Jaysukh Patel: గుజరాత్ తీగల వంతెన మరమ్మతులు చేసిన ఈ వాచీల కంపెనీ యజమాని ఎవరు

ఫొటో సోర్స్, Oreva.com
- రచయిత, జయ్ శుక్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని మోర్బీ వద్ద మచ్చు నది మీద తీగల వంతెన కూలిన ఘటనలో సుమారు 141 మంది చనిపోయారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒరెవా గ్రూప్‌కు చెందిన ఇద్దరు మేనేజర్లు కూడా ఉన్నారు. ఆ తీగల వంతెన నిర్వహణ ఒరెవా గ్రూప్ చూస్తోంది.
ఒరెవా గ్రూప్ ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు.
వంతెన మరమ్మతులు చేపట్టిన తరువాత దాన్ని ఒరెవా గ్రూప్ యజమాని జయసుఖ్ ఓధావజీ పటేల్ స్వయంగా ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Facebook/Oreva Group
జయసుఖ్ పటేల్ ఎవరు?
భారత్‌లో గోడ గడియారాల పితామహుడిగా ఓధావజీ పటేల్‌ను పిలుస్తారు. 1971లో ఆయన ముగ్గురు భాగస్వాములతో కలిసి లక్ష రూపాయలతో 'అజంతా ట్రాన్సిస్టర్ క్లాక్ మాన్యుఫేక్చరర్' అనే కంపెనీ ప్రారంభించారు.
ఆ కంపెనీలో ఓధావజీ పటేల్ వాటా రూ.15 వేలు మాత్రమే.
ఆ తరువాత అజంతా గోడ గడియారాలు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. 1981లో కంపెనీలోని భాగస్వాములు విడిపోయారు. కంపెనీ కాస్త 'అజంతా కంపెనీ'గా మారిపోయింది.
అదే సమయంలో 'క్వార్ట్జ్ క్లాక్' తయారు చేయడం ప్రారంభించారు ఓధావజీ పటేల్. ఇలా అజంతా కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద గోడ గడియారాల సంస్థగా మారింది. అంతేకాదు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అధికంగా ఎగుమతులు చేసినందుకు వరుసగా 12 ఏళ్లపాటు అజంతా గ్రూప్‌కు కేంద్ర వాణిజ్యశాఖ నుంచి పురస్కారాలు దగ్గాయి.
కంపెనీ కార్యకలాపాలు 45 దేశాలకు విస్తరించాయి. ఓధావజీ పటేల్ కుమారుడే జయసుఖ్ పటేల్.
1983లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి అయిన తరువాత తండ్రితో కలిసి కంపెనీలో జయసుఖ్ పటేల్ పని చేశారు.
ఓధావజీ పటేల్ 2012లో చనిపోయిన తరువాత అజంతా కంపెనీని ఆయన పిల్లలు పంచుకున్నారు. తన వాటా కింద వచ్చిన కంపెనీ భాగానికి 'ఒరెవా గ్రూప్' అని పేరు పెట్టుకున్నారు జయసుఖ్ పటేల్.

ఒరెవా అని ఎందుకు పెట్టారు?
తల్లిదండ్రుల పేర్ల మీదుగా ఒరెవా అని పేరు పెట్టినట్లు రాజ్‌కోట్‌లోని సీనియర్ జర్నలిస్టు సురేశ్ పారేఖ్ చెప్పారు.
'తండ్రి పేరు నుంచి ఓను తల్లి పేరు నుంచి రెవాను తీసుకొని వాటి రెండింటినీ కలిపి ఒరెవా అని కంపెనీకి పేరు పెట్టారు' అని సురేశ్ వివరించారు.
అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఒరెవా గ్రూప్, పేరెంట్ కంపెనీ అజంతా మాన్యుఫేక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విద్యుత్ లైట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ బైకులు, గృహోపకరణాలు, టెలిఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎల్ఈడీ టీవీలు వంటివి తయారు చేస్తోంది.
ఒరెవా తన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది.
గుజరాత్‌లోని సామఖియాలీలో 200 ఎకరాల్లో అతి పెద్ద ప్లాంట్‌ను ఒరెవా గ్రూప్ నడుపుతోంది. ఒకనాడు గోడ గడియారాలకు పెట్టింది పేరుగా ఉన్న కంపెనీ డిజిటల్ క్లాక్ విభాగంలోకి కూడా విస్తరించింది.
1980లో తొలిసారి మహిళలను కూడా పనిలోకి తీసుకోవడం ప్రారంభించింది కంపెనీ. ప్రస్తుతం ఆ కంపెనీలో 7వేల మంది పని చేస్తుండగా వారిలో 5వేల మందికిపైగా మహిళలున్నారు.
'మహిళా ఉద్యోగుల పెళ్లి ఖర్చులను కూడా కంపెనీ భరిస్తుంది' అని సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ పారేఖ్ తెలిపారు.
చైనాలో చౌకగా తయారైన భారత్‌కు దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎదుర్కొవడానికి వీలుగా భారత దేశం తన విధానాలను మార్చాలని జయసుఖ్ పటేల్ భావించేవారు. ఇక్కడ కూడా చీప్‌గా దొరికే వస్తువులను తయారు చేయాలన్నది ఆయన కోరిక.
'పెద్దపెద్ద కంపెనీల యజమానులు వాటిని ఎగతాళి చేయొచ్చు. కానీ నేను పట్టించుకోను. మా వినియోగదారులకు చౌకైన, నాణ్యత గల వస్తువులను ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం' అని బహిరంగంగానే జయసుఖ్ పటేల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ సంబంధాలు
గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలతోను జయసుఖ్ పటేల్‌కు సంబంధాలున్నాయి.
ఆయనతోపాటు ఆయన తండ్రి కొంత బీజేపీకి దగ్గరగా ఉండేవారని మోర్బీలోని బీబీసీ ప్రతినిధి రాజేశ్ అంబాలియా అన్నారు. గుజరాత్‌లో బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉండటం ఇందుకు ఒక కారణం.
జయసుఖ్ పటేల్ నిర్వహించే కార్యక్రమాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు వస్తారు.
బీజేపీ నేతలతో జయసుఖ్ పటేల్ దిగిన ఫొటోలను ఒరెవా గ్రూప్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
'రాణ్ సరోవర్' వివాదం
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 'రాణ్ సరోవర్ ప్రాజెక్ట్'ను జయసుఖ్ పటేల్ చేపట్టారు. నాడు మోదీ కూడా ఆ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.
4,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఆ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సుగా గుర్తింపు పొందుతుందని కంపెనీ చెప్పింది. కానీ ఇంత వరకు పనిలో పురోగతి కనిపించలేదు.
కానీ అక్కడి ఉప్పు తయారీదారులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్ ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఫైనల్ చేస్తారా, స్కాచ్ విస్కీ ధరలకు దీనికి లింకేంటి
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












