హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి

హోప్ ఐలాండ్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

అండమాన్ దీవులు, లక్షదీవుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ సముద్రపు దీవి ఉందని చాలామంది తెలియకపోవచ్చు.

 కాకినాడ తీరం నుంచి కనిపించే ఆ దీవిలో నివాసం ఉంటున్న వారి గురించి తెలుసా? బంగాళాఖాతంలోని ఈ దీవిలో నివసించే వారికి ఏ చిన్న సరకు కావాల్సినా పడవ ఎక్కి సముద్రం దాటాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక దీవి- హోప్ ఐలాండ్.

కాకినాడ నగరానికి పెట్టని కోటలా మారిన ఈ దీవి విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి.

అన్ని సదుపాయాలకు దూరంగా అక్కడ నివశిస్తున్న వారి జీవితాలు సమస్యలమయంగా కనిపిస్తాయి.

సముద్రంలో ఏర్పడిన అనేక దీవులతో పోలిస్తే ఈ హోప్ ఐలాండ్ వయసు చాలా తక్కువ. గడిచిన 200 ఏళ్లుగా ఇది క్రమంగా విస్తరించింది.

గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ధవళేశ్వరం వద్ద కాటన్ కట్టిన ఆనకట్ట కారణంగా ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

హోప్ ఐలాండ్

గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట పడిన తర్వాత నదీ ప్రవాహంలో వచ్చిన మార్పుల మూలంగా పేరుకుపోయిన ఇసుక మేటలతో ఈ ద్వీపం ఏర్పడిందని ప్రకటించారు.

గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి 50 కిలోమీటర్ల ఎగువన 1850 ప్రాంతంలో కాటన్ ఆనకట్ట నిర్మాణం జరిగింది.

అప్పటికే చిన్న చిన్న ఇసుక మేటలుగా ఉన్న హోప్ ఐలాండ్ ప్రాంతం వేగంగా విస్తరించి ఇరవై, ముప్పై ఏళ్లకే ద్వీప రూపం సంతరించుకుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఈ ద్వీపంలో జనసంచారం వందేళ్ల క్రితమే మొదలైనట్లు అధికారిక పత్రాల్లో ఉంది. హోప్ ఐలాండ్‌లో నివసిస్తున్న వారి పూర్వీకులంతా సముద్రతీరంలోని వివిధ గ్రామాల నుంచి వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వారని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఆ ఐలాండ్‌ని గుర్తించి తమ వృత్తికి అనుకూలంగా ఉందనే కారణంతో అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు ప్రభుత్వ నివేదికల్లో ఉంది.

హోప్ ఐలాండ్

అన్నింటికీ తీరం చేరాల్సిందే

హోప్ ఐలాండ్‌లో ఉన్న గ్రామాన్ని పుత్రయ్య పాకలు అని స్థానికులు పిలుస్తారు. తొలుత అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న పుత్రయ్య అనే మత్స్యకారుడి పేరుతో చిన్న గ్రామం ఏర్పడింది.

తొలుత సీజన్లలో ఐలాండ్‌కి వచ్చి, చేపల వేట తర్వాత మళ్లీ సొంత గ్రామానికి వెళ్లిపోయేవారు. కానీ రానురాను శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ సిమెంట్ రేకులు, ఇటుకలు వంటివి కూడా బోటు మీద తీసుకెళ్లి అక్కడే ఇళ్లు కట్టుకున్నారు. ఎక్కువ మంది మాత్రం పూరిళ్లలో నివసిస్తున్నారు.

మొత్తం 40 ఇళ్లున్నాయి. 118 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ చెప్పారు.

కిరాణా సరకులు నుంచి నెలవారీ పింఛన్ల వరకూ అన్నింటికీ మళ్లీ సముద్రం దాటాల్సిందే.

ఈ గ్రామంలో అత్యధికులకు గతంలో కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొందరు అక్కడ ఇళ్లు కట్టుకున్నారు అత్యధికులు వాటిని అమ్ముకుని మళ్లీ ఐలాండ్‌లోనే ఉండిపోతున్నారు.

ఈ గ్రామస్థుల ఓట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ ప్రస్తుతం ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కోరంగి పంచాయతీ పరిధిలో ఉన్నాయి.

వైద్య సహాయం కావాల్సి వచ్చినా అత్యవసరాల్లో బోటు ప్రయాణమే. పిల్లలకు గతంలో ఈ ఐలాండ్‌లోనే స్కూల్ ఏర్పాటు చేశారు. కానీ ఉపాధ్యాయులు రాకపోవడంతో ప్రస్తుతం అది మూతపడింది. కొందరు పిల్లల్ని కాకినాడలో హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నప్పటికీ ఎక్కువ మంది పిల్లలు బడి మొఖం కూడా చూసే అవకాశం లేదు.

హోప్ ఐలాండ్

‘‘సమస్యలతోనే సావాసం’’

హోప్ ఐలాండ్ అభివృద్ధికి గతంలో ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. 2010లో అక్కడి ప్రజల కోసం సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించారు. ఆ తర్వాత బోరు వేసి మంచినీటి సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు.

మంచినీటి కోసం వేసిన మోటార్ నేడు పనిచేయడం లేదు. సోలార్ విద్యుత్ మధ్యలో పనిచేయకపోతే స్థానికులే దానిని సరిచేయించుకుని రాత్రి పూట పనిచేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇళ్లలో లైట్లు. ఫ్యాన్లు పనిచేయడానికే కాకుండా టీవీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ పవర్ ద్వారా టీవీ సెట్లు కూడా రాత్రి పూట రెండు మూడు గంటల పాటు పని చేస్తాయని స్థానికురాలు మచ్చా పేరమ్మ బీబీసీకి తెలిపారు

“మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. వాడుకకు ఉప్పు నీరు వాడుకున్నా మంచినీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. మాకు గతంలో మోటార్ పనిచేసినప్పుడు బాగుండేది. పిల్లలకు బడి లేకపోవడం వల్ల వాళ్లంతా మళ్లీ పెద్దలతో కలిసి వేటకు వెళ్లిపోతున్నారు. బడి నడిపితే బాగుంటుంది” అని ఆమె చెప్పారు.

ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవాలని ఆమె కోరారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో తమకు కూడా ఇంటి సదుపాయం కల్పించాలన్నారు.

హెప్ ఐలాండ్

కాకినాడకి పెట్టని కోట..

ధవళేశ్వరం దిగువన గోదావరి ప్రవాహం ఏడు పాయలుగా మారుతుంది.

అందులో గౌతమి నదిగా పిలుచుకునే పాయ యానాం సమీపంలో సముద్రంలో కలుస్తుంది. కోరింగ మడ అడవుల సమీపంలో తుల్యభాగ సముద్రంలో అంతర్భాగం అవుతుంది.

ఈ రెండు పాయల నుంచి వచ్చిన ఇసుక కారణంగానే నేటికీ హోప్ ఐలాండ్ విస్తరిస్తోంది.

ప్రస్తుతం ఈ ఐలాండ్ పొడవు 16 కిలోమీటర్లు. దక్షిణ భాగాన సన్నగా మొదలయ్యి, ఉత్తరం వైపు దాని వెడల్పు పెరుగుతుంది.

ఆ పెరుగుదల కారణంగా కాకినాడ పోర్టుకు నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో కాకినాడ సీపోర్ట్స్ అధికారులు నిత్యం డ్రెడ్జింగ్ చేపడుతూ ఉంటారు.

కాకినాడ పోర్టు అభివృద్ధికి ఈ ద్వీపమే ప్రధాన కారణం. రెండు శతాబ్దాల క్రితం కాకినాడకు సమీపంలోని కోరంగి గ్రామం నుంచి వివిధ నౌకలు బర్మాకు కూడా వెళ్లిన అనుభవం ఉంది. కాలక్రమేణా హోప్ ఐలాండ్ విస్తరించడంతో ద్వీపానికి, తీరానికి మధ్య కాకినాడ పోర్టు అభివృద్ధి అయ్యింది. నౌకల రాకపోకలకు అనువుగా మారడంతో కాకినాడ పోర్టుకు సహజ రక్షణగా ఈ దీవి నిలిచింది.

పోర్టుతోపాటు కాకినాడ నగరానికి కూడా ఈ ద్వీపమే రక్షణగోడగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు కాకినాడ నగరాన్ని తాకకుండా ఈ ఐలాండ్ నిలువరిస్తోందని కాకినాడకు చెందిన జాగ్రఫీ ప్రొఫెసర్ ఎల్ గణేశ్ చెప్పారు. గడిచిన వందేళ్లలో ఒక్క తుపాన్ కూడా కాకినాడ నగర సమీపంలో తీరాన్ని తాకిన దాఖలాలు లేవంటే అందుకు ముఖ్య కారణం ఈ దీవి అడ్డుగా ఉండటమేనని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా?

ఎలా వెళ్లాలి

కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ చేరుకోవాలంటే సాధారణ ఇంజిన్ బోటులో గంట ప్రయాణం చేయాలి.

ఈ ఐలాండ్‌లో కొంత భాగం అటవీశాఖ పరిధిలో ఉంది. మడ అడవులను పరిరక్షించేందుకు దీన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించారు.

ఆటంకాలు లేకపోవడంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా పెద్ద సంఖ్యలో హోప్ ఐలాండ్ తీరంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.

వాటి కోసం అటవీశాఖ గతంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేసింది.

ద్వీపం తూర్పు తీరం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. పర్యాటకంగా ఆస్వాదించేందుకు అవకాశం ఉంది.

రిజర్వ్ ఫారెస్ట్, ఆలివ్ రిడ్లే తాబేళ్లు వంటి వన్య ప్రాణులకు ఆటంకం లేకుండా మిగిలిన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

కొంతకాలంగా ప్రభుత్వాలు హోప్ ఐలాండ్‌లో టూరిజం అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కానీ అలాంటి ప్రయత్నాలు పట్టాలెక్కిన దాఖలాలు లేవు.

కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం అధికార యంత్రాంగం హోప్ ఐలాండ్ వెళ్లేందుకు టూరిస్టుల కోసం బోట్లు కూడా నడిపింది.

సముద్ర ప్రయాణం, ఐలాండ్ తీరం ఆస్వాదించడం కోసం చాలామంది పర్యటకులు వచ్చేవారు. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం అది నిలిచిపోయింది.

"కాకినాడకు రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్ వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతోంది. వెయ్యి ఎకరాల వరకూ దీని విస్తీర్ణం ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన తర్వాత కూడా వంద ఎకరాల పైగా పెరిగింది. టూరిజం అభివృద్ధి కోసం ఓ ప్రాజెక్టుగా తీసుకోవాలి. ప్రభుత్వాలు మారినా రిసార్ట్స్ వంటివి అభివృద్ధి చేయడానికి చర్యలు లేవు. మంచి టూరిజం స్పాట్ అవుతుంది. ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రైవేటుగా అనుమతించినా ఉపయోగమే" అంటూ కాకినాడ సీ పోర్స్ట్ అధికారి ఎం మురళీధర్ అభిప్రాయపడ్డారు.

 తీరానికి చేరువలో ఉన్న ద్వీపం కాబట్టి హోప్ ఐలాండ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే వీలుంటుందని ఆయన బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, తిరుపతి పక్కన, శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన అందాలు.. చూశారా..

ప్రతిపాదనలు

హోప్ ఐలాండ్‌లో నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అక్కడి తీరంలో పర్యటకం అభివృద్ధి కోసం కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రభుత్వ ఆమోదంతో చర్యలు తీసుకుంటామని ఆమె బీబీసీతో అన్నారు.

"హోప్ ఐలాండ్‌లో ఉన్న కుటుంబాలకు సదుపాయాలు మెరుగుపరుస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. పర్యటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అక్కడ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా హోప్ ఐలాండ్‌ను అందమైన పర్యటక కేంద్రంగా చేస్తాం" అంటూ కృతిక శుక్లా వివరించారు.

రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో లేకుండా 100 ఎకరాల స్థలం ఉన్న తరుణంలో దానిని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి, ఆసక్తి ఉన్న వారికి ప్రకృతిని ఆస్వాదించే అవకాశం దక్కుతాయి.

ఇప్పుడు హోప్ ఐలాండ్‌కు వెళ్లే వారికి కనీసం మంచినీరు గానీ, ఇతర ఎటువంటి సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. దాంతో ఎక్కువ మంది మొగ్గుచూపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి గానీ, జగన్నాథపురం వంతెన సమీపంలో జెట్టీల నుంచి గానీ, మడ అడవుల నుంచి గానీ హోప్ ఐలాండ్‌కి వెళ్లేందుకు వీలుంటుంది. పర్యాటకాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)