చైనా: జీరో కోవిడ్ పాలసీకి సడలింపులు.. ఇక ‘కోవిడ్‌తో సహజీవనం’

- రచయిత, ఫ్రాన్సెస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్
చైనాలో కోవిడ్ నియంత్రణకు అమలు చేస్తున్న కఠిన ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తిన తరువాత ప్రభుత్వం తన విధానాలను సడలిస్తోంది.
కోవిడ్ సోకినా ఎలాంటి లక్షణాలు లేనివారు, తక్కువ లక్షణాలు ఉన్నవారు.. ప్రభుత్వం నిర్వహించే క్వారంటైన్ సెంటర్లలో ఉండనవసరం లేకుండా ఇళ్లలోనే ఉంటూ మిగతావారి నుంచి దూరంగా ఉండాలని సూచించింది.
ఇలాంటివారు గతంలో కంటే స్వేచ్ఛగా దేశంలో తిరిగే అవకాశం కల్పించింది.
తాజా మార్పులను ప్రజలు కొంత ఉపశమనంగా భావిస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పులు తీసుకురావడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘‘హమ్మయ్య.. కోవిడ్ సోకినవారిని కలిసినందుకు నన్ను కూడా తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లో పెడతారన్న భయం పోయింది ఇప్పుడు’ అంటూ ఓ వ్యక్తి చైనీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ఏం జరుగుతోందో ఎవరైనా నాకు చెప్పండి. ఒక్కసారిగా ఇంత పెద్ద మార్పులు ఎందుకొచ్చాయి’ అంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు.
చైనా తన జీరో కోవిడ్ పాలసీ నుంచి దూరం జరుగుతూ మిగతా దేశాల మాదిరిగా ‘వైరస్‌తో కలిసి జీవిద్దాం’ అనే పద్ధతికి వస్తున్నట్లుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాగా ప్రస్తుతం చైనాలో రోజుకు కొత్తగా సుమారు 30 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా ఇంతవరకు కఠిన ఆంక్షలను కొందరు వ్యతిరేకించగా, ఇంకొందరు ప్రజలు ఇప్పుడు ఇలా ఆంక్షలు సడలించడాన్నీ వ్యతిరేకిస్తున్నారు. ‘వైద్య వ్యవస్థపై భారం పెరుగుతుంది. వయోధికులకు కష్టమవుతుంది’ అంటూ ఆన్‌లైన్‌లో కొందరు అంటున్నారు.
అయితే, అత్యధికులు మాత్రం గత మూడేళ్లుగా తమ జీవితాలను ఆంక్షలమయంగా మార్చిన కఠిన నిబంధనలను సడలిస్తుండడాన్ని స్వాగతిస్తున్నారు.
ఇప్పటివరకు చైనాలో ఎవరికైనా కోవిడ్ సోకినా, కోవిడ్ సోకినవారిని కలిసినా వారిని బలవంతంగా క్వారంటైన్ సెంటర్లకు తరలించేవారు. ఈ విధానంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కుటుంబాలను విడగొడుతున్నారని.. ఇళ్ల నుంచి తీసుకెళ్తున్నారంటూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
క్వారంటైన్ సెంటర్లలోనూ సరైన వసతులు లేవని, తగినంత మంది సిబ్బంది అక్కడ ఉండడం లేదని ప్రజల నుంచి ఆరోపణలున్నాయి.
క్వారంటైన్ సెంటర్లకు వెళ్లేందుకు నిరాకరించేవారిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు ఈడ్చి మరీ తీసుకెళ్లిన వీడియోలు ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హాంగ్‌ఝోలో గతవారం కొవిడ్ సోకిన వ్యక్తిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించేందుకు అధికారులు రాగా ఆయన వారితో పెనుగులాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ ఆంక్షల నుంచి మినహాయింపులను చైనా నేషనల్ హెల్త్ కమిషన్ బుధవారం ప్రకటించింది.. అవేంటంటే..
- టెస్టులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూళ్లు, హాస్పిటళ్లలో అవసరాలకు తప్ప మిగతా అన్ని సందర్భాలలో పీసీఆర్ టెస్టులకు బదులు ర్యాపిడ్ టెస్టులు చాలు అనే నిబంధనలు తీసుకొచ్చారు.
- మున్ముందు కూడా లాక్‌డౌన్‌లు ఉంటాయి. కానీ, గతంలోలా మొత్తం ఒక ప్రాంతం కాకుండా కేసుల తీవ్రతను బట్టి ఏదైనా ఒక భవనం, లేదంటే ఒక అంతస్తును లాక్‌డౌన్‌లో ఉంచుతారు.
- హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించినవి కూడా కొత్తగా కేసులు నమోదు కాకుంటే 5 రోజులలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారు.
- కేసుల సంఖ్య తక్కువగా ఉంటే స్కూళ్లు కూడా తెరుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రాంతంలో మంటలు అంటుకుంటున్నప్పుడు చాలామంది ఇళ్లు, భవనాల నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణం.. కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలలో భాగంగా ఇళ్ల తలుపులు, వెనుక ద్వారాలు, చివరకు ఫైర్ ఎగ్జిట్లు కూడా మూసేయడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త విధానంలో ఇకపై ఎక్కడైనా లాక్‌డౌన్ విధించినా ఫైర్ ఎగ్జిట్లు, తలుపులు సీల్ చేయడానికి వీల్లేదు. అలాంటి చర్యలపై పూర్తి నిషేధం విధించారు.
లాక్‌డౌన్ అమలులో ఉన్న ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు అందడంలోనూ జాప్యమేర్పడుతోందని అనేక సందర్భాలలో కథనాలు వెలువడ్డాయి.
కాగా బుధవారం ఆంక్షల సడలింపు ప్రకటించినప్పుడు వయోధికులకు వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులు చెప్పారు.
లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తడం, గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో దేశంలో నిరసనలు వెల్లువెత్తిన తరువాత ఈ ఆంక్షల సడలింపునకు ప్రభుత్వం సిద్ధమైంది.
నిజానికి నవంబరు 24-26 మధ్య చోటుచేసుకున్న తీవ్ర నిరసనల తరువాత కొన్ని నగరాలలో లాక్‌డౌన్ ఎత్తేశారు.
కోవిడ్ ముప్పుపై అధికారులు మాట్లాడే భాషలోనూ భయాందోళనల స్థాయి తగ్గిస్తూ వచ్చారు.
అయితే, ఆంక్షల సడలింపు ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరగాలని.. లేదంటే 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఊహించని పరిణామాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వయోధికులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు
- మధ్యప్రదేశ్: 400 అడుగుల లోతున బోరుబావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు
- ప్రియాంక చోప్రా జోనస్: ‘‘తొలిసారి మగ నటులతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నా, బాలీవుడ్లో 10 శాతమే దక్కేది’’ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ
- బీబీసీ 100 మంది మహిళలు 2022: ఈ ఏడాది జాబితాలో తెలుగు యువతి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














