కేసీఆర్: ‘కఠినంగా ఉండకపోతే కోఠిలో అమ్మేస్తారు నన్ను.. అప్రజాస్వామికం అన్నా నేను బాధపడను.. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి’

ఫొటో సోర్స్, trspartyonline/facebook
రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే కాంగ్రెస్, బీజేపీ మోడల్ పనిచేయదని, ఈ మోడల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియ నిమిత్తం ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేశానని, తన కార్యదర్శి ఈ రాజీనామాను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారన్నారు.
ప్రమాణ స్వీకారం రేపు
గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అయితే, ఎమ్మెల్యేల ఎన్నికకు సంబంధించి గవర్నర్ గెజిట్ ప్రకటన చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అన్నది మాత్రం గెజిట్ ప్రకటన వెలువడే సమయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
పేరు జాతీయ పార్టీ.. తీరు మాత్రం..
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్రానికో మాట మాట్లాడుతోందని కేసీఆర్ విమర్శించారు. సీపీఎస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దాన్ని అమలు చేసింది రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతోంది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. జాతీయ విధానం అని చెప్పి రాష్ట్రానికో విధానం.. పచ్చి అవకాశ వాదంతో పనిచేస్తున్న పార్టీలు ఇప్పుడు ఉన్నాయన్నారు. దీన్ని నిర్మూలించి కొత్త మోడల్ తీసుకురావాల్సిన అవసరం ఉందని, తాను దీనికి కృషి చేస్తానన్నారు. అది కచ్చితంగా అమలవుతుందన్నారు.
ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే ఉద్యోగాలు వస్తాయన్నాం..
‘‘వందకు వంద శాతం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ మాది. దీనిపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మేనిఫెస్టోలో లేని 75 ఇతర హామీలు కూడా అమలు చేశాం.
ఇంటికో ఉద్యోగం అని నేను అన్నానా? మా మేనిఫెస్టోలో ఉందా? ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే వస్తాయన్నాం.. ఇచ్చినం.. ఇస్తున్నం. యూత్‌లో పిల్లలు కొందరు అపోహలు పడుతుంటారు. రైతుబంధు, బీడీ కార్మికులకు పెన్షన్ల వంటివి మా మేనిఫెస్టోలో లేవు. అయినా అమలు చేశాం.
నిరుద్యోగులకు అబద్ధాలు చెప్పే పార్టీలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించింది.. కాంగ్రెస్, టీడీపీలు ఘనాపాటీలు.. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి? 60 ఏళ్లలో ఈ రాష్ట్రంలో 60 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఎందుకివ్వలేదు? 5 లక్షలు కూడా ఇవ్వలేదు ఎందుకు? పచ్చి అబద్ధాలు చెప్పి యువతలో ఆశలు కల్పిస్తున్నాం.
ప్రభుత్వంలో పనిచేసే వాళ్లు 3 లక్షల మంది ఉద్యోగులైతే.. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు 30 లక్షల మంది. దీన్ని విస్మరించి, అబద్ధం చెప్పి ఎంత కాలం మోసం చేస్తారు? నేను ఉద్యోగం ఇస్తా అంటారు.. ఇవ్వరు.. ధర్నాలు చేస్తారు. కొనసాగేది ధర్నాలే.
ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయో వెను వెంటనే వాటిని భర్తీ చేస్తాం.
ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాల శాతం ఒకటి మాత్రమే.
ప్రభుత్వంలో రిటైర్ అయితే ఉద్యోగాలు వస్తాయి.. లేదంటే కొత్తవి ప్రవేశపెట్టాలి. ప్రైవేటు రంగంలో వస్తూనే ఉంటాయి.
నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుంది. దీనిపై ఒక కమిటీ వేస్తాం. అది అన్నీ పరిశీలించి నియమ నిబంధనలు తయారు చేస్తుంది. దీనికి 3 నుంచి 5 నెలల సమయం పడుతుంది. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు వెళ్లేలా చేస్తాం. దాదాపు 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందుతుంది.


ఆంధ్రా వెళ్తాం..
వందకు వందశాతం ఆంధ్రా వెళతాం. ఎందుకు వెళ్లం. మాకు అక్కడి నుంచి ఆహ్వానాలు కూడా వస్తున్నాయి.
పంచాయితీ ఎన్నికలకు సిద్దం
హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.
దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు
రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేస్తే 3.5 లక్షల కోట్లు అవుతుంది. అమలు చేస్తాం.
తెలంగాణ అంత వృద్ధి ప్రపంచంలో ఎక్కడా లేదు
తెలంగాణ రాష్ట్రంలో 29.9 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇంత అభివృద్ధి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు.
ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.70 వేల కోట్లు
రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు పెడితే అన్ని ప్రాజెక్టులూ పూర్తయిపోతాయి. అందులో దాదాపు సగం పాలమూరు ఎత్తిపోతలకే ఖర్చవుతాయి.
అప్పులు ఎలా తీర్చాలో తెలుసు
మేం చేసిన అప్పులేందో.. వాటిని ఎలా పూర్తి చేయాలో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ రాబడి రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు. తెలంగాణ ఈ ఐదేళ్లలో రూ. 2.40 లక్షల కోట్లు కట్టాలి. అందులో రూ.1.30 లక్షల కోట్లు అప్పుకు అర్హత వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 85 శాతం బలహీన, మైనార్టీ వర్గాలు ఉంటే.. 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామంటే ఎలా?
ప్రజలపై కొత్త పన్నులు వేయం. మాకు సరిపడినంత ఆదాయం ఉంది.
ప్రత్యేక హోదాతో వచ్చేదేంది? చచ్చేదేంది? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఇచ్చేదాకా కుదరదంటున్నారు. ఆయనకే క్లారిటీ లేదు.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలు 33 అవుతాయి.


అప్రజాస్వామికం ఏముంది?
అధికారాలన్నీ ఒకే దగ్గర ఉంటాయండీ ఈ దేశంలో.. మీకు అర్థం కాకపోతే నేనేం చేయాల? అదేమీ అప్రజాస్వామికం కాదు. కొన్ని విషయాల్లో కేంద్రీకరణ ఉంటుంది. భారతదేశ సెటప్‌లో కేంద్రంలో ప్రధాని ఉంటాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు.
వాలీబాల్, కబడ్డీల్లో లాగా టీమ్ ప్లేయర్ ఉంటాడు. అతనేం చేస్తాడు? టీమ్ ఎట్లా ఆడాలో అట్లా ఆడిపిస్తాడు. లేకపోతే ఏమైపోతది? సర్కస్ అయిపోతది. నా ఇష్టం వచ్చినట్లు నేను ఆడతా అంటే నడుస్తదా? ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడే ఆడితే అయిపోయే.. కుప్ప అయిపోయే. టీమ్ ప్లేయర్ ఉంటాడు. అందులో నేను స్ట్రాంగ్ ఉంటాను.
మీకు అప్రజాస్వామికం అనిపిస్తది.. కానీ ఐ డోంట్ మైండ్. ఎవరికి అప్రజాస్వామికం అనిపించినా నేను బాధపడను. అలా కఠినంగా లేకపోతే కోఠీ చౌరస్తాలో రూపాయి పావలాకు అమ్మిపోతారు నన్ను. చెలగాటాల్లో ఖతం చేస్తారు నన్ను.
నల్లా ఇవ్వకపోతే ఓట్లడగను అన్నా..
ఇంటింటికీ నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగను అన్నాను. అప్పట్లో నా టార్గెట్ జూన్. అయితే, మధ్యలోనే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది. వందకు వంద శాతం రేపటి నుంచి దీనిపైనే ఉంటాం. ఏప్రిల్ నాటికి దీన్ని పూర్తి చేస్తాం.
ఓటుకు నోటు కేసుపై..
ఓటుకు నోటు కేసు (విచారణ) నడుస్తోంది కదా.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు పూర్తి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, ఉండదా
- మధ్యప్రదేశ్‌లో మెజార్టీ కాంగ్రెస్‌కే, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌దే విజయం
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ వర్సెస్ సంఘ్ పరివార్
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- కేసీఆర్ సరికొత్త రికార్డు: తెలంగాణ నుంచి అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









