స్పీకర్ ఫార్మాట్ అంటే ఏమిటి? ఎమ్మెల్యేల రాజీనామాలు ఆ పద్ధతిలో లేకుంటే చెల్లవా?

కరణం ధర్మశ్రీ

ఫొటో సోర్స్, KARANAM DHARMASRI

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లో ఉందా లేదా అనే చర్చ మొదలయింది. నిజానికి, ఏ ఎమ్మెల్యే రాజీనామా చేసినా అది స్పీకర్ ఫార్మాట్లో ఉందో లేదోననే చర్చ ప్రతిసారీ వస్తూ ఉంటుంది.

ఇంతకీ స్పీకర్ ఫార్మాట్ అంటే ఏమిటి? గత ఏడాదిన్నర కాలంలో రాజీనామాలు చేసిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు ఏ ఫార్మాట్లో ఉన్నాయో చూద్దాం.

ఎవరెవరు రాజీనామా చేశారు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే తన పదవికి అక్టోబరు 07న రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్‌కు అప్పగించారు. దీనిని స్పీకర్ ఫార్మాట్ రాజీనామా అని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా సమర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. గంటా కూడా తన రాజీనామాని కూడా స్పీకర్ ఫార్మాట్‌లోనే చేశానని తెలిపారు.

ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గం ఎమ్మల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ రాసినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

తమ్మినేని సీతారాం

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

కరణం ధర్మశ్రీ రాజీనామా పై ఏపీ స్పీకర్ ఏమన్నారు?

ఈ ముగ్గురు కూడా స్పీకర్ ఫార్మాట్‌లోనే తమ రాజీనామాలు చేశామని చెప్పారు. అయితే మూడింటిని పరిశీలిస్తే రాజీనామా సమర్పిస్తూ రాసిన వ్యాఖ్యాలలో తేడాలున్నాయి. ఇందులో రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామా వెంటనే ఆమోదం పొందింది. గంటా శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ రాజీనామాలపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో బీబీసీ మాట్లాడింది.

"కరణం ధర్మశ్రీ రాజీనామా విషయం నా దృష్టికి రాలేదు. ఆ లేఖ వస్తే పరిశీలిస్తాను. అది స్పీకర్ ఫార్మాట్‌లో ఉందా లేదా అనేది ముందుగా చూడాలి. ఆ తర్వాతే దానిని ఆమోదించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాం" అని బీబీసీతో స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

ఎవరి రాజీనామా లేఖలో ఏముంది?

మనుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా స్పీకర్‌కు సమర్పించిన వెంటనే ఆమోదం పొందింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి ఏడాదిన్నర అవుతున్నా, ఆమోదం పొందలేదు. ఇక తాజాగా కరణం ధర్మశ్రీ చేసిన రాజీనామా అయితే స్పీకర్ దృష్టికే వెళ్లలేదు. ఇంతకీ వీరు రాసిన రాజీనామా లేఖల్లో ఏముందో ఒక సారి చూద్దాం.

గంటా శ్రీనివాసరావు: 'గౌరవనీయులైన స్పీకర్ గారికి, నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను. దయచేసి ఆమోదించండి.'

రాజీనామా లేఖ

ఫొటో సోర్స్, GANTA SRINIVASA RAO

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: "శాసనసభలో నా స్థానానికి 2022 ఆగస్ట్ 8 నుంచి వర్తించేలా నేను రాజీనామా చేస్తున్నాను." ఈ లేఖలో దిగువన ఆయన తన నియోజకవర్గం పేరు, దాని నెంబరు స్పష్టంగా రాశారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ

ఫొటో సోర్స్, Komatireddy Rajgopal Reddy

కరణం ధర్మశ్రీ: 'తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్న మూడు రాజధానులకు మద్దతుగా నేను చోడవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సవినయంగా సమర్పిస్తున్నాను. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ నాకు నేనుగా నా రాజీనామాను సమర్పిస్తున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి.

కరణం ధర్మశ్రీ

ఫొటో సోర్స్, KARANAM DHARMASRI

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు అమోదం పొందింది?

గంటా శ్రీనివాసరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాసిన లేఖల్లో సారాంశం ఒకే విధంగా ఉంది. కానీ, కరణం ధర్మశ్రీ రాసిన లేఖ మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఉంటూ, తాను రాజీనామా చేస్తున్న కారణాన్ని స్పష్టంగా రాశారు.

ఈ మూడింటిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేఖ ఎటువంటి అడ్డంకులు లేకుండా అమోదం పొందింది.

"ఎంఎల్‌ఏలు రాజీనామా చేసేటప్ప్పుడు స్పీకర్ ఫార్మాట్‌లో చేస్తే వెంటనే అమోదం పొందుతుంది. ఆ ఫార్మాట్లో కాకుండా తమ అభిప్రాయాలను అందులో చెప్పడం, ఇతర వ్యాఖ్యనాలు ఉంటే దాని పై స్పీకర్ పునరాలోచిస్తారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన వెంటనే ఆమోదించాలని కూడా లేదు. దాని వెనుకున్న లక్ష్యం ఏంటో తెలుసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది" అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి బీబీసీకి తెలిపారు.

మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభకు 2015 జూన్ నుంచి 2019 జనవరి వరకు స్పీకరుగా పని చేశారు.

రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Komatireddy

స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఎలా చేయాలి?

స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఎలా చేయాలి? దానిలో ఉండే అంశాలేంటి? అనే విషయంపై ఉమ్మడి రాష్ట్రానికి చివరి శాసనసభ స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన 2011 జూన్ నుంచి 2014 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకరుగా పని చేశారు.

"ఏ ఎమ్మెల్యే అయినా తన పదవికి రాజీనామా చేయాలని అనుకుంటే తన అధికారిక లెటర్ హెడ్ పై ఏక వ్యాక్యంలో నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, అని రాస్తే సరిపోతుంది. అంతకు మించి మరే విషయం రాసినా దానిని స్పీకర్ ఫార్మాట్‌గా పరిగణించరు. ఈ విషయం ఎంఎల్‌ఏలకు ఇచ్చిన రూల్ బుక్‌లో స్పష్టంగా ఉంటుంది" అని తెలిపారు.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయాల్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే గంటా శ్రీనివాసరావు, కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన రాజీనామా లేఖలు ఇలాగే ఉన్నాయి. కానీ కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖలో తానెందుకు రాజీనామా చేస్తున్నానో కూడా వివరించారు. ఇలా తన రాజీనామాకు కారణాన్ని వివరించడం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పిన దాని ప్రకారం స్పీకర్ ఫార్మెట్‌కు విరుద్ధం.

మరింత స్పష్టంగా...

రాజీనామా లేఖ మరింత స్పష్టంగా ఉండాలంటే ఏక వాక్యంలో రాజీనామా సమర్పిస్తూ... దాని తర్వాత తన నియోజకవర్గం, దాని సంఖ్య కూడా రాయాలి అని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా సరిగ్గా అలాగే ఉంది.

"నేను ఆంధ్ర, తెలంగాణ ఉద్యమ సమయంలో 46 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాను. ఇలా స్పష్టంగా ఉన్న రాజీనామాలను మాత్రమే ఆమోదించాను. దాని వెనుక కారణాలను, భావోద్వేగాలను లేఖలో రాయకూడదు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ స్పీకర్‌కు అందిన తర్వాత దానిని అమోదించాలా? వద్దా? అనేది స్పీకర్ విచక్షణాధికారంపై ఆదారపడి ఉంటుంది" అని నాదెండ్ల మనోహర్ బీబీసీతో చెప్పారు.

గంటా శ్రీనివాసరావు

ఫొటో సోర్స్, GANTA SRINIVASA RAO

స్పీకర్ ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటారు?

స్పీకర్ ఫార్మాట్లో లేఖ అందిన వెంటనే దానిని స్పీకర్ ఆమెదించాల్సిన అసవరం లేదని, దాని వెనుకున్న కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం స్పీకర్ చేస్తారని, దానికి స్పీకర్ సంతృప్తి చెందితేనే రాజీనామాను ఆమోదిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

"రాజీనామాని పూర్తిగా తన ఇష్టంతోనే చేశారా? లేదంటే ఎవరి బలవంతం వలన కానీ, ఏ విషయంలోనైనా మధనపడి కానీ చేశారా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. దాని కోసం రాజీనామా చేసిన పిలిచి స్పీకర్ మాట్లాడాలి. అలాగే, తమ రాజీనామాను ఆమోదించాలనే డిమాండ్, ఆ ఏమ్మేల్యే నుంచి గట్టిగా రావాలి. ఉద్యమ సమయంలో కొండా సురేఖతో పాటు కొందరు ఎమ్మెల్యేలు నాపై రాజీనామాలను ఆమోదించాలని తరుచూ ఒత్తిడి తెచ్చేవారు" అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగానే ఉన్నప్పటికీ, ఏడాదిన్నరైనా ఇంకా ఆమోదం పొందలేదు. గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ

స్పీకర్ నిర్ణయమే ఫైనల్...

ఒక ఎంఎల్‌ఏ రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో ఉన్నా కూడా దానిని ఆమోదించాలా, వద్దా అనే విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం. దీనిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని మాజీ స్పీకర్ నాదెండ్ల తెలిపారు.

"1952 సార్వత్రిక ఎన్నికల నుంచి స్పీకరుకు ఈ అధికారం ఉందని చెప్పారు. ఎందుకంటే కొన్ని సార్లు అధికారం, డబ్బు బలంతో చాలా చోట్ల బలహీన వర్గాల వారితో బలవంతపు రాజీనామాలు చేయిస్తారు. అందుకే రాజీనామా పత్రం స్పీకరుకు చేరగానే ఆమోదించకుండా, దాని వెనుకున్న కారణాల్ని కూడా తెలుసుకోవాలి. ఆ అధికారం స్పీకర్‌దే . అయితే రాజీనామా చేసిన అభ్యర్థి తన రాజీనామాని ఆమోదించమని స్పీకర్‌ను కోరవచ్చు కానీ, బలవంత పెట్టకూడదు" అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఎలా కావాలంటే అలా ఇస్తా: ధర్మశ్రీ

విశాఖను కార్యనిర్వహక రాజధానిగా కోరుతూ, అలాగే టీడీపీ వ్యతిరేకిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని అన్నారు.

"ఒక వేళ అది స్పీకర్ ఫార్మాట్ కాదంటే, ఎలా కావాలంటే అలాగే రాజీనామా చేస్తాను. నాకు చిత్తశుద్ధి ఉంది. నా రాజీనామా విషయంలో ఎటువంటి డ్రామా లేదు" అని ఎంఎల్‌ఏ కరణం ధర్మశ్రీ అన్నారు.

గంటా శ్రీనివాసరావు తన రాజీనామా గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)