాలన్నా, ఉండాలన్నా పూర్తిగా హెచ్1-బీ వీసాపైనే ఆధారపడి ఉంది. 2009లో నేను అమెరికాలో అడుగు పెట్టాను. నా సొంత తెలివితేటలతో, ధైర్యంతో కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు నేనెంతో కష్టపడ్డాను. టెస్లా, ఇనిస్టిట్యూట్ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశాను. ఉత్తమమైన ఉత్పత్తులను అభివృద్ధి చేశాను. టాప్ రేటింగ్స్ పొందాను. పన్నులు కట్టాను. పదేళ్లకు పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు నా వంతు సహకారం అందిస్తున్నాను. నేనెంతో ఇష్టపడే బాలీవుడ్ నటి, నా ఐడల్ సుష్మితా సేన్ చేతుల మీదుగా నేను అందాల పోటీ మిస్ భారత్ కాలిఫోర్నియాలో కిరీటం దక్కించుకున్నాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేశాను. నాకు సొంతంగా పాడ్‌కాస్ట్ ఉంది.
గ్రీన్ కార్డు పొందేందుకు వెయిటింగ్ సమయం ఒక్కోసారి ఒక్కోలా..
భారత్ నుంచి వెళ్లే హెచ్1-బీ వీసాదారులకు గ్రీన్ కార్డును(శాశ్వత నివాసం)ను జారీచేసేందుకు అమెరికా పరిమితులు విధిస్తుంది. ఈ పరిమితి వల్ల మేము అనవసరమైన ఆందోళనకు గురవుతున్నాం. నేను గ్రీన్ కార్డు క్యూలో ఉన్నప్పటికీ, నేను నా స్టేటస్ చెక్ చేసుకుంటే, కొన్ని సార్లు వెయిటింగ్ టైమ్ రెండు దశాబ్దాలుగా ఉండగా, కొన్ని సార్లు 60 ఏళ్లుగా చూపిస్తూ ఉంది.
ఈ అనిశ్చితికర పరిస్థితులతో మా వ్యక్తిగత జీవితం చాలా ఇబ్బందికరంగా మారింది. సొంతంగా ఇల్లు కొనుక్కోవడమేనేది ప్రశ్నార్థకమైంది. ఒకవేళ నేను ఇంటిపై ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఈ దేశం వదిలి రావాల్సి వస్తే, కొనుక్కుని ఏం ప్రయోజనం? ఒకవేళ నేను అమెరికా టెక్నాలజీ స్టార్టప్ యాక్సిలేటర్ వై కాంబినేటర్(వైసీ)తో కలిసి ముందుకు వెళ్లినప్పటికీ లాభమేమీ లేదు. నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉన్నప్పటికీ, నేను కంపెనీ ప్రారంభించలేను. ఎందుకంటే నా వద్ద గ్రీన్ కార్డు లేదు.
నాకు 30 ఏళ్లు వచ్చేనాటికే నేను 30 దేశాలను చుట్టుముట్టేశాను. కానీ ఇప్పుడంత ప్రయాణం చేయలేను. ప్రపంచవ్యాప్తంగా నాకు తిరగాలనే కల ఉన్నప్పటికీ, హెచ్1-బీ వీసా రీస్టాంప్‌ను పొందే సమయంలో నేను చాలా ఇబ్బందులు పడతాననే భయం నాకుంది. గూగుల్, పేపాల్ వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన నా స్నేహితులు విదేశాల్లోనే చిక్కుకుపోయినట్టు నేను విన్నాను.
విడాకుల సమయంలో కూడా వీసానే ప్రధాన కారణాల్లో ఒకటి..
స్వదేశం భారత్‌కు రావడం కూడా నేను తగ్గించాను. కొన్నేళ్ల క్రితం, భారత్‌కు వచ్చి నేను ఇలానే ఇబ్బందులు పడ్డాను. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చాను, ఆ సమయంలో నా హెచ్1-బీ వీసా స్టాంప్ చేసుకోవాల్సి వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌కు ఎన్నో నెలల సమయం పట్టింది.
ఈ అనిశ్చితికర పరిస్థితుల మూలంగా నా పెళ్లి విషయంలో కూడా ఇబ్బందులు పడ్డాను. నా పెళ్లి సమయంలో వీసా సమస్యలు చుట్టుముట్టాయి.
ఇది మాత్రమే కాదు, విడాకులు తీసుకోవడంలో కూడా వీసానే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. నేను చదువుకునే న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సెమిస్టర్‌కు హాజరు కాలేక డ్రాపవుట్ అయ్యాను. ఎందుకంటే నేను మళ్లీ తిరిగి ఎప్పుడు అమెరికా వెళ్తానో తెలియక, చదువు మానేశాను. హెచ్1-బీ వీసాలో పనిచేసే వారు ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కోవాలి?
కరోనా మహమ్మారి సమయం నుంచి నేను నా తల్లిదండ్రులను కలవనే లేదు. ఎందుకంటే మూడున్నర ఏళ్లుగా వారు నన్ను చూసేందుకు రాలేకపోయారు. వారు పెద్దవారు. నేను ఎల్లప్పుడూ ఒకటి ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ నా తల్లిదండ్రులకు సాయం కావాల్సి వస్తే, నేను వారికి సాయంగా వెళ్లగలనా? అని. ఇది మా జీవితాలపై ఎంత ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.
కానీ, ఏదైతే జరిగిందో అదంతా నా మంచికే జరిగిందని నేను నమ్ముతాను. ఆధ్యాత్మికం నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నేను ’సద్గురు జీ‘ ని విశ్వసిస్తాను, అనుకరిస్తాను. భారత యోగా గురు జగ్గీ వాసుదేవ్‌ను సద్గురుజీగా అంటారు.
కేవలం మన వృత్తిపరమైన జీవితానికే మన ఐడెంటీని పరిమితం చేసుకోకూడదు. సిలికాన్ వ్యాలీలో అత్యంత ఎక్కువగా అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏ కంపెనీ కోసం నీవు పనిచేస్తున్నావు? అని.
ఇవి కూడా చదవండి:
- కోహిస్తాన్: పరువు హత్యల పేరుతో ఈ జిల్లాలో అమ్మాయిలు, అబ్బాయిలను చంపుతున్నారు
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- ఖతార్: ఈ కృత్రిమ ద్వీపం ప్రత్యేకత ఏంటి.. ప్రజలు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎగబడుతున్నారు
- మహిళా లీడర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారిపై నమ్మకం తగ్గుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















