ఆధునిక బానిసత్వం అంటే ఏమిటి, ప్రతి 150 మందిలో ఒకరు ఈ ఊబిలో ఎందుకు చిక్కుకుంటున్నారు?

కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌లోని బహియా పట్టణంలో చక్కెర కర్మాగారంలో చిక్కుకున్న కార్మికులు

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గణాంకాల ప్రకారం ప్రతీ 150 మందిలో ఒకరు ఆధునిక బానిసత్వంలో చిక్కుకుపోతున్నారు.

ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల మంది ఈ ఊబిలో చిక్కుకున్నట్లు ఆ సంస్థ చెబుతోంది. నాలుగేళ్ళలోనే 4 కోట్ల నుంచి ఈ సంఖ్య 5 కోట్లకు పెరిగింది.

ఆధునిక బానిసత్వం అంటే ఏమిటి?

శ్రమదోపిడీకి సంబంధించిన ఈ కింది అంశాలన్నీ ఆధునిక బానిసత్వం కిందకు వస్తాయి.

బలవంతపు శ్రమ - ప్రజలు వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా చేయవలసిన ఏదైనా పని. రుణ బంధం - అప్పులు తీర్చడానికి పని చేయవలసి రావడం. అనువంశిక బానిసత్వం - బానిసత్వంలో జన్మించినప్పుడు, ఆస్తిగా పరిగణించబడినప్పుడు చేసేది. బలవంతపు వివాహం - ఎవరైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం, ఆ పరిస్థితి నుంచి బయటపడటం కష్టంగా ఉండటం. గృహ దాస్యం - ఇది ప్రతీసారి బానిసత్వం కాదు, కానీ వారు మూసిన తలుపుల వెనుక దారుణ పరిస్థితులు ఎదుర్కోవచ్చు.

చెత్త ఏరుకుంటున్న బాలలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో చెత్త ఏరుకునే పనిలో చిన్నారులు

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందిలో ఒకరు అంటే దాదాపు 4.96 కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారు. "ఇది సాధారణంగా ఆర్థికపరమైన లాభాల కోసం బలహీనుల శ్రమను దోపిడీ చేయడం కిందకు వస్తుంది" అని బానిసత్వ వ్యతిరేక కార్యకర్త, అమెరికాలోని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మోంటి దత్తా అన్నారు. "శారీరకంగానో మానసికంగానో ఒత్తిడి చేయడం ద్వారా ఈ శ్రమదోపిడీ కొనసాగుతోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంత మందితో బలవంతంగా పనిచేయిస్తున్నారు?

అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దాదాపు 2 కోట్ల 76 లక్షల మంది బలవంతపు పనిలో చిక్కుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు దీని బారిన పడుతున్నారు. విదేశాల్లో పని చేయడానికి పేద దేశాల నుంచి ఇలాంటి వారిని తీసుకొస్తారు. బిల్డింగ్, వ్యవసాయం, గార్మెంట్ తయారీ మరియు ఇంటిపని వంటి పరిశ్రమలలో పనిచేయడానికి వారిని సిద్ధం చేస్తారు. వారు ఆ పనిలో చిక్కుకుని ఇక ఇంటికి వెళ్లలేరు. "ప్రపంచంలో దాదాపు 400 కోట్ల మంది ప్రజలకు చట్టపరమైన సంరక్షణ లేదు'' అని యూకే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్‌కు చెందిన యువాన్ ఫ్రేజర్ అన్నారు.

చట్టాలకు అతీతంగా ఉంటూ శ్రమదోపిడీకి అలవాటు పడిన వారు ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ బలవంతపు శ్రమదోపిడీ విషయంలో భారతదేశం పరిస్థితి అధ్వానంగా ఉండవచ్చని డాక్టర్ దత్తా అన్నారు. "ఇటుక బట్టీల వంటి ప్రదేశాలలో బలవంతపు కార్మికులను ఉపయోగించడమే కాకుండా పిల్లలతో కూడా పని చేయించడం ఆందోళన కలిగించే అంశం" అని దత్తా అన్నారు. దాదాపు 49 లక్షల మంది మహిళలు, పిల్లలను సెక్స్ వర్కర్లుగా మార్చినట్లు అర్థమవుతోందని తెలిపారు. "ఈ రకమైన బానిసత్వం వల్ల మనుషులు మానసికంగా తీవ్రంగా గాయపడతారని, అది యుద్ధం వల్ల కలిగే గాయం కన్నా దారుణమైనది" అని దత్తా అన్నారు. అంతేకాకుండా, సాామాజికంగా దాన్ని ఒక కళంకంగా చూస్తారు కాబట్టి, ఎవరూ తమ బాధను చెప్పుకోలేరని, మానసికంగా-శారీరకంగా అనుభవించిన గాయాల నుంచి తేరుకోవడానికి వారికి చాలా ఏళ్ళు పడుతుందని ఆయన చెప్పారు.

బెడ్ మీద వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్ఫే దేశాల్లో రద్దీగా ఉండే వలస కార్మికుల శిబిరాలు

బలవంతపు పెళ్లిళ్లలో ఎంతమంది చిక్కుకున్నారు?

దాదాపు 2.2 కోట్ల మంది ప్రజలు బలవంతపు పెళ్లిళ్ల ఊబిలో చిక్కుకున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. అలాంటి వారు మూడింట రెండు వంతుల మంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలకు బలవంతపు వివాహాలు ప్రత్యేకంగా భారత్ దాని చుట్టు పక్కల గల పాకిస్తాన్ వంటి దేశాలలో జరుగుతున్నాయని దత్తా పేర్కొన్నారు. అయితే, గల్ఫ్ అరబ్ లో బలవంతపు వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ 1,000 మందిలో 4.8 మంది ఈ ఊబిలో చిక్కుకుంటున్నట్లు తెలిపింది.

వాటర్ బాటిల్స్ ఏరుంటుకున్న బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల మంది బాలలు వెట్టి చాకిరీ చేస్తున్నారని ఐఎల్ఓ చెబుతోంది

ఈ ఆధునిక బానిసత్వానికి బాధ్యులెవరు?

ఈ బలవంతపు శ్రమ దోపిడీకి, లైంగిక దోపిడీకి 86% బాధ్యులు ప్రైవేటు యజమానులే.

ప్రపంచ వ్యాప్తంగా యజమానులు బలవంతపు శ్రమ చేయించుకుని 15,000 కోట్ల డాలర్లు ఆర్జిస్తున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. ఇందులో 5,180 కోట్ల డాలర్లు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 1.5 కోట్ల మంది ఆధునిక బానిసలతో పని చేయించడం ద్వారా యజమానులు సంపాదించినవే. యూరప్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా ఆర్జించిన మొత్తం 4.69 కోట్ల డాలర్ల దాకా ఉంది. అయితే, జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఆధునిక బానిసల సంఖ్య అత్యధికంగా ఉన్నది గల్ఫ్ అరబ్ దేశాల్లోనే అని ఐఎల్ఓ చెబుతోంది. ఇక్కడ ప్రతి వేయి మందిలో 5.3 మంది బలవంతపు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు బలవంతపు శ్రమ దోపిడీ కోరల్లో చిక్కుకోవడం పెరిగిందని యూకే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్‌కు చెందిన యువాస్ ఫ్రేజర్ అభిప్రాయపడ్డారు. ''కోవిడ్ కారణంగా చాలామంది విదేశాల్లో చిక్కుకున్నారు, వాళ్ల ఉద్యోగాలూ పోయాయి. వాళ్లు డబ్బు కోసం వెంపర్లాడారు. దీంతో అక్రమ రవాణాదారుల బారిన పడ్డారు. ఫలితంగా, ఆధునిక బానిసత్వం ఒక ఉప్పెనలా ఎగసిపడింది'' అని ఫ్రేజర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)