నరేంద్ర మోదీ: బీజేపీ బలం, బలహీనత రెండూ ఆయనే..

మోదీ

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, ఇండియా కరస్పాండెంట్

భారత్‌ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ప్రపంచంలోనే అత్యంత దుర్బలులు.

‘ఇండియాలో ప్రతి మూడు ప్రభుత్వాలలో రెండు ఎన్నికల తరువాత అధికారం కోల్పోతుంటాయి. అదే అమెరికాలో అయితే, దీనికి పూర్తిగా విరుద్ధంగా జరురుగుతుంది. మూడింట రెండు ప్రభుత్వాలను ప్రజలు మళ్లీ ఎన్నుకుంటుంటారు’ అని విశ్లేషకుడు రుచిర్ శర్మ ఒకసారి చెప్పారు.

అయితే, భారతదేశంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకావడానికి బీజేపీ నేత నరేంద్ర మోదీ మినహాయింపుగా చెప్పుకోవాలి.

నరేంద్రమోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడుసార్లు బీజేపీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2014లో ప్రధాని పదవి చేపట్టి దిల్లీ రావడానికి ముందు ఆయన 12 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఉన్నారు.

2014 నుంచి రెండుసార్లు ఆయన తన పార్టీని కేంద్రంలో అధికారంలోకి తసుకొచ్చారు.

ప్రధాని అయినప్పటికీ నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడా మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు.

గురువారం వెల్లడైన ఫలితాలో 182 సీట్ల గుజరాత్ అసెంబ్లీలో 158 సీట్లు సాధించిన బీజేపీ 50 శాతానికిపైగా ఓట్లను పొంది ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతోంది.

గుజరాత్‌లో బీజేపీ ప్రచారం

ఫొటో సోర్స్, AFP

ప్రస్తుత గుజరాత్ ఎన్నికలను మోదీ తనకు రిఫరెండమ్ అన్నట్లుగా మార్చేశారు. ఆయన అక్కడ 30కి పైగా ఎన్నికల ప్రచార ర్యాలీలలో మాట్లాడిన ఆయన కిలోమీటర్ల పొడవునా రోడ్ షోలు కూడా నిర్వహించారు. ఇవన్నీ ఓటర్లను ఆకట్టుకోవడానికి, నిత్యం మీడియాలో బీజేపీకి మంచి కవరేజ్ దొరికేలా చేయడానికి దోహదపడ్డాయి. ‘గుజరాతీ గౌరవం’ అనేది చర్చలోకి తెచ్చి తనను, బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మాలంటూ ప్రజలను పదేపదే విజ్ఞప్తి చేశారు.

‘ఒక ప్రధాన మంత్రి ఇలా అసెంబ్లీ ఎన్నికకు ఇంత సమయం కేటాయిస్తారని ఎవరూ అనుకోరు’ అన్నారు మహారాజా షాయాజీరావ్ యూనివర్సిటీకి చెందిన పాలిటిక్స్ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా అన్నారు.

హిందూ జాతీయవాదం, ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రెండింటినీ కలిపి మోదీ ఇచ్చే హామీలు ఓటర్లను ఆకట్టుకోగలుగుతున్నాయి.

మోదీ మొదటిసారి గుజరాత్ సీఎం అయిన కొన్నేళ్లకే 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు జరిగినప్పటికీ అవేమీ ఆయన పాపులారిటీని తగ్గించలేకపోయాయి.

పెట్టుబడులను ఆకర్షించడం, తలసరి ఆదాయం విషయంలో భారత్‌లోని అనేక రాష్ట్రాల కంటే గుజరాత్ ముందుంది. దేశంలోనే తమది నాలుగో అతిపెద్ద ఎకానమీ అని కూడా గుజరాత్ ప్రభుత్వం చెబుతుంది.

అయితే, మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్‌లోనూ నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయి.

మరోవైపు గుజరాత్ కంటే పేద రాష్ట్రాలు కూడా మాతాశిశు మరణాల నివారణలో గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.

గుజరాత్‌ను మూడు సార్లు పాలించిన మోదీ తరువాత ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రులైన వారు మోదీ స్థాయిలో ఓటర్ల అండదండలు సంపాదించలేకపోయారు.

2017 ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవడం.. భూస్వాములు ఎక్కువగా ఉండే బలమైన సామాజికవర్గ నేత ఒకరు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేయడంతో బీజేపీ అతి తక్కువ మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది.

182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 స్థానాలు అవసరం కాగా బీజేపీ ఆ ఎన్నికలలో 99 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది అంతకుముందు 5 ఎన్నికలలో ఆ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తూ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది.

అయితే, గత ఎన్నికలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో సీట్లు సాధించింది.

‘మోదీ రంగంలోకి దిగిన తరవాత స్క్రిప్ట్ అంతా మారిపోతుంది’ అని ‘ది ప్రింట్’ వెబ్‌సైట్ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా అన్నారు.

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ ఎన్నికలతో గుజరాత్‌ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలవడం కూడా మోదీ ఇంతగా దృష్టి పెట్టడానికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు.

అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నుంచి దిల్లీలో అధికారంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆ పార్టీ పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక రోజు ముందు బుధవారం దిల్లీ మున్సిపల్ ఎన్నికలలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దిల్లీ మున్సిపాలిటీలో అంతకుముందు 15 ఏళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది.

మోదీని, బీజేపీని ఢీకొట్టడానికి కేజ్రీవాల్ తరచూ సిద్ధమవుతుంటారు. 2014లో మోదీ వారణాసిలో పోటీ చేసినప్పుడు కేజ్రీవాల్ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా గుజరాత్‌లో తొలిసారి పోటీ చేసిన కేజ్రీవాల్ పార్టీ 12.9 శాతం ఓట్లతో 5 సీట్లు గెలుచుకుంది. అయితే, ఈ పార్టీ సంపాదించిన ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్‌కు పడాల్సినవేనన్నది విశ్లేషకుల మాట.

 YouGov అనే సంస్థ, దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’లు కలిసి దేశవ్యాప్తంగా 200 నగరాలలో చేసిన సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని తేలింది.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది.

కాగా మోదీకి గల తిరుగులేని చరిష్మా, ఓటర్లను కలుస్తూ వారిని ఆకట్టకునే కళ బీజేపీకి అతి పెద్ద ఆస్తిగా మారింది. ‘అయితే, పార్టీకి ఉన్న ఈ బలమే దానికి బలహీనత కూడా. బీజేపీ గెలుపు సమీకరణం నుంచి మోదీని వేరు చేసి చూడండి. ఏమవుతుంది.. బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తుంది’ అన్నారు ప్రొఫెసర్ డోలాకియా.

ఎన్నికలలో పూర్తిగా మోదీ ప్రభపైనే ఆధారపడడమనేది బీజేపీకి మైనస్.. రాష్ట్రాలలో ఇతర నాయకులు తమ పాపులారిటీతో ఎన్నికలు గెలిచే పరిస్థితి అన్నిచోట్లా లేదు అంటారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)