KCR: ఎన్టీఆర్ జాతీయ పార్టీ ‘భారతదేశం’ ఏమైంది? టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎలా మారుతుంది?

ఫొటో సోర్స్, KCR/FACEBOOK
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. అదే విధంగా త్వరలోనే తెలుగు పార్టీ కూడా భారత్ దేశంలో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. దీనికి ప్రజలందరి మద్దతు, ఆశీర్వాదాన్ని అందించాలి"
కరీంనగర్‌లో ఇటీవలే జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయికి విస్తరించబోతోందన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఈ పార్టీపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఆ పార్టీ పేరు, విధి విధానాలు పక్కన పెడితే అసలు ఇలా పేరు మార్చేసుకొని ఒక ప్రాంతీయ పార్టీ తనను తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చా అన్న చర్చ కూడా మొదలయ్యింది.
కేసీఆర్ ప్రకటించబోయే పార్టీ ఎలా ఉండబోతోంది? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీగా స్థిరపడిన పార్టీ, పేరులోనే ప్రాంతీయత ఉట్టి పడే పార్టీ, దేశ రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుంది? కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు? అన్నవి కూడా చర్చనీయాంశాలుగా మారాయి.
దక్షిణాది నుంచి వచ్చిన ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇక్కడే ఒక జాతీయ పార్టీ పుట్టి దేశాన్ని పాలించే పరిస్థితి ఉంటుందా?
కేసీఆర్ వ్యూహ రచన సరే, అసలు దిల్లీలో ఉండే రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు? ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ బలం ఎంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఈ కొత్త పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎలా మారుతుంది?
బీజేపీకి ప్రత్యామ్న్యాంగా ఒక బలమైన పార్టీ కేంద్రంలో లేదని, కాబట్టి ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో చాలా కాలంగా కేసీఆర్ దేశం లోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు జరిపారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
అందుకు తగినట్లుగానే తానే ఒక ప్రత్యామ్నాయం ఎందుకు కాకూడదు అన్న సంకేతాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే వచ్చారు కేసీఆర్.
కొత్త పార్టీ గురించి చర్చ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, స్వయంగా జూన్ నెలలో ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో జాతీయ పార్టీ గురించి ప్రస్తావించడంతో, కేసీఆర్ కొత్త పార్టీ పెడతారన్నది ఖరారు అయిపోయింది. ఆ కొత్త పార్టీ గురించే విజయదశమి రోజు మీటింగ్ ఏర్పాటు చేశారు కేసీఆర్.
"జాతీయ అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదన్నదే కేసీఆర్ ఆవేదన. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్రీయ సమితిగా కూడా మార్చుకోవచ్చు అన్నది మాత్రం వాస్తవమే. అయితే పార్టీ ఎలా ఉండాలి ఏంటి, వీటన్నింటి పైనా ఇంకా మేం నిర్ణయం తీసుకోలేదు. అయితే పార్టీ పెట్టాలంటే, ఎన్నికల కంటే ముందు రావాల్సిందే కదా? జాతీయ పార్టీగా ఉంటూ, మిగతా పార్టీలకు ఒక గొడుగు లాగా వ్యవహరిస్తూ అందరిని ఒక తాటి మీదకి తీసుకురావచ్చు అన్నది ఆలోచన. కానీ దీని గురించి ఇంకా విధివిధానాలు మాత్రం ఇప్పటిదాక నిర్ణయించలేదు" అంటూ పార్టీ ప్రయత్నాలు, ప్రారంభానికి కారణాలను బీబీసీకి వివరించారు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్.
గత లోక్‌సభ ఎన్నికల కంటే ముందు నుంచి దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల నాయకులను అనేక సందర్భాల్లో కేసీఆర్ కలిశారు. దాదాపూ మూడేళ్ల పాటూ దీనిపై కసరత్తు చేశారు. మమతాబెనర్జీ, స్టాలిన్, నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్, కుమార స్వామి..ఇలా అందర్నీ కలసిన తరువాత చివరగా కేసీఆర్ తనకంటూ సొంత పార్టీ అనే వైఖరి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్టీఆర్ భారతదేశం పార్టీ ఏమైంది?
ప్రస్తుత పరిస్థితులు, దాంట్లో కొత్త పార్టీ అవసరం, కొత్త పార్టీకి ఉండే అవకాశం వంటి వాటిపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అనగానే ఇప్పుడు అందరూ ఎన్టీయార్‌నే గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్టీయార్ కూడా ఇలా విస్తృత ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
"ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే హక్కు ప్రతిపార్టీకీ ఉంది. అలానే జాతీయ రాజకీయాల్లో దాని ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో జాతీయ పార్టీ కనిపించని తరుణంలో మరొక పార్టీ రావడంలో తప్పు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ బాగా బలంగా ఉన్న రోజుల్లో బీజేపీ ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి. తనకు చాలా తక్కు బలం ఉన్న కాలంలో కూడా, తమ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నదాంతో సంబంధం లేకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది బీజేపీ. తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. కానీ అది ఇప్పుడు కాంగ్రెస్‌లో కనపడటం లేదు. ఒక బలహీన ప్రతిపక్షంగా కనపడుతోంది. అప్పట్లో బీజేపీ పోషించిన ప్రతిపక్షపార్టీ పాత్ర పోషించడానికి ఎవరూ లేరు. కానీ, తాను మరో ఎన్టీయార్ కాగలనా అన్నది కేసీఆర్ ఆలోచించుకోవాలి. గతంలో చంద్రబాబు కూడా తానూ ఎన్టీయార్ కావచ్చని అనుకున్నారు. ఏమి జరిగిందో అందరికి తెలుసు" అని దిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు విజయ్ త్రివేది బీబీసీతో అన్నారు.
కేంద్ర రాజకీయాల్లో ఎన్టీయార్‌కి ఉన్నంత పేరు దక్షిణ భారతదేశంలో మరొక నేతకు దక్కలేదని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.
"ఎన్టీయార్ కూడా తెలుగు నేల మీద ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదిగిన తరువాత 'భారత్ దేశం' అని పేరుతో పార్టీ అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు" అని గుర్తు చేశారు రవి.
తరువాత చంద్రబాబు పార్టీ పెట్టకపోయినా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని ప్రయత్నించారు. ఎన్‌డీఏలో ఉన్నారు. తరువాత బయటకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని బలమైన నాయకుల్లో ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాలపై కూడా ఆసక్తి కనిపించింది ఈ ముగ్గురిలోనే.
తెలుగునాట జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన బలమైన కాంగ్రెస్ నాయకులు చాలామందే ఉన్నారు. కానీ, వారంతా జాతీయ పార్టీ తరపున పని చేశారు.
ఇక ఎన్టీయార్, చంద్రబాబు తరువాత పెద్ద ప్రాంతీయ పార్టీల నాయకులుగా కేసీఆర్, జగన్‌లు కనిపిస్తున్నారు. కానీ, జగన్‌కి జాతీయ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని ఆ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది.

ఫొటో సోర్స్, FACEBOOK/KALVAKUNTLACHANDRASHEKARRAO
ప్రత్యేక తెలంగాణను గెలిచారు.. మరి సమైక్య భారతాన్ని గెలుస్తారా?
దక్షిణ భారతదేశం నుంచి కూడా జాతీయ రాజకీయాలను నడిపించవచ్చా అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ విషయంపై సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు బీబీసీతో మాట్లాడారు.
"జాతీయపార్టీగా గుర్తింపు పొందడానికి ఉన్న నియమావళికి అనుగుణంగా దక్షిణ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలలో, అలానే తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని నియోజక వర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి, తెలంగాణలో తాము చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో ఆ రాష్ట్రాల ప్రజలకు ఉన్న కొద్దిపాటి అనుబంధం కేసీఆర్‌కు కలిసిరావచ్చు. ఆ విధంగా మిగతా రాష్ట్రాలలో అడుగు వేసే అవకాశం కూడా ఉండవచ్చు. అలా ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించవచ్చు'' అని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
''ఉత్తర భారతదేశంలోని అప్నాదళ్ లాంటి కొన్ని చిన్నపార్టీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు కూడా. ఆ పార్టీల దగ్గర డబ్బులేదు. ఆర్థికంగా కేసీఆర్ ది బలమైన పార్టీ. అలా కూడా వారితో చేతులు కలిపి ఉత్తరాదిలో విస్తరించవచ్చు" అని అన్నారాయన.
అయితే, జాతీయ పార్టీగా ఎదగడం అంత సులభమైనంత పనైతే కాదు. ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ అవతారానికి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికలిగించే అంశం.
ఇప్పటికే టీఆర్ఎస్ తెలంగాణలో రెండుసార్లు గెలిచింది. ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా బలపడినట్లు కనిపిస్తోంది. ముందు ఇంట గెలవాల్సిన అవసరం కూడా ఉంది.
గతంలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించిన దాఖలాలు లేవు. ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు జాతీయ పార్టీలుగా సాంకేతిక గుర్తింపు దక్కించుకున్నా, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారాన్ని పొందేస్థాయి వాటికి ఎప్పుడూ దక్కలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రధాని పదవి అంటే ఎర్ర బస్సు కాదు...మరి కారు సంగతి?’
"ప్రధాన మంత్రి పదవి అంటే ఎర్ర బస్సు లో కర్చీఫ్ వేసుకొని ఆ సీటు నాది అంటే సరిపోతుందా, పార్లమెంట్ లో ఎవరికి బలం ఉంటుందో వారిదే గెలుపు కదా?" అని 1996 లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్, వాజపేయి సర్కారు బలనిరూపణ సమయంలో వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ గురించి స్పందన కోరినప్పుడు దిల్లీలోని ఒక సీనియర్ పాత్రికేయుడు ఇదే వ్యాఖ్యలను బీబీసీతో ప్రస్తావించారు. ఆ మాటల్లో వ్యంగ్యం ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న తీవ్రత, కష్టం అలాంటివే.

ఫొటో సోర్స్, UGC
మిగిలిన ప్రాంతీయ పార్టీలు కలుస్తాయా?
మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలు, వారి పార్టీలు కేసీఆర్‌ను ఎలా స్వాగతిస్తాయి? ఎందుకంటే దిల్లీలో లెక్కలు ముఖ్యం. ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయన్నది కీలకం.
యూపీలో 80, మహారాష్ట్ర లో 48, పశ్చిమబెంగాల్ లో 42, బిహార్లో 40, తమిళనాడులో 39 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల పార్టీలు అక్కడ సగం సీట్లు గెలుచుకున్నా, తెలంగాణలో కేసీఆర్ మొత్తం సీట్లు గెలుచుకన్నా వారి బలంకన్నా తక్కువే.
''ఆయా ప్రాంతాల పార్టీలు 17 లోక్‌సభ సీట్లు ఉన్న చిన్న రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ మాట వినే పరిస్థితి లేదని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ పెడితేనే తమ సత్తా తెలుస్తుందని గ్రహించినట్లు కనిపిస్తోంది’’ అని దిల్లీకి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఒకరు బీబీసీతో అన్నారు.
‘‘రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న 'ఆప్' లాంటి పార్టీలకు కేసీఆర్ పై ఆధార పడవలసిన అవసరం లేకపోవచ్చు. అందరు బీజేపీ శక్తిని ఎదురుకోవాలని అనుకుంటున్నా, కూటమిగా ఒక నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి లేదు. గతం లో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ లాంటి మూడవ కూటమి పరిస్థితి అందరు చూసారు. అయినా మరొకసారి ప్రయత్నించాలన్న ఆలోచనతో కేసీఆర్ అందరిని కలిసినా పెద్దగా ఫలితం కనపడలేదు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడం అవసరం. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగితే అది ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తుందని టీఆర్ఎస్ భావిస్తాంది. కాంగ్రెస్‌ను పడగొట్టినంత తేలికకాదు బీజేపీని పడగొట్టడం.
అటు బీజేపీ కూడా కర్ణాటక తరువాత తెలంగాణే టార్గెట్ గా పనిచేస్తోంది. అందుకే తన గుమ్మంలోకి వచ్చిన బీజేపీ ని ఢీ కొట్టాలంటే తమ శక్తి సామర్ధ్యాలు జాతీయస్థాయిలో చాటాల్సిందే అన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
నిజానికి టీఆర్ఎస్ సర్కార్ మొదటి విడతలో, ఒక దశలో బీజేపీ, టీఆర్ఎస్‌లు చాలా సన్నిహితంగా మెలిగాయి. కానీ రానురాను అది వైరంగా మారి ఇప్పుడు మరింత ముదిరింది.

ఫొటో సోర్స్, TELANGANA CMO/FACEBOOK
జాతీయ పార్టీగా మారాలంటే ఏం చేయాలి?
కొత్తగా జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయి కనుక, న్యాయ నిపుణులతో సంప్రదించి తెలంగాణ రాష్ట్ర సమితికే పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రచారంలోకి తీసుకురావాలన్నది ప్రస్తుతానికి ఉన్న ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుని పేరు మార్పుకు ఆమోదం పొందవచ్చు.
అయితే, పేరు మార్చుకున్నంత మాత్రాన అది జాతీయ పార్టీ కాబోదు. తెలుగుదేశం ప్రస్తుతం తనను తాను జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పార్టీకి కూడా ఆ గుర్తింపు లేదు.
1.ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 4 లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలి. అయితే పోటీతోనే సరిపోదు...
2. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. లేదా
3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదంటే
4. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం ఏవైనా మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
ఈ నిబంధనల్లో ఏదో ఒక దాన్ని పూర్తి చేయగలిగితేనే కేసీఆర్ కొత్త పార్టీకి జాతీయ పార్టీ అనే గుర్తింపు వస్తుంది.
''తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త పార్టీ కోసం దరఖాస్తు చేసుకుంటూ, బై లా లో ఉన్న ఆర్గాన్ అనే సెక్షన్‌లో నేషనల్ ఆర్గాన్ అని ఎంచుకొని, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సింబల్ అలానే ఉంచి, ఆ పార్టీ ఇతర లావాదేవీలు అన్నింటినీ కొత్త పార్టీలో విలీనం చేస్తున్నాము అని పేర్కొనాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలలు పడుతుంది" అని రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లకు కన్సల్టెంటుగా పనిచేసే డాక్టర్ బాలు బీబీసీతో అన్నారు
ఇవి కూడా చదవండి:
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















