మోర్బి కేబుల్ బ్రిడ్జి: రిపేర్ చేశాక ఫిట్‌నెస్ తనిఖీ, సర్టిఫికెట్ లేకుండానే వంతెనను తెరిచారా?

మోర్బీ వంతెన

ఫొటో సోర్స్, gujarattourism.com

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో పురాతనమైన కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన విషాదంలో మృతుల సంఖ్య 140 దాటింది.

బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మితమైన మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జ్ (వేలాడే వంతెన).. గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మచ్చు నది మీద నిర్మించిన ఈ వంతెన ఒక 'కళాత్మక, సాంకేతిక అద్భుతం' అని జిల్లా కలెక్టరేట్ వెబ్‌సైట్‌లో అభివర్ణించారు.

పందొమ్మిదో శతాబ్దంలో యూరప్‌లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దీనిని నిర్మించారని, ఈ వంతెన 1.25 మీటర్ల వెడల్పు, 233 మీటర్ల పొడవు ఉంటుందని వివరించారు.

మోర్బీని 1922 వరకూ పరిపాలించిన సర్ వాఘ్జీ ఠాకోర్ ఈ వంతెనను కట్టించినట్లు చెప్తారు. ఈ వేలాడే వంతెన, నదీ ముఖనగరం.. 'విక్టోరియా శకపు లండన్' నగరాన్ని జ్ఞప్తికి తెస్తాయని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్ వర్ణిస్తోంది. స్థానికంగా ఈ వంతెనను 'జుల్తో పూల్' అని పిలుస్తారు.

అయితే..వందేళ్లకు పైగా పురాతనమైన ఈ వేలాడే వంతెన శిథిలావస్థకు చేరటంతో ఈ ఏడాది మార్చిలో దీనిని మూసివేసినట్లు మోర్బి మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ ఝాలా పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ వంతెనను అక్టోబర్ 26వ తేదీన తిరిగి తెరిచారు. కానీ నాలుగు రోజుల్లోనే ఆదివారం సాయంత్రం వంతెన కుప్పకూలింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున వచ్చిన జనం.. వంతెన మీదకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వంతెన కూలడంతో వారంతా నదిలో పడిపోయారు. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

మోర్బీ వంతెన

ఫొటో సోర్స్, Bipin Tankaria

'మునిసిపాలిటీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు'

''ఈ వంతెన జీర్ణావస్థలో ఉండింది. కాబట్టి ప్రజలు ఈ వంతెనను ఉపయోగించకుండా మూసివేశారు. ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేసి, నిర్వహించటానికి మోర్బీకి చెందిన అజంతా ఒరేవా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ కూడా ఒక సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి మరమ్మతులకు ధర ఖరారు చేయాలని, మరమ్మతులు చేసిన తర్వాత బ్రిడ్జిని తిరిగి తెరవాలని ఆ సమావేశంలో నిర్ణయించారు'' అని మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ ఝాలా వివరించారు.

''దీనికి సంబంధించి ఒరేవా సంస్థతో ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ వంతెనను మరమ్మతు చేసిన తర్వాత సదరు సంస్థ 15 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ వంతెనను పునరుద్ధరణ పనుల కోసం మార్చిలో మూసివేశారు. మరమ్మతులు పూర్తయ్యాక.. దీపావళి తరువాతి రోజు, గుజరాతీ నూతన సంవత్సరం రోజు అయిన అక్టోబర్ 26వ తేదీన వంతెనను తెరిచి ప్రజలను అనుమతించారు’’ అని ఆయన వివరించారు.

‘‘కానీ ఈ వంతెనకు మరమ్మతుల తర్వాత స్థానిక మునిసిపాలిటీ ఇంకా ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయలేదు'' అని సందీప్ ఝాలా తెలిపారు.

మోర్బీ వంతెన

ఫొటో సోర్స్, Bipin Tankaria

'మాకు చెప్పకుండానే వంతెన తెరిచారు'

''ఒప్పందం ప్రకారం ఒవేరా సంస్థ ఈ వంతెన పనరుద్ధరణ పనులు ప్రారంభించింది. దీనిపై మీడియాలో పలు కథనాలు కూడా విడుదల చేసింది. అందువల్ల పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని మాకు తెలిసింది. మునిసిపల్ ఆస్తి అయిన ఈ వంతెనను 15 ఏళ్ల పాటు మరమ్మతులు, నిర్వహణ కోసం కొన్ని నెలల కిందట ఒరేవా గ్రూప్‌కు అప్పగించాం. కానీ ఆ సంస్థ మాకు తెలియజేయకుండానే సందర్శకులకు ఈ వంతెనను తెరిచింది. అందువల్ల ఈ వంతెన భద్రతను మేం తనిఖీ చేయలేకపోయాం'' అని ఆయన చెప్పారు.

''కానీ ఈ వంతెన ఎలా కూలిపోయిందో మాకు తెలీదు. వంతెన సామర్థ్యం ఎంత? అందులో ఎలాంటి మెటీరియల్ వాడారు? అనే అంశాలు తెలీవు. ఆ సంస్థ మరో ప్రైవేటు కంపెనీకి మరమ్మతు పనులు అప్పగించింది. వాళ్లు ప్రైవేటుగా అవసరమైన సర్టిఫికెట్లు తీసుకున్నారా అనేది తెలుసుకోవటానికి మేం ప్రయత్నిస్తున్నాం. వారి ఆఫీస్ నుంచి రికార్డులు తెప్పించి పరిశీలిస్తాం'' అని సందీప్ ఝాలా పేర్కొన్నారు.

వంతెన మీదకు సామర్థ్యం కన్నా ఎక్కువ మందిని అనుమతించారన్న అంశంపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి

ఫొటో సోర్స్, ANI

ఇది మనిషి చేసిన విషాదం: కాంగ్రెస్ ఆరోపణ

బ్రిడ్జి నిర్వహణ బృందం మీద ఐపీసీలోని 304, 308, 114 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సాంఘవి తెలిపారు.

గుజరాత్ ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారి, మునిసిపాలిటీస్ కమిషనర్ రాజ్‌‌కుమార్ బెనీవాల్ ఆధ్వర్యంలోని ఈ దర్యాప్తు బృందంలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి, పోలీస్ ఐజీపీలతో పాటు.. నిర్మాణ, నాణ్యత నియంత్రణ నిపుణులైన ఇద్దరు ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మోర్బీ వంతెన కుప్పకూలిన ఉదంతానికి ప్రకృతి కారణం కాదని, ఇది మనిషి చేసిన విషాదమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. దీనికి బాధ్యత గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు.

‘‘వంతెనను తెరిచిన నాలుగు రోజుల్లోనే ఎలా కుప్పకూలుతుంది? ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వంతెనను ప్రజలకు ఎలా తెరుస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)