వెనక్కి నడవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్ మెక్‌నమారా
- హోదా, ది కాన్వర్జేషన్
నడవడానికి ప్రత్యేకమైన పరికరాలేవీ అవసరం లేదు. జిమ్ సభ్యత్వం కూడా అక్కర్లేదు. అన్నిటికన్నా ఉత్తమమైన విషయం ఏమిటంటే.. నడక అనేది పూర్తిగా ఉచితం. పైసా ఖర్చు కాదు.
మనలో చాలా మందికి నడవడం అనేది మనం మామూలుగానే చేసే పని. దానికి శ్రద్ధగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నడక వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయాజనాలను మనలో చాలా మంది గుర్తుపెట్టుకోరు.
అయితే.. మనం మామూలుగా నడవటం ఆపేసి.. వెనకకు నడవడం మొదలుపెట్టి మన మెదళ్లను, శరీరాలను సవాల్ చేస్తే ఏం జరుగుతుంది?
దీనివల్ల మనం నడుస్తున్న దిశ మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి రావటమే కాదు.. మనకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
శారీరక కార్యకలాపాలు సంక్లిష్టంగా ఉండాల్సిన అవసరమేమీ లేదు.
మీరు మామూలుగా క్రియాశీలంగా ఉన్నారా లేదా అనేదానితో సంబంధం లేకుండా.. రోజూ నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి వారం కనీసం 150 నిమిషాల ఏరోబిక్ కార్యకలాపాలు అవసరమని చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులో కూడా ఈ నడకను లెక్కించవచ్చు.
అయినాకానీ.. నడవటం అనేది మనలో చాలా మంది అనుకున్నదానికన్నా ఎక్కువ సంక్లిష్టమైనదే.
నిటారుగా నిలబడటానికి మన శరీరంలోని దృష్టి, చలన, గ్రహణ వ్యవస్థలు వంటి వాటి మధ్య సమన్వయం అవసరమవుతుంది.
మనం వెనుకకు నడిచినపుడు.. ఈ వ్యవస్థల మధ్య సమన్వయం కోసం అవసరమైన అదనపు డిమాండ్‌ను ప్రాసెస్ చేయటానికి మన మెదడుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. అయితే మన శరీరం ఈ చాలెంజ్‌ను ఎదుర్కోవటం మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పలు అధ్యయనాల్లో వెల్లడైన ప్రకారం.. వెనుకకు నడవటం వల్ల లభించే అత్యుత్తమ ప్రయోజనాల్లో ఒకటి - స్థిరత్వం, నిలకడ మెరుగుపడటం. వెనుకకు నడవటాన్ని అభ్యసించటం వల్ల మనం ముందుకు నడిచేటపుడు మన శరీరం నిలబడే తీరు, నిలకడ మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన వయోజనులతో పాటు మోకాలిలో కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా ఇది సాయపడుతుంది.
వెనక్కు నడిచేటపుడు మనం అడుగులు చిన్నవిగా వేస్తాం. ఎక్కువ అడుగులు వేస్తాం. దీనివల్ల మన కాలి కింది భాగంలోని కండరాల సామర్థ్యం పెరుగుతుంది. కీళ్ల మీద భారం తగ్గుతుంది.
అలాగే మన కీళ్లు, కండరాలు కదిలే పరిధి కూడా పెరుగుతుంది. మడమ నొప్పికి సాధారణ కారణాల్లో ఒకటైన ప్లాంటర్ ఫసీటీస్ వంటి సమస్యలు ఉన్నవారికి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే వెనుకకు నడవడం వల్ల శరీరం నిలబడే తీరులో వచ్చే మార్పుల వల్ల.. మన నడుము భాగంలోని వెన్నెముకకు మద్దతునిచ్చే కండరాలను మరింత ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అంటే.. తరచుగా వెన్ను నొప్పితో బాధపడే వారికి.. వెనుకకు నడవటం వల్ల ప్రయోజనం లభిస్తుందన్నమాట.
నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగుల నిలకడను, వారు నడిచే వేగాన్ని గుర్తించటానికి కూడా వారిని వెనుకకు నడిపించి పరీక్షించటం జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఖర్చు చేసే శక్తి...
వెనుకకు నడవటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స లాగా మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
మామూలుగా నడవటం.. మనం ఆరోగ్యవంతమైన బరువు ఉండేలా చూసుకోవటానికి ఉపయోగపడుతుంది. అయితే వెనుకకు నడవటం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
మామూలుగా ముందుకు నడవటాని కన్నా.. అంతే దూరం వెనుకకు నడవటానికి మన శరీరం ఖర్చు చేసే శక్తి 40 శాతం అధికంగా ఉంటుంది.
ఆరు వారాల వెనుకకు పరిగెత్తే శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన మహిళల్లో శరీర కొవ్వులు తగ్గినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది.
వెనకకు నడవటంలో మనకు విశ్వాసం పెరిగినపుడు.. మరి కొంచెం పెంచుతూ వెనక్కు రన్నింగ్ చేయటం వల్ల మన శరీరం అవసరాలు మరింతగా పెరుగుతాయి.
పలు అధ్యయానాల ఫలితాల ప్రకారం.. వెనుక దిశలో రన్నింగ్ చేయటం వల్ల మోకాలిని నిటారుగా చేయటానికి కీలకమైన కండరాలు బలోపేతం అవుతాయి. దీనివల్ల గాయాలు కాకుండా నిరోధించటానికి వీలవుతుంది. అంతేకాదు శక్తిని పుట్టించే, పనితీరును పెంపొందించే మన క్రీడా సామర్థ్యం కూడా పెరుగుతుంది.
వెనక్కు నడవటం బాగా అలవాటై సులభమైపోయినపుడు కానీ, వెను దిశలో రన్నింగ్ చేయటం ప్రాక్టీస్ చేయటానికి తగినంత స్థలం లేకపోయినపుడు కానీ.. బరువులు లాగుతూ వెనక్కు నడవటం ద్వారా కష్టాన్ని పెంచటం ఒక సులభమైన మార్గం.
మొత్తం బరువును పెంచటం వల్ల.. మోకాలి వ్యాకోచ కండరాల వినియోగం పెరుగుతుంది. అలాగే గుండె మీద, ఊపిరితిత్తుల మీద తక్కువ కాల పరిమితిల్లో పనిభారం పెరుగుతుంది.
ఒక స్లెడ్‌ను వెనక్కు లాగటం వల్ల గాయమయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మనం బాగా అలసిపోయినట్లయితే ఆ స్లెడ్ కదలదు. అంతే.
కానీ తక్కువ బరువులతో ఇలాంటి కసరత్తు చేయటం ద్వారా.. మన కండరాల శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెరుగుతాయి.
యువ అథ్లెట్లలో.. వారి శరీర బరువులో 10 శాతం బరువులను లాగటం ద్వారా.. తక్కువ నిడివి పరుగు పందెంలో వారి పరుగు వేగం పెరిగింది.
ఎలా ఆరంభించాలి?
వెనుకకు నడవటం సంక్లిష్టమేమీ కాదు. అలాగని అది అంత సులువనీ కాదు. మరి మీ వ్యాయామంలో దీనిని ఎలా చేరుస్తారు?
మనం వెనుకకు నడిచేటపుడు మనం వేటినైనా ఢీకొట్టి అవరోధాలు, లేదా పడిపోయే ప్రమాదాలు ఉండొచ్చు. కాబట్టి భద్రత కోసం మీకు బాగా పరిచయమున్న మీ ఇంట్లో మొదలు పెట్టటం మంచిది. లేదంటే చదరంగా, ఖాళీగా ఉన్న ప్రాంతంలో చేయండి.
భుజం మీదుగా తల తిప్పి వెనక్కు చూడాలనే కాంక్షను నిలువరించుకోండి. మీ అడుగు వెనుకకు వేస్తున్నపుడు మీ తలను, ఛాతీని పైకి ఎత్తి ఉంచండి. పాదాన్ని మునివేళ్ల నుంచి మడమవరకూ నేలకు ఆనిస్తూ నడవండి.
అలా నడవటం కాస్త అలవాటై సౌకర్యవంతంగా మారిన తర్వాత వేగం పెంచవచ్చు. బాగా అలవాటైన తర్వాత ట్రెడ్‌మిల్ మీద కూడా గైడ్ రైల్స్ ఉపయోగిస్తూ వెనుక నడక మొదలుపెట్టవచ్చు.
బరువులు ఉపయోగించాలని అనుకున్నపుడు తేలికపాటి బరువులతో ఆరంభించండి. ఎక్కువ దూరాల మీద కాకుండా ఎక్కవ పర్యాయాలు చేయటం మీద దృష్టి పెట్టండి. ఆరంభంలో 20 మీటర్లకు మించి ఎక్కువ దూరాలు వద్దు.
(జాక్ మెక్‌నమారా.. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో క్లినికల్ ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- సెక్స్ ఎడిక్షన్: ‘రోజుకి ఐదుసార్లు కూడా సరిపోయేది కాదు’
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి
- ఖతార్: అత్యంత సంపన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుందంటే...
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















