భార్యను కీలుబొమ్మగా మార్చే గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, దీన్ని మొదట్లోనే ఎలా గుర్తించాలి?

ఫొటో సోర్స్, PIXABY
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ తెలుగు
గ్యాస్‌లైటింగ్... ఈ పదాన్ని ‘‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’’గా మెరియమ్ వెబ్‌స్టెర్ డిక్షనరీ ప్రకటించింది.
ఈ పదానికి అర్థం ఏమిటో వెతుక్కుంటూ తమ వెబ్‌సైట్‌కు వచ్చిన వారిలో ప్రస్తుత ఏడాది అంటే 2022లో 1740 శాతం పెరుగుదల కనిపించిందని మెరియమ్ వెబ్‌స్టెర్ తెలిపింది.
నిజానికి ఈ పదం కేవలం అమెరికన్లను మాత్రమే ఆకర్షిస్తోంది అనుకుంటే పొరపాటే.
శ్రద్ధ వాల్కర్ హత్య కేసుపై వార్తలు చదివేటప్పుడు కూడా ఈ పదం కనిపించింది. ఆమెను గ్యాస్ లైటింగ్‌కు బాధితురాలుగా కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇంతకీ గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? ఈ పదాన్ని వెతికేవారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది? దీనితో శ్రద్ధ వాల్కర్ కేసుకు సంబంధం ఏమిటి?

అంత అర్థముందా?
గ్యాస్‌లైటింగ్ అంటే ఒక వ్యక్తిని పూర్తిగా తప్పుదోవ పట్టించడం. ఇంకా చెప్పాలంటే మన అవసరానికి తగినట్లుగా వారిని కీలుబొమ్మగా వాడుకోవడం.
‘‘తప్పుడు వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న నేటి రోజుల్లో కుట్ర సిద్ధాంతాలు, ట్విటర్ ట్రోల్స్, డీప్ ఫేక్స్ ఎక్కువయ్యాయి. దీంతో గ్యాస్‌లైటింగ్ నేటి పరిస్థితులకు సరిపోయే పదంగా చెప్పుకోవచ్చు’’అని మెరియమ్ వెబ్‌స్టెర్ తమ ప్రకటనలో తెలిపింది.
‘‘ఇంటర్నెట్‌లో ఈ పదాన్ని శోధించడం వెనుక ఒక ఘటన లేదా ఒక వ్యక్తి ఉన్నారని అనుకుంటే పొరపాటే. తరచూ ఈ పదాన్ని వెతుక్కుంటూ చాలా మంది వస్తున్నారు’’అని అసోసియెటెడ్ ప్రెస్ వార్తా సంస్థతో మెరియమ్ వెబ్‌స్టెర్ ఎడిటర్ పీటర్ సోకోలోవ్‌స్కీ చెప్పారు.
ప్రతి పదం వెనుక మనం వెతికితే ఏదో ఒక కథ లేదా చరిత్ర కనిపిస్తాయి. అలానే ఈ పదం వెనుక కూడా ఒక కథ ఉంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
అలా పుట్టింది..
ఈ కథ తెలుసుకోవడానికి మనం ‘‘విక్టోరియన్ ఎరా’’కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రముఖ రచయిత ప్యాట్రిక్ హ్యామిల్టన్ ఇదే పేరుతో ఒక ‘‘ప్లే’’ను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
లండన్ నేపథ్యంలో నడిచే ఒక మిడిల్ క్లాస్ పెళ్లి కథ ఇదీ. అబద్ధాలు, మోసాల చుట్టూ దీన్ని అల్లుకుంటూ పోయారు.
దీనిలో ప్రధాన పాత్రధారి జాక్ మానింగమ్ తన భార్య బేల్లాకు పిచ్చిపట్టిందని నమ్మిస్తాడు. ఇంట్లో గ్యాస్ లైట్ వెలుగు తగ్గిపోతున్నట్లు, పైకప్పు లోనుంచి ఏవో శబ్దాలు వస్తున్నట్లు తను భ్రమపడుతోందని ఆమెను మభ్యపెడుతుంటాడు.
అవన్నీ నిజంగానే జరుగుతాయి, కాకపోతే ఆమె అన్నీ ఊహించుకుంటోదని, ఆమెను మానసికంగా గందరగోళానికి గురిచేస్తుంటాడు. తన చుట్టూ కనిపించే ప్రపంచంలో వాస్తవాలు నిజంకాదని ఆమెను తప్పుదోవ పట్టిస్తాడు. ఆమె దగ్గర నుంచి డబ్బు దోచుకోవడానికి ఇదంతా చేస్తుంటాడు.
ఈ నాటకం అధారంగా సినిమాలు కూడా తెరకెక్కాయి. 1944లో ఇంగ్రిడ్ బెర్గ్‌మన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి రెండు అకాడమీ అవార్డులు కూడా వచ్చాయి.
నేడు ఈ పదాన్ని ‘‘సైకలాజికల్ మానిపులేషన్’’ కోణంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని మెరియమ్ వెబ్‌స్టెర్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఎలా జరుగుతుంది?
కేంబ్రిడ్జి సైకాలజిస్టులు ఆర్ బార్టన్, ఏ వైట్‌హెడ్ కూడా తమ అధ్యయనంలో ఈ పదాన్ని ఉపయోగించారు.
అయితే, యేల్ యూనివర్సిటీ సైకాలజిస్టు రాబిన్ స్టెర్న్ ‘‘ద గ్యాస్‌లైట్ ఎఫెక్ట్ రికవరీ గైడ్’’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. ఆమె దీని గురించి దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
గ్యాస్‌లైటింగ్‌కు పాల్పడేందుకు నిందితులు కొన్నిరకాల టెక్నిక్‌లను ఉపయోగిస్తుంటారని తన పుస్తకంలో స్టెర్న్ వివరించారు.
‘‘గ్యాస్ లైటింగ్‌లో అటు గ్యాస్‌లైటర్ (నిందితుడు), ఇటు గ్యాస్‌లైటీ (బాధితురాలు) ఇద్దరి ప్రమేయం ఉంటుంది. గ్యాస్ లైటింగ్ బాధితుల్లో గందరగోళం, యాంక్సైటీ, తమపై తాము నమ్మకం కోల్పోవడం లాంటివి జరుగుతాయి. వీటిని రానురాను మరింత తీవ్రంచేస్తూ వాస్తవ ప్రపంచానికి వీరు దూరమయ్యేలా నిందితులు చూస్తుంటారు. చివరగా చుట్టుపక్కల ప్రపంచాన్ని పక్కనపెట్టి తాము చెప్పేది మాత్రమే నమ్మేలా చేస్తారు’’అని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఎక్కువగా ఇది ఇంటిమేట్ రిలేషన్‌షిప్‌ల విషయంలో కనిపిస్తుందని, పైగా ఇది నెమ్మదిగా మొదలవుతుందని మానసిక వైద్య నిపుణురాలు జీసీ కవిత చెప్పారు.
‘‘మొదట బాధితురాలి నమ్మకాన్ని నిందితుడు సంపాదిస్తాడు. దీని కోసం ప్రేమగా తనకు దగ్గర అవుతున్నట్లుగా నటిస్తాడు. సమయం గడిచేకొద్దీ తమపై తమకే నమ్మకం పోయేలా చేస్తాడు. తన తోడు లేకపోతే జీవించలేరనే పరిస్థితికి తీసుకొస్తాడు. దేనికైనా తమపైనే ఆధారపడేలా చేసుకుంటాడు. బాధితులకు సాయం అందే అన్ని మార్గాలనూ మూసివేస్తాడు. ఫలితంగా అసలు చుట్టూ ఏం జరుగుతుందో తాము తెలుసుకోలేకపోతున్నామని, మానసికంగా తాము స్థిమితంగా లేమని భావన కలిగిస్తాడు’’అని జీసీ కవిత చెప్పారు.
మరోవైపు శ్రద్ధ వాల్కర్ విషయంలోనూ ఇదే జరిగుండొచ్చని విశాఖపట్నానికి చెందిన మానసిక వైద్య నిపుణుడు చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ నుంచి ఆమె ఎందుకు వేరుపడలేదు? అని చాలా మంది సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. ఆమెది కూడా దీనిలో తప్పుందని కొందరు అంటున్నారు. నిజానికి ఆమె కూడా గ్యాస్ లైటింగ్‌కు బాధితురాలు అయ్యుండొచ్చు. మన చుట్టుఉండే ప్రపంచంపై మనం నమ్మకం కోల్పోయే స్థితికి వెళ్లినప్పుడు అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి స్థితిలోకి వెళ్లినప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లోనుంచి బయటకు రావడం చాలా కష్టం’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PA
చాలా విధాలుగా
గ్యాస్‌లైటింగ్ కోసం భిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారని ‘‘ద గ్యాస్‌లైట్ ఎఫెక్ట్ రికవరీ గైడ్’’ పుస్తకంలో రాబిన్ స్టెర్న్ రాసుకొచ్చారు.
వీటిలో ‘‘అండర్ కౌంటెరింగ్’’ ఒకటి. దీనిలో బాధితులు తమ మెమరీని సందేహించేలా చేస్తారు. ‘‘అసలు ఏం జరిగిందో నీకు గుర్తుందని నేను అనుకోను, నీకు వంద శాతం గుర్తుందా?, నీకు నువ్వే ఏదో అనేసుకుంటున్నావు.. లాంటి మాటలను నిందితులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
‘‘దీని వల్ల అసలు తమపై తమకే బాధితుల్లో సందేహాలు పుట్టేలా చేస్తారు. అసలు ఇక్కడ జరుగుతున్నదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు నమ్మిస్తారు’’అని మానసిక వైద్య నిపుణురాలు జీసీ కవిత చెప్పారు.
‘‘అసలు వారు చెప్పిందే నిజమా? నేను అతిగా స్పందిస్తున్నానా? అని తమలో తమకే సందేహాలు పుట్టేలా చేస్తారు’’అని ఆమె చెప్పారు.

అలా ఎలా?
గైస్‌లైటింగ్ గురించి మాట్లాడేటప్పుడు తన దగ్గరకు వచ్చిన ఒక కేసును ఈ సందర్భంగా మానసిక నిపుణురాలు పూర్ణిమా నాగరాజ ఉదహరించారు. ఆ రిలేషన్‌షిప్‌లో మహిళ గ్యాస్‌లైటింగ్‌కు బాధితురాలని వివరించారు.
‘‘కార్తిక్, రోజా (పేర్లు మార్చాం)లకు పెళ్లై దాదాపు ఐదేళ్లు గడిచింది. పెళ్లైన కొత్తలో తన మాటలతో రోజాను కార్తిక్ మాయచేశాడు. గిఫ్టులు, పువ్వులు, చాక్లెట్ల వర్షం కురిపించాడు. ఆమె విశ్వాసాన్ని చూరగొనేందుకు ఆమె కోసం సమయం కేటాయించేవాడు. దీంతో నెమ్మదిగా ఆమె తన సమస్యలు, గత చరిత్ర, బలహీనతలను ఆయనకు చెప్పింది. ఆ తర్వాత నెమ్మదిగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మదగిన వారు కాదనే భావన ఆమెలో కలిగించాడు. ఆమె బయటపెట్టిన అభద్రతా భావాలనే అవకాశంగా తీసుకొని, వాటి సాయంతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత తగ్గించాడు. అన్ని విషయాల్లో రోజా తనపై ఆధారపడేలా చేసుకున్నాడు.
ఆ తర్మాత ఆమెను ఇతరుల ముందు పరాచకాలు ఆడటం మొదలుపెట్టాడు. దీనిపై ఏమైనా ప్రశ్నిస్తే, విద్వేషం బయటకు వచ్చేది. పైగా తప్పంతా ఆమెదేనని ఆరోపించేవాడు. అందరికీ అతడు మంచివాడిలా కనిపించేవాడు. ఫలితంగా తనే ఎక్కువ ఆలోచిస్తున్నాననే భావన ఆమెకు కలిగేది. అలా నెమ్మదిగా తన జీవితం, ప్రవర్తన, వ్యక్తిత్వం అన్నింటినీ ఆయన తన ఆధీనంలోకి తీసుకుంటాడు. చివరికి ఆమె అతడి చేతిలో కీలుబొమ్మ అయ్యింది. పూర్తిగా తనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిన తర్వాత, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆమె మా దగ్గరకు వచ్చింది. అయితే, ఆమె అతడిపైనే పూర్తిగా ఆధారపడేది. దీంతో ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మేం బిహేవియరల్ థెరపీని ప్రయత్నించి చూశాం. నెమ్మదిగా ఆమె పరిస్థితి మళ్లీ సాధారణానికి వచ్చింది. మేం కార్తిక్‌ను కూడా థెరపీకి రావాలని సూచించాం. కానీ, ఆయన మాట వినలేదు’’అని ఆమె చెప్పారు.
పైన పేర్కొన్న కేసులో శారీరక హింస చోటుచేసుకోలేదు. కానీ, ఇలాంటి కేసుల్లో శారీరక హింసకు కూడా దారీ తీయొచ్చని, పైగా దీనికి మొత్తం కారణం బాధితురాలేనని నిందితులు నింద మోపుతుంటారని మానసిక వైద్య నిపుణురాలు పూర్ణిమా నాగరాజ చెప్పారు.
‘‘కొన్నిసార్లు బాధితులను శారీరకంగా హింసిస్తారు. అయితే, ఈ పరిస్థితులకే బాధితులే కారణమనేలా నమ్మిస్తారు. నమ్మని పక్షంలో నువ్వు వారితో మాట్లాడటం వల్లే ఇలా జరుగుతోంది, నువ్వు చదువుతున్న పుస్తకాలు నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నాయి లాంటి మాటలు చెబుతారు’’అని ఆమె వివరించారు.

మహిళలు మాత్రమే అనుకుంటే పొరపాటే..
ఇక్కడ మహిళలు మాత్రమే గ్యాస్‌లైటింగ్ బాధితులు అనుకుంటే పొరపాటే. అయితే, మన సమాజంలో మహిళలు ఈ తరహా మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఎక్కువని డాక్టర్ జీసీ కవిత తెలిపారు.
‘‘తనే బాధితురాలనని ఒక మహిళ సమాజాన్ని నమ్మించగలిగినప్పుడు ఆమె పురుషులను కూడా గ్యాస్‌లైట్ చేయొచ్చు. ఇలాంటివి సీరియల్స్‌లోనే కాదు.. నిజ జీవితంలోనూ కనిపిస్తాయి’’అని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె ఒక కేసును ఉదహరించారు. ‘‘ఒక దంపతులు ఇలా మానసిక సమస్యలతో మా దగ్గరకు వచ్చారు. ఇక్కడ గ్యాస్‌లైటర్ మహిళ, గ్యాస్‌లైటీ ఆమె భర్త. ఆమెకు మానసిక సమస్యలు ఉండేవి. ఆయన ఏం చేసినా ఆమె తప్పు పడుతుండేది. ఉదాహరణకు మార్కెట్‌కు వెళ్లి కాయగూరలు తెచ్చినా ఇవి బాలేవని, అవి బాలేవని వంకలు పెట్టేది. ఏం కొని తెచ్చినా చెత్తగా ఉన్నాయని చెప్పేది. దీంతో కొంతకాలానికి ఆయనలో ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన ఏమీ కొనితేవడం మానేశారు. అప్పుడు మీకు కొనితేవడం చేతకాదని మరో విధంగా వేధింపులు మొదలుపెట్టింది. ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిన మాట వాస్తవమే, అయితే, దీనికి మూల కారణం ఆమె. మొదట ఆమెకు మనం చికిత్స మొదలుపెట్టాలి. కానీ, ఆమె లాంటి వారు అసలు తమలో ఎలాంటి లోపంలేదని చెబుతారు’’అని కవిత వివరించారు.
గ్యాస్ లైటింగ్ నుంచి తప్పించుకోవడం ఎలా?
గ్యాస్ లైటింగ్‌ను ప్రధానంగా మానసిక వేధింపులుగా చెప్పుకోవాలని, అయితే, దీన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయని రాబిన్ స్టెర్న్ చెబుతారు.
‘‘ఇక్కడ బాధితుల జెండర్, క్లాస్, కులం, జాతి లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి’’అని ఆమె రాసుకొచ్చారు. బాధితుల్లో ఆత్మవిశ్వాసం తగ్గించేందుకు వీటిని ఉపయోగించుకుంటారని వివరించారు.
చుట్టుపక్కల పరిస్థితుల నుంచి బాధితులను దూరం చేసేందుకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలనూ వారు ఉపయోగించుకుంటారని చెప్పారు.
మరోవైపు మానసిక నిపుణురాలు జీసీ కవిత కూడా గ్యాస్‌లైటింగ్ తరహా వేధింపులు మొదలయ్యేటప్పుడు కొన్ని సూచనలు, సంకేతాలు కనిపిస్తాయని చెప్పారు. అవి ఏమిటంటే..
- చులకన చేయడం: మీ ఫీలింగ్స్‌ను గుర్తించరు. మీ భావోద్వేగాలతో వారికి సంబంధం ఉండదు. అసలు మీరు అతిగా స్పందిస్తున్నారని చెబుతారు.
- మెమరీని ప్రశ్నించడం: మీ మెమరీని ప్రశ్నిస్తారు. అసలు అలాంటి ఘటన జరగనేలేదని చెబుతారు. మీరే ఏదో ఊహించేసుకుంటున్నారని అంటారు.
- దాటవేయడం: మీరు ఏదైనా చెప్పాలని భావించినప్పుడు దాటవేస్తారు. తర్వాత మాట్లాడుకుందాం అంటారు. కానీ, ఆ తర్వాత ఎప్పటికీ తర్వాతే.
- మాటలు మార్చడం: మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారిగా సబ్జెక్ట్ మార్చేస్తారు. ఒక్కోసారి మాటలు కూడా మారుస్తుంటారు.
- తిరస్కరణ: వారు చెప్పిన ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రస్తావిస్తే, అరే అసలు అది కానేకాదని తిరస్కరిస్తారు. పైగా నువ్వే మరచిపోయి వేరేది చెబుతున్నావని అంటారు.
- క్రెడిట్ ఇవ్వరు: ఏ పనికీ క్రెడిట్ ఇవ్వరు. గందరగోళానికి గురిచేస్తూ పైగా ఆ క్రెడిట్‌ను వారే తీసుకుంటారు.
ఆ ఊబిలో కురుకుపోతే ఎలా తెలుస్తుంది?
చాలా మంది తమకు తెలియకుండానే గ్యాస్‌లైటింగ్ వేధింపులను ఎదుర్కొనే అవకాశముంది. ఈ వేధింపులను ఎదుర్కొనేటప్పుడు బాధితుల్లోనూ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే..
- మనల్ని మనమే సందేహించుకోవడం
- అతిగా స్పందిస్తున్నామేమోనని ఆత్మవిమర్శ చేసుకోవడం
- తరచూ క్షమాపణలు చెప్పడం
- సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం
- మనపై మనకు ప్రేమ లేకపోవడం, గందరగోళానికి గురికావడం
- అసలు ఏం జరుగుతుందో బయటకు చెప్పలేక, ఆప్తులకు దూరం కావడం
ఇప్పుడు ఏం చేయాలి?
గ్యాస్‌లైటింగ్ నుంచి బయటపడేందుకు ‘‘ద గ్యాస్‌లైట్ ఎఫెక్ట్ రికవరీ గైడ్’’ పుస్తకంలో సైకాలజిస్టు రాబిన్ స్టెర్న్ కొన్ని సూచనలు చేశారు. అవి ఏమిటంటే
- మొదట ఈ వేధింపులు గ్యాస్‌లైటింగేనని మనం నిర్ధారించుకోవాలి
- ఆ తర్వాత చుటుపక్కల ఈ విద్వేష వాతావరణం నుంచి దూరం జరిగేందుకు ప్రయత్నించాలి
- అసలు ఏం జరుగుతుందో ఆప్తులకు వివరించే ప్రయత్నం చేయాలి
- వేధింపులకు ఎదురుతిరిగి మాట్లాడటం మొదలుపెట్టాలి
- మీరు చెప్పే అంశాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి
- సెల్ఫ్ కేర్‌పై దృష్టిపెట్టాలి
- మానసిక వైద్యులు, ఇతర ఆరోగ్య నిపుణుల సాయం తీసుకోవాలి
మానసిక వైద్యంపై సాయం కోసం కేంద్ర ప్రభుత్వ హెల్ప్‌లైన్ 1800-599-0019కు కాల్ చేయండి
ఇవి కూడా చదవండి:
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- మ్యూజియంలో భద్రపరిచిన 300 ఏళ్ళ నాటి గోదుమ గింజలకు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించే శక్తి ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















